"నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. అయితే నామీద అట్టే ఆశలు పెట్టుకోకు..." అంది సుశీల.
3
"మధ్యాహ్నం రాదాభాయి గారింటి వెళ్లానండీ?" అంది సావిత్రమ్మ.
"రాదాభాయేవరు?" అన్నాడు మోహనమూర్తి. ప్రశ్నైతే వేశాడు కానీ ఆయన ముఖంలో ఏమాత్రమూ ఆసక్తి కనబడలేదు.
"టంగుటూరి వారి వీధిలో వున్నారూ- వాళ్ళు!"
"ఓహ్ " అని ఊరుకున్నాడు మోహనమూర్తి.
"ఆ రాధాభాయి బావగారబ్బాయి సుభాష్. ఎమ్మే ఎకనామిక్స్ చదివాడు. కుర్రాడు చక్కగా వుంటాడు. మనవాళ్ళే!" అంది సావిత్రమ్మ.
"అలాగా!"అంటూ మోహనమూర్తి పడక కుర్చీల్లో కూర్చుని పేపరు తీశాడు.
'ఆ అబ్బాయి కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటాట్టండీ" అంది సావిత్రమ్మ కళ్ళు పెద్దవి చేసి.
మోహనమూర్తి చేతిలోని పేపరు జారిపోయింది -- "కట్నం లేకుండా పెళ్ళా? ఆ అబ్బాయి కేమైనా లోపముందా..." అన్నాడాయన అప్రయత్నంగా.
"లోపమూ లేదు పాడూ లేదు. కుర్రాడు నిక్షేపం లా వున్నాడు. మన సుశీల వాళ్ళింటి కెళ్ళినప్పుడు చూశాట్ట. పిల్ల నచ్చిందిట...."
"అయితే ఇంకేం --వాళ్ళ పెద్దాలతో మాట్లాడదాం!"
"మాట్లాడొచ్చు కానీ అతడింకా పెళ్ళి చేసుకోనంటునాట్ట."
మోహనమూర్తి విసుగ్గా -- "ఇంతకీ నువ్వేం చెప్పాలను కుంతున్నావో నా కర్ధం కావడం లేదు' అన్నాడు.
"అతడు మీ కాలేజీలో లెక్చరర్ పోస్టుకి అప్లై చేశాడు..."
సావిత్రమ్మ ఇంకా ఏదో చెబుతుండగానే -- "అర్ధమైందిలే -- ఇంకేమీ చెప్పకు ..." అన్నాడు మోహనరావు.
"ఏమిటర్ధమైంది?"
"ఆ కుర్రాడు నాద్వారా ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నాడు."
"ఇందులో తప్పేముంది?"
"తప్పేం లేదు. కానీ ఉద్యోగానికి నామీద ఆధారపడే చవటను నా అల్లుడిగా చేసుకోలేను....'అన్నాడు మోహనమూర్తి.
సావిత్రమ్మ నోరు నొక్కుకుని -- "హవ్వ -- అవెం మాటలండీ -- అతడెం తెలివి తక్కువ వాడు కాదు. ఎమ్మే ఫస్టు క్లాసులో ప్యాసయ్యాడు" అంది.
"సావిత్రీ -- నా సంగతి నీకు తెలుసుగా!" అన్నాడు మోహనమూర్తి గంబీరంగా.
"మీకుద్యోగం ఎవరి సిఫారసు లేకుండా వచ్చిందంటారు. అంతేగా! ఆరోజుల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. ఉద్యోగాలెక్కువ" అంది సావిత్రమ్మ.
"నేనప్పటి మాట కాదు - ఇప్పటి మాట అడుగుతున్నాను. నాసంగతి నీకు తెలుసుగా .." అన్నాడు మోహనమూర్తి మళ్ళీ.
"ఇన్నేళ్ళు కాపురం చేసినా నా గురించి మీకు తెలిసింది కనుకనా-- మీగురించి నాకు తెలియడానికి!'అనేసింది సావిత్రమ్మ.
"తెలియదన్నావు కాబట్టి చెబుతున్నాను విను. ఇంటా బయటా మచ్చలేని జీవితం నాది...."
'అయితే యిప్పుడేమైందిట?"
"నువ్వు చెప్పిన ఆ సుభాష్ కి మెరిట్ వుంటే తనే సెలక్టవుతాడు. అయితే కాలేజీలో సెలక్టయ్యాడంటే -- సుశీలకూ అతడికీ పెళ్ళి జరుగదు."
"ఎందుకని?"
"అంతా యేమని చెప్పుకుంటారు? ప్రిన్సిపాలు గారు మంచి కుర్రాణ్ణి పట్టి ఉద్యోగం వేయించి అల్లుణ్ణి చేసుకున్నాడని!' అది నాకు నచ్చదు..."
"అందుకని...."
"అతడికి సుశీల నచ్చి పెళ్ళి చేసుకోవాలనుకున్నాడనుకో -- ఈ ఉద్యోగానికి అప్లై చేయకూడదు..." అని -- 'అయినా లాస్టు డేటైపోయిందిగా. మేము ఇంటర్వ్యూ లేటర్సు కూడా పంపెశాం" అన్నాడాయన .
"అతడప్లై చేసేశాట్ట...."
'అయితే ఇంటర్వ్యూ కి రాకూడదు...."
"ఇదేం ఘోరమండీ -- ఈ రోజుల్లో ఎర చూపించి అల్లుళ్ళ ను పడుతున్నారందరూ . మీరేమో చేతిలో ఉద్యోగముండీ అది అల్లుడు కాదగ్గ వాడి కివ్వనంటున్నారు...." అంది సావిత్రమ్మ.
"చెప్పానుగా -- మచ్చలేని జీవితం నాది" అన్నాడు మోహనమూర్తి.
4
"వెతకపోయిన తీగ కాలికి తగిలింది" అన్నాడు సుందర్శనం సంతోషంగా.
" ఏమిటి విశేషం - నన్ను తీగను చేసేశావు" అన్నాడు ఆనందరావు కుతూహలంగా.
'అన్ని ఇక్కడెందుగ్గాని - అలా కాఫీ హోటలు కి పోదాం పద!" అన్నాడు సుదర్శనం.
ఇద్దరూ దగ్గరలో వున్న పంచవటి " హోటల్ కు వెళ్ళి ఫామిలీ సెక్షన్లో కూర్చున్నారు.
"ఆడాళ్ళు లేకుండా ఫామిలీ సెక్షన్ లో కూర్చోవాలంటే తగని సిగ్గు నాకు. అందులోనూ ఇక్కడ మరీను. ప్రేయసీ ప్రియుల కోసమన్నట్లు ఇద్దరిద్ద్రితో చిన్న అపార్ట్ మెంట్...."అన్నాడు ఆనందరావు ఇబ్బందిగా.
"అందుకే గదా ఇక్కడికి తీసుకొచ్చాను , మనమాటలింకేవ్వరూ వినకూడదు....'అని ఇంకా ఏదో అనబోతుండగా అక్కడ ప్రత్యక్షమైన సర్వర్ని చూసి -- రెండు మిక్స్ చర్ ఉతప్పాలు " అన్నాడు సుదర్శనం.
"అరె - నాకు ఊతప్పం చాలా ఇష్టమని నీ కేలా తెలుసు?" అన్నాడు ఆనందరావు ఆశ్చర్యంగా.
"ఊతప్పమైతే తయారవడానికి చాలా సేపు పడుతుంది. సర్వరు మనల్ని బాధించాడని అది చెప్పాను."
"ఇంతకీ యేమిటంత రహస్యం?"
"నీకు తెలుసు...."
"నిజంగా నాకు తెలియదు...."
"నిరుద్యోగం -- నాకు నీతో రహస్యమేముంటుంది?"
ఆనందరావు నాలిక్కరుచుకుని -- "అయాం సారీ బ్రదర్ ....ఆ విషయమే మర్చిపోయాను. అప్లికేషన్స్ కి లాస్టు డేటై అప్పుడే వారం రోజులు దాటింది -- ఇంటర్వ్యూ లెటర్స్ ఈ వారమే పంపారను కుంటాను" అన్నాడు.
"నాకు లెటరు కూడా అందింది కానీ -- ఇందులో నాకు అవకాశాలేమితో చెప్పగలవా?"
ఆనందరావు క్షణం మౌనం వహించి --"నువ్వు చాలా అదృష్టవంతుడివి " అన్నాడు.
సుదర్శనం కళ్ళు మెరిశాయి --"ఏం?'
"మోహనమూర్తి గారు చాలా గొప్పవారు. దేశంలో అలాంటివాళ్ళు మరికొందరుంటే యెంతో బాగుండేది!" అని నిట్టూర్చాడు ఆనందరావు.
"ఎందుకని?"
"వచ్చిన అప్లికేషన్స్ న్నీ స్క్రీన్ చేయడమైనాక మొత్తం పదిమందికి ఇంటర్వ్యూ లెటర్స్ పంపారు. అందులో నీదే మొదటి పేరు. అంటే అందరిలోకి నువ్వే బెస్టు కాండిడేటువి...."
"అంటే నేను తప్పక సెలక్టవుతానన్న మాట...."
"నూటికి నూరుపాళ్ళు గ్యారంటీ లేదు..."
'ఎందుకని?"
ఆనందరావు నవ్వి -- "ఇంటర్వ్యూ లెటరు కీ అపాయింట్ మెంట్ ఆర్డరు కీ తేడా వుంటుంది కదా ...." అన్నాడు.
"సరిగ్గా -- ఇదే నాన్నగారు కూడా అన్నారు..."
"బాగా దగ్గర స్నేహితుడిని కాబట్టి నీకింకో రహస్యం చెబుతున్నాను. ఇది నీలో ఆశలు పెంచనూవచ్చు త్రుంచను వచ్చు,...."
"చెప్పు!" కుతూహలంగా అన్నాడు సుదర్శనం . ఆనందరావు చెప్పడం మొదలుపెట్టాడు.
"వెంకోజీరావు కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుకి అప్లై చేసిన వారిలో సుభాష్ అని ఇంకో కాండిడేటున్నాడు. మెరిట్ ప్రకారం అతడి నెంబరు మూడు. ఇంటర్వ్యూ లో అర్హతతో పాటు - ఇంటర్య్వూ ఫేర్ ఫార్మెన్స్ కు కూడా కొన్ని మార్కులుంటాయి. ఆ మార్కులని అడ్జస్టు చేయడంలోనే ఉంటుంది సెలక్షనంతా. కేవలం అమార్కుల్ని ఉపయోగించి అర్హతల ప్రకారం ఆఖరున వున్నవాడిని పోస్టుకి ఎన్నిక చేయవచ్చు.
సుభాష్ తెలివైనవాడిలా కనబడుతున్నాడు. అతడు ఉద్యోగం కోసం అట్నించి నరుక్కుని వస్తున్నాడు."
'అంటే?' అన్నాడు ఆనందరావు ని మధ్యలో ఆపుతూ -- " సుదర్శనం.
"సుభాష్ మోహనమూర్తి గారమ్మాయి సుశీలను ప్రేమించాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు...."
"అయితే ఇంక నాకేం చన్సుండదు--"నీరసంగా అన్నాడు సుదర్శనం.
'అలా నిరుత్సాహపడకు. పూర్తిగా నేను చెప్పేది విను....."అంటూ ఆనందరావు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.
మోహనమూర్తి ఆనందరావుని కలుసుకుని -- "నీవల్ల సాయం కావాలి నాకు" అనడిగాడు. ప్రిన్సిపాలంతటి వాడు తనని స్వయంగా కలుసుకుని సాయమడిగే సరికి ఆనందరావు తెల్లబోయాడు. మోహనమూర్తి అతడిని తన పర్సనల్ రూం లోకి తీసుకుని వెళ్ళి సుభాష్ గురించి చెప్పాడు. ఈ విషయమయిన తనకెందుకు చెప్పాడో ఆనందరావు కర్ధం కాలేదు.
