అదృశ్యరూపుడై ఉన్న వీరచంద్రుడు ఆ మంత్ర దండాన్ని గాలిలోకి ఎత్తి విరిచేశాడు. దాంతోనే మాంత్రికుడు నిర్వీర్యుడై నాడని తెలియగానే అతడికి కలిగిన ఉత్సాహమింతా అంతా కాదు. అతడు మాంత్రికుడిని సమీపించి వీపు మీద గట్టిగా గుద్దాడు.
"అబ్బా! అని పెద్ద కేక పెట్టి మాంత్రికుడు సుహాసిని చేయి వదిలి పెట్టి వెనుదిరిగాడు. వీరచంద్రుడు మాంత్రికుణ్ణి ఇష్టం వచ్చినట్లు బాదాడు. ఏం జరిగుతుందో మంత్రికుడికి తెలియలేదు. అలా చాలాసేపు దెబ్బలు తిన్నాక జటాజూటుడికి తాను దెబ్బలు తింటున్నది ఒక అదృశ్యరూపుడి చేతిలో నన్న అనుమానం వచ్చింది. "పిరికిపందా! కంటికి కనిపించకుండా నామీద చేయి చేసుకోవడం కాదు. మొనగాడివైతే నీ అసలు రూపంతో నా ఎదుట నిలబడు . అప్పుడు నా అసలు ప్రతాపం తెలుస్తుంది ' అంటూ ఓ కేక పెట్టాడు.
ఆ కేకకు వీరచంద్రుడి లోని రాజసం ఆవేశ పడింది. అతడు వెంటనే అదృశ్యరూపాన్ని వదిలి పెట్టి, "దుర్మార్గుడా! ఈ రోజుతో నీ పాపం పండింది. నా దెబ్బ కాచుకో " అంటూ కత్తిని ఝూళించాడు.
జటాజూటుడి కళ్ళు, కత్తిని పట్టుకుని ఉన్న వీరచంద్రుడి చేతి వ్రేళ్ళని శ్రద్దగా గమనిస్తున్నాయి. ఆ చేతి వ్రేళ్ళకు మెరుస్తున్న ఉంగరాన్ని చూసి అతడుత్సహంగా -- 'అయితే నువ్వే నా నూరవ రాజకుమారుడివన్న మాట! నా శక్తిని చాలా తక్కువ అంచనా వేశావు. ఇప్పుడు నీ గతి చూడు" అంటూ "జటాజూటహో!' అని అరిచి, తన తలమీద జటల్లో ఒకటి ఊడ పెరికి నేలపైన కొట్టాడు. ఆ జట నేలపై పడగానే వీరచంద్రుడు ఒక ఖడ్గ మృగంగా మారిపోయాడు. "పో! అరణ్యం లోకి పోయి రేపు నిన్ను పిలవగానే బలికి రా!" అన్నాడు జటాజూటుడు.
అప్పుడు జటాజూటుడు సుహాసిని వంక తిరిగి - "మంత్రదండం పోగానే నే నెందుకూ పనికి రాని వాడినౌతాననుకున్నావా?" అంటూ వికటాట్టహాసం చేశాడు.
జటాజుటుడికి గురూపదేశం జరిగినపుడు అతడి తలపై ఎనిమిది జటలుండేవి. ఆ జటలే అతడి మంత్ర శక్తులు. గురువు అతడికి ఓ సలహా ఇచ్చాడు. మంత్ర శక్తు లన్నింటినీ మంత్ర దండం లోనికి మార్చుకుని , ఆ దండాన్ని భద్రంగా కాపాడుకోమని , ఆ మంత్రదండం అతడు దరించ నపుడు దానంతటదే గాలిలోకి లేవనంత వరకూ జటాజూటుడికి ప్రమాద ముండదు. అలాగే జటాజూటుడు తలపై జటలన్నీ అయిపోతే కూడా అతడి సర్వశక్తులూ అయిపోతాయి.
సునందుడితో గొడవ పడ్డప్పుడు జటాజుటుడొక జట ఉపయోగించి వృధా చేసుకున్నాడు. అప్పుడతడికి భయం వేసి, మూడు జటలు ఉపయోగించి, ఒక మంత్రదండాన్ని సృష్టించి, దానిలోకి మంత్రశక్తుల్ని ప్రవేశింపజేసి , అది తనకు తప్ప ఇతరులెవ్వరికీ ప్రయోజనకారి కాకుండా ఉండేలా చేశాడు. అప్పుడతడి తలపై నాలుగు జటలు మాత్రం మిగిలాయి. అప్పట్నించీ అతడు సకల కార్యాలనూ మంత్ర దండం సహాయంతోనే చేస్తున్నాడు.
ఇంత కాలానికి వీరచంద్రుడి కారణంగా అతడు మరో జటను ప్రాణ రక్షణార్ధం ఉపయోగించాల్సి వచ్చింది. అతడి దురదృష్టం ఏమిటంటే అతడి మంత్రాలు అదృశ్య రూపులపై పని చేయవు. బహుశా ఇది తెలిసే మునిపల్లె ముని వీరచంద్రుడికి ఆ మంత్రం ఉపదేశించి ఉంటాడు.
జటాజుటుడు తన కధను సుహాసినికి క్లుప్తంగా తెలిపి -- "నా మంత్రదండం లో శక్తిని పున్హప్రతిష్ట చేయడానికి ఇప్పుడున్న మూడు జటలనూ ఉపయోగిస్తాను. ఆ తర్వాత నాకు జతలుండక పోయినా ఎటూ త్రిలోకయాగం చేయనున్నాను కాబట్టి బెంగ లేదు" అన్నాడు.
సుహాసిని బెదురూ బెదురుగా వాడి వంకే చూస్తూ నిలబడింది. ఆమె చూస్తుండగా మాంత్రికుడు అక్కణ్ణించి మరో గదిలోకి బయల్దేరి తలుపులు వేసుకున్నాడు.
7
సుహాసిని మెదడు చురుగ్గా పనిచెయసాగింది.
మాంత్రికుడు ప్రస్తుతం తన శక్తులు కోల్పోయి ఉన్నాడు. తన మంత్ర దండంలో శక్తులు పున్హ ప్రతిష్ట చేయడానికి వాడికి కొంత సమయం పడుతుంది. ఈలోగా తను ఈ మందిరం లోంచి తప్పించుకుని బయటపడాలి. మంత్రదండం శక్తి వంతమయేలోగా తను అక్కణ్ణించి బైట పడాలి.
సుహాసిని మందిరం లోంచి గుహకు వచ్చి, అక్కడ దేవీ విగ్రహానికి నమస్కరించి , గుహ లోంచి బైటకు వచ్చి త్వరత్వరగా పర్వతం మీద నుంచి క్రిందకు దిగసాగింది.
అరణ్యంలోనే పుట్టి పెరిగినప్పటికీ సుహాసిని సుకుమరిగానే ఉండిపోయింది. అందుకు కారణం సునంద మహర్షి పరిరక్షణ. ఆమె ఇప్పుడు కటిక రాళ్ల పైన నడుస్తుంటే పాదాలు బొబ్బలెక్కుతున్నాయి. అరికాళ్ళు మండుతున్నాయి. అయినా లెక్క చేయకుండా ఆమె నడుస్తోంది. ఆమె దృష్టిలో ఇంకేమీ లేదు. ఏదో విధంగా ఈ తాండవ వనం నుంచి బైట పడాలి.
సుహాసిని కొంతదూరం వెళ్ళగానే పొదల వెనుక ఏదో కదిలినట్లనిపించింది. అదేమిటో ఆమె వరిశీలించే లోగానే పొదల చాటు నుంచి ఓ పెద్ద పులి ఒక్క ఉదుటున ఆమె పైకి దూకింది.
సుహాసిని కెవ్వుమని కేకపెట్టి శక్తి కొద్దీ పరుగు తీసింది. ఈలోగా ఎక్కణ్ణించో ఓ ఖడ్గ మృగం వచ్చి పెద్ద పులి మీదకు దూకింది. రెండూ ఒకదాని వైపు ఒకటి క్రూరంగా చూసుకున్నాయి. అలా కొద్ది క్షణాలయ్యక పెద్ద పులి వెనక్కు తిరిగింది. ఖడ్గ మృగం వెనక్కు తిరిగింది.
ఖడ్గ మృగాన్ని చూస్తూనే సుహాసిని కి వీరచంద్రుడు గుర్తుకు వచ్చాడు. "వీరచంద్రా!" అని పెద్ద కేక పెట్టిందామే.
ఆశ్చర్యమేమిటంటే ఆమె కేక వింటూనే ఆ ఖడ్గమృగం వీరచంద్రుడిగా మారిపోయి ఎదుట నిలబడ్డాడు.
సుహాసినికి అది కలో నిజమో తెలియలేదు.
మాంత్రికుడి పై కత్తి దూసినపుడు ఒకే ఒక్క క్షణం వీరచంద్రుడిని చూసింది సుహాసిని. ఆ ఒక్క క్షణంలోనే అతడి అందం, ఠీవి అన్నీ ఆమెను ఆకర్షించాయి. ఆ రూపం ఆమె హృదయంలో ముద్ర వేసుకొంది. అదే రూపం ఇప్పుడేదురుగా నిలబదేసరికి ఆమెకు నోట మాట రాలేదు.
వీరచంద్రుడామెను సమీపించి, "నన్ను మళ్ళీ మనిషిని చేశావు. నీ ఋణం ఎలా తీర్చుకోగలనో తెలియడం లేదు సుహాసినీ!" అన్నాడు.
"ఇందులో నేను చేసిందేమీ లేదు. దేవుడు మన పక్షాన వున్నాడు. అసలు పేరుతొ ఏ జంతువూ నైనా పిలిచినపుడు ఆ జంతువు నిజరూపం పొందుతున్నదన్నమాట! మిగతా రాజకుమారుల పేర్లు కూడా తెలిస్తే ఎంత బాగుండును. అందర్నీ మనుషులుగా మార్చి ఉండేవాళ్ళం " అంది సుహాసిని. ఆమె అతడికి జటాజూటుడి కధను వివరించి చెప్పింది.
వీరచంద్రుడు అలోచించి --" అంతా మనకు అనుకూలంగా ఉన్నట్లే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో నువ్వు ఆ మందిరం వదిలి రాడవం జటాజూటుడిని మరింత జాగరూకుణ్ణి చేస్తుంది. నువ్వు అక్కడ ఉంటేనే వాడు అజాగ్రత్తగా ఉంటాడు" అన్నాడు.
"అయితే మనం ఏం చేద్దాం ?" అంది సుహాసిని.
వీరచంద్రుడు ఏదో చెప్పబోయే లోగా ఓ హస్తం వారిద్దరినీ కలిపి ఒడిసి పట్టుకున్నాది. ఇద్దరూ బ్రహ్మరాక్షసి చేతిలోకి వెళ్ళిపోయారు.
బ్రహ్మరాక్షసి, తన అరచేతిని ముఖానికి దగ్గరగా ఉంచి, ఇద్దర్నీ పరీక్షించి చూసి - "నిన్నెక్కడో చూచినట్లుందే " అంది వీరచంద్రుడితో.
"విధ్వంసక పర్వత గుహలోంచి రామచిలుకను తీసుకు వస్తానంటే నన్ను వదిలి పెట్టావు. ఇంకా పని పూర్తీ కాకుండానే మళ్ళీ పట్టుకున్నావు. నా పేరు వీరచంద్రుడు . స్వరూపరాణి స్వయంవరానికి వెళ్ళిన నూరవ రాజకుమారుడిని " అన్నాడు వీర చంద్రుడు.
బ్రహ్మ రాక్షసి ఈ పర్యాయం సుహాసిని వంక చూసి - "నరమాంసం రుచి చూసి చాలా కాలమైంది. దీన్ని తినడానికే అడ్డంకీ లేదు" అంది.
సుహాసిని ఆ బ్రహ్మరాక్షసి రూపం చూసి గడగడ వణికి పోసాగింది. వీరచంద్రుడి కేం మాట్లాడాలో తోచలేదు. రాక్షసి ఇద్దర్నీ నేల మీద ఉంచింది. అది చేతులు దూరంగా చాపి ఒక సరస్సు లోని నీటిని పుక్కిట పట్టి పుక్కిళింఛి ఉమ్మింది.
అప్పటికి సుహాసిని మూర్చ పోయింది. వీరచంద్రుడికేం చేయాలో తోచలేదు.
బ్రహ్మరాక్షసి మళ్ళీ సుహాసినిని అందుకుంది. ఆ సమయంలో వీరచంద్రుడు కూడా దాని చేతులపైకి ఎగబ్రాకాడు. బ్రహ్మరాక్షసి సుహాసినిని నోటికి దగ్గరగా జేర్చుకుంటూ మళ్ళీ వీరచంద్రుడు తన చేతిపై చేరడం చూసి, "మళ్ళీ ఎందుకొచ్చావ్ ?" అంది.
"నువ్వడిగిన రామచిలుక ఎక్కడుందో ఈ అమ్మాయికి తెలుసు. ఈమె విధ్వంసక పర్వత గుహలో జటాజూటుడనే మంత్రికుడికి బందీగా ఉన్నది. ఈమెను నువ్వు భుజిస్తే నేనా రామచిలుకను కనుక్కోలేను. నీకు సాయపడ లేను. ఈ విషయం చెప్పడానికి నేను మళ్ళీ వచ్చాను" అన్నాడు వీరచంద్రుడు.
రాక్షసి విసుగ్గా - "ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు ?" అన్నది.
"నిన్ను చూస్తె భయం వేసి నోటమాట రాలేదు. దయతో మమ్మల్ని విధ్వంసక పర్వత గుహను చేర్చు" అన్నాడు వీరచంద్రుడు.
"నర మాంసం తినే యోగం నాకున్నట్లు లేదు" అని విసుక్కుంటూ బ్రహ్మరాక్షసి చేయి జాపి నాలుగు అడుగులు కూడా వేసి వాళ్ళను విధ్వంసక పర్వత గుహ వద్ద వదలి - "ఈ అరణ్యంలో ఏం జరిగినా నేను గమనిస్తూనే ఉంటాను. నన్ను తప్పించు కోవటానికి యత్నించి బ్రతకలేరు. రామచిలుకను నాకు అప్పజేప్పకపొతే మిమ్మల్నిద్దర్నీ కరకర నమిలి మింగేస్తాను " అంది.
బ్రహ్మరాక్షసి వెళ్ళిపోయాక సుహాసినిని కుదిపి, కదిపి మెలకువ తెప్పించాడు వీరచంద్రుడు. ఆమె లేచి, "నేనింకా బ్రతికే వున్నానా" అంది.
