"తలుపులుతీసే ఉన్నాయి" అందామె.
"ఈ రాత్రి సమయంలో మన్ని చూసేవారెవరు?" అన్నడతనామేను మరింత బలంగా హత్తుకుంటూ.
వాళ్ళిద్దర్నీ నేను పరీక్ష గా చూస్తున్నాను. నాక్కాస్త ఒళ్ళు వేడెక్కినామాట నిజం.
అతను రుమాలును ముక్కుకు దగ్గరగా జేర్చాడు. ఆ మాత్రం చాలు. అతను పెల్చకపోయినా ఫరవాలేదు. కానీ అతను పీల్చాడు కూడా. సరిగా ఒకే ఒక నిముషం - అతని తల ఆమె భుజం మీద వాలిపోయింది. నేను రుమాలుకు వేసిన మందు ప్రభావమలాంటిది. అది నేను స్మగ్లర్ దగ్గర సంపాదించాను. నేను వెళ్ళి వీధి తలుపులు వేశాను . నా చేతిలో ఇంకా రివాల్వరుంది.
అతన్ని మంచం మీదకు చేర్చడాని కామే సహాయం చేసింది.
"చాలా మంచిదానివి. బుద్దిగా ప్రవర్తించి నిన్ను నువ్వు రక్షించు కోవడమే కాక నాకు శ్రమ లేకుండా చేశావు" అంటూ అతను తెచ్చిన బ్రీఫ్ కేసుని తెచ్చి తెరిచాను. "నా కళ్ళు చెదిరాయి.
అందులో నాకళ్ళు చెదిరి పోయేటంత డబ్బుంది. నేను సంపాదించా లనుకుంటున్న దానికంటే చాలా చాలా ఎక్కువ డబ్బుంది.
నేను లెక్కపెట్ట దల్చుకోలేదు. త్వరత్వరగా అందులోని డబ్బును నా బ్రీప్ కేసులోకి మార్చేశాను. ఈ డబ్బు గురించి కొంత వెండి సామాను వదిలి పెట్టేయవలసి వచ్చింది.
ఇంక ఇంట్లో వెతకవలసినదేమీ లేదు. నాక్కావలసింది నాకు దొరికింది. నాకుచాలా సంతోషంగా ఉంది.
నేనామెను సమీపించాను. మంచం మీద ఆమె భర్తను కాస్త పక్కగా జరిపి, "నువ్వు పడుకో" అన్నాను.
ఆమె సందేహించింది. భయంగా నావంక చూస్తోంది. ఆమె ముఖంలో బాధ కనబడుతోంది.
"ఊ క్వేక్" అన్నాను.
ఆమె చటుక్కున వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టి, "ప్లీజ్ ఆ డబ్బు మాత్రం తీసుకు వెళ్ళకు. ఆదాయన ఉద్యోగం చేస్తున్న కంపెనీ డబ్బు. ఉద్యోగం పోవడం మాత్రమే కాదు. అయన జైలు పాలు అవుతారు" అంది.
నేను మాట్లాడలేదు. ఆమె మళ్ళీ అంది. 'ఆ వెండి సామాను తీసుకు పో. కావాలంటే నా మెడలో ఇంకా నగలున్నాయి. తీసుకు పో. కానీ ఆ డబ్బు మాత్రం వదిలి పెట్టు"
నేను చటుక్కున ఆమె రెండు భుజాలు పట్టుకొని లేవనేత్తాను. అలా లేవనెత్తడంలో ఆమె పైట జారింది.
ఆమె మెడలో ఒక చంద్ర హర ముంది. అందమైన లాకేట్ వుంది. ఈ రెండూ కాక మంగళ సూత్రాలున్నాయి. నేను మంగళ సూత్రాలు జోలికి పోదల్చుకోలేదు. "వెరీ గుడ్! వెండి సామాను వదులు కోవలసి రావడం నాకు చాలా బాధగా ఉంది. నాకు నీ మెడలో నగల గురించి చూడాలని స్ప్రురించలేదు. మర్యాదగా తీసిచ్చేయి " అన్నాను.
ఆమె చంద్రహారం లాకెట్ గొలుసూ రెండు ఇచ్చేసింది. బరువు అంచనా వేసాను. ఆరేడు వేలు చేస్తాయనిపించింది. "వెళ్ళి నీ భర్త పక్కన పడుకో" అన్నాను.
"ఆ డబ్బు వదిలి పెట్టు"దీనంగా అందామె.
"వెళ్ళి పడుకో" ఈసారి రివాల్వర్ చూపించాను.
ఆమె మంచం మీద పడుతుంది.నా జేబురుమాలు ఆమె ముక్కుకు అదిమి పట్టాను. క్షణాల్లో తల వాల్చేసింది. ఎందుకైనా మంచిదని మరోసారి ఆమె భర్తకు కూడా జేబురుమాలు ముక్కు దగ్గర పెట్టాను. ఆమె ఇచ్చిన రెండు నగలూ బ్రీఫ్ కేసులో వేసేశాను.
వాచీ చూసుకున్నాను. టైము పన్నెండు న్నర కావస్తోంది. ఉత్సాహంగా ఆ ఇంట్లోంచి బయటపడి, తలుపులు బార్లా వేసి అ ఇంటి తలుపుల నాప్యాయంగా ముద్దు పెట్టుకున్నాను.
3
నా జీవిత ధ్యేయం నెరవేరింది. చాలాకాలంగా నేనేదురు చూస్తున్న మంచి ఇల్లు దొరికింది. జీవితంలో నేనిక దొంగతనాలు చేయవలసిన అవసరం లేదు. ఇదేనా ఆఖరి దొంగతనం.
నా గది చేరుకొని, తలుపులు వేసుకుని డబ్బు, లేక్కపెట్టుకున్నాను. సరిగ్గా మూడు లక్షలుంది.
బ్రీఫ్ కేసు మూసి అల్మారా లో పెట్టేశాను. రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు.
నేనా ఇంటిని బాగా పది పదిహేను రోజుల పాటు పరీక్షించి సెలక్టు చేసుకున్నాను. ఆమె భర్త సాధారణంగా రాత్రి సమయాల్లో ఇంట్లో ఉండడు. వాటం చూస్తె కాస్త అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళలా దర్జాగా కనబడుతున్నారు. ఇలా అన్నీ అంచనా వేసుకుని ఆ ఇంటిని సెలక్టు చేసుకున్నాను. ఓ పది వేలదాకా ఆ ఇంట్లో ఎక్స్ పెక్ట్ చేశాను. మూడు లక్షలిచ్చింది నాకా ఇల్లు. ఇంతకంటే అదృష్టమే ముంటుంది?
రాత్రి నాకు ఎన్నో కలలు వచ్చాయి. భావిజీవితానికి సంబంధించినవే అన్నీ. ఎపప్తికో తెల్లవారుజామున గాడ నిద్ర పట్టింది నాకు. కానీ ఎవరో తలుపు తడుతుంటే మెలకువ వచ్చింది. లేచి వెళ్లి తలుపులు తీశాను. ఎదురుగా ఉన్న మనుషులెవరో నా నిద్రమత్తు కళ్ళకు గుర్తు తెలియలేదు. కళ్ళు బాగా నులుముకున్నాను.
"ఇతనే!" అందొక స్త్రీ కంఠం.
అ కంఠన్ని గుర్తు పట్టి ఉలిక్కిపడ్డాను.నా మత్తు పూర్తిగా వదిలి పోయింది.
ఎదురుగా అతను, ఆమె , నలుగురు పోలీసులు ఉన్నారు. అతను తిన్నగా గదిలోకి నడిచి అల్మారా తలుపులు తెరిచి నా బ్రీఫ్ కేసు తీశాడు. "ఇంత అనుమానించవలసిన అవసరం లేదు. అతన్ని అరెస్టు చెయ్యండి!" అన్నాడు. పోలీసులు ముందుకు వచ్చారు.
అతను బ్రీప్ కేసు లోంచి లాకెట్ గొలుసు తీసి నా దగ్గరకు వచ్చి , "మూర్ఖుడా , అత్యాశకు పోయి ఈ గొలుసు తీసుకుని పట్టుబడి పోయావు. ఈ లాకెట్ ఎక్కడున్నా కొన్ని రేడియో సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ ఎక్కణ్ణించి వస్తున్నాయో సులభంగా తెలుసుకునే సాధనం నా దగ్గరుంది. నిన్న రాత్రి నువ్వు నా ఇంటికి వచ్చినపుడు నా భార్య ఈ లాకెట్ లోని ట్రాన్స్ మీటర్ స్వేచ్ అన్ చేసింది. ఆ సిగ్నల్స్ పట్టుకునే నేను అర్ధాంతరంగా ఇంటికి వచ్చాను. కానీ నీ తెలివి తేటల కారణంగా తాత్కాలికంగా రక్షించుకోగలిగావు. అయితే నువ్వు డబ్బు తీసుకుని పారిపోతే నిన్ను పట్టుకోవడం కష్టమే అయుండేది. నా భార్య సమయస్పుర్ర్తి ఉపయోగించి నీ దృష్టి లాకెట్ మీదపడేలా చేసింది. అత్యాశకు పోయావు. పట్టుబడ్డావు..... "అన్నాడు.
"ఇంతకూ నువ్వెవరు ?' అన్నాను బాధగా.
"ఎవరైతే నీ కెందుకులే. నేరస్థుల్ని పట్టుకునే ప్రభుత్వం మనిషిని...." అన్నాడు.
బహుశా ఏ సిఐడి అఫీసరో అయుండాలి. నేను మంచి ఇల్లనుకుని ఆఖరికి తెలివితక్కువగా ఓ సిఐడి అఫీసరింట్లో దూరాను.
"ఎన్నాళ్ళుగా నువ్వీ వృత్తిలో ఉన్నావో తెలియదు. ఇలా ఎంతమంది ఇళ్ళు దోచావో తెలియదు. కానీ నా ఇంట ప్రవేశించి , నీ ఆఖరి దొంగతనం చేశావు" అన్నాడతను.
నేనామె వంక చూశాను. ఆమె కళ్ళలో ఇప్పుడు భయం లేదు. చురుకుగా నవ్వుతోంది. నా వైపు మాత్రం హేళనగా కాక జాలిగా చూస్తోంది.
'అవును. నేనూ అలాగే అనుకున్నాను. ఈ జీవితానికిదే ఆఖరి దొంగతనమనుకున్నాను. కానీ ఈ విధంగా మాత్రం కాదు" అంటూ చేతులు జాపాను.
బేడీలతో పోలీసులు నన్ను సమీపించారు.
***
