"అయితే హంతకులందరూ భగవంతుడి అనుచరులనా మీ ఉదేశ్యం?"
"కాదు భగవంతుని ఆదేశం లేకుండా హత్యలు చేసినవారు పట్టుబడి శిక్షకు పాత్రులవుతారు. నావంటి వారు పట్టుబడకుండా మేడలు కడతారు. సంపదలు పెంచుకుంటారు...."
"ఒకవిధంగా మీరూ శిక్ష అనుభవిస్తున్నారేమో! అంతులేని సంపదలకు వారసులయుండీకూడా మీరు సామాన్యంగా జీవిస్తున్నారు...." అన్నాను.
"నాకు సంపదలమీదా, విలాసాలమీదా మోజు లేదు. మానసికంగా ఏనాడో సన్యాసిని, నా జీవితం నాకు నచ్చింది...."
"అయితే మీరు హత్య లెందుకు చేస్తున్నట్లు?"
"ఆరంభంలో ఆత్మరక్షణకు హత్య చేశాను. నన్ను నేను కాపాడుకునేందుకో పెద్దమనిషి నాశ్రయిస్తే ఆయన నాచేత మరిన్ని హత్యలు చేయించాలనుకున్నాడు. అప్పుడు నేను సిద్దేంద్రస్వామి భక్తుడి నయ్యాను. స్వామి నా పాపాలు క్షాళనం చేశాడు. మనసునుపవిత్రం చేశాడు. హత్యలు చేసి సమాజంలో పెద్దమనుషులందర్నీ కాపాడమని ఆదేశిం'చాడు. నేనే పాపంచేసినా అది తనదేననీ నన్నంటదనీ భరోసా యిచ్చాడు. హత్యలు నాకోసం కాక భగవంతునికోసం చేస్తున్నాను. కాబట్టి ప్రతిఫలం నన్ననుభవించవద్దన్నాడు. హత్యల కారణంగా నేను సంపాదించిన డబ్బు నేననుభవించిననాడు-హత్యలు పాపాలై నన్ను వేదిస్తాయి. అందుకే నేనిలా సామాన్యంగా జీవిస్తున్నాను...."
"అయితే ఆ డబ్బంతా ఎవరనుభవిస్తున్నారు?"
"నాకు నలుగురు కూతుళ్ళున్నారు. అయిదుగురు కొడుకులున్నారు. అందరూ పిల్లాపాపలతో సుఖంగా ఉంటున్నారు. నాసంపదను వారనుభవిస్తున్నారు...."
"మీ ఆస్తిని మీరనుభవిస్తేనేం-మీ పిల్లలనుభవిస్తేనేం-ఒకటేకదా!" అన్నానాశ్చర్యంగా.
"నేను మానసికంగా సన్యాసిని. నాబిడ్డలకు నాఆస్తి పాస్తులిచ్చి ఉండవచ్చు. కానీ మానసికంగా వారికీ నాకూ ఏ సంబంధమూలేదు. తాళికట్టాను కాబట్టి నా భార్య నాతో ఉండవచ్చు. కానీ మానసికంగా ఆమె నాకు శిష్యురాలు మాత్రమే!"
"చాలా చిత్రంగా ఉంది.... " అన్నాను.
"ఇందులో చిత్రమేమీలేదు. ఇలా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఎందరిలోనో నేనొకన్ని, నాకు సిద్దేంద్రస్వామి దీవెనలున్నాయి...."
నేను నిరంజన్ వంక పరీక్షగా చూశాను. అతడు నిజంగా సన్యాసి అనిపించింది. అతడి ముఖంలో ఎటు వంటి భావాలు లేవు.
కాసేపు మామధ్య మౌనం రాజ్యమేలింది. నిశ్శబ్ధాన్ని నిరంజనే ఛేదించి-"మీరు వచ్చిన పని చెప్పలేదు"- అన్నాడు.
నేను చటుక్కున-"నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీరే రక్షించాలి-" అన్నాను.
నిరంజన్ చిత్రంగా నావంక చూసి నా వివరాలడిగాడు. అతడికి నేను నాగురించిచెప్పుకున్నాను.
"మీకు ప్రాణభయమెందుకు?" అన్నాడతడాశ్చర్యంగా.
"ఇటీవల నేనో స్మగ్లింగ్ వ్యవహారంలో దిగాను. అందులో నాప్రత్యర్ది నాప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు...."
"స్మగ్లింగ్ లోకి దిగేక అలాంటివి తప్పవు...."
"అవును నా ప్రత్యర్ధి నాకంటే బలవంతుడు కాదు కానీ ప్రమాదకరమైన మనిషి, అందుకే అతడికి నేను భయపడుతున్నాను....."
"ఎవరతడు?"
"అతడి పేరు నాకు తెలియదు కానీ అతఃది గురించిన వివరాలు చెప్పగలను-" అంటూ నా శ్రీమతి శ్రీదేవికి అన్నయ్య నంటూ ఉత్తరం రాసిన రాసినవాడి విశేషాలు చెప్పాను. నా స్మగ్లింగు ఆపరేషన్ గురించి కూడా చెప్పాను.
"అతడు నాకు తెలుసు...." అన్నాడు నిరంజన్.
"అతణ్ణి చంపగలరా?"
నిరంజన్ గంభీరంగా-"అతఃడు నాస్నేహితుడు, నా స్నేహితులను నేను చంపను...." అన్నాడు.
అతఃది గొంతులోని ధ్వని అతడి నిర్ణయమెంత కఠోరమైనదో తెలియజెప్పింది నాకు నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను.
నిరంజన్ నావంకనే చూస్తున్నాడు.
"పోనీ - అతణ్ణి చంపొద్దు. కానీ అతఃడు నన్ను చంపమంటే అంగీకరించకూడదు"
"ఎందుకని?"
"నాప్రనలు రక్షించుకునేందుకు...." అని నవ్వాను.
"నేను కాకపోతే అతఃడికి మరో హంతకుడు దొరకడా?"
"దొరకొచ్చు. కానీ అందరు హంతకులూ సిద్దేంద్రస్వామి భక్తులు కారుకదా! మీరుతప్ప ఇంకెవరైనా అయితే-నాప్రాణాలు నేను రక్షించుకోగలను...."
నిరంజన్ ఆలోచనలో పడ్డాడు.
"నా ప్రాణాలు రక్షించినందుకు మీరు కోరిన డబ్బిస్తాను. మీరు చేయవలసిందల్లా-నన్ను చంపడానికి అంగీకరించకపోవడం...."
నిరంజన్ సాలోచనగా-"సాయపడగలిగిన శక్తి ఉండి-స్నేహితుడు సాయమడిగితే చేయననడం-స్నేహధర్మమూకాదు, వృత్తిధర్మమూకాదు." అన్నాడు.
"వృత్తి ధర్మమా?" అన్నానాశ్చర్యంగా.
"అవును నాస్నేహితులకు సాయపడకపోతే నా వృత్తి కేవలం స్వార్ధానికే అనిపించుకుంటుంది. సిద్దేంద్రస్వామి నన్ను క్షమించడు...."
నేను మరి కాసేపాలోచించాను. ఒక ఉపాయం తోచింది-మీరు నన్ను స్నేహితుణ్ణి చేసుకోండి, అప్పుడు మీరు నన్ను చంపలేరు...." అన్నాను.
"స్నేహం బజార్లో కొనుక్కుని తొడుక్కొనే దుస్తుల్లాంటిదికాదు. స్నేహానికి మనసు కారణం. బలమైన సంఘటనలు కారణం. ఆపదలో అవసరానికి నాచెంత చేరిన ప్రతివాడినీ నేను స్నేహితుడిగా అంగీకరిస్తే నా వృత్తి ఏమైపోతుంది?"
"అయితే మీరు నా ప్రాణాలు రక్షించలేరా?"
నిరంజన్ ఉలిక్కిపడి-"య్యొ! ఇంతఃసేపూ మనం మాట్లాడుకుంటున్నది ప్రాణరక్షణ గురించి కదూ!" అన్నాడు.
"అవును-" అన్నాడాశగా.
"నేను ప్రాణాలు తీయడమే వృత్తిగా పెట్టుకున్న వాణ్ణి. ప్రాణరక్షణ నావల్ల నెలాగవుతుంది?" అన్నాడతడు.
"మీరే చెప్పాలి-"
"ప్రాణరక్షణకు ఒక్కటే వుపాయముంది-"
"చెప్పండి-" అన్నా నాత్రుతగా.
"త్రికరణశుద్ధిగా సిద్దేంద్రస్వామిని నమ్మండి...."
"నమ్మితే?"
"ఆస్వామి మిమ్మల్ని రక్షిస్తాడు...."
"ఎలా?" అన్నానాశ్చర్యంగా.
"స్వామిలీలలు అనంతాలు ఎలాగంటే నేను చెప్పలేను...."
ఇదంతా ఏదో నాటకమనిపించింది నాకు. నిరంజన్ నన్ను కూడా సిద్దేంద్రస్వామి భక్తకోటిలోకి లాగాలని చూస్తున్నాడు. నేను సమాజంలో పలుకుబడి బాగా ఉన్న భాగ్యవంతుణ్ణి నాకారణంగా సిద్దేంద్రస్వామికీ పలుకుబడి పెరుగుతుంది.
"నమ్మకం పుట్టడం అంత సులభంకాదు...."
"నాకు తెలుసు...." అన్నాడు నిరంజన్-"భగవంతుడు తనమీద నమ్మకం పుట్టించడానికే మనిషికి సమస్యలు సృష్టించి పరిష్కరిస్తాడు.....ఇప్పుడు మీకు వచ్చిన సమస్య మీ కదృష్టం కావచ్చు-"
"ఆశపెడుతున్నారా?"
నిరంజన్ అదోలా నావంక చూసి-"దేవుడిపై నమ్మకం అదృష్టవంతులకే కలుగుతుంది. మిమ్మల్నాశపెట్టాల్సిన అవసరం నాకు లేదు. మరోమాట చెబుతున్నాను. మీరు సిద్దేంద్రస్వామికి భక్తులైనప్పటికీ-నా స్నేహితుడుకోరితే మిమ్మల్ని చంపితీరతాను. నా నుండి కాపాడాలనుకుంటేనే సిద్దేంద్రస్వామి మీ ప్రాణాలు రక్షిస్తాడు...." అన్నాడు.
