"అన్నట్లు సుధాకర్ నీ భర్తకు స్నేహితుడే కదా-అడ్రస్ కూడా చెప్పనక్కర్లేదు అయితే?" అన్నాడు సుజాత తండ్రి.
"ఇప్పుడే బయల్దేరుదాం" అన్నాడు రవి.
"ఇంటికి వచ్చిన ఆడపిల్లను అలా ఎప్పుడుపడితే అప్పుడు పంపడానికి వీల్లేదు. ఎల్లుండిదాకా ఓపికపట్టు" అంది సుజాత తల్లి రవితో.
9
"కెవ్వు" మని అరిచి లేచి కూర్చుంది సుజాత.
ఆ కేక ఎంత పెద్దదిగా వుందంటే ఇంటిల్లిపాదీ లేచి పోయారు.
"ఏం జరిగిందమ్మా?" అన్నాడు కంగారుగా సుజాత తండ్రి.
సుజాత ఇంకా వణుకుతూనే "ఆ హంతకుడు మళ్ళీ కలలోకి వచ్చాడు నాన్నా!" అంది.
"ఏ హంతకుడు?" అన్నాడు సుజాత తండ్రి.
"శాంతిని చంపినవాడు...." అంది సుజాత.
రవి, తల్లిదండ్రులు ఆమె మంచంపైన కూర్చున్నారు.
"శాంతి బ్రతికేవుందమ్మా ఆమెను ఎవరూ చంపలేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు...." అన్నాడు సుజాత తండ్రి.
"ఏమో, అంతా నా కళ్ళముందు జరిగినట్లే వుంది" అంది సుజాత.
"శాంతి హత్య మళ్ళీ కలలో కనబడిందా?" అన్నాడు రవి.
"కలలో నేనుచూసింది హత్యకానీ-ఈ పర్యాయం ఆ అమ్మాయిని శాంతికాదు. ఇది మరో హత్య..." అంది సుజాత.
"మరో హత్యా....ఎవరా అమ్మాయి?" అన్నాడు రవి ఆత్రుతగా.
"సుధాకర్ భార్య-రాధిక" అంది సుజాత.
సుజాత తండ్రి త్రుళ్ళిపడి "నిన్నేదో పిశాచం ఆవహించినట్లుంది. ఎవరయినా సైకియాట్రిస్టును సంప్రదించాలి" అన్నాడు.
"లేదు నాన్నా కల్లోకనబడే హంతకుణ్ణి నిన్న ఈ ఊళ్ళోనే చూశాను. వాడెవరో, ఎందుకిలా హత్యలు చేస్తున్నాడో, అవి నా కలల్లో కెందుకొస్తున్నాయో తెలియడంలేదు" అంది సుజాత.
"కలలు రావడం మానసిక వ్యాధి. నీ ఆరోగ్యం బాగాలేదని నా అనుమానం" అన్నాడు సుజాత తండ్రి.
"నా మనసు రాధికకు అపాయాన్ని శంకిస్తోంది. శాంతికి పట్టినగతే రాధికకూ పట్టిందేమోనని భయంగా వుంది" అంది సుజాత.
సుజాత తండ్రి ఆలోచిస్తూ "నీ కల్లోకనబడ్డ హంతకున్నీ వూర్లో చూశావా? ఎక్కడ?" అని అడిగాడు.
"మాధురి ఇంట్లో!" అన్నాడు రవి.
"ఎలా వుంటాడు వాడు?"
"బొమ్మవేయడం రాదునాకు. వాడి ఫోటో ఎక్కడా దొరకడంలేదు. ఎంత వర్ణిస్తే మాత్రం మీకు అర్ధమయేలా చెప్పగలను?" అంది సుజాత.
10
"మధూ, మనం నీ ఫ్రెండ్ సుధాకర్ ఇంటికెళ్ళాలి. అందుకే నేనీవూరు వచ్చాను కూడా" అన్నాడు రవి.
"నువ్వుండరా, ముందు నన్ను వివరాలు చెప్పనీ?" అంది సుజాత.
భార్యచెప్పిన వివరాలు విని "సుజా! నువ్వు చెప్పేదంతా వింటూంటే ఇప్పుడు నేను కలగంటున్నానేమో నని అనుమానంగా వుంది" అన్నాడు మధు.
తర్వాత అందరూ బట్టలు మార్చుకుని సుధాకర్ ఇంటికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసమయానికి సుధాకర్ ఇంటిలోనే వున్నాడు.
"రండి. ఏమిటిలా చెప్పకుండా వచ్చేశారు...." అన్నాడు సుధాకర్ వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తూ.
పరస్పర పరిచయాలు, కుశలప్రశ్నలు కావడానికి కొద్దిసేపు పట్టింది.
"మీతో ఒక ముఖ్యమయిన పనుండి వచ్చాను...." అన్నాడు రవి.
"చెప్పండి" అన్నాడు సుధాకర్.
రవి క్లుప్తంగా శాంతికీ తనకూ సంబంధించిన కధచెప్పి "మా నాన్నగారు మిమ్మల్నడిగితే శాంతి ఆచూకీ తెలుస్తుందన్నారు" అన్నాడు.
సుధాకర్ ముఖం అదోలా అయిపోయింది. "ఆమె ఇక్కడకొచ్చి ఓ వారంరోజులున్నమాట నిజం. ఆ వారం రోజులూ ఆమెను నేను కంటికి రెప్పలాచూశాను. అంతస్థుల భేదాలగురించి రాధిక ఆమెకు ఎన్నో కథలు చెప్పింది. అవన్నీ విన్నాక శాంతిలో చాలా మార్పువచ్చింది. నేను రవిని పెళ్ళి చేసుకోను. కొంతకాలం పాటు అతనికి దూరంగా ఉంటాను అనిచెప్పి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయింది. మీరు చెప్పిందాన్ని బట్టి ఆమె అన్న మాట నిలబెట్టుకున్నట్లు తోస్తోంది."
రవి, సుజాత ముఖాముఖాలు చూసుకున్నారు.
"శ్రీమతి రాధిక కనబడరేం?" అన్నాడు మధు.
సుధాకర్ తడబడుతూ-"ఆమె ఊళ్ళోలేదు...." అన్నాడు.
మళ్ళీ రవి, సుజాత ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
"శాంతి హత్య చేయబడిందని నా అనుమానం-" అంది సుజాత.
"శాంతి ఎందుకు హత్యచేయబడుతుంది? మీ అనుమానానికి అర్ధంలేదు" అన్నాడు సుధాకర్.
"ఎందుకో చెప్పలేను. ఒకవేళ జీవించే ఉన్నదనుకోండి. ఇంతవరకూ తన తల్లిదండ్రులనుకూడా కలుసుకోలేదామె. కన్నవారిని కూడా మరిచిపోయి ఒంటరి ఆడపిల్ల ఇంతకాలం ఎక్కడుంటుంది? ఏ కసాయివాడికో బలయిపోయి ఉండవచ్చునేమోనని నా అనుమానం-" అంది సుజాత మళ్ళీ.
"కీడెంచి మేలెంచమంటారు చాలామంది. నా సిద్దాంతము అందుకు పూర్తిగా వ్యతిరేకం. శాంతి శవం దొరకనంతకాలం ఆమె బ్రతికుందనే ఆశించాలి" అన్నాడు సుధాకర్.
"నేను మాత్రం కీడెంచి మేలెంచుతాను. మీ శ్రీమతి రాధికకూడా హత్యగావించ బడిందని నా అనుమానం" అంది సుజాత.
సుధాకర్ రెండుచెవులూ మూసుకుని కెవ్వుమని అరిచాడు. అతనలా చేస్తాడని తెలియని ఆ ముగ్గురూ ఉలిక్కిపడ్డారు.
"ఏమన్నారు మీరు?" అన్నాడు సుధాకర్.
"రాధిక హత్య చేయబడిందని నా అనుమానం-" అంది సుజాత మళ్ళీ.
"నో-ప్లీజ్ అలా అనవద్దు" అంటూ అరిచాడు సుధాకర్.
"ఏమిటి సుధాకర్, మీ పిచ్చికానీ సుజాత అన్నంత మాత్రాన రాధిక చచ్చిపోతుందా? ఇంతకూ మీ ఆవిడ ఎక్కడుంది?" అన్నాడు మధు.
"పుట్టింట్లో" అన్నాడు సుధాకర్. అతని ముఖం పాలిపోయి వుంది.
"ఎందుకయినా మంచిది. మీ శ్రీమతిని గురించి వాకబు చేయండి. నా మనసు కీడును శంకిస్తోంది" అంది సుజాత.
11
రవి, మధు, సుజాత ఇంట్లోకూర్చుని మాట్లాడుకుంటుండగా రాత్రి ఎవరో తలుపుతట్టారు. రవివెళ్ళి తలుపు తీసి "ఓ సుధాకర్ గారా, రండి" అంటూ అతన్ని ఆహ్వానించాడు.
సుధాకర్ కళ్ళు ఎర్రగా వున్నాయి. జుత్తు చెదరి పోయింది. "మీ చెల్లెలు సుజాతవుందా?" అన్నాడు. ఆ కంఠంలో జీవంలేదు.
