ఆ రాత్రికి అతని చెయ్యి యింకా వాచిపోయి కదల్లేని స్థితికి వొచ్చింది. గూట్లోదొరికిన ఓ పెయిన్ కిల్లింగ్ ఆయింట్ మెంట్ తీసి అతని చేతికి రాస్తూ కూర్చుని, యించుమించు తొమ్మిది దాటాక అతని ముఖకవళికల్ని చూసి "నీరసంగా వుందా బాగా?" అనడిగింది.
అతను లేదన్నట్లు తల ఊపాడు.
"అబద్దం చెప్పకండి....ఆకలి కూడా వేస్తోంది కదూ?"
అతనేమీ జవాబివ్వలేదు.
ఆమె లేచి చెయ్యి కడుక్కుని క్యారియర్ విప్పి కంచంలో కొంచెంఅన్నం కలిపి తీసుకొచ్చింది. మంచంమీద అతని ప్రక్కనే కూర్చుని, చేతిలోకి చిన్న ముద్ద తీసుకుని "నోరు తెరవండి" అన్నది.
సిగ్గుతో అతని ముఖం ఎర్రబడింది. "వొద్దులే" అన్నాడు చాలా మొహమాటంగా.
"ఏం? నేను తినిపించకూడదా?"
"అదికాదు"
"ఆరోజు మీరు గోరుముద్దలుచేసి తినిపిస్తే నేను తినలేదా?"
అతనింకేమీ మాట్లాడలేక పోయాడు. మౌనంగా పెదిమలు తెరిచి మూస్తూ ఆమె "యింకాస్త....యింకాస్త" అని గారాబంచేస్తూ తినిపిస్తోంటే మొత్తంమీద ఆరగించాడు.
తినటం అయ్యాక ఆమె నీళ్ళతో అతని మూతి తుడిచింది. తర్వాత టవల్ తో తుడిచింది.
"నువ్వో?"
"నేను కాసేపాగి తింటాను. మీరు పడు"కోండి అన్నది అతని కళ్ళలోని నిద్ర మత్తుని గమనిస్తూ.
మహేష్ కి నిజంగానే నిద్రముంచుకొస్తోంది. మంచంమీద తన ప్రక్కనే కూర్చుని ప్రియంవద ఛాతీమీద రాస్తోంటే హాయిగా అనిపిస్తూ, క్రమంగా నిద్రలో పడిపోయాడు.
కొంతసేపటికి- ఆమెకూడా- కళ్ళు మూతలుపడి అతని ఛాతీమీదనే తలవాల్చి చాలాసేపు నిద్రపోయిందన్న సంగతి అతనికి తెలియదు.
* * *
మరునాడు మధ్యాహ్నం సునంద అతన్ని చూడటానికి వొచ్చింది. చెయ్యి కొంచెం కదల్చగలుగుతున్నాడు.
మహేష్ చేతిలో సెవెన్ మినిట్స్ పుస్తకం వుండటం చూసి ఆమె కళ్ళు కాంతితో వెలిగాయి.
నిజానికథను ఆ పుస్తకం ప్రొద్దుటనుంచీ చదువుతున్నాడు. మడత పెట్టివున్నా కాగితం అతని కళ్ళపడింది ఉత్తరమా ఏదో ఎవరికో రాసి మరిచిపోయి వుంటుందనుకుని మడత విప్పకుండానే. దాన్ని బుక్ మార్క్ క్రింద ఉపయోగించుకుంటూ మధ్య మధ్య చిన్న చిన్న విరామాలతో నవల చదివేస్తున్నాడు.
"హాయ్! మహేష్ ఎలావుంది? అంది.
"ఐయాం ఆల్ రైట్."
ఆమె దృష్టి అతని చేతిలో వున్న నవల మీద పడింది. ఆమె ముఖం ప్రపుల్లమైంది. ఆ ప్రపుల్లతలోనే కంగారు.
"చదివావా?" అంది. తడబడే కంఠంతో.
"చదువుతున్నాను."
"చదువుతున్నారా? చదువుతున్నారా? బోలెడుసార్లు చదివేసు కుంటున్నారా?
"ఎలా వుంది?"
"అప్పుడే ఎలా తెలుస్తుంది? పూర్తిగా చదవకుండా?"
ఇంకా పూర్తిగా చదవలేదా? అంటే ఒక్కొక్క వాక్యం పదే పదే చదువుకుంటున్నాడా?
ఆమె మురిసిపోతోంది.
"ఎంతవరకూ చదివావు పోనీ?" అనడిగింది ఆతృత అణచుకోలేక.
"చాలా పెద్ద పుస్తకం కదా. నూటఇరవై పేజీలయింది" అని, అక్కడ బుక్ మార్క్ పెట్టి తర్వాత కబుర్లు చెబుతాను, లేకపోతే పేజీ మిస్ అయిపోతుంది. అని, కాగితం మడతని నూట ఇరవై పేజీలోపెట్టి పుస్తకం మూసి "ఆఁ యిప్పుడు చెప్పు. అన్నాడు తాపీగా."
ఆమె ముఖం వెలవెలబోయింది "అది.... అది బుక్ మార్క్ గా ఉపయోగిస్తున్నావా?" అంది.
ప్రియంవద యింతసేపట్నుంచీ టేబుల్ దగ్గర స్టూల్ మీద కూర్చుని వారపత్రిక ఒకటి తిరగేస్తూ యీ సంభాషణ ఆలకిస్తూంది. ఆఖరిమాట విని నవ్వాపుకోలేక పోయింది. నవ్వు కనిపిస్తుందేమోనని ముఖం ప్రక్కకు తిప్పుకుంది.
"అవును ఏం" అంటున్నాడు మహేష్.
"అది..... అది ఉత్తరం."
"నేనూ అదే అనుకున్నాను."
".....చదవలేదా?"
"ఇంకోరి ఉత్తరాలు ఎలా చదువుతాను?" అంటూ ఆ లెటర్ తీసేసి "సారీ! పోస్ట్ చెయ్యటం ఆలస్యమైపోయి వుంటుంది." అన్నాడు"
"చేతికిస్తేనే ప్రయోజనం లేనిదీ పోస్ట్ చేస్తే ప్రయోజనం వుంటుందా మహేష్?" అనుకుంది సునంద నిస్పృహగా అందుకని జాకెట్లో దోపుకుంది.
"చాలా అదృష్టం." అన్నాడు మహేష్ చిలిపిగా.
"ఎవరికి?"
"ఆ ఉత్తరానికి"
"ఎందుకు?"
"అంత ఉన్నతమైన చోట చోటు చేసుకున్నందుకు."
"ఆమె అప్రయత్నంగా తన గుండెలవైపు చూసుకుంది. "తిరిగి వొచ్చేసిన ఉత్తరం ఎక్కడ చోటు చేసుకొంటేనేం మహేష్" అనుకుంది మరింత బాధగా.
ఆ సమయంలో ఆమె ముఖంలోకి తరిమి చూస్తే కళ్ళలోంచి రాలిపడకుండా ఆపుకుంటోన్న కన్నీళ్ళు, అని ఏర్పరిచే విషాదం గోచరించి వుండేవి. కాని అతనింకా ధ్యాసే లేదు.
"వొస్తాను." అని సునంద లేచి నిలబడింది.
"నవలంతా చదివాక నా అభిప్రాయం చెబుతాను." అన్నాడు మహేష్.
"నవల గురించి ఎవరిక్కావాలి అభిప్రాయం?" అని ఆమె విసురుగా వెళ్ళిపోయింది.
"అమ్మాయిల మాటలు బలే చిత్రంగా వుంటాయే." అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా.
"ఏం?" అంది ప్రియంవద.
"ఇంతకు ముందు అభిప్రాయం అడిగింది. చదివి చెబుతానంటే అక్కర్లేదంటుంది."
