"సారీ రవీ -- నా మాటలతో నిన్ను బాధ పెట్టినట్లున్నారు !" అంది నీరజ.
"ఏమీ లేదు. నా దృష్టిలో నువ్వింకా పసిపాపవు. నిన్ను కొంతకాలం ప్రేమతో లాలించాలి. ఆ తర్వాత నువ్వే తల్లి వౌతావు.
నీరజ సిగ్గుపడింది. అంతలోనే ఆమెను శంకరం ఆఖరి కోరిక గుర్తొచ్చింది. "కానీ లలిత మనసు నువ్వు సాధించగలవా?" అంది నిరుత్సాహంగా.
"అన్నింట్లోకి అదే నాకు సులభం" అన్నాడు రవి.
"ఎలా?' అంది నీరజ ఆశ్చర్యానికి సంతోషం జరిగాక.
"ఎలాగని అడగవద్దు. ఇంకో అరగంటలో నేను లలితను తీసుకుని నీ దగ్గరకు వస్తాను. ఆ తర్వాత మనం మంచి ముహూర్తం చూస్కోవాలి" అన్నాడు రవి.
14
"హల్లో లలితా -- నీతో ఒక చిన్న పని తగిలింది."
"వ్వాట్ డియర్ -- " అంది లలిత.
"నన్నలా పిలవద్దని చెప్పానా?"
"పిలుపేగా -- అంతకుమించి ఎలాగూ సాధ్యపడదు నాకు."
"కాదు లలితా , నా వివాహం నిర్ణయమైనట్లే !" అన్నాడు రవి.
పక్కలో బాంబు పడ్డట్లదిరిపడింది లలిత. "ఎమిటన్నావ్?"
"నేనొక అమ్మాయిని ప్రేమించాను, ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలను
కున్నాం. చిన్న అడ్డంకి వచ్చింది."
"ఏమిటది?"
"అదేమిటైనప్పటికీ నువ్వు సాయం చేస్తేనే ఆ అడ్డు తీరుతుంది....
"చెప్పు...."
"లలితా! నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్ను అభిమానిస్తున్నాను గానీ నువ్వు కోరే విధంగా ప్రేమించ లేకపోతున్నాను. అది నా దురదృష్టం. కానీ ఎన్నో పర్యాయాలూ నిన్ను నేను కాపాడాను. ఒకటి రెండు పర్యాయాలు నువ్వు నన్ను కాపాడావు. జీవితంలో నా కోసం ఎమైనా చేయగలనని చెప్పావు. అందుక్కారణం ప్రేమ అని కూడా చెప్పావు. అందుకే ఇప్పుడు గంపెడాశతో నీ దగ్గరకు వచ్చాను. నాకోసం ఏమైనా చేసి నీప్రియుడి ప్రేమను భగ్నం కాకుండా కాపాడగలవా?" అన్నాడు రవి.
"అందుకు సందేహమా?' అంది లలిత.
"అయితే నేను నిన్ను నాకాబోయే భార్య నీరజకు అప్పగిస్తాను. ఆమె నిన్ను ఒక పురుషుడి కి అప్పగిస్తుంది. నువ్వు పూర్తిగా అతని అధీనంలోకి వెళ్ళిపోవాలి. అతను నిన్ను బాధించడు. హింసించడు. అపురూపంగా చూసుకుంటాడు. అలా చూసుకోకపోతే నువ్వతని అధీనంలో ఉండనవసరం లేదు."
"రవీ! ఏమిటి నువ్వనేది?" అంది లలిత. ఆమె కన్నులలో నీరు తిరిగింది.
"చాలా స్పష్టంగా చెప్పాను లలితా" అన్నాడు రవి.
'అవును నిజమే , కానీ నా ప్రేమకిదా ప్రతిఫలం . నిన్ను ప్రేమించిన తప్పుకి ముక్కూ ముఖం ఎరుగని మగవాడికి స్వాధీనమై పోవాలా? నా అన్నవారు. లేని నాకు నువ్వైనా వున్నావనుకున్నాను. కానీ నీ కడుపు లో నా గురించి ఇలాంటి ఊహలున్నాయనుకోలేదు" అంది. చాలా బాధగా వచ్చాయామాటలామె నోటి వెంట.
"మాములు ఆడదాని కిలా మాట్లాడకు లలితా! నన్ను ప్రేమించిన తప్పు అంటున్నావు. అంటే నన్ను ప్రేమించడం ద్వారా తప్పు చేశానని అనుకుంటున్నావా? నా మీద ఎంతో విశ్వాసమున్న నీవు- నేను నీకు సరైన వరుణ్ణి చూదననుకుంతున్నావా? నీకూ నాకూ వివాహం కానంత మాత్రాన నా ప్రేమ భగ్నమై పోవాలా? ఇదేనా నీ ప్రేమ?" అన్నాడు రవీ.
లలిత - అతను అలాగే అయిదు నిముషాల సేపు వాదించుకున్నారు. రవి తర్కం ముందు లలిత నిలబడ లేకపోయింది. "సరే పద రవీ. నీ సంతోషం కోసం నేను త్యాగం చేస్తాను....' అందామె.
15
"నేనెవరో నీకు తెలుసా మిస్టర్ రవీ!" అన్నాడు వీరభద్రం.
"తెలుసు . మీరు నీరజకు తండ్రి." అన్నాడు రవి.
"నీరజకు సంబంధించినంతవరకూ తండ్రినే. కానీ నీకు సంబదించినంత వరకూ యముడ్ని...." అన్నాడు వీరభద్రం.
"నేను యముడికి భయపడే రకం కాదు. షాజహాన్ తెలుసా మీకు?" అన్నాడు రవి.
వీరభద్రం మాట్లాడకుండా ఒక్క నిముషం వూరుకుని తర్వాత "తెలుసు ఏం?"
'అతను కూడా నాకు భయపడతాడు ."
వీరభద్రం తడబడ్డాడు. తర్వాత తమాయించుకుని "ఇలాంటి కబుర్లు చాలా విన్నాం. నువ్వు మాత్రం నీరజ జోలికి రాకు" అన్నాడు.
సమాధానంగా "నీరజా!' అన్నాడు రవి. వీరభద్రం ఆశ్చర్యంగా చూస్తుండగా గదిలోకి నీరజ వచ్చింది.
"అయితే అమ్మాయిని బయట నిలబెట్టి నువ్వు లోపలకు పెళ్ళి మాటలకు వచ్చావన్నమాట." అన్నాడు వీరభద్రం కోపంగా.
"నీరజా! మీ నాన్న గారికి నీ నిర్ణయం తెలియచెయ్యి" అన్నాడు రవి.
"నాన్నా నేనితన్ని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరికీ మీరు వివాహం జరిపిస్తే సరేసరి. లేదా మేము రిజిస్ట్రాఫీసులో పెళ్ళి చేసేసుకుంటాం. ప్రస్తుతం ఇద్దరం హోటల్ శాంతినివాస్ లో పదకొండో నెంబర్ గదిలో ఉంటున్నాం. సాయంత్రం లోగా మీ నిర్ణయం మాకు తెలియజేయండి" అంది నీరజ. అయన తేరుకునేలోగా ప్రేమికులిద్దరూ వీధిలోకి వెళ్ళిపోయారు.
నీరజ తండ్రి ఎదుట పడి ఎన్నడూ అలా మాట్లాడలేదు. వీరభద్రం ఆమె మాటలకు మ్రాన్పడి పోయాడు.
"ఎంత ధైర్యంగా మాట్లాడావు నీరజా ...." అంటూ అభినందించాడు రవి.
"ఈ ప్రపంచంలో ఏమైనా సాధించగల భర్త నీవుండగా నాకింకేవరన్నా భయం పోయి ఓ కొత్త ధైర్యం నన్నావహించింది" అంది నీరజ.
"కీ పిటప్...." అన్నాడు రవి.
"అన్నట్లు చెప్పడం మరిచిపోయాను రవీ. శంకరానికి లలితను అప్పగించేక అయన నాకో ఉచిత సలహా పారేశాడు. నువ్వు చేసిన పనుల వల్ల షాజహాన్ చాలా నష్టం వాటిల్లిందట. అతను నీమీద పగబట్ట వచ్చునట. మన మార్గం నిష్కంటకం కావాలంటే షాజహాన్ని చంపేయడం మంచి మర్గామాన్నాడాయన ...." అంది నీరజ.
ఆమె మాటలు వింటూ రవి క్షణం పాటు ఏదో అలోచించి "నాతోరా నీరజా ఇది జరిగింది నిన్న కదా ఈ రోజు నిన్ను షాజహాన్ దగ్గరికి తీసుకు వెళ్ళాలి..." అన్నాడు.
"ఎందుకు?"
"షాజహాన్ నా మేలుకోరే వ్యక్తీ. అతను నాకెన్నడూ అపకారం తలపెట్టడు. నావల్ల అతనికి అపకారం జరిగిందని నువ్వంటుంటే నాకు చాలా బాధగా ఉంది. అదే నిజమైతే నేను తల బద్దలు కొట్టుకు చచ్చిపోతాను. షాజహాన్ కు నిన్ను చూపిస్తాను. జరిగినదంతా చెబుతాను. నేను కావాలని, తెలిసి అతనికి నష్టం కలిగించాలని ప్రయత్నించలేదని చెబుతాను. అతను నమ్మి నన్ను మన్నించితే మన జీవితం కొనసాగుతుంది. లేకపోతే నేనుండను. నువ్వే వుంటావు!"
నీరజ మాట్లాడలేదు. షాజహాన్ అంటే రవికి చాలా అభిమానమని ఆమెకు తెలుసును. కానీ మరీ ఇంత తెక్కువగా అది వుందని ఆమెకు తెలియలేదు.
ఇద్దరూ టాక్సీ ఎక్కారు. రవి చెప్పిన ప్రకారం టాక్సీ సత్య ప్రకాష్ హోటల్ వద్ద ఆగింది. ఇద్దరూ టాక్సీ దిగారు.
'షాజహాన్ పనులు ఎక్కువగా అతని అనుచరులే చూస్తుంటారు. అతను కొన్ని ముఖ్యమైన వాటిలోనే జోక్యం చేసుకుంటాడు. అయినప్పటికీ అతనికి కొన్ని సమయాలూ, నీర్ణీత స్థలాలూ ఉన్నాయి. ఉదాహరణకు రోజు సోమవారం గదా, ఈరోజు ఈ సమయంలో అతను సత్యప్రకాష్ హోటల్లో ఏడో నంబరు లో వుంటాడు....' అన్నాడు రవి.
అయితే రవి అంచనా తప్పయింది. రిసెప్షన్ కౌంటర్లో చెప్పిన ప్రకారం ఏడో నంబరు గదిలో ఎవరూ లేరు. అది ఖాళీగా ఉందిట. నిరుత్సాహంగా ముఖం పెట్టిన రవిని -- ఆర్ యూ మిస్టర్ రవీ !" అనడిగాడు రిసేప్షనిస్ట్.
రవి తల ఊపాడు.
ఏడో నంబర్ గదిలోని తన కోసం వచ్చిన రవి అనే నీకివ్వమని ఒక కవరిచ్చాడతను ....' అంటూ రవికి కవరు అందించాడు రిసెప్షనిస్ట్ .
అది తీసుకుని అక్కణ్ణించి బయటపడ్డాడు రవి. నీరజ అతన్ననుసరించింది. ఇద్దరూ శాంతినివాస్ హోటల్లో పదకొండో నంబర్ గదికి వెళ్ళారు.
రవి తిన్నగా బాత్రూం లోకి వెళ్ళాడు. అక్కడ సింకు నిండా నీళ్ళు పట్టాడు. తన జేబులోంచి ఒక సీసా తీసి అందులోని పొడిని కొద్దిగా నీటిలో వేసి తర్వాత సీసాను జేబులో వేసుకున్నాడు. నీటిని బాగా చిలకరించి అందులో కవరు పడేశాడు. బాగా నీటిని పీల్చేలా దాన్ని అందులో కదిపాడు. తర్వాత కవరు తీశాడు.
దాని మీద "ఫ్రం షాజహాన్ " అని వుంది. పక్కన ఉన్న నీరజకు అది చూపించి "ఈ ట్రీట్ మెంట్ కవరు మీద చిరునామా కనబడుతుంది. కవర్లోని కాగితాల మీద అక్షరాలూ పుడతాయి. ఇది మా సీక్రెట్ పద్దతి.!' అన్నాడు.
నీరజ ఆశ్చర్యంగా అతని మాటలు విని, చేష్టలు చూస్తోంది.
కవరు తెరిచాడు రవి. కాస్త పెద్ద ఉత్తరమే వుంది. అందులోని వివరాలు చదివి రవి నీరజ కూడా ఆశ్చర్య పడ్డారు. షాజహాన్ రాసిన ఆ పెద్ద ఉత్తరంలోని ముఖ్య వివరాలివి.
షాజహాన్ లలితను ప్రేమించాడు. ఆమెను ముఠాలో జేర్చుకుందామనుకున్నాడు. ఆమె సాయంతో పెద్ద ఎత్తున నేరాలు చేయాలనుకున్నాడు. నేరాలు లలిత మనస్తత్వానికి సరిపడదని అతనికి తెలిసి నయనా భయానా ఆమె తనకు లొంగదని కూడా తెలిసిపోయింది.
లలిత కోసం అతను తన జీవన విధాన్ని మార్చుకోవాలనుకున్నాడు. మామూలు మనిషిగా మారాలనుకున్నాడు. ఆ సమయంలోనే లలిత రవిని ప్రేమిస్తోందని , రవి నీరజను ప్రేమిస్తున్నాడని-- లలిత, నీరజ, రవి కోసం ఏమైనా చేయగలరని అతను గ్రహించాడు. తను మామూలు మనిషిగా మారడానికి రవి చేత కొన్ని పనులు చేయించాలని అతననుకున్నాడు.
కానీ అప్పటికి రవి మనసు షాజహాన్ అధీనం లోంచి తప్పిపోయింది. ఏం చేయాలో తెలియక సతమత మైపోయిన షాజహాన్ చివరకు రవిని బెదిరించాడు. మొండి ఘటం రవి బెదరలేదు. అప్పుడు షాజహాన్ శంకరం అవతార మెత్తి నీరజను బెదిరించి, రవి ద్వారా తనకు కావలసిన వన్నీ సాధించు కున్నాడు.
అతను ఇప్పుడు నార్తిండియా వెళ్ళిపోయి సామాన్య జీవనం ప్రారంభించదల్చుకున్నాడు. ఇంక అతను రవికి కనిపించడు.
"రవీ! నీరజ పై నీకున్న ప్రేమ అపూర్వం. ఆ ప్రేమను నా ప్రేమ కోసం ఉపయోగించు కున్నాను. నేను కోరిన వన్నీ సాధించడం చ్వారా నీ గురించి నాకూరెండు విషయాలు తెలిశాయి. అన్ని విధాలా నువ్వు నాకంటే సమర్దుడివి. నేను నీకు బాస్ గా వుండడానికి తగను. ఇది నేను తెలుసుకున్న మొదటి విషయం. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను మోసం చేయవు. నాకు అపకారం తలపెట్టవు. అటువంటి వాడిని అనుచరుడిగా పొందడం నా అదృష్టం. నేను నిన్ను అనుచరుడి స్థాయిలో వుంచడం నా తప్పు కూడా. ఇది నేను తెలుసుకున్న రెండవ విషయం. జీవితంలో మరెన్నడూ నేరాల జోలికిపోకు. హాయిగా జీవితం వెళ్ళబుచ్చు. నీకూ నీరజకూ నా శుభాకాంక్షలు"అంటూ ముగించాడు షాజహాన్ ఆ ఉత్తరాన్ని.
"నీద్వారా నేను షాజహాన్ కుపయోగాపడుతున్నానన్న అనుమానం నాకుంది. అయితే ఆ శంకరం షాజహాన్ ను చంపమని సలహా ఇచ్చాడంటే మాత్రం కలవరపడి విషయం తెలుసుకోవాలనుకున్నాను...." అన్నాడు రవి. ఒక క్షణం ఆగి "నీరజా షాజహాన్ నాకంటే సమర్దుడో కాదో నాకు తెలియదు. కానీ అతను నాకు బాస్ ఉండ తగ్గవాడు. నాలాంటి వాణ్ణలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు" అన్నాడు రవి.
"నీలాంటి వాడ్నేలా ఉపయోగించు కోవాలో నాకు బాగా తెలుసు ...." అంది నీరజ నవ్వి.
'అవున్లే షాజహాన్ వెళ్ళిపోయినా నా ఉద్యోగం మాత్రం మారలేదు. అప్పుడతని అనుచరుడిని. ఇప్పుడు నీ అనుచరుడిని...." అన్నాడు రవి.
అప్పుడే ఎవరో తలుపు తట్టారు. నీరజ వెళ్ళి తలుపు తీసింది.
నీరజ తండ్రి వీరభద్రం నవ్వుతూ లోపలకు వచ్చాడు.
-------: అయిపొయింది :-----
