Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 26


    "ఆమెకు కావల్సింది వేరు. నువ్వుయిస్తానన్నది వేరు."
    "అన్నట్లు నువ్వూ అమ్మాయివేగా, నన్ను కన్ ఫ్యూజ్ చేస్తున్నావు" అన్నాడు మహేష్.
    
                               *    *    *
    
    అతను కోలుకున్నాడు. కాలేజీకి పోయి వొస్తున్నాడు.
    ఎక్కడున్నాడు ఆంజనేయులు?
    మళ్ళీ కనబడటంలేదు.
    నెల రోజులగాడువూ పూర్తయిపోతోంది. ఏం జరుగుతుంది నెలరోజులూ గడిచిపోతే?
    ఆమె వెళ్ళిపోతుందా?
    వెళ్ళిపోతే?
    ఓ వెలుగు ఆరిపోయినట్లు, శూన్యం ఆవరించినట్లు తాను నిర్దాక్షిణ్యంగా వొంటరిగా మిగిలిపోతాడు.
    ఆ వొంటరితనం ...
    ఒకవేళ వెళ్ళిపోకపోతే?
    వెళ్ళిపోకుండా యిక్కడెలావుంటుంది? ఎంతకాలమని వుండగలదు? ఆమెకోసొంత జీవితం, ఎప్పటికైనా వెళ్ళిపోవల్సిన చోటు వుంటుందికదా. అక్కడికి చేరుకోక తప్పదుకదా!
    అసలు ఆంజనేయులి విషయం ఎలా పరిష్కారమవుతుంది? అతను పెళ్ళాం పిల్లలూ వున్నవాడు.
    ఆమెను చూస్తే జాలేస్తోంది.
    సలహా చెప్పటానికి చంద్రం ఇక్కడలేడు. చంద్రం ఎప్పుడొస్తాడో! వాడ్నికూడా చూడాలని వుంది. తన మనసులోని బాధనంతా వాడికి చెప్పెయ్యాలని వుంది.
    "వొరేయ్ చంద్రం నేను చాలా మారిపోయానురా. పూర్వపు చలాకీతనం ఇప్పుడు లేదురా. చాలా డల్ అయిపోయానురా- ఇంకేదో అయిపోతున్నానురా." అని తనగోడు వాడిముందు వెళ్ళబోసుకోవాలి.
    ఇంటివాళ్ళెప్పుడొస్తారో తెలీదు. వాళ్ళొస్తే యీ వాతావరణాన్ని ఏ రకంగా ఊహించుకుని గొడవచేస్తారో!
    తనకు క్రికెట్ దెబ్బతగిలిన నాటి ఆ రాత్రి....ఆమె తనతో అన్నం తినిపించటం, తన క్రాఫింగ్ చెయ్యిపెట్టి దువ్వటం, తన గుండెను ఆ చేతి  వ్రేళ్ళు స్ప్రుశించటం....ఆ అనుభవం ఎంత బాగుంది! ఆ అనుభూతులు ఎంత తియ్యగా వున్నాయి.
    
                                                                 *    *    *
    
    ప్రియంవద యింకోరకం భయంలో, ఆలోచనల్లో వుంది.
    నెలరోజుల గడువూ పూర్తయిపోతోంది. అతన్నిప్పటికే రకరకాలుగా బాధపెట్టింది.
    అర్ధంలేకుండా అనవసరంగా జొరబడి తన బాధ్యతను అతనిమీద మోపింది. అతన్లో చెలరేగిన అలజడి ఏదో రూపంలో తెలుస్తూనే వుంది.
    అసలతన్నింతగా హింసించటానికి తనకి హక్కేముంది?
    నెలరోజుల గడువూ పూర్తయిపోతుంది. ఏం జరుగుతుంది? వెళ్ళి పొమ్మంటాడా?
    ఆమె గుండె ఝల్లుమంది.
    
                            *    *    *
    
    రాత్రి ఎనిమిది గంటలవేళ.....ప్రియంవద గదిలో వొంటరిగా కూర్చుని వుంది.
    మహేష్! ఆరయేలోపునే కాలేజి నుంచి మహేష్ వచ్చేస్తాడు. ఈ రోజింకా రాలేదు. ఆమెకేమీ తోచటం లేదు. అస్థిమితంగా గదిలో అటూ యిటూ తిరుగుతోంది.
    బ్రా, బనీను కాంబినేషన్ మీద ఆమె దృష్టి పడింది. ఆమె మేనుపులకరించినట్లయింది. దగ్గరకు వెళ్ళింది. ప్రక్కనే వున్న అంజనేయుల చిత్రపటం మీద ఆమె చూపు వాలింది. ఒక చిరుహాసం ఆమె పెదిమల మీద ఉదయించింది. ముందుకు వొంగి ఆంజనేయులి పెదిమలమీద తన పెదిమలు ఆనించి ముద్దుపెట్టుకుంది. మైకంతో ఆమె కనులు మూతలు పడ్డాయి.
    "ఆఁ ఆఁ మరీ అంత ప్రేమ పనికిరాదు".
    ఉలికిపడి యివతలకు జరిగేసరికి తలుపు దగ్గర సునంద నిలబడి వుంది.
    సిగ్గుతో ముఖం ఎర్రబడింది.
    "పాపం అతని పెదిమలు నలిగిపోయి వుంటాయి" అంది సునంద.
    "ఏం? నా పెదిమలు మృదువైనవి కావా" అనుకుంది ప్రియంవద.
    "మహేష్ ఇంకా రాలేదా?"
    లేదన్నట్లు తలఊపి "నాకెందుకో భయంగా వుంది" అంది ప్రియంవద.
    "భయం దేనికి?"
    తమ నెలరోజుల గడువూ రేపటికి పూర్తి అవుతుంది. ప్రొద్దుట్నుంచీ అతను అదోలా కనిపించాడు. ఒక్కో మూడ్ లొ అతన్ని చూస్తే పలకరించటానికి భయం వేసింది కూడా ఏదయినా మనసులో ఆలోచన పెట్టుకుని....
    గుండె ఒక్కసారి ఆగి, మళ్ళీ కొట్టుకున్నట్లయింది. శరీరమంతా వొణికింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS