Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 27

 

    "భయమెందుకో చెప్పలేను కాని సునంద ఓ సాయం చేస్తావా?" అనడిగింది.
    "కానీ ఎక్కడ వుంటాడా? నేను మెడికల్ కాలేజిదాకా వెళ్ళి వొచ్చేస్తాను - ఏం జరిగిందో చూసి"
    "ఏం జరిగుతుంది? కాలేజిలో ఫంక్షన్ ఏమయినా వున్నదేమో"
    "అయినా చూసి వొస్తాను. బావ యింతవరకూ .....ఎప్పుడూ యింత ఆలస్యం చెయ్యలేదు.
    "ఒక్కదానివీ దేనికి! ఇద్దరం కలిసే వెడదాం."
    "ఒకవేళ నేనటు వెళ్ళగానే తను వొస్తే .....గదిలో ఎవరూ వుండకపోతే బావుండదు. సునందా ప్లీజ్."
    సునంద ఆరోజు మహేష్ తో అటో యిటో తేల్చుకోవాలనే వొచ్చింది. లెటర్ ని కూడా జాకెట్ లో దోపుకుని తీసుకొచ్చింది.
    "డైరెక్టుగా యిచ్చేస్తాను. ముఖాముఖి అడిగేస్తాను. " అనుకుంటూ వొచ్చింది.
    "ఏం? నాలో ఏం తక్కువ? అందమా? ఆస్తా? విద్యావంతురాల్ని కాదా? సూటిగా అడిగేయ్యటానికి నేనెందుకు భయపడాలి?" అనుకుంటూ వొచ్చింది.
    ఒకరకంగా తను యిక్కడ వుండటమే మంచిదనుకుంది. ఆమె అటు వెళ్ళగానే మహేష్ యిటు వస్తే ?
    తాను వొచ్చినప్పుడల్లా ప్రియంవద వుంటూ వుడటం వల్ల మహేష్ తో సూటిగా మాట్లాడటం కుదరటం లేదు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు.
    "సరే వెళ్ళిరా. త్వరగా వోచ్చేయి సుమా. లేకపోతే ఒక్కతినే నాకు  బోర్ కొడుతుంది" అన్నది - ఫర్వాలేదు ఎంత టైమయినా తీసుకో. ఎంత ఆలస్యంగా వొస్తే అంత మంచిది " అని మనసులో అనుకుంటూ.
    "థాంక్స్ నేవొచ్చేదాకా వెళ్ళకు" అని చెప్పి ప్రియంవద బయల్దేరింది.


                                *    *    *


    చీకటి. అక్కడక్కడా స్ట్రీట్ లైట్స్ ఆమె నడుస్తోన్న రోడ్డుమీద జనసంచారం అసలు లేదు. ఒకటి రెండుసార్లు మెడికల్ కాలేజీకి వెళ్ళటం వల్ల ఆ దారులన్నీ ఆమెకు తెలుసు.
    కాని ఆమె రూమ్ నుంచి బయల్దేరినప్పట్నుంచీ ఒక కారామెను అనుసరిస్తోన్న సంగతి ఆమె గుర్తించలేదు.
    సందు మధ్యలోకి వొచ్చేసరికి వెనకనుండి ఏదో కారు వొస్తున్నట్లు పొడవుగా దీపకాంతి ప్రసరించింది.
    దారి ఇద్దామని ఆమె ప్రక్కకి తొలగింది.
    కారు ఆమె ప్రక్కగా వొచ్చి ఆగింది. పరధ్యాస నుండి బయటపడి ఆమె తల ప్రక్కకుత్రిప్పి చూసేసరికి కారులోంచి ఇద్దరు మనుషులు దిగుతున్నారు.
    కొంచెం దూరంలోవున్న స్ట్రీట్ లైట్ కాంతిలో అందులో ఒకతన్ని, మొహం చూసి ఉలిక్కిపడింది.
    ఆంజనేయులు.
    ఆరోజు ఎగ్జిబిషన్ లో కనిపించిన వ్యక్తి.
    కాని ఆరోజు కనిపించిన సౌమ్యత, భయం యిప్పుడతన్లో లేవు. పొగరుగా, బిరుసుగా వున్నాడు.
    "ఏం బుల్లెమ్మా! ప్రేమించానని చెప్పి ఆవేళ వెంటబడి అల్లరి చేశావు. ఇప్పుడు కనిపిస్తే బిత్తరిచూపులు చూస్తావేమిటి?" అంటూ దౌర్జన్యంగా భుజంమీద చెయ్యివేసి "ఇప్పటికి అవకాశం దొరికింది. ప్రేమించుకుందాంరా మరీ" అంటూ దగ్గరకు లాక్కోపోయాడు.
    ఆమె అతన్ని విదిలించికొట్టి "ఎవరు నువ్వు? మర్యాదగా పోతావా? కేకలు వేసి నలుగుర్నీ పిలవమంటావా?" అంది.
    ఆ వ్యక్తి వికటంగా నవ్వి "అదేమిటి బుల్లెమ్మా! నేనెవరో గుర్తుపట్టలేదా? నేను ఆంజనేయుల్ని. నీ ప్రియుణ్ణి. పాపం కావాలని మోజు పడ్డావుకదూ. రా మరీ. నీ ముద్దు చెల్లించవద్దూ" అంటూ భుజంమీద మళ్ళీ చెయ్యి వెయ్యబోయాడు.
    ఆమె తనికందకుండా దూరంగా జరిగి "నీ ముద్దూ? నీ బొందా!నీ బండ మొహంచూసి ఏ ఆడదన్నా ప్రేమిస్తుందన్న ఆశ నీకుందా?" అన్నది హేళనగా.
    అతనేమీ సిగ్గుపడలేదు. "పోనీ ప్రేమించవద్దులే. మురిపెం తీరుద్దువుగాని" అంటూ మీదకు రాబోయాడు.
    "అక్కడే ఆగు. అడుగు ముందుకు వేశావంటే బావుండదు చెబుతున్నా."
    "ఏంచేస్తావు? కేకలు వేస్తావా? నీ అరుపులెవ్వరికీ వినబడవు" అంటూ రెండుచేతులూ జాచి ఆమెను పొదివి పట్టుకోబోయాడు.
    "రాస్కెల్ చెబుతుంటే నీకు బుద్ధిలేదూ" అంటూ ఆమె కోపంతో వొణికిపోతూ చాచిపెట్టి చెంపకాయ కొట్టింది.
    ఆ వ్యక్తి చెంప సవరించుకుని "ఏయ్! నీకు మంచి మాటలతో చెబితే లాభంలేదు" అని స్నేహితుడివైపు తిరిగి "గురూ! కానీయి అన్నాడు.
    ఆ స్నేహితుడు మెరుపులా ముందుకువొచ్చి, ఏం జరుగుతుందో తెలుసుకునేముందే చటుక్కున చేత్తో ఆమె నోరుమూశాడు. ఆమె విదిలించుకుందామని ప్రయత్నించేలోపున ఆంజనేయులు ముందుకొచ్చి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆమెను బలవంతంగా కారులోకి లాగాసాగారు.
    ఉన్నట్లుండి వెనుక ఓ నీడపడినట్లయింది. "ఏయ్! ఏం జరుగుతోందిక్కడ?"
    ఆంజనేయులు ఉలికిపడి వెనక్కి తిరిగి చూసేసరికి ప్రియంవద అదే అదనని పట్లు విడిపించుకుంది. స్నేహితుడి చేతిని కూడా తప్పించుకుని ఆ వ్యక్తి వైపు పరిగెడుతూ "చూడండీ! వీళ్ళు నన్ను...." అంటూ తృళ్ళిపడింది.
    మహేష్!
    "ప్రియా! నువ్వా?"అన్నాడు మహేష్, ఆశ్చర్యంగా "ఏమిటిదంతా?"
    "వీళ్ళు....నన్ను బలవంతంగా ఎత్తుకుపోయేందుకు చూస్తున్నారు" అన్నదామె ఏడుపు గొంతుకతో.
    మహేష్ వాళ్ళవైపు తిరిగి "అరే! అతను ఆంజనేయులు కదూ" అన్నాడు యింకా ఆశ్చర్యంగా.
    "అవును. ఆంజనేయులే. కానీ ఇతనికీ నాకూ ఏ సంబంధమూ లేదు"
    "అదేమిటి? ఇతన్ని నువ్వు...."
    అదంతా వొట్టినాటకం. ఇంట్లో నుంచి పారిపోయివొచ్చి, చీకట్లో పోలీసు వెంటబడితే తప్పించుకునేందకు మీదగ్గరకొచ్చి, ఆ తర్వాత ఆశ్రయం కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పను."
    "మరి నువ్వు వేసిన బొమ్మ?"
    "అదేనాకూ ఆశ్చర్యంగా వుంది. మిమ్మల్ని మోసం చెయ్యడానికి ఏదో ఓ బొమ్మ వేసేశాను. పేరుకూడా కల్పించి చెప్పను. అలాంటి రూపంగల ఒక మనిషి వుండటం, అతనిపేరు ఆంజనేయులు కావటం కేవలం కాకతాళీయం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS