"నమస్కారం - అన్నయ్యగారూ-" అంటూ మహాలక్ష్మి, ఆమె వెనుకే అప్సర లోపలకు ప్రవేశించారు.
"రండి-రండి-" అన్నాడు సుబ్బారావు ఏమనాలో తెలియక.
"నిన్న జాతకాల విషయం మరిచిపోయాను. నాకు జాతకాల పట్టింపు బాగా వుంది. అమ్మాయికీ అబ్బాయికీ జాతకాలు సరిపోయిందీ లేనిదీ చూసుకోకుండా-మనం మాటలు జరుపుకుని ఏం లాభం?" అంది మహాలక్ష్మి.
"దీనికి మీరు పనిగత్తుకుని రావాలా? ఎవరిచేతనైనా కబురు పంపితే - మీ ఇంటికి నేనే పంపి ఉండే వాన్నిగా-" అన్నాడు సుబ్బారావు మనసులో చిరాకును బయటపడనీయకుండా జాగ్రత్తపడుతూ.
"వాసు పొద్దున్నే బయల్దేరి ఊరెళ్ళిపోయాడు. ఆయనకు పెందరాళే ఆఫీసు మళ్ళీ రాత్రిదాకా రారు. నాకేమో అనుకున్న పని వెంటనే అయిపోతే కానీ స్థిమితంగా వుండదు. పోనీ ఏ ఎదురింటి కుర్రాడినైనా పంపిద్ధామా అంటే - నిన్నటి అనుభవంతో బాగా బుద్దొచ్చింది. అందుకే అమ్మాయిని తీసుకుని బయల్దేరి వచ్చాను-" అంది మహాలక్ష్మి.
ఈలోగా సులోచన అక్కడకు వచ్చి మహాలక్ష్మిని చూసి తెల్లబోయింది.
"గుర్తుపట్టేరా-అప్పుడే మరిచిపోయారా-" అంది మహాలక్ష్మి.
"ఎంతమాట?" అంది సులోచన నొచ్చుకుంటున్నట్లు.
"అబ్బాయి జాతకాలకోసం వచ్చారు. పాపంపొద్దున్నే బయల్దేరి వచ్చారు. త్వరగా వెళ్ళిపోవాలో ఏమిటో-" అన్నాడు సుబ్బారావు అసహనంగా.
"అయ్యో-అంత తొందరేం లేదండీ-పొద్దున్నే మీ కాఫీనూ అదీ హడావుడిగా వుంటుందని నాకు తెలుసుగదా-మేమేమీ కాళ్ళలో చెప్పులు పట్టుకుని రాలేదు. కాసేపుండే వెడతాం. ఇవన్నీ ఆలోచించి-మా పురోహితుడిక్కూడా ఈ యింటి అడ్రసిచ్చాను. పదకొండు గంటల ప్రాంతంలో ఆయనిక్కడికి వచ్చి-జాతకాలు పరీక్షిస్తాడు-" అంది మహాలక్ష్మి.
"అంతసేపు మీరుండే పక్షంలో ఏకంగా భోంచేసి వెడితే బాగుంటుంది. కానీ కతికితే అతకదంటారు....." అన్నాడు సుబ్బారావు నీళ్ళు నములుతూ.
"శాస్త్రాలంటే మీకంటే నాకే ఎక్కువ పట్టింపండోయ్-మా అమ్మాయి చేతిలోని బ్యాగు మీరు చూడలేదు. దాంట్లో స్వయంపాకముంది. ఇంత ఉడకేసుకుని ఇక్కడే తినివెడతాం-అనుకున్నపని అయ్యే దాకా నేను చాలా పట్టుదలగా వుంటాను-" అంది మహాలక్ష్మి.
"కానీ...." అని సుబ్బారావేదో అనబోతూంటే సులోచన వారించి - "బయటకు వెడదామనుకున్నాం లెండి. అంత ముఖ్యమైన పనేంకాదు. ఈవేళ కాకపోతే రేపైనా వెళ్ళవచ్చు-" అన్నది.
సుబ్బారావుకు మనసులో బెంగగా వున్నది. మహలక్ష్మి అసాధ్యురాలనీ నాగు వ్యూహంలో ఆమె భాగస్థురాలనీ ఆయనకు బాగా అనుమానంగా వున్నది. తను ఇల్లు కదలగానే వీళ్ళు ఏం చేస్తారోనని ఆయనకు భయంగా వుంది.
కానీ ఇప్పుడు-ఈ పరిస్థితుల్లో సులోచనను బయట మరో ఇంట్లో వుంచడం కూడా అంత శ్రేయస్కురంకాదని ఆయనకు అనిపించింది. మహాలక్ష్మి శత్రువుల మనిషయుంటే-ఆమె అనుసరించి సులోచన ఉనికి తెలుసుకుంటుంది. శత్రువుల మనిషి కాని పక్షంలో ఆమె ఇంట్లో ఉండడం సులోచనకు అధిక రక్షణ అవుతుంది. ఏది ఏమైనా సులోచనను ఇల్లు కదపడం మంచిదికాదని ఆయనకు తోచింది. అయితే ఆమెకు రక్షణ అవసరం.
ఆయన కొడుకు సురేంద్రను పిలిచి - "ఈ రోజు నువ్వు ఆఫీసుకు సెలవుపెట్టేస్తే మంచిది...." అన్నాడు. అంతకంటే యెక్కువ ఆయన వివరించనవసరంలేక పోయింది.
ఆయన మాటలు వింటూనే సురేంద్ర-"ఎలాగూ నేను సెలవు పెట్టేద్దామనుకుంటున్నాను. యెందుకో హఠాత్తుగా తల బద్దలైపోయేటంత నొప్పిగా వుంది-" అన్నాడు.
సుబ్బారావు కంగారుగా కొడుకువంక చూసి- "ఏమయింది? ఈ తల నొప్పి రాత్రినుంచీ వున్నదా-ఉదయమే ప్రారంభమయిందా - ఏదైనా తిన్నాక మొదలయిందా......వెంటనే ఓసారి డాక్టర్ని కలుసుకుంటే...." అని ఇంకా ఏదో అనబోతూంటే సురేంద్ర కంగారుపడ్డాడు. అప్సరకోసం తనేదో వంకపెట్టి ఇంట్లో వుండిపోదామనుకుంటూంటే తన తలనొప్పి నిజమే అనుకుని తండ్రి కంగారుపడిపోతున్నాడు.
"అబ్బే-మరీ అంత కమగారు అవసరం లేదులెండి-ఇప్పుడిప్పుడే కాస్త నెమ్మదిస్తోంది. రాత్రి సరిగ్గా నిద్రపట్టక అలాగుందనుకుంటాను. ఈ రోజుకు విశ్రాంతి తీసుకుంటే అన్నీ అవే సద్దుకుంటాయి-"అన్నాడతను.
కూతుర్ని కూడా ఇంట్లో వుండిపొమ్మని సలహాయిస్తే దేవీబాల వినలేదు. ఆ రోజు చాలా ముఖ్యమైన క్లాసు లున్నాయనీ - మిస్సు కావడానికి వీల్లేదనీ నొక్కిచెప్పింది. అయితే ఎక్కడికీ వెళ్ళవద్దనీ, కేవలం తనకు తెలిసిన స్నేహితురాండ్రతోనే గడపాలనీ-సాయంత్రం తిన్నగా ఇంటికొచ్చేయమనీ మరీ మరీ చెప్పాడు సుబ్బారావు. తండ్రి ఆ రోజు మరీ అంతలా యెందుకు చెబుతున్నాడో అర్ధంకాకపోయినా-దేవీబాల అంగీకారసూచకంగా తలూపింది.
10
"వదినగారూ-పురోహితుడు రావడానికింకా చాలా టయమయింది. కాస్త కత్తిపీటలా పారేయండి. కూర తరుక్కుంటాను-" అంది మహాలక్ష్మి.
"ఏం కూర తెచ్చుకొచ్చారేమిటి?" అంది నవ్వుతూ సులోచన.
"వంకాయలు, ఎలా వండుకున్నా బాగుండే కూర అదొక్కటే కదా...." అని నవ్వింది మహాలక్ష్మి సులోచన కత్తిపీట తెచ్చి ఆవిడకిచ్చి ముచ్చటగా ఆవిడనే చూస్తూ కూర్చుంది.
బ్యాగులోంచి మూడు నీటొంకాయలు తీసింది మహాలక్ష్మి. వాటిని తరుగుతూ కబుర్లు మొదలెట్టింది-"నాకు రుచి మహాపట్టింపులెండి-ఉల్లికారం కూర చాలా ఇష్టం నాకు. ఎలాగూ బ్యాగు తెస్తున్నాంకదా అని కాసిని ధనియాలు, నాలుగుల్లిపాయలూ వగైరాలన్నీ మూట కట్టుకొని వచ్చాను. కూర కూడా నేను చాలా బాగా చేస్తాను. వాసన చూస్తేనే నోరూరిపోతుంది. అలాగని తొందరపడి మీరు మాత్రం రుచి చూడకండి. కతికితే అతకదంటారు కదా-"
మహాలక్ష్మి అతి చనువు ఇబ్బందిగానే వున్నా-అరామరికలు లేని ఆవిడ మనస్తత్వమూ - ఆవిడ చెప్పే సరదా కబుర్లూ సులోచనను బాగా ఆకర్షించాయి. ఈవిడ వియ్యపురాలయితే బాగానే వుంటుందని ఆమెకూ తోచింది. ఆమెతో అవీ ఇవీ కబుర్లు చెబుతూనే మహలక్ష్మి ఘుమఘుమలాడే వంకాయ కూర చేసింది. తనకూ కూతురికీ మటుక్కు అన్నం వండింది. కూడా తెచ్చుకున్న క్యారియర్లోని కొంత పెరుగుతీసి మెంతి మజ్జిగ పెట్టింది. నంజుకుందుకు చిన్న సీసాలో ఊరగాయ కూడా తెచ్చుకొచ్చిందావిడ.
సుమారు పదకొండు గంటల ప్రాంతంలో పురోహితుడు వచ్చాడు. ఆయనెంతోసేపుండలేదు. సురేంద్ర అప్సరల జాతకాలు పరీక్షించి-అద్భుతంగా సరిపోయాయన్నాడాయన, ఆ జాతకాలు చూసేక కాబోయే వధూవరులను చూడాలన్న కోరిక కూడా ఆయనకు కలిగింది. వేరే గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అప్సర, సురేంద్ర ఆయన కోరిక మేరకు వచ్చి దర్శన మిచ్చారు.
"జాతకాలనుబట్టే అనుకున్నాను. ఇది అద్భుతమైన జంట-" అన్నాడు పురోహితుడు. ఈలోగా బాత్రూమ్ వివరాలడిగి తెలుసుకుని-అప్సర అక్కడికి వెళ్ళివచ్చింది. ఆమె తిరిగి వచ్చేసరికి పురోహితుడు సెలవు తీసుకుంటున్నాడు. అప్సరను చూస్తూనే మహాలక్ష్మి-"అమ్మాయ్ నీ చేతికున్న ఆ గాజు ఆయనకు మొదటి బహుమతిగా ఇచ్చేయమ్మా-" అన్నది.
