లక్ష్మీ చెఱ !!
వసుంధర
"నన్నాశీర్వదించు నాన్నా!" అంటూ డబ్బు తండ్రికి అందించి, అయన పాదాలకు ప్రణామం చేశాడు శ్రీనాద్.
నరసింహులు కుడి చేత్తో డబ్బందుకుని ఎడం చేతిలోకి మార్చుకుని -- "కొడుకును కుడిచేత్తో --- "దీర్ఘాయుష్మాన్ భవ!' అని దీవించాడు. శ్రీనాద్ లేచి నిలబడితే అయన డబ్బు లెక్కపెట్టి 'మూడువందల ఇరవై" అన్నాడు.
'అసలు నాలుగిందాలిరవై వచ్చింది నాన్నా. కానీ నాకుద్యోగ మిప్పించి నాయనకు వందా ఇచ్చేశాను. నువ్వు చెప్పిన ప్రకారం . ఇలా మొత్తం పది నెలలివ్వాల్సుంటుంది గదా..." అన్నాడు శ్రీనాద్.
నరసింహులు డబ్బు జేబులోకి తోసేసి -- "ఎన్ని మూడొందలైతే పది లక్షల య్యేను ...." అన్నాడు.
"పది లక్ష లెందుకు నాన్నా -- మనిద్దరం తినడానికి తిరగడానికీ రెండొందల యాభై చాలు. ఇందులోనే మనకింకా మిగుల్తుంది...."అన్నాడు శ్రీనాద్.
నరసింహులు కొడుకు వంక పరీక్షగా చూశాడు. ఆయనకు నవ్వొచ్చింది. అతని కళ్ళలో మెరుపును చూస్తుంటే ముష్టి మూడొందలిరవై రూపాయలు సంపాదించగలిగి నందుకు వచ్చిన మెరుపు అది. కానీ తనకు పది లక్షలు సంపాదించే మార్గం తెలుసు!
అంతలోనే అయన మనసు ఆర్ద్ర మైపోయింది. కొడుకు చాలా బుద్ది మంతుడు. ఏవిధమైన దురలవట్లూ, లేవు. తన పనేదో తప్పితే ఇంకేమీ అక్కర్లేదతనికి. అతను చెప్పినట్లు తమకు రెండొందల యాభై చాలు. కానీ అలాగని సరిపెట్టు కోవలసిందేనా?
"ఒరేయ్ అబ్బీ, నీకుద్యోగం రావడం నాకు చాలా సంతోషంగావుంది రా. నీ జీవితం స్థిరపదినట్లే లెక్క. ఇంక నేనేమై పోయినా ఫరవాలేదు..." అన్నాడు నరసింహులు.
"బాగుంది నాన్నా. నువ్వేమైనా అయిపోవడమెందుకు?"
"కొడుకు వంక చూసి ఆప్యాయంగా నవ్వాడు. నరసింహులు "ఇంత కాలం నేను బ్రతుకున్న కెందుకురా నిన్నో దారిలో పెట్టాలనే! నీకోదారి ఏర్పడగానే నా బ్రతుక్కర్ద'మేముంది? నిన్నింకా గొప్పవాణ్ణి చేస్తేనే అది సార్ధకమవుతుంది. ఆ ప్రయత్నంలో నేనేమైనా ఫరవాలేదంటున్నాను...."
"నాకింకే ఆశలూ లేవు నాన్నా. ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు. ఇకముందు కష్టపడ్డానికి వీల్లేదు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించు కుంటా నాన్నా. నీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం" అన్నాడు శ్రీనాద్.
భారంగా నిట్టూర్చాడు నరసింహులు-- "నిజమేనేమోరా , నీకోసం నేను అందర్నీ పోగొట్టుకున్నాను. అన్నీ వదులుకున్నాను. అదంతా నిన్ను గాలికి వదిలేయడం కోసం చేసినది కాదు గదా , నీ భవిష్యత్తు ను తీర్చిదిద్దడానికే ....'
శ్రీనాద్ కళ్ళలో తనకు గుస్తున్న గతం మెదిలింది. అప్పుడు తనకు పదేళ్ళు. ఒక రాత్రి వేళ తండ్రి హడావుడిగా కంగారుగా ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అమ్మ హడావుడిగా వచ్చి తలుపు తీసింది.
'అబ్బి ఎక్కడ?' అన్నాడాయన.
అప్పటికే తనకు మెలకువ వచ్చింది. "నువ్వింట్లో నే ఉండు. తలుపులన్నీ వేసేసుకో. ఎవరు తలుపు తట్టినా ఎంత గట్టిగా మోదినా తీయకు. రేపుదయం బయల్దేరి సామర్ల కోటకు టికెట్ కొనుక్కుని రాజమండ్రి లోనే దిగిపో. నేను వచ్చి నిన్ను స్టేషన్ దగ్గర కలుసుకుంటాను, ప్రస్తుతం నేనూ అబ్బి గాడూ దొడ్డి గుమ్మాన వెళ్ళి పోతాం మళ్ళీ దొడ్డి తలుపు వేసేసుకో" అన్న అయన మాటలు విన్నాడు.
ఆరాత్రికి రాత్రీ ఇద్దరూ బయల్దేరి రాజమండ్రీ చేరుకున్నారు. స్టేషన్ కెదురుగా వున్న లాడ్జిలో బస చేశాడు. మర్నాడు తండ్రి రోజల్లా స్టేషన్ లో గడిపి వచ్చాడు. అలా రెండ్రోజులు చేశాడు. ఆ తర్వాత తను బయల్దేరి బెజవాడ వెళ్ళి వచ్చాడు. రావడం ఒక్కడే వచ్చాడు.
అమ్మేది నాన్నా -- అనడిగితే చచ్చిపోయిందన్నాడు. తనేడిస్తేఓదార్చాడు. బెజవాడ నుంచి నాన్న తనకు సంబంధించిన స్కూలు సర్టిఫికెట్స్ తెచ్చాడు. తనని రాజమండ్రి లో చేర్పించాడు. ఈ పదేళ్ళూ అహో రాత్రులు శ్రమించాడాయన - తన కోపం.
మొదట్లో తనకు అమ్మ గురించి బెంగగా ఉండేది కానీ ఆరోజు రాత్రి ఏం జరిగిందో - తండ్రి ఉన్న పళంగా బెజవాడ ఎందుకు వదిలి పెట్టాడో - తన తల్లి ఎందుకు చచ్చిపోయిందో ఇంతవరకూ తనకు తెలియలేదు.
బెజవాడ లో నాన్న కాస్త పేరున్న వడ్రంగి. ఆయనకు సంపాదన బాగానే ఉండేదక్కడ. అటువంటప్పుడు ఆ ఊరెందుకు వదలాల్సోచ్చిందో తెలియక పోవడం ఒక ఆశ్చర్యమైతే ఇక్కడికి వచ్చేక అయన తనకు తెలిసిన వడ్రంగం, గృహ నిర్మాణం వగైరా పనుల జోలికి పోక కేవలం కాయకష్టం చేసి ఎందుకు జీవించాడో కూడా -- తనకు అర్ధం కాని విశేషం !
'అవును నాన్నా నువ్వనుకున్నది సాధించావు. ఇంక విశ్రాంతి తీసుకో...."
నరసింహులు నవ్వి "నీకు బెజవాడ లోనే ఉద్యోగం రావాలనేందుకు ప్రయత్నించానో నీకు తెలియదు రా.... నేను సాధించాల్సిందింకా చాలా వుంది" అన్నాడు.
శ్రీనాద్ ఆశ్చర్యంగా తండ్రి వంక చూశాడు.
2
అది రెండంతస్తుల మేడ, మరీ కొత్తది కాకపోయినా అది చూడ్డానికి విశిష్ట మైనది గానే వుంది ఆ ప్రాంతాల విలక్షణంగా కనబడుతుంది. ఆమేడ సోమయాజులు గారిది!
ఆ మేడ ముందు ఒక జ్యోతిష్కుడు కూర్చుని వున్నాడు. అతను తన ప్రత్యెక వేష ధారణతో చూపరులను బాగా ఆకర్షిస్తున్నాడు. అతను చేతులు చూసి భూత భవిష్యత్తు వర్తమానాలు గురించి చకచకా చెప్పేస్తున్నాడు. ఆ విద్యలో బాగా ప్రావీణ్యమున్నట్లు కనిపిస్తున్న అతని ముందు అప్పుడే ఒక యువకుడు ఆగాడు. అతను శ్రీనాద్.
"ధన్యవాదాలు స్వామీ-- మీరు చెప్పినట్లే నాకు ఉద్యోగం వచ్చింది ...." అంటూ పది రూపాయల నోటు జ్యోతిష్కుడి కందించాడతను. జ్యోతిష్కుడెవో అస్పష్టంగా అతన్నాశీర్వదించి- ఆ పదిరూపాయలూ అందుకును రొంటిన దోపుకున్నాడు. ఆ తర్వాత "చూడు నాయనా వచ్చిన జీతాన్నిలాగే విచ్చల విడిగా ఖర్చు చేసెస్తున్నావా?' అన్నాడు.
"లేదు, స్వామీ, మా నాన్న నాకు నెల ఖర్చులకు యాభై రూపాయలిచ్చాడు. ఏవరేజ్ చూసుకుంటే రోజుకు రూపాయి కూడా ఖర్చు కాదు నాకు. అందులో మీకు పది రూపాయలు ఇచ్చాను. ఇది నేను నా సంతోషం కొద్దీ మీకిస్తున్నది...." అన్నాడు శ్రీనాద్.
'చాలా అమాయకుడిలాగున్నావ్ . ఎలాగడుపుతావో ఏమిటో రోజులు. ఏదీ నీ చెయ్యోసారి ఇలా పారెయ్ అన్నాడు జ్యోతిష్కుడు. శ్రీనాద్ అతనికి చేయి చూపించాడు. అతని చేయిని పరిశీలిస్తున్న జ్యోతిష్కుడి ముఖం గంబీరంగా మారిపోయింది. "త్వరలో నువ్వు లక్షాదికారివి కాబోతున్నావు. కానీ నీ తండ్రికి మాత్రం ఏవో గండాలున్నాట్లు తోస్తుంది...."
శ్రీనాద్ కంగారుగా , 'అగండాలకూ , నేను లక్షాధికారిని కావడానికీ సంబంధముందా స్వామీ"అన్నాడు .
"ఉంది!"
"అయితే నాకు లక్షలు వద్దు. వద్దు స్వామీ" అన్నాడు శ్రీనాద్.
"వెర్రివాడా. అని నువ్వూ నేనూ గీసిన రేఖలు కావు. కాస్త జాగ్రత్తగా వుండమని మీ నాన్నను హెచ్చరించు. అంతే చాలు" అన్నాడు జ్యోతిష్కుడు. శ్రేనాద్ అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయాడు.
అక్కడ చుట్టూ మూగిన వారెవరో నాలుగురైదుగురు నిరుద్యోగులు గబగబా చేతులు చాపి, "మాకు ద్యోగ మెప్పుడు వస్తుందో చూడండి స్వామీ" అన్నారు.
జ్యోతిష్కుడు గబగబా వారి చేతులు చూసి జాతకాలు చెప్పాడు. మరో పావుగంటయ్యేసరికి జ్యోతిష్కుడి దగ్గర జనం లేరు. ఇంకో రెండు నిముషాల్లో కాబోలు కారొకటి మేడలోంచి బయటకు వచ్చింది. జ్యోతిష్కుడు చటుక్కున లేచి నిలబడ్డాడు.
కార్లోంచే పలకరించాడు సోమయాజులు. "ఏమయ్యా పంతులూ , మా ఇంటి ముందు నించి మకాం మార్చావా?"
"లక్ష్మీ చేర విడిపించమని అడుగుతోంది బాబూ. మీరేమో నవ్వి ఊరుకుంటారు. లక్ష్మీ దేవికి చెర విడిపించే వరకూ నా మకాం ఇక్కడే" అన్నాడు జ్యోతిష్కుడు.
"సరే - జ్యోతిష్కుడివి కదా- లక్ష్మీకి చేర ఎప్పుడు వదుల్తుందో నీకు తెలియదా ?"
"ఎందుకు తెలియదు బాబూ! తెలిసినా ఏదో భ్రమ!"
'అయితే ఎప్పుడు విడుతుందంటావ్ - చెర ...."
"టైమొచ్చేసింది బాబూ -- ఇంకెవ్వరూ ఆపలేరు."
"సరే మంచిది. అమ్మగారు నిన్ను పిలుస్తున్నారు లోపలకు వెళ్ళు...."
జ్యోతిష్కుడు ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. "నిజంగానే టైము వచ్చేసిందన్న మాట' అన్నాడు అప్రయత్నంగా.
సోమయాజులు గారి కారు వెళ్ళిపోయింది.
జ్యోతిష్కుడు మాత్రం తడబడుతున్న అడుగులతో లోపలకు వెళ్ళాడు. బయట నుంచీ చూడడమే కానీ ఈ మధ్యకాలంలో అతన్నేన్నడూ ఆ భవనంలో అడుగు పెట్టలేదు.
అతనడుగు పెట్టిన హాలు అందచందాలు గమనిస్తుండగానే "వచ్చేరా పంతులు గారూ" అన్న మాట వినపడింది. అతను చటుక్కున అటు తిరిగాడు.
ఆవిడ ముఖం అతనికి పరిచితమైనదే! తరచుగా తన్ని చూస్తూనే వుంటుంది. ఇంతవరకూ నవ్వడం తప్పితే ఎప్పుడూ పలకరించి ఎరుగదు.
"వచ్చెనమ్మా - మహాలక్ష్మీ శోభ మీది. అందుకే చేర లో ఉన్న లక్ష్మీని నిర్లక్ష్యం చెయ్యగలిగారు....' అన్నాడు జ్యోతిష్కుడు.
"నిజంగా మా ఇంట్లో లక్ష్మీ వుందంటారా?" ఉంటే ఏ రూపంలో ?' అందావిడ.
"బంగారు అచ్చుల రూపంలో. లక్షలు లక్షలు విలువ చేస్తుందమ్మా" అన్నాడు జ్యోతిష్కుడు.
'అయితే ఈరోజే చూపించాలి మీరు" అందావిడ .
"అదంత సులభంకాదు. కనీసం ఒక రోజు గడువు కావాలి. ఈలోగా నేను అంజనం వేయాలి. అంజనం లో లక్ష్మీని చూడాలి" అన్నాడు జ్యోతిష్కుడు.
