కానీ అసలు ప్రేమ మాత్రం స్త్రీ పురుష సంబంధమనే విచిత్ర స్థితిలోంచే ఉద్భవించిందని కొందరు విచిత్ర వాత్స్యాయనుల వాదన. శకుంతలా స్వరూపమే నన్ను దివ్యుణ్ణి చేసిది. అది స్త్రీ పురుష ప్రేమైతేనేమి ఇంకో విచిత్ర తత్త్వమైతేనేమి? నాకు సర్వమూ ఆ పదనొకండేళ్ళ బాలికే!
మా అత్తగారూ, శకుంతలా కలసి దసరా బొమ్మలు ఒక గదిలో అలంకరించారు. శకుంతలకు నేనూ ఒక పెట్టెడు బొమ్మలు పట్టుకొని వచ్చాను. విక్టోరియా మందిరములో అమ్మే కొండపల్లి బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, వెండి బొమ్మలు, మైసూరు గంధం బొమ్మలు, తిరువాన్కూరు దంతంబొమ్మలు రకరకాలవి ఆ పెట్టెనిండా నిండివున్నవి. నూరురూపయలై తేనేమి? కలలు ఊటలూరే బొమ్మలు అవి.
నాకు జపాను బొమ్మలంటే అసహ్యం. కీ ఇస్తే పరుగులెత్తేవి, తల ఆడించేది, గంతులు వేసేవి, పల్టీలు కొట్టేవి, కప్పలు, పక్షులు, సర్కస్ మనుష్యులు, గుఱ్ఱాలమీదవాళ్ళు, మోటారుబళ్ళు, సైకిళ్ళు, అమ్మా అనేవి- తక్కువరకం సంతోషం కలుగజేసేవి, హీనమైనవి అని నాకు మా గురువు గారైన సిద్దప్పగారు ఉద్భోధించారు. ఆ వాదన బాగా నా బుఱ్ఱకెక్కింది. వారన్నారు గదా,
''పాశ్చ్యాత్య దేశాల్లో వారు ఏదో విధంగా కళ అలుముకు ఉంటేనే గాలి బొమ్మలను గౌరవించరు. డ్రెస్డ్ న్ చీనా బొమ్మలు, చీనా జేడ్ బొమ్మలు, ఇటలీ వెండి బంగారు బొమ్మలు, కర్రబొమ్మలు అన్నీ కళాకాంతులు వేదజల్లెవి. పెద్ద పెద్దలు తమ మందిరాలు అలంకరించడానికి కొన్ని వందల పౌనులు ఇచ్చి కొంటారు. దేశ ప్రదర్సనశాలల్లో కూడా అలంకరించిన వేలకొలది కాసులు ఖరీదుచేసే బొమ్మ లున్నవి. ఓడల బొమ్మలు, చరిత్రలో ప్రసిద్ది కెక్కిన ఓడల నమూనాలు, బ్రిటీషు ప్రదర్శన శాలలో నూరులున్నవి'' అని.
ఈ ముక్కలు నా తలకు బాగా పట్టినవి. శకుంతల గదిలో పుదుచ్చేరి బొమ్మలు, తిరుపతి చందనం బొమ్మలు, జపాను, జర్మను, ఇంగ్లీషు బొమ్మలు ఉన్నవి. ఆ పుదుచ్చేరి బొమ్మలంటే నాకు ఉద్భవించిన రోత రోహిణికార్తే గాడ్పులా విసిరింది. శకుంతల చిరునవ్వుతో, పూజా నయనాలతో సగర్వంగా నాకా బొమ్మలు చూపించింది.
''ఎలా వున్నాయి?''
''సరే, సరే. నేను పెటేడు బొమ్మలు నీకు బహుమతి పట్టుక వచ్చాను. అవన్నీ మనం అలంకరిద్దాం.''
''నేను సర్దిన ఈ బొమ్మలు బాగాలేవూ?'
'' చాల బాగున్నాయి! కాని ఈ పుదుచ్చేరి బొమ్మల రకాలు అందరి ఇళ్ళల్లో ఉంటూనే ఉన్నాయి; మనింట్లోనూ అవే పెడితే గొప్పకాదు. నేనో విచిత్రమైన బొమ్మవేసి పట్టుకొచ్చాను. అది మధ్య పెట్టి, ఈ పుదుచ్చేరి బొమ్మలు కొన్ని దాచేసి అద్భుతంగా అలంకరించాలి బొమ్మలు.''
''నే నలంకరించిన వానిలా బాగా లేకపోతే?''
''శకూ! యిలా చూడు, నా కళ్ళల్లోకి చూడు. కోపం వచ్చిందీ? ఓ అమ్మాయిగారు ఒకరికి ఓ ఉత్తరంలో ''నేను శిష్యురాలనై బొమ్మలు తయారుచేయడం నేర్చుకుంటా '' అని వ్రాశారు. శిష్యురాలు, గురువుగారికి బొమ్మ అలంకరించడం బాగా వచ్చునని అనుకోవద్దూ?''
శాకుంతల పకపక నవ్వింది. ''గురువుగారికి నమస్కారం.''
''సత్వర శిల్పకళా ప్రాప్తిరస్తు.'' నా నవ్వు శకుంతల దివ్య హాసంలో లీనమైపోయింది.
శకుంతలా, నేనూ బొమ్మ లలంకరించడంలో ఉల్లాసప్రవాహంలో తెలిపోయాము. మా అత్తగారు రాజ్యలక్ష్మమ్మగారు వచ్చి తొంగిచూసింది.
శకూ! బావకు తలంటిపోయాలి, చెల్లాయి హారతిస్తుందట. ఈ బొమ్మల గదిలో వున్నారంటే ఈపాటికి పరుగెత్తుకుని ఇక్కడికి రాక పోయిందా!''
తప్పటడుగులు వేసుకుంటూ బంగారు పనస తొనల హేమంగారు నేను చెన్నపట్నంనుంచి వచ్చానుగదా అని. ''బావ వత్తాలు బావ వత్తాలు'' అని చక్కావచ్చింది. ఎత్తుకుంటే మళ్ళీ సిగ్గుపడింది.
ఆ రోజుల్లో నన్ను ''బావా '' అని పిలిచిన హేమకుసుమ నేడు నన్ను ఆనవాలే పట్టలేకపోయింది. నేను బావగా హేమకుసుమను చూచి నది ఆఖరుసారి ఆమెకు తొమ్మిదేళ్ళున్నప్పుడు. నా రూపు రేఖా విలాసాలు పూర్తిగా మారిపోయినవి. నాలో ఒక కొత్తదనం వచ్చినది. నా ముఖం లోని గుండ్రని నున్నని రేఖలుపోయి తీక్షణమైన స్పష్టరేఖలు ప్రత్యక్ష మైనవి. తొమ్మిదేళ్ళకు తర్వాత అడయారులో ఆమె నన్ను మరల చూచినది. నన్ను వెనక చూచినట్టామెకేమీ స్ఫురణలేదు. అక్కా బావల గాథ ఒక పురాణ గాథలా ఆమెకు స్పృహ ఉంది ఉండాలి.
8
చెన్నపట్టణంలో మా మావగారి భవనంలో అక్కడక్కడ గోడల అలంకరించి వున్న శకుంతలా శ్రీనాథమూర్తుల ఛాయాచిత్రాలు అనేకం ఉన్నాయి. అందులోని శ్రీనాథమూర్తికి, ఈనాటి త్యాగతికీ యెంతో తేడా వుంది. నన్ను నేను ఆనవాలు పట్టుకోలేకపోయినాను.
సముద్రపు ఒడ్డుకు నేనూ, కల్పమూర్తీ సీతాసుందరి అనే హేమ స్నేహితురాలు ఒకతే, నలుగురూ హేమ కారు నడుపుతూండగా వ్యాహ్యాళికి వెళ్ళినాము. నున్నటి మెరీనా రోడ్డుమీద హేమ ఆక్సిలేటరుమీద గట్టిగా నొక్కింది. మా ముందు కార్లు నిమిసములో వెనుకపడ్డవి. రోడ్డు పక్క నిలబడ్డ కార్లు అన్నీ కలిసి ఒక మాలికై పోయాయి. అంత వేగంతో వెళ్తూన్న కారునుచక్కగా వేగంతగ్గించి, మైలాపూరు వీధుల వెంట తీసుకొనిపోయి, అడయారు నదిదాటి అడయారు కెల్లెటు సముద్రతీరం దగ్గర ఆపింది హేమకుసుమ.వెనుక సీటులో కూచునిఉన్న నేనూ, కల్పమూర్తీ దిగి ముందు కూచునిఉన్న సీతాసుందరికిన్నీ, హేమకుసుమకున్నూ తలుపులుతీసినాము.
