నేను లేచి నిలబడి-"సెలవు-" అన్నాను.
"స్వామి దర్శనం చేసుకుని వెళ్ళరా?" అన్నాడు నిరంజన్.
"స్వామి ఇక్కడే ఉన్నాడా?"
"మాయింట్లో ఓగది స్వామికి ప్రత్యేకం అక్కడ నిలువెత్తు స్వామివిగ్రహముంది. మీరు మనోవాక్కాయ కర్మేణా ఆయన్ను నమ్మితే ఆవిగ్రహం మనుష్యరూపంలో మీతో సంభాషిస్తుంది-" అన్నాడు నిరంజన్.
"మీ కెప్పుడేనా అలా జరిగిందా?"
"ఎన్నోసార్లు..."
కుతూహలంగా నిరంజన్ ననుసరించాను.
అగది దేవాలయంలా ఉంది. గదిలో అగరువత్తుల పరిమళాలు.....పవిత్రవాతావరణం.
సిద్దేంద్రస్వామి విగ్రహం చిరునవ్వులు చిందిస్తోంది.
నేను విగ్రహాన్ని పరీక్షగా చూశాను. కళ్ళు మూసుకుని నమస్కరించాను. నామనసులో ఎలాంటి భావమూ కలగలేదు.
కళ్ళు తెరిచాను.
విగ్రహం చిరునవ్వులు చిందిస్తుంది.
"స్వామి కనబడుతున్నారా?" అన్నాడు నిరంజన్.
తల అడ్డంగా ఊపాను.
నిరంజన్ నిట్టూర్చి-"ప్రయత్నించండి అదృష్టముంటే ఏదో ఒకరోజున మీలో భక్తిభావం కలుగుతుంది...." అన్నాడు.
నేనూ నిట్టూర్చాను.
6
నా కొత్త స్మగ్లింగ్ ఆపరేషన్ కింకా వ్యవధి ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.
ఒక హైస్కూల్లో అటెండరుగా ఉన్న నిరంజన్ దేశంలో ఏమూలనైనా హత్యచేయగల సమర్ధుడు. తను పెంకుటింట్లో ఉంటూ తనవారందరికీ సకల వైభోగాలనూ అందించగల నిరంజన్ ప్రాణాలు కింతవరకూ ఎవరి నుంచి ప్రమాదం వాటిల్లలేదంటే అది సిద్దేంద్రస్వామి మహిమ అనుకోవాలా, మన సమాజం గొప్పతనం అనుకోవాలా?
డబ్బు, పలుకుబడి, హోదా ఉన్న నేను నిరంజన్ కి భయపడుతున్నాను. నాభయాన్ని తొలగించగలవ్డు సిద్దేంద్రస్వామి మాత్రమే నని అంటున్నాడు నిరంజన్.
ఇప్పుడు నేనేం చేయాలి?
ఎందుకో నాకు సిద్దేంద్రస్వామిపై నమ్మకం కుదరలేదు. నేను నాస్తికుణ్ణి.
ఏమీ పాలుపోనీ సమయంలో నావద్దకో విచిత్రమైన కేసు వచ్చింది. కేసు ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది.
ఒకడిపేరు మాధవరావు. అమాయకుడు. ముక్కుకు సూటిగా పోయేవ్యక్తి. చిన్న ఉద్యోగి. నీతిసూత్రాలనూ, ఆదర్శాలనూ నమ్ముకున్న కారణంగా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయిన సామాన్యుడు.
రెండోవ్యక్తి సుదర్శనం బాగా ఉన్నవాడు అహంకారి. అతడి ధనదాహం అంతులేనిది.
సుదర్శనం కూతురు మాధవరావు కొడుకుని ప్రేమించింది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటామంటున్నారు. సుదర్శనం కూతుర్ని మందలిస్తే-"నువ్వు నాకు మరో పెళ్ళి చేసినా నేను భర్తను వదిలిపెడతాను. నా ప్రియుడి దగ్గరకు వెళ్ళిపోతాను-" అని చెప్పింది. ఆమె మొండిది. అన్నంత పనీ చేయగలదని తండ్రికి తెలుసు. అందుకని ఆయన మాధవరావును హెచ్చరించాడు. మాధవరావు కొడుకు తండ్రి మాట వినడంలేదు. చివరకు సుదర్శనం మాధవరావు కొడుకును చంపేస్తానని చెప్పి పదిరోజులు గడువిచ్చాడు. పదిరోజుల తర్వాత మాధవరావు కొడుకు ఊళ్ళో కనపడకూడదు. కనపడ్డాడా ఆ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరికీ కనపడడు.
సుదర్శనం, మాధవరావు-ఇద్దరూ నాకు స్నేహితులు నా హోదా నన్ను సుదర్శనానికి స్నేహితుణ్ణి చేసింది. మధ్యతరగతి వాళ్ళు నా పట్ల చూపే ఆరాధన నన్ను మాధవరావుకు స్నేహితున్ని చేసింది.
ఇద్దరూ విడివిడిగా నన్ను కలుసుకున్నారు.
తెలివైనవాడు తనకు ప్రతికూలంగా వున్న విశేషం నుంచి కూడా ప్రయోజనం పొందగలడు.
నేను తెలివైనవాణ్ణి.
మాధవరావుకు నేను సిద్దేంద్రస్వామి గురించి సలహా యిచ్చాను. మాధవరావుకు దేవుడంటే అంతో యింతో నమ్మకముంది. నేను నాస్తికుడినని అతడికి తెలుసు.
"మీరు సిద్దేంద్రస్వామిని నమ్ముతారా?" అంటూ ఆశ్చర్యపోయాడతడు.
"మీరు నమ్మరా?" అన్నాను.
"నేను అన్నింటికీ ఈ వెంకటేశ్వరునిపై ఆధారపడ్డాను. సిద్దేంద్రస్వామి గురించి నాకాట్టే తెలియదు...."
నేనతడికి సిద్దేంద్రస్వామి గురించి చెప్పి-"త్రికరణ శుద్ధిగా స్వామిని నమ్మితే-సాక్షాత్తూ మృత్యుదేవత తరలివచ్చినా మీ అబ్బాయికే ప్రమాదమూ వుండదు.." అన్నాను.
మాధవరావు నా వుపాయానికి చాలా సంతోషించాడు. నేను చెప్పిన నిదర్శనాలతడికి నమ్మకాన్ని కలిగించాయి.
అంతటితో నా పని పని అయిపోలేదు. నేను పులికీ, లేడికీ కూడా స్నేహితుణ్ణి వేటగాడికీ స్నేహితుణ్ణి.
సుదర్శనం నన్ను సలహా అడిగినప్పుడు నేనతడికి నిరంజన్ పేరు సూచించాను.
"నిరంజన్ గురించి విన్నాను కానీ నేనెప్పుడూ ఉపయోగించుకోలేదు...." అన్నాడు సుదర్శనం.
"నిరంజన్ వల్ల చాలా సుఖాలున్నాయి. హత్యగురించి వంకాయలు బేరం చేసినంత సులభంగానూ మాట్లాడుకోవచ్చు. అన్నీ సూటిగా వుంటాయి. అనుకున్న పని గ్యారంటీగా అయిపోతుంది. నీ పేరు బయటకు రాదు..."
"నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను. ఇంత వరకూ నేను హత్యలు చేయలేదు. చేయించలేదు. అందుకే భయపడుతున్నాను. కానీ ఆ మాధవరావుకు గట్టిగా బుద్ధిచెప్పకపోతే ఎలా? నాకింకా ఇద్దరాడపిల్లలున్నారు" అన్నాడు సుదర్శనం.
"అయితే మాధవరావు కొడుకును చంపించేస్తావా?"
"ఊఁ"
"ఇప్పుడేనా!"
"కాదు పదిరోజులు గడువిచ్చానుగా. ఇంకా టైముంది....ఈలోగా మాధవరావు భయపడకపోడు.."
"అయితే నిరంజన్ ని ఇప్పట్నించీ కలుసుకోకు. నిరంజన్ కి మాటంటే రామబాణం. హత్య తప్పనిసరి అయితే ఒకరోజు ముందు వెళ్ళి అతఃడికి చెప్పడం మంచిది...." అన్నాను.
"నువ్వెలా చెబితే అలాగే!" అన్నాడు సుదర్శనం వినయంగా.
మాధవరావుపట్ల అహంకారమే నాపట్ల వినయంగా మారిందని నాకు తెలుసు. అయినా అతడి వినయం నాకు సంతోషాన్ని కలిగించింది.
7
"పిలిచారుట?" అంది వినీత.
నేనామెవంక పరీక్షగా చూశాను.
లేత తమలపాకులా సుకుమారంగా ఉందామె. ఆమె వంటిమీద దుస్తులు, అలంకరణ కిళ్ళీలో మాసాలాలా వున్నాయి. నాకామెను కిళ్ళీని నమిలినట్లు నమిలేయాలనుంది కానీ వినీత కళ్ళలో ఎటువంటి భావాలూలేవు. ప్రశాంత వదనమామెది!
"నీకు వారంరోజులు మాత్రమే గడువు!" అన్నాను.
ఆమె నవ్వింది. చాలా అందంగా, మనోహరంగా!
"నీ సిద్దేంద్రస్వామికి నేను పరీక్షపెట్టాను. ఆ పరీక్షలో స్వామి తప్పక ఓడిపోతాడు. అప్పుడు నన్నిక ఎవరూ ఆపలేరు-నువ్వు కూడా!"
వినీత ఇంకా నవ్వుతూనే వుంది-"ఇంతకాలం మిమ్మల్నెవరాపారు? అ సిద్దేంద్రస్వామి కాదా?"
