Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 24

 

    ప్రభాకర్ బదులివ్వకుండా ఆమె వంకే చూస్తున్నాడు.
    స్వాతి కది అసహనంగా తోచింది. తనను దగ్గరగా రప్పించుకోవడాని కతను పన్నిన పన్నాగ మేమోనని అనుమానం కూడా కలిగిందామెకు. అందుకే తెగించి అటు వెళ్ళలేదు. అలా ఎంతసేపు నిలబడతాడో తనూ చూడాలను కుందామె.
    అయిదు, పది పదిహేను నిముషాలు గడిచాయి ప్రభాకర్ కదలలేదు.
    ఇంతలో ఎవరో తలుపు తట్టారు-- "స్వాతీ - స్వాతీ !" అంటోంది తల్లి.
    "ఊ మా అమ్మ వచ్చింది . తలుపు తియ్యి --" అంది స్వాతి. అయినా ప్రభాకర్ కదలలేదు.
    స్వాతి చిరాగ్గా మంచం మీంచి లేచి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు గడియ తీసింది. అయినా ప్రభాకర్ కదలలేదు. తలుపు తోసుకుని మాలతి కంగారుగా లోపలకు వచ్చి -- "ఎమిటయిందమ్మా --" అంది.
    "అవడానికేముంది? ప్రభాకర్ గదిలో కి వచ్చి తలుపు గడియ పెట్టి అక్కడ నుంచుని కదలడం లేదు ..." అంది స్వాతి. ఇంకా ప్రభాకర్ కదలకపోవడంతో స్వాతికి అనుమానం కూడా వచ్చి అతని దగ్గరకు వెళ్ళి -- పట్టుకుని కుదిపింది. ప్రభాకర్ కొయ్య బొమ్మలా ఆమె పైన పడ్డాడు.
    కెవ్వుమని కేక వేసింది స్వాతి.

                                     8
    "చాలా ఆశ్చర్యంగా వుంది --" అంది స్వాతి.
    "నాకూ ఆశ్చర్యంగానే ఉంది. మీ నాన్న గారు కూడా ఇలాగె చచ్చి పోయారంటున్నావు. మాట్లాడుతూ మాట్లాడుతూ హటాత్తుగా చచ్చి పోవడము, డాక్టర్లు పరిశీలించి అది సహజ మరణమని చెప్పడమూ నాకు నమ్మశక్యంగా లేదు --" అన్నాడు రాము.
    "నిజమే మరి-- మా నాన్నగారి చావుకూ, ప్రభాకర్ చావుకూ చాలా పోలికలున్నాయి. నాకు నిన్ను గురించి అనుమానంగా వుంది --" అంది స్వాతి.
    "నా గురించా -- ఎందుకు ?" అన్నాడు రాము ఆశ్చర్యంగా.
    "మృత్యుకళ ముఖంలో ముందుగానే చూడగలనని నువ్వు నాకు చెప్పావు. అదేమాట ప్రభాకర్ తనకు ఎవరో చెప్పారని చచ్చిపోయే ముందు నాతో అన్నాడు. నువ్వే అయుంటావని నా నమ్మకం. అదలా గుంచితే ప్రభాకర్ ఇలా చెప్పిన విషయం నేను చెప్పగా మా అమ్మ ఆశ్చర్యపడి తనకూ మా నాన్నగారు చనిపోయేముందు ఎవరో ముఖంలో మృత్యు కళ కనబడుతోందని అన్నారని అంది. ఆ మనిషివి కూడా నవ్వే అయుండాలి --" అంది స్వాతి.
    "నీ వూహ కరెక్టే. మీ నాన్నగారికీ, ప్రభాకర్ కి ముఖంలో మృత్యు కళ కనిపెట్టి చెప్పిన వాడిని నేనే! ఒప్పుకుంటున్నాను--" అన్నాడు రాము.
    "అయితే ఎలా తెలుస్తుంది నీకు మృత్యుకళ -- చంపబోయే ముందా?"
    "హరిహరీ --' అంటూ చెవులు మూసుకున్నాడు రాము -- "ప్రేమించిన ప్రియురాలి నోటి వెంట ఎటువంటి మాటలు వినవలసి వచ్చింది?"
    "మిస్టర్ రామూ -- మర్యాద గా నిజం చెప్పు ....' అంది స్వాతి.
    "నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు స్వాతీ!  రెండు రెండు ప్రాణాలను తీయవలసిన అవసరం నాకే ముంది? నీ తండ్రిని చంపితే నాకేమిటి లాభం? నీ ప్రేమ కోసం ప్రభాకర్నీ చంపెటంత మూర్ఖపు స్థాయికి నేనింకా దిగజారి పోలేదు" అన్నాడు రాము.
    "హత్యలు నువ్వు చేయలేదంటావు ?" అంది స్వాతి.
    "లేదు-"
    "అంటే హత్యలు చేయలేదంటావు?" అంది స్వాతి మళ్ళీ.
    ఉలిక్కిపడ్డాడు రాము -- "ఎమిటన్నావ్?"
    "ఆ హత్యలు నువ్వే చేసి వుంటే బాగుండేది. ధైర్యంగా నాకు వచ్చిన ఇబ్బందిని చెప్పుకునేదాన్ని " అంది స్వాతి. ఆమె కళ్ళలో నీరు తిరిగింది.
    రాము ఇరుకులో పడ్డాడు. "నేను హత్యలు చేయలేదు. గానీ నీ కోసం ఏమైనా చేయగలను. నీ ఇబ్బంది ఏమిటో చెప్పు....నా శక్తి కొద్దీ నిన్నాదుకునేందుకు ప్రయత్నిస్తాను...."
    స్వాతి కళ్ళ నీళ్ళు తుడుచుకునేందుకు ఒక్క నిముషం ఆగింది. "ప్రపంచంలో ఇంత అమానుషం కనీవినీ ఎరుగం. ప్రభాకర్ చావులో నా పాత్ర ఉందని గోవిందరావు నన్ననుమానిస్తున్నాడు. డాక్టర్ పరీక్షలో ఏమీ అనుమానస్పద విషయం బయల్పడలేదు. అయినా అయన నన్ననుమానిస్తున్నాడు. మా అమ్మకు కూడా నామీద అనుమానం గా వుంది. చూస్తుండగా ప్రభాకర్ ఎలా చచ్చిపోయాడు? అందులోనూ నిక్షేపంలా వున్న మనిషి ఇలా ఆలోచిస్తున్నప్పుడు నామీద నాకే అనుమానంగా వుంటోంది --"
    "గోవిందరావు నిన్ను పోలీసు కేసులో ఇరికించాలనుకున్నాడా?"
    'అలా చేసినా బాగుండేది. ఈ పాడు జీవితం అంతమయ్యేది! అంతకంటే ఘోరం చేయదల్చుకున్నాడాయన."
    "ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు రాము.
    "గోవిందరావు నన్ను పెళ్ళి చేసుకుంటాడుట...." అంది స్వాతి.
    పక్కలో బాంబు పడ్డట్లు అదిరి పడ్డాడు రాము. క్షణం పాటు అతనికి నోట మాట రాలేదు -- "తన కొడుక్కు చేసుకుందామనుకున్న నిన్ను తను పెళ్ళి చేసుకుంటాడా?"
    "నామీద ప్రేమ కొద్దీ కాదు,కక్ష కొద్దీ , నాకు జీవితంలో నరకం చూపించడమే ఆయన ధ్యేయమట. ప్రభాకర్ ఆయనకంటే వెయ్యి రెట్లు మెరుగు. నా అభీష్టనికి వ్యతిరేకంగా నన్ను పెళ్ళి చేసుకోవడానికతను జంకాడు. గోవిందరావు బలవంత వివాహానికి పునాదులు వేస్తున్నాడు. కొడుకు పోయిన దుఃఖం పేరులో కొంత కాలం పాటు నా జోలికి రాకపోవచ్చు. కానీ ఆ తర్వాత...."
    "ఇందుకు మీ అమ్మ ఒప్పుకుంటుందా?"
    "ఒప్పుకోక ఏం చేస్తుంది? ఆవిడకు పేదరికమంటే భయం. గోవిందరావంటే ఇంకా భయం. ఈ భయాలు నాపై ప్రేమను కమ్మేస్తున్నాయి...."
    "మీ అన్నయ్య ?"
    "వాడికి గోవిందరావంటే భయం. అమ్మ వాడూ ఒక్కటే!"
    "ఏం చేయాలిప్పుడు ?"
    "నువ్వు దయతో గోవిందరావు ను కలుసుకుని అయన ముఖంలో మృత్యు కళ వున్నదీ లేనిదీ చూసి రావాలి --"
    రాము కంగారుగా -- "ఏం చెప్పగలం? నేను మృత్యు కళను చెప్పగలను కానీ - రప్పించలేను ...." అన్నాడు.
    "గోవిందరావు చచ్చిపోతే నా లక్షల ఆస్తి మీద నాకు స్వతంత్ర్యం వస్తుంది. ఆ ఆస్తితో నేను నీ స్వంత మవుతాను ...." అంది స్వాతి.
    "నా దగ్గర కూడబెట్టిన డబ్బంతా డైమండ్ నెక్లెస్ గా మార్చేసి నీకిచ్చేశాను. నాకు డబ్బు మీద మోజు లేదు. మీ నాన్న అన్యాయంగా సంపాదించిన డబ్బు మీద నీకూ మోజు లేదు. మనకిక గోవిందరావు గొడవెందుకు ? ఊ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదాం...."
    "గోవిందరావు బ్రతికుండగా అది సాధ్యం కాదు. అయన సంగతి నీకు తెలియదు. కొంతదబ్బు సంపాదించు కున్నాక మా నాన్నకునీతిగా బ్రతకాలని కోరిక కలిగింది. అందుకు నా పోరూ కొంత కారణం. కానీ గోవిందరావు మా నాన్నని వదలలేదు. దారుణంగా బెదిరించి తన తోత్తును చేసుకున్నాడు. అయన సృష్టించిన విష వలయం నుంచి బయట పడకుండానే మా నాన్న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడాయన నా చుట్టూ వలయం పన్నుతున్నాడు."
    రాము సాలోచనగా -- "నువ్వు చెప్పింది వింటుంటే నాకు చాలా భయంగా వుంది. నువ్వు చెప్పినట్లే ఓ పర్యాయం గోవిందరావును కలుసుకుంటాను. కానీ అయన ముఖంలో జీవకళ ఉట్టి పడుతూ కనిపిస్తే -- నేనేం చేసేది ?' అన్నాడు.
    "నీ ప్రయత్నం నువ్వు చెయ్యి... నాకోసం!" అంది స్వాతి.
    రాముకు స్వాతి బాధ అర్ధమయింది. గోవిందరావు పధకం అమానుషమైనది. ఆ పధకంలో స్వాతి జీవితాన్ని బలి తీసుకోవాలను కుంటున్నాడా దుర్మార్గుడు . తను దానికి అడ్డు పడాలి. అంటే గోవిందరావు ముఖంలో మృత్యు కళ వెదకాలి !
    "నా ప్రయత్నం నేను చేస్తాను స్వాతీ-- ఆ పైన నీ అదృష్టం!" అంటూ అక్కణ్ణించి లేచాడు రాము.

                                    9
    "నీకో మంచి బేరం " అన్నాడు వెంకట్రావు.
    "ఏమిటి?" ఆడిగాడు రాము.
    "ఒకటి కాదు , రెండు కాదు .... అయిదు లక్షలు."
    "దేనికి,ఎలా?"
    "ఒకే ఒక్క హత్య చేయాలి."
    "అంత ఖరీదైన మనిషి ఎవరు?"
    "స్వాతీ!" అన్నాడు వెంకట్రావు.
    రాము కళ్ళు ఎర్రబడ్డాయి-- "స్వాతీ నా ప్రాణం. ఆమెను హత్య చేయమని నాకు చెప్పడానికి నీకెన్ని గుండెలు?" అన్నాడు.
    "నాకున్నది ఒక్కటే గుండె. కానీ ఈ ప్రపంచంలో స్వాతిని మించిన ఆడవాళ్ళు ఇంకా బోలెడు మంది వున్నారు. అయిదు లక్షలు సంపాదించుకుంటే పాదాల ముందు వాలే అప్సరసలు బోలెడు మంది."
    "అయిదు లక్షలు కాదు-- అరవై కొట్లిచ్చినా ఈ పని జరగదు."
    వెంకట్రావు అదోలా నవ్వి -- 'అరవై కోట్లు కాదు . ఈ ప్రపంచం లోని సంపదంతా ఒకచోట జేర్చి ధారపోసినా చాలనంత విలువైన దింకోకటి వుంది తెలుసా?" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS