Previous Page
వసుంధర కథలు-13 పేజి 26


    తడబడ్డాను. వినీత నన్ను బెదిరించగానే నాకు శ్రీదేవి అన్నయ్యనుంచి బెదిరింపు ఉత్తరం వచ్చింది. అప్పట్నించీ ఆమె గురించి మరిచి నిరంజన్ గొడవలో పడ్డాను.
    ఇది సిద్దేంద్రస్వామి మహిమ అవుతుందా?
    "స్వామిని పరీక్షిస్తున్నాననుకుంటే అది మీ భ్రమ, స్వామి తనే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు-" అంది వినీత మళ్ళీ.
    చటుక్కున మళ్ళీ ఆమె చేయి పట్టుకుని-ఇప్పుడు నిన్ను దగ్గరగా లాక్కుంటే ఏమవుతుంది?" అన్నాను.
    "మీ కుటుంబం సమూలంగా నాశనమవుతుంది...."
    అదే ప్రశాంతత....అదే నిర్మలత్వం.....
    నేను ఆమె చేయి వదిలి-"వెళ్ళు.....ఇంకా వారం రోజులు గడువుంది..." అన్నాను.
    "వారం రోజుల తర్వాత కూడా జరిగే దిదే...." న్తూ వెళ్ళిపోయిందామె!
    ఆడది....అబల....అసహాయురాలు....అనాథ.....
    ఎంత ధైర్యంగా వుంది! ఎంత నమ్మకంగా వుంది!
    సిద్దేంద్రస్వామి సామాన్యుడు కాదు....."మరి నా పరీక్షలో ఆ స్వామి ఏమవుతాడో చూడాలి.

                                    8

    వారంరోజుల గడువుపూర్తి కావస్తోంది. ఈ వ్యవధిలో ఒక్కసారి కూడా మాధవరావు నా దగ్గరకు రాలేదు.
    సిద్దేంద్రస్వామి మహిమతో మాధవరావు కొడుకులో మార్పు వచ్చిందా? లేక సుదర్శనం తన కూతుర్నాయింటి కోడల్ని చేయదల్చుకున్నాడా?
    కుతూహలం పట్టలేక నేను మాధవరావింటికి వెళ్ళాను. అక్కడ నాకు ప్రత్యేకంగా మర్యాదలు జరిగాయి. నేను, మాధవరావు ఓ గదిలో తలుపులు వేసుకుని కూర్చున్నాం.
    "పరిస్థితిలో మార్పు వచ్చిందా?" అన్నాను.
    "లేదు-" అంటూ తల అడ్డంగా ఊపాడు మాధవరావు.
    "కానీ మీరు చాలా ఉత్సాహంగా కనబడుతున్నారు."
    "నా కిప్పుడు మనసెంతో ప్రశాంతంగా వుంది. సిద్దేంద్రస్వామి తప్పకుండా నా బిడ్డను కాపాడుతాడనే అనిపిస్తోంది."
    "మీ వాడేం చేస్తున్నాడు?"
    "ఆ అమ్మాయి రాత్రి కిల్లు వదిలి వచ్చేస్తానందిట. ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి గుళ్ళో పెళ్ళి చేసుకుంటారట బ్రతికినా, చచ్చినా కలిసేనంటోందా అమ్మాయి"
    "మరి మీరేమంటున్నారు?"
    "అంతా ఆ సిద్దేంద్రస్వామి దయ... అన్నాడు మాధవరావు.
    నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను. మాధవరావుకు నేను మంచి చేశానో లేదో తెలియదు కానీ అయన సుధార్శనానికి భయపడ్డం మానేశాడు.
    నేను మంచంమీద పడుకుని ఈ విషయమే ఆలోచిస్తూండగా నాకోసం సుదర్శనం వచ్చేడు.
    అతడి ముఖంలో కంగారు, కలవరం వగైరాలున్నాయి
    సిద్దేంద్రస్వామి భక్తులకీ, కాని వారికీ తేడా తెలుస్తోంది నాకు.
    "ఏమయింది?" అన్నాను.
    "అనవసరంగా గడువిచ్చాను. ఇప్పుడంతా నా పీకల మీదకు వచ్చింది-..." అన్నాడు సుదర్శనం.
    "కంగారు పడకుండా అసలు విషయం చెప్పు."
    "అమ్మాయీ రాత్రికే ఆ దౌర్భాగ్యున్ని పెళ్ళి చేసుకుంటుందిట."
    "ఈ రాత్రికే ఏం కర్మ! ఎప్పుడో పెళ్ళి చేసుకుంటానంది. కానీ నువ్వు సాగనిస్తావా?"
    "అది చాలా తెలివైనది. వాళ్ళ బామ్మను పట్టింది."
    సుదర్శనం తల్లికి వయసు ఎనభైపైన వుంటుంది. ఆమె పదిమంది పిల్లల తల్లి. ఆఖరివాడని సుదర్శనమంటే ఆమె కెక్కువిష్టం. అందుకే అతడితో వుంటోంది. సుదర్శన మీవాడిలా పచ్చగా వున్నాడంటే కారణం ఆ తల్లి చలవే! ఆ ఇంట్లో సుదర్శనం తల్లి మాట కాదనగల శక్తి ఎవరికీ లేదు. ఎనభై ఏళ్ళు వచ్చినా ఆమె దృఢంగా ఉంది.
    సుదర్శనం కూతురు తన ప్రేమ కథ గురించి బామ్మకు చెప్పుకుంది. బామ్మ మాధవరావు కొడుకును తనింటికి రప్పించుకుని పలకరించి మాట్లాడింది. ఆమెకు మాధవరావు కొడుకు వచ్చాడు. వెంటనే సుదర్శనాన్ని పిలిచి చీవాట్లు పెట్టింది.
    "నీకు తెలియదమ్మా-వాడో దగుల్భాజీ వెధవ అల్పాయుష్కుడు ఒక్క బుద్ధికూడా మంచిదికాదు..." అంటూ సుదర్శనం తల్లి మనసు మార్చడానికి ప్రయత్నించాడు. ఆమె వినకుండా-"అంతా చూసేవాళ్ళ' కళ్ళలో ఉంది. నాకు తెలుసు. అతగాడు పేదవాడని నీకు నచ్చలేదు. ఒకప్పుడు మనమూ పేదవాళ్ళమే! పేదరికాన్ని గౌరవించాలి కానీ ఏవగించుకోకూడదు. కుర్రాడు బుద్దిమంతుడు. నాకు నచ్చాడు...." అని చెప్పింది.
    "అమ్మా! చాలాసార్లు నీ మాటలు విన్నాను. ఈ విషయంలో మాత్రం నాకడ్డు చెప్పకు. అమ్మాయికి నేను మంచి సంబంధం చూసి చేస్తాను...." అన్నాడు సుదర్శనం.
    "నీ మాట ఎవరికీ లెక్క? ఈ రాత్రే వాళ్ళ పెళ్ళి జరుగుతుంది..." అంది సుదర్శనం తల్లి.
    "నా ప్రమేయం లేకుండా పెళ్లెలా చేస్తావు?" అన్నాడు సుదర్శనం.
    "పెళ్ళి గుళ్ళో చేస్తాను" అంది సుదర్శనం తల్లి.
    ఆమె మొండిపట్టు వీదదని తెలిసేక-"అయితే అమ్మా! ఒక చిన్న మనవి, పిల్లలముందు నేను లోకువై పోకుండా కాపాడు. ఈ పెళ్ళి నాకు తెలియకుండా జరిగినట్లే వాళ్ళనుకోవాలి. ఓసారి పెళ్ళయ్యాక అక్షింతలు వేసి దీవించక తప్పదుగదా!" అన్నాడు సుదర్శనం.
    "లేనిపోబ్ని పట్టుదలకు పోకు వైభవంగా జరగాల్సిన పెళ్ళి గుళ్ళో జరుగనివ్వకు.." అంది సుదర్శనం తల్లి.
    "అమ్మా! నువ్వు నా మాట వినడంలేదు. నాకు తెలిసి ఆ వెధవ అల్పాయుష్కుడు. వాడికూళ్ళో చాలామంది పెద్ద వాళ్ళతో గొడవలున్నాయి. పెళ్ళికి కాస్త ముందో వెనకో వాడెవరి చేతిలోనో చస్తాడని నా భయం. అలాంటి వాణ్ణి నే నేరికోరి అల్లుణ్ణి చేసుకున్నానని నలుగురూ అనుకోవడం నాకిష్టంలేదు. వాడికి నా చేతుల్తో నేను కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యలేను..." అన్నాడు సుదర్శనం.
    "కొంపదీసి నువ్వే అతగాడిని చంపేయవు గదా!" అంది సుదర్శనం తల్లి అనుమానంగా.
    "అమ్మా! నేను హంతకుణ్ణి కాగలనా?" అన్నాడు సుదర్శనం.
    "నా బిడ్డలు హత్యలు చేయరు. చేయించలేరు...." అంది సుదర్శనం తల్లి నమ్మకంగా.
    ఇప్పుడు సుదర్శనం నాకా విషయాన్ని చెప్పి-"ఏ తల్లీ తన కన్నబిడ్డ హత్యలు చేయించే స్థాయికి ఎదిగాడని నమ్మదు. ఇప్పుడు నాకు నిరంజన్ సాయం కావాలి. పెళ్ళికి ముందే వాణ్ణి ఫినిష్ చేయాలి.." అన్నాడు.
    నిరంజన్ అయితే హత్య గ్యారంటీ సుదర్శనమె ఆ హత్య చేయించాడన్న అనుమానం యెవరికీ రానివ్వడు. అది యాక్సిడెంటుకింద చూపగలడు.
    "అయితే నిరంజన్ ని కలుసుకో.." అన్నాను.
    "నువ్వు సాయం రావాలి. ఇలాంటివి నేనెప్పుడూ చేయలేదు అందుకని నాకు భయంగా వుంది. వళ్ళంతా వణుకుతోంది."
    మామూలుగా అయితే ఏమోకానీ-ఆ రోజు నా మనస్థితివేరు. సిద్దేంద్రస్వామిని పరీక్షించాలని అనుకుంటున్నాను. నిరంజన్ తో కొంత పరిచామూ వుంది.
    ఇద్దరం నిరంజన్ ఇంటికి వెళ్ళాం.
    నిరంజన్ ఇంట్లోనే వున్నాడు. అప్పుడు సాయంత్రం ఆరుగంటలయింది.
    నిరంజన్, మేము చాపమీద కూర్చున్నాం.
    హత్య గురించి వినగానే హతుడి వివరాలడిగాడు నిరంజన్.
    మాధవరావు కొడుకు గురించి చెప్పాడు సుదర్శనం.
    వివరాలన్నీ విని-"నలభై వేలవుతుంది-" అన్నాడు నిరంజన్.
    "చాలా ఎక్కువ-" అన్నాడు సుదర్శనం చటుక్కున.
    నిరంజన్ కళ్ళు చిట్లించి-"నా దగ్గర బేరాలుండవు. నా మాటే ఆఖరుమాట..." అన్నాడు.
    సుదర్శనం ఒప్పుకున్నాడు.
    "సగం అడ్వాన్సివ్వాలి...." అన్నాడు నిరంజన్.
    సుదర్శనం కూడా డబ్బు హత్యకు ఒకరోజు ముందిచ్చినా చాలు. ఈ హత్యకు ముహూర్తం సరిగా ఈ రోజుకు పదిరోజుల తర్వాత...." అన్నాడు నిరంజన్.
    "అలాకాదు హత్య ఈ రోజే జరగాలి..." అన్నాడు సుదర్శనం.
    "ఈ రోజు వీలు కాదు."
    సుదర్శనం తన అర్జెన్సీ వివరించినా నిరంజన్ అంగీకరించలేదు.
    "యాభై వేలిస్తాను...." అన్నాడు సుదర్శనం నిరంజన్ చలించలేదు. ఆవేశంలో బేరాన్ని లక్షదాకా పోనిచ్చాడు సుదర్శనం.
    "ఒకటికాదు-పదిలక్షలిచ్చినా ఈ రోజు హత్య చేయడం సాధ్యంకాదు..." అన్నాడు నిరంజన్.
    "ఎందుకని?" అన్నాను కుతూహలంగా.
    "ఇంకో గంటలో నేను సిద్దేంద్రస్వామి ఆశ్రమానికి బయల్దేరుతున్నాను. అదిక్కడికి రెండువందల కిలోమీటర్ల దూరంలో వుందని మీకూ తెలుసు. అక్కడ వారం రోజులు గడిపి వచ్చేకనే-నేను మళ్ళీ ఇహాన్ని గురించి పట్టించుకునేది...." అన్నాడు నిరంజన్.
    "ప్రయాణం వాయిదా వేసుకోకూడదా?" అన్నాను.
    నిరంజన్ కళ్ళెర్రబడ్డాయి-"మిన్ను విరిగి మీదపడ్డాసిద్దేంద్రస్వామి దర్శనానికి బయల్దేరిన ప్రయాణం వాయిదా వేయడం సాధ్యంకాదు. ఈ ప్రపంచంలో నాకు స్వామి భక్తి తర్వాతనే మరేదైనా!"
    నేను తెల్లబోయాను.
    సిద్దేంద్రస్వామి తన భక్తులను రక్షించి మహిమను చూపించేడా? కానీ హత్యల నామోదించిన మనిషి దేవుడెలాగౌతాడు?
    సమాధానం నాకు తెలియలేదు. కానీ నేను కూడా సిద్దేంద్రస్వామి భక్తుడినయ్యాను. ఆ భక్తి నిరంజన్ కుటుంబానికి అంతులేని సంపదను తెచ్చిపెట్టింది.
    నేను సిద్దేంద్రస్వామి భక్తుడినయ్యానని చెప్పేక-వినీతకూ నాకూ సంబంధించిన సమస్య ఎలా పరిష్కరించబడిందో చెప్పనవసరం లేదనుకుంటాను.

 

                                            -:అయిపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS