"ఏమైంది ?" అన్నాడు శేషగిరి.
"ట్రెయిన్ లో చెకింగ్సవుతున్నాయట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారేమోనని భయంగా ఉంది ...." అన్నాడు గోపాల్.
'అయితేనేం , పేపర్సన్నీ సక్రమంగా ఉన్నాయిగా !"
"ఉన్నాయండి....కానీ నేను పొరపాటున టికెట్ నా పేరునే కొన్నాను. వీసీఅరేమో నా పేరున లేదు. మరెవరి పేరునో ఉంది కదా! ఊళ్ళో అయితే ఫరవాలేదు ! తెచ్చుకోన్నామని చెప్పొచ్చు. రూలు ప్రకారం కస్టమ్స్ క్లియరెన్స్ ఉన్నా వీసీఅర్ అమ్మడానికి లేదు. ఎవరు కొనుక్కోన్నారో వారే ఉంచుకోవాలి. కాబట్టి ట్రయిన్ లో హరాస్ మెంటుంటుంది..."
"అయితే ఏం చేస్తావ్?"
"ఏం చేయాలో పాలుపోవడం లేదు. కోనేముందీ విషయం తెలిస్తే బాగుండేది నాకు ...." అన్నాడు గోపాల్.
"పోనీ -- మా కమ్మేస్తావా!" అన్నాడు శేషగిరి.
గోపాల్ ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టాడు. అసలది తన ఆలోచనలోనే లేదన్నాడు. కానీ ఒక విధంగా అదే మంచిదేమోననిపిస్తోందన్నాడు.
చివరికి "ఏమిస్తారు?" అన్నాడు.
"ఏం కావాలో నువ్వు చెప్పాలి?" అన్నాడు శేషగిరి.
ఈలోగా మిశ్రా వచ్చి - "వీసీఅర్ ఎక్సలెంట్ కండిషన్లో వుంది- నేనిక సెలవు తీసుకుంటాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
'చూశారా వీసీఅర్ మంచి కండిషన్ లో కూడా ఉంది" అన్నాడు గోపాల్.
"ఉందనుకో -- కానీ మేము వ్యాపారస్తులం కాదు. అన్నిటికీ జీతాల మీద ఆధారం. కలర్ టీవీ కొనుక్కుందుకే యింకా తటపటాయిస్తున్నాం. కలర్ టీవీ లేకుండా వీసీఅర్ దండగే కదా! ఇప్పుడిది కొంటె రేపదీ కొనాలి" అన్నాడు శేషగిరి తన లౌక్యాన్నంతా ప్రదర్శిస్తూ.
"నేను పదమూడు వేలకు కొన్నాను. నాకులాభం అవసరం లేదు...." అన్నాడు గోపాల్.
'అంటే కొన్న ధరకే అమ్ముతానంటావు !" అన్నాడు శేషగిరి.
"కొన్న ధర పదమూడు కాదండి. పదిహేను , నా దగ్గిర పేపర్సు కూడా ఉన్నాయి" అన్నాడు గోపాల్.
"ఒకసారి నేనా పేపర్సు చూడొచ్చా ?" అన్నాడు శేషగిరి.
"అమ్ముదామని అనుకోలేదు కదా -- పేపర్స్ హోటల్లో ఉన్నాయి...."
"మా నాన్నంటున్నది - ఓనరు కొన్న ధర కాదు..... మీరు కొన్న ధర ...." అన్నాడు శేషగిరి కొడుకు.
"నేనూ ఈరోజే కొన్నాను గదా! ఇందులో కన్సెషనేమిస్తాను / అంతగా కావాలంటే మాయాబజార్ కాసేట్ మీ దగ్గిర వదిలి పెట్టగలను....." అన్నాడు గోపాల్.
'పదమూడు వేలయితే మేము కొనలేం ....' అన్నాడు శేషగిరి.
"ఎంతకు కొనగలరు ?"
"ఏడువేలు ...." అన్నాడు శేషగిరి కొడుకు.
శేషగిరి కొడుకు వంక గుర్రుగా చూశాడు. అప్పుడే ఏడు వేలనేసినందుకు !
"వద్దులెండి -- ఇంతకంటే కస్టమ్స్ చెకింగు విషయంలో రిస్కు తీసుకోవడమే మంచిది ...." అన్నాడు గోపాల్.
"మాకు తోచింది మేం చెప్పాం. నీకు తోచింది నువ్వూ చెప్పొచ్చుగా --" అన్నాడు శేషగిరి.
"నేను మీకు వీసీఅర్ నమ్మను. ఏమీ అనుకోవద్దు .."
"ఎందుకని ?"
"ట్రయిన్ లో మానేజ్ చేసుకునేందుకు నా పద్దతులు నాకున్నాయి. మీ యింట్లో వీసీఅర్ టెస్టింగయింది అందుకు చాలా చాలా థాంక్స్ ...." అన్నాడు గోపాల్.
"మానేజ్ చేయడమంటే లంచ మివ్వడమేగా? వాళ్ళ కిచ్చే లంచం - మాకు కన్సెషన్ గా యివ్వవచ్చు ...." అన్నాడు శేషగిరి.
'చూడండి సార్ ! నేను వ్యాపారస్తుడి కొడుకును. గౌరవంగా బ్రతికినవాణ్ణి . ఒకరి చేత వేలెత్తి చూపించుకోవడం నా కిష్ట ముండదు...." ఆగాడు గోపాల్.
"ఇప్పుడు మాత్రం నీకేమయింది ?"
"నేను పదమూడు వేలక్కొన్నానన్న వీసీఅర్ని -- మీరేడువేల కడుగుతున్నారు. అంటే అర్ధమేమిటి? ఇదేదో దొంగ సరుకని మీరనుమానిస్తున్నారు. బొంబాయిలో ప్లాట్ ఫారం ల మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర తప్ప ఇలాంటి బేరా లుండవు కదా! నేను చాలా హర్టయ్యాను. ఇది దొంగ సరకు కాదు. కష్టార్జితం తో కొన్నది...."
శేషగిరి అతడనుసరించి తన ఉద్దేశ్యమది కాదని మరీ మరీ చెప్పాడు.
"అయితే మీకిది నేనమ్మగలను. కస్టమ్స్ వాళ్ళకి మూడు వేలదాకా లంచామివ్వాల్సుంటుంది. మీరు చెప్పినట్లు - ఆ డబ్బు మీకే కన్సెషన్ గా యివ్వచ్చు. అంటే పదివేలు. కానీ నేనిది పదివేలకు అమ్మను. పదివేల ఎనభై నాలుగుకిస్తాను ..." అన్నాడు గోపాల్.
"మధ్య ఆ ఎనభై నాలుగేమిటి?" అన్నాడు శేషగిరి.
'పదమూడు మా యింట్లో అచ్చొచ్చిన అంకె. మీరిది పదమూడు వేలకు కొనడం లేదు. కాబట్టి ఇందులో అంకెలన్నీ కలిపితే పదమూడు రావాలి. పదివేల ఎలభై నాలుగంటే -- ఒకటి, ఎనిమిది, నాలుగు ....లన్నీ కలిపి పదమూడు కదా !"
"వద్దులే !' అన్నాడు శేషగిరి- "మా యింట్లో ఉన్న క్యాషంతా కలిపి ఏడువేలు. నువ్వేమో ఈ రాత్రికే వెళ్ళిపోతున్నావు .."
"కావాలంటే టికెట్ కాన్సిల్ చేసుకుంటాను. మిగతా డబ్బు రేపుదయం వచ్చి వసూలు చేసుకుంటాను. ఆ కాన్సిలేషన్ చార్జెస్ కూడా మీవే !" అన్నాడు గోపాల్.
శేషగిరి కొడుకు తండ్రి వంక గుర్రుగా చూసి --"ఏడు వేలకు మించి వీసీఅర్ కొనే తాహతు మాకులేదు..." అన్నాడు.
'అయితే సెలవు ...." అన్నాడు గోపాల్.
"ఒక్కసారి లోపల కూడా అడిగివస్తాను...." అన్నాడు శేషగిరి.
తండ్రి కొడుకులు లోపలకు వెళ్ళారు. ఆడవాళ్ళతో కలిసి విషయం చర్చించారు.
ముందాడవాళ్ళుత్సాహపడ్డారు.
"ఉగాది కి మీ ముగ్గురికి కలిసి పదివేల రూపాయల బంగారం కొనే కార్యక్రమముంది. ఆలోచించు కొండి -- బంగారం కావాలా, వీసీఅర్ కావాలా ?" అన్నాడు శేషగిరి కొడుకు.
కాసేపాలోచించి ఆడవాళ్ళు బంగారానికే ఓటు వేశాడు.
"బంగారం లాంటి వీసీఅర్ -- మళ్ళీ అమ్ముకుంటే పదమూడు వేలోస్తుంది...." అన్నాడు శేషగిరి నిట్టూర్చి .
'వీసీఅర్ బంగారం లాంటిదే కానీ బంగారం కాదు --' అన్నాడు కొడుకు.
బయట్నించి గోపాల్ కేకపెట్టాడు -- 'అయ్యా ! నాకు ట్రైన్ టైమవుతోంది . సెలవిప్పిస్తే వెళ్లొస్తాను..."
"వెళ్ళనివ్వండి నాన్నా! అతడే మళ్ళీ మనకు పట్టుకొచ్చి వీసీఅరిస్తాడని నా నమ్మకం ...." అన్నాడు శేషగిరి కొడుకు.
గోపాల్ వీసీఅర్ తీసుకుని వెళ్ళిపోయాడు.
శేషగిరికి కాస్త బాధనిపించింది.
యాబయ్యోవడిలోకి వచ్చినప్పట్నించీ అయనలో తిరిగే ఓపిక తగ్గింది. టీవీ ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడాయన. అయితే టీవీ లో తెలుగుమాట వినపడ్డం లేదని అయన బాధ!
రాత్రి పదకొండు దాటినా శేషగిరి వీసీఅర్ ఆలోచన లతో నిద్రాపట్టలేదు.
సుమారు పదకొండున్నర ప్రాంతాల కాలింగ్ బెల్ మ్రోగింది.
అప్పుడాయనొక్కడే మెలకువగా ఉన్నాడు.
'గోపాల్ వచ్చాడేమో - ఏడు వేలకే వీసీఅరిస్తాడేమో !" అనుకుంటూ అయన పక్క మీంచి లేచాడు.
తలుపు తీసేసరికి ఎదురుగా ఉన్నది గోపాల్ కాదు. మరెవరో!
"నేనండి ....ఇందాకా వచ్చానుగా -- " అన్నాడతడు ఒరియాలో.
శేషగిరికి గుర్తొచ్చింది. అతడు గోపాల్ తీసుకొచ్చిన వీసీఅర్ మెకానిక్.
"ఏం కావాలి ?' అన్నాడు శేషగిరి ఒరియాలో.
"వీసీఅర్ తీసుకుని వెడదామని వచ్చానండి ...."
"వీసీఅర్ తీసుకుని వెళ్లడమేమిటి?" అన్నాడు శేషగిరి అర్ధం కాక ....
'అదే ....సాయంత్రం గోపాల్ బాబు మీ యింట్లో సినిమా వేసుకొంటామని వీసీఅర్ అద్దెకు తెచ్చారుగా. అద్దె ఆయనే కట్టేశాడు లెండి! వీసీఅర్ వెనక్కు తీసుకుని వెడదామని వచ్చానండి ...." అన్నాడు మెకానిక్.
శేషగిరి ఇంటిల్లిపాదినీ లేపాడు.
అయన బుర్రలో అంతా అయోమయమైపోయింది.
మెకానిక్ జరిగింది తెలుసుకుని గోల పెడుతున్నాడు.
అప్పటికప్పుడు స్కూటర్ మీద హోటల్ అనార్కలీ కి వెడితే -- అందులో గోపాల్ పేరు మీద గత రెండు మూడు రోజులుగా ఎవరూ దిగలేదని తేలింది.
కోరమండల్ ఎక్స్ ప్రెస్ కాస్త లేటయింది. స్టేషనుకు వెడితే అక్కడా గోపాల్ కనబడలేదు.
మోసం చేసేవాడు నిజం చెబుతాడా?
మెకానిక్ దిగులుగా వెళ్ళిపోయాడు. అతడు చేసిన తప్పేమీ లేకపోయినా యజమాని కోపానికి గురికాక తప్పదతడికి.
శేశాగిరింట్లో మాత్రం -- శేషగిరి కొడుకును విపరీతంగా మెచ్చుకుని --"ఈరోజు నువ్వు ఏడువేల రూపాయలు సేవ్ చేశావు ...." అన్నాడు.
'అది దొంగసరుకై ఉంటుందని ఊహించాను కానీ మరీ యిలా జరుగుతుందని ఊహించలేదు. దొంగ ఏడు వేలకే కక్కుర్తి పడకపోవడం మన అదృష్టం ...." అన్నాడు శేషగిరి కొడుకు.
***
