Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 24

 

    "నీ కుంకుం మహిమ అద్భుతం" అన్నాడు ప్రతాప్ అతడి ముఖంలో కొత్త కాంతీ, కళ్ళలో మెరుపు కనబడుతున్నాయి.
    లక్ష్మీనారాయణ గదిలో చాలామంది వున్నారు. అందరూ ప్రతాప్ ని రకరకాల ప్రశ్నలు వేసి జవాబు చెప్పించుకుని ఆనందిస్తున్నారు. తను వారందరి వేళాకోళానికి గురి అవుతున్నట్లు ప్రతాప్ గ్రహించలేదు.
    "ఇన్నాళ్ళకు నా సమస్యకు పరిష్కారం దొరికింది అని ఆగి ....'అన్నట్లు కొంత కుంకం సుబ్బయ్య క్కూడా ఇయ్యి. నీ దెయ్యం కధ విని వాడు భయపడుతున్నాడు. కుంకం సంగతి చెప్పగానే వాడిక్కలిగిన ఆనందమింతా అంతా కాదు" అన్నాడు ప్రతాప్.
    సూర్యం ఫక్కుమని నవ్వాడు. లక్ష్మీనారాయణ కూడా నవ్వాపుకోలేకపోయాడు -- "నా దగ్గర ఎంతో కుంకం లేదు. మళ్ళీ మా అమ్మకు రాసి తెప్పించాలి" అన్నాడతను నవ్వుతూనే.
    "అన్నట్లు నువ్వు నమ్మే ప్రత్యక్ష దైవమెవరో వుండాలి. వాడి పేరేమిటి?" అన్నాడు సూర్యం.
    "శివశివా -- ఆయన్ను వాడు అనకూడదు" అని చెవులు మూసుకున్నాడు ప్రతాప్. 'ఆయనకు పేరేమిటి? ఏ దేవుడి పేరైనా ఆయనదే. ఎటొచ్చీ ఈ కలియుగంలో వ్యవహార నామం సదానందస్వామి."
    "వాడినెందుకు కోరలేదు నువ్వు రక్షించమని!"
    "ఇంత చిన్న వ్యవహారానికి అయన జోక్యమా ?" అన్నాడు ప్రతాప్ బాధగా.
    'అయితే దీన్ని నువ్వు చిన్న వ్యవహారంగా బావిస్తున్నావా?" అన్నాడు సూర్యం.
    "అవును" అన్నాడు ప్రతాప్ ధైర్యంగా . కుంకం అతడికి చాలా దైర్యాన్నిచ్చింది.
    "కుంకం రాకముందు కూడా ఇలాగే అనుకున్నావా?" అన్నాడు సూర్యం.
    "నువ్వు నాస్తికుడివి. భక్తీ విలువ నీకు తెలియదు. భక్తుడు భగవంతుడ్ని యాచించవల్సిన అవసరం లేదు. ఆయనే భక్తుడి అవసరం తెలుసుకుని సాయపడతాడు. ఇంత కాలం లేనిది -- లక్ష్మీనారాయణ కు రెండ్రోజుల క్రితమే వాళ్ళమ్మగారి దగ్గర్నుంచి కుంకం ఎలా అందిందనుకున్నావ్! అది సదానందస్వామి మహిమే! ఆయనే నాకష్టం గురించి అది ఈ విధంగా నా కందజేశారు" అన్నాడు ప్రతాప్.
    'అలాగైతే అసలా దెయ్యమే రాకుండా చేయచ్చుగా" అన్నాడు సూర్యం.
    "ఈ సృష్టిలో ఏది అర్ధమైందని మనం భగవంతుడి లీలలకు అర్ధాలు వెతుకుతాం !" అన్నాడు ప్రతాప్.
    "నీ అసాధ్యం కూలా?" అనుకున్నాడు సూర్యం. పైకి మాత్రం "అయితే నీకు కుంకం దొరకడం సదానంద స్వామి మహిమేనంటావ్ " అన్నాడు.
    "ముమ్మాటికీ అంటాను. అలా అని ఈ విషయం స్వామి వారికి ఉత్తరం కూడా రాసి పారేశాను. స్వామి వారి ఆశ్రమం నుంచి వచ్చే పత్రికలో ఈ మహిమ వచ్చే నెల్లో పడవచ్చు కూడా" అన్నాడు.
    "అయితే స్వామివారు ప్రచారం చేసుకునే మహిమ లేలాంటివో నాకర్ధమై పోయింది. బహుశా మీ అందరికీ కూడా అర్ధమై వుంటుంది" అన్నాడు సూర్యం.
    లక్ష్మీనారాయణ తప్ప అక్కడ చేరిన అందరూ నవ్వారు.
    "సదానందస్వామి పేరు చెప్పి నవ్వకండి. మీకు అశుభం జరగ్గలదు!" అన్నాడు ప్రతాప్.
    "మా అశుభం సంగతలా వుంచు? మళ్ళీ ఈసారేప్పుడైనా దెయ్యం వస్తే వాళ్ళ దగగ్రికి వీళ్ళ దగ్గరికి పరుగు లేట్టకు. ఆ స్వామి సాయం అడిగి చూడు. అప్పుడు తెలుస్తుంది అయన పస!" అన్నాడు సూర్యం.
    "మళ్ళీ దెయ్యమెందుకొస్తుంది?" అన్నాడు ప్రతాప్.
    'అసలెవరి దగ్గరికీ రాని దెయ్యం నీ దగ్గరికే ఎందు కొచ్చింది? అదెందుకో నీమీద పగ పట్టింది. నువ్వు కుంకాలు సంపాదిస్తే దానికి విరుగుడు ఏదో ఒకటి సంపాదించక పోదు" అన్నాడు సూర్యం.
    ప్రతాప్ ముఖంలో మళ్ళీ భయం చోటు చేసుకోసాగింది.

                                     8

    కిటికీ అవతల నిలబడి ఒకసారి తన ముసుగు సవరించుకున్నాడు సూర్యం. నెమ్మదిగా గదిలోకి తొంగి చూశాడు.
    ప్రతాప్ గదిలో లైటు వెలుగుతోంది. అతడు మంచం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపిస్తున్నాట్లున్నాడు.
    సూర్యం నెమ్మదిగా కిటికీ మీద చేతి వ్రేళ్ళతో తమాషాగా చప్పుడు చేశాడు.
    ప్రతాప్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి కిటికీ వంకా చూసి దిగ్భ్రాంతుడయ్యాడు.
    సూర్యం వికటంగా నవ్వి తమాషాగా చేతులు అద్దం ముందు కదిపాడు.
    ప్రతాప్ మంచం దిగి "ఆంజనేయా! ఆంజనేయ" అంటూ అరిచాడు.
    సూర్యం మళ్ళీ వికటంగా నవ్వి తలుపులు బాదాడు.
    ప్రతాప్ చటుక్కున గోడ దగ్గరకు వెళ్ళి అక్కడ తగిలించి ఉన్న సదానందస్వామి పటం అందుకున్నాడు. ఆ పటం అందుకోగానే అతడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంది. ఆ పటాన్ని కిటికీ వైపే చూపిస్తూ "ముందడుగు వేయకు. సదానందస్వామి నిన్ను భస్మం చేసేస్తాడు" అంటూ హెచ్చరికగా అరిచాడు. కానీ అతడి చేతులూ, ఆ చేతిలోని పటమూ కూడా వణుకుతున్నాయి.
    సూర్యం ఈసారి సన్నగా, భయంకరంగా నవ్వాడు.
    ప్రతాప్ మళ్ళీ పటం చూపిస్తూ "ముందుకు రాకు, భస్మమైపోతావు ' అని హెచ్చరించాడు.
    సూర్యం ఈ పర్యాయం మళ్ళీ తలుపులు బాదాడు. బోల్టు సరిగ్గా లేవేమో ఓ తలుపు లోపలికి తెరుచుకుంది. సూర్యం ధైర్యం చేసి తన చేయి కిటికీ లోంచి గదిలోకి పెట్టి భయంకారంగా ఊగించాడు.
    ప్రతాప్ చేతిలోని పటం జారిపోయింది. "ఈ .....ఊ....వ్వూ ...." అంటూ భయంకరంగా పెద్ద కేక పెట్టి గుమ్మం వైపు పరుగెత్తాడు.
    అది చావు కేకలా వుంది తప్పితే మాములుగా లేదు.
    సూర్యం చటుక్కున రెండడుగులు వెనక్కు వేసి ముసుగు తీసేసి -- చేతికున్న గ్లవ్స్ ఊడతీసి రెండగల్లో భవనం ముందు వైపు చేరుకొని మరో రెండు క్షణాల్లో లోపలకు వెళ్ళాడు.
    సరిగ్గా అప్పటికి అయిదారుగురు ప్రతాప్ చుట్టూ వున్నారు. ప్రతాప్ నోట మాట లేకుండా నేల మీద పడి వున్నాడు. అయితే అతడు మూర్చ పోలేదు. వెర్రి చూపులు చూస్తున్నాడు.
    "ఏం జరిగింది ?" అన్నాడు సూర్యం.
    "మనిషి బాగా భయపడ్డాడు. ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు " అన్నాడు సుబ్బారావు.
    ఇంకో పదినిమిషాలకు ప్రతాప్ మామూలు మనిషయ్యాడు. "ఆ దెయ్యం సామాన్యమైనది కాదు. అది నన్ను చంపేస్తుంది. కుంకానికి లొంగలేదు. సదానంద స్వామి పటం చూసి భయపడలేదు" అన్నాడు.
    "ఈరోజు మళ్ళీ వచ్చిందా?" అన్నాడు లక్ష్మీ నారాయణ.
    "రావడమేమిటి? నేను సదానందస్వామి పటం చూపి బెదిరించినా లొంగకుండా గదిలో కూడా ప్రవేశించబోయింది. ఈ వేళతో నా పని సరేనని అనుకున్నానసలు. కానీ అదృష్టం బాగుండి బైట పడగలిగాను .
    "నన్ను క్షమించు ప్రతాప్" అన్నాడు లక్ష్మీనారాయణ. "నా కుంకం కారణంగా నీ గదిలోకి దెయ్యం రాలేదంటే నాకే ఆశ్చర్యం వేసింది. అందుకే ఈరోజు నీకు తెలీకుండా అది దొంగిలించాను. నువ్వు గమనించావో లేదో -- నీ తలగడ క్రింద కుంకం పొట్లం వుండివుండదు."
    ప్రతాప్ ఆశ్చర్యంగా "నువ్వు కుంకం తీశావా అందుకే దెయ్యం రాగలిగిందన్నమాట. కానీ అది సదానందస్వామి పటాన్ని క్కూడా భయపడలేదు. నీ కుంకమొక్కటే నాకు విముక్తిని స్తుందనుకుంటాను" అన్నాడు ప్రతాప్.
    'సదానందుడు మనిషి . వాడు దెయ్యాన్నేమి చేయగలడు?" కుంకం సంగతి నాకు తెలియదు " అన్నాడు సూర్యం.
    "ఇప్పుడా చర్చ లేమీ వద్దు. ఇతడు మనిషి బాగా భయపడ్డాడు. ఇతని కేవరైనా సాయముండాలి" అన్నాడు ముకుందరావు.
    "నేనింక ఆ గదిలోకి వెళ్ళను. రాత్రి పన్నెండు కాబోతుంటే చచ్చేటంత భయం వేస్తోంది. ఇంకోసారి ఆ దెయ్యం కనబడితే చచ్చిపోతేనేమోనని అనుమానం" అన్నాడు ప్రతాప్.
    సూర్యం కాస్త కంగారు పడి " దెయ్యాన్ని చూసి చచ్చిపోవడమేమిటి? ఇంతవరకూ అది నీ మీద ఉరకకలేదు గదా! నిన్ను దూరాన్నించే భయపెడుతోంది గదా!" అన్నాడు.
    "ఏది ఏమైనా నేను పిరికివాణ్ణి. దెయ్యం నా మీద ఉరకక్కర్లేదు. ఆఖరకది నాకు కనబడకుండా అక్కర్లేదు. కనబడుతుందేమోనన్న ఊహకే ప్రాణం పోయేలా గుంది" అన్నాడు ప్రతాప్.
    అతడారోజు యింటికి తాళం వేసి ప్రసాద్ అనే అతడి గదిలో నిద్రపోయాడు.
    మిగతా మిత్రులు మాత్రం సూర్యం చుట్టూ చేరి "ఇంక నీ ఆట ఆపాలి. లేకపోతె ప్రతాప్ నిజంగానే చచ్చిపోవచ్చు" అన్నారు.
    "మీకలాంటి అనుమానం వుంటే అతడికి నిజం చెప్పే యండి" అన్నాడు సూర్యం.
    'అది కాదు - ఇందాకా అతను గదిలోంచి బైటకు వచ్చినప్పుడు నువ్వు చూడలేదు. మనిషి చాలా భయకంరంగా డెక్కుతున్నాడు. అప్పుడే చచ్చిపోతాడని అనుకున్నాం" అన్నాడు ముకుందరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS