"నువ్వు నన్నెన్ని మాటలన్నా ఫరవాలేదు. నేనేం చేసినా నీ క్షేమం కోసమే!" అన్నాడు కొండల్రావు.
"బాబూ-- తమరికేందరు బిడ్డలు? అందులో ఎందరికి శేషారావు అనే పేర్లున్నాయి?" అడిగాడు పేర్రాజు.
"మా ఇంటి మొత్తానికి వీడోక్కడే శేషారావు . నిన్న శేషారావునంటూ మీ దగ్గరకు వచ్చినవాడు జయరాజు అయుంటాడు-'అన్నాడు కొండల్రావు.
"మరి అంతకుముందు జయరాజునంటూ వచ్చిందేవరు?" ఆడిగాడు పేర్రాజు.
"నాన్నా-- ముందిక్కడి నుంచి పద - రాధ ఏమయిందో తేల్చాలి. నువ్వు అవతల చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఇక్కడ నా సరదా తీర్చడాని కొచ్చినట్లు నాటకాలాడితే తీరదు. రాధ శవంగా మారినా సరే-- ఆశవాన్నే పెళ్ళి చేసుకుంటాను తప్పితే మీ మాట వినను. రాధ శవంగా మారేక ఆ శవాన్ని పెళ్ళి చేసుకుని నేనూ శవాన్నవుతాను, ఇదీ నా శపథం -"
కొండల్రావు కంగారుగా -- నా మాట వినరా-- అని ఏదో చెప్పబోయాడు . శేషారావు అక్కణ్ణించి విసురుగా కదిలాడు.
7
"ఎవరూ?' అంటూ తలుపు తీశాడతను. తలుపు తెరుచుకోగానే తట్టిన వ్యక్తీ విసురుగా లోపలకు వచ్చాడు.
"ఏమిటా విసురు-- " అంటూ ఏదో అనబోయి ఆ వ్యక్తిని చూసి ఆగిపోయి -- "నువ్వా జయరాజూ -- " అన్నాడతను ఆశ్చర్యంగా.
"అవున్రా -- నేనే -- నాకంటే ముందుగా నువ్వే రాధను కిడ్నాప్ చేస్తే నాకు తెలీదనుకున్నావుట్రా రాస్కెల్-" అన్నాడు జయరాజు.
ఆ రాస్కెల్ ఒక్క క్షణం మాట్లాడకుండా జయరాజు వంకే ఆశ్చర్యంగా చూసి "నేను రాధను కిడ్నాప్ చేస్తానని ఎందుకనుకున్నావ్?" అన్నాడు.
"రాధ కిడ్నాప్ గురించి రెండు వారాల క్రితం కొండల్రావు నాతో అన్నప్పుడు నా పక్కనున్నది నువ్వే-- నాకంటే ముందే నా పేరుతొ దాన్ని కిడ్నాప్ చేస్తే ఆ నేరం నామీదకు వచ్చేస్తుందని అనుకున్నావ్. అంతేగా! ఈ జయరాజు మనిషి ఎంత సున్నితంగా కనిపిస్తాడో-- అంత దారుణంగా మనిషి ప్రాణాలు కూడా తీయగలడని మర్చిపోయావా?" అన్నాడు జయరాజు.
రాస్కెల్ ఏడ్పు ముఖం పెట్టి -- "డబ్బుకు కక్కుర్తి పడ్డాను గురూ!" అన్నాడు.
"ఎంత ?"
"పదివేలు--"
"ఎవరిచ్చారు ---?"
"కోదండరామయ్య -"
"కోదండరామయ్య?" అన్నాడు జయరాజు కంగారుగా -- "అసలేం జరిగిందో చెప్పు -"
"ఆయనకు రసగుళికలాంటి పల్లెటూరి పిల్ల కావాలిట. తీసుకొస్తే పది వేలిస్తానన్నాడు. నేను వెంటనే రాధను కిడ్నాప్ చేయించే ఏర్పాట్లు చేశాను. నన్ను మన్నించు"అన్నాడు రాస్కెల్.
"జయరాజు పేరుతొ అక్కడికి వెళ్ళిందేవరు?"
"రాజమండ్రి వాడే-- పేరు గురుమూర్తి . ఆ పిల్ల ఇంకా వాడి ఆధీనంలోనే ఉంది-'
"ఏం చేశారా పిల్లని ?"
"బహుశా వ్యాపారంలో పెడతారనుకుంటాను. పిల్ల చాలా బాగుంటుంది. పదివేలూ రాబట్టుకుందుకు నెల్లాళ్ళు కూడా అక్కర్లేదు--"
"అయితే పాడు చేశారా?"
"నాకు తెలియదు. గురుమూర్తిని అడుగు...."
జయరాజు ఆవేశంగా అతడి వంక చూసి -- "రాధ కేమైనా అయిందో -- నీ రక్తం నీచేత తాగిస్తాను. జాగ్రత్త" అన్నాడు.
8
'అయిదు నిమిషాలూ అయిపోయాయి...." అన్నాడతను రాధ వంక చూస్తూ.
రాధ అదురుతున్న గుండెలతో అతడి వంక చూస్తోంది.
ఆమె గుండెలు భయంతో ఎగసి పడుతున్న ఆమె హృదయపుటారాటాన్నే చూస్తూ అతను మంచం మీంచి లేచి నిలబడి ఆమెను సమీపించాడు.
ఆమె వెనకడుగు వస్తూ - వద్దు!" అంది.
"నేను చెప్పింది మర్చిపోయావా?" అన్నాడతను.
"ఏమిటి?" అందామె.
"మానభంగం తప్పదు. మనసు తేలిక చేసుకుని సుఖపడు -" అన్నాడతను.
ఆమెకు మనసు తేలిక కావడం లేదు. బరువెక్కుతోంది.
అతనామెను సమీపించాడు. చేయి పట్టుకున్నాడు.
అంతవరకూ రాధ భీతహరిణేక్షణ , బేల, అబల, అతడి చేయి ఆమెను తాకగానే ఆమె రాధ కాదు, దుర్గ, భద్రకాళి.
ఇప్పుడామె చూపుల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. ఆమె వంటలోకి వెయ్యేనుగుల బలం వచ్చింది.
రాధ అతడి చేయి విదుల్చుకుని ఒక్క తోపు తోసింది. ఊహించని ఆమె శక్తికీ, బలానికి అతడు క్రిందపడ్డాడు. ఒక్క ఉదుటున ఆమె తలుపు దగ్గరాజు పరుగెత్తి తలుపు తీసింది. కానీ తలుపు తెరచుకోలేదు. అది అవతల పక్క గొళ్ళెం వేయబడినట్లుంది. రాధ శక్తి కొద్ది తలుపులు తట్టి లాగి నానా ప్రయత్నాలు చేసింది.
ఈలోగా ఆటను లేచి ఆమెను సమీపించి మళ్ళీ చేయి పట్టుకున్నాడు- "తలుపులు తెరుచుకోవు. నువ్విక్కడ్నించి బైటకు పోలేవు. నీకు మానభంగం తప్పదు. మనసు తేలిక చేసుకుని సుఖపడు--"
రాధ అతడి చేయి వడుల్చుకొబోయింది. అతడి పట్టు ఈసారి ఇంకా బలంగా వుంది. అతడు నవ్వుతూ ఆమె నడుపు పై చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు.
9
శేషారావు, కొండల్రావు -- రాజమండ్రిలో జయరాజు సాధారణంగా మకాం వేసే చోటుకు వెళ్ళారు-- "జయరాజక్కడ కు వచ్చాడా?" అనడిగాడు శేషారావు.
"వచ్చాడండి, ఇప్పుడింట్లో నే ఉన్నాడు--"అన్నాడతను.
జయరాజప్పుడు స్నానం చేస్తున్నాడు. అతనది పూర్తీ చేసుకు వచ్చి తండ్రీ కొడుకు లిద్దర్నీ చూసి ఆశ్చర్యపోయాడు.
"రాధ ఎక్కడ?" అనడిగాడు శేషారావు.
"అది తెలుసుకోడానికే నేనూ వచ్చాను. గురుమూర్తి దగ్గరికిప్పుడు వెళ్ళాలి--" అన్నాడు జయరాజు.
"నా పేరుతొ నువ్వు పేర్రాజు గారింటికి వెళ్ళావా?" అన్నాడు శేషారావు.
"వెళ్ళాను. కానీ రాధను అప్పటికే ఎవరో కిడ్నాప్ చేశారు--" అన్నాడు జయరాజు. తర్వాత జరిగింది కూడా అతను చెప్పాడు.
"అంతా విని నువ్వు తాపీగా ఇక్కడ స్నానం చేస్తున్నావా? త్వరపదాలన్న జ్ఞానం లేకపోయిందా?" అని ఆగి - "అవునులే -- కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారని ఆశపడుంటావ్. నా నిర్ణయం నేను మా నాన్నకు చెప్పాను. రాధ శవాన్నైనా పెళ్ళి చేసుకుంటాను గానీ అయన మాట వినను. రాధ శవంగా మారితే నేనూ అంతే--" అన్నాడు శేషారావు-
"జయరాజూ-- మనమిప్పుడు రాధను రక్షించాలి-- అన్నాడు కొండల్రావు.
"పదండి -- పోదాం-- " అన్నాడు జయరాజు . అంతా కలిసి గురుమూర్తి దగ్గరకు వెళ్ళారు.
ముందు గురుమూర్తి తనకేమీ తెలియదని దబాయించాడు. జయరాజు వాణ్ని చితకతన్ని - "అసలే టైమట్టె లేదు. అందువల్ల నిన్నంతటితో వదిలి పెడుతున్నాను. దెబ్బలు తినక త్వరగా చెప్పు-"అన్నాడు.
గురుమూర్తి వాళ్ళను ఓ యింటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళా యింట్లో ప్రవేశించగానే ఓ గదిలో పెద్ద గొడవ జరుగుతున్నట్లు గ్రహించారు. తలుపు గడియ బయట వేసి వుంది. శేషారావు పరుగున వెళ్ళి గడియ తీశాడు. తలుపు తెరుచుకుంది.
లోపల.....
రాధా అర్ఘ నగ్నంగా గదిలో పడుగెడుతోంది. ఆమె జుట్టు చెదిరిపోయింది. రవిక చిరిగిపోయింది. అమెనో పురుషుడు తరుముతున్నాడు. అతడి వంటి నిండా రక్కులున్నాయి. మనిషి క్రూరంగా ఉన్నాడు.
తెరచుకున్న తలుపులు చూసి ఆ మనిషి ఆగిపోయాడు.
రాధ ఒక్క పరుగున వచ్చి అక్కడ కనబడ్డ కొండల్రావు కాళ్ళ మీద పడిపోయి -- "బాబూ- నన్ను రక్షించండి. చావు కంటే ఘోరమైన పరాభవం ఈ దుర్మార్గుడు నాకు తలపెట్టాడు-- " అంది.
"లే-- అమ్మా-- నీకేం భయం లేదు --" అన్నాడు కొండల్రావు.
ఈలోగా జయరాజతన్ని పట్టుకుని- "ఏరా -- వళ్ళు కొవ్వేక్కిందా-- కొండల్రావు గారి కాబోయే కోడల్ని మానభంగం చేయడానికి సిద్ద పడతావుట్రా -- " అన్నాడు.
వాడు మాట్లాడలేదు. జయరాజు డొక్కలో ఒక్క పోటు పొడిచి -- "నువ్వెవరో చెప్పు- " అన్నాడు. వాడు కోదండరామయ్య మనిషినని ఈ అమ్మాయిని వ్యభిచారం లోకి దింపడం అయన ఉద్దేశ్యం మనీ చెప్పాడు. జయరాజు వాణ్ని మరో నాలుగు తన్నాడు.
ఈలోగా రాధ బట్టలు మార్చుకు వచ్చింది. అంత విపత్కరపరిస్తితుల్లో కూడా ఆమె దేవకన్యలాగుంది. అసలు జరిగినదంతా ఆమెకు తెలియడానికి కాసేపు పట్టింది.
