త్రినాధరావు విన్నా పెద్ద పట్టించుకోలేదు. అది నేరం చేసేవాళ్ళు చాలామంది చేస్తారు. పెద్ద విశేషమైన ట్రిక్కేమీ కాదు.
ఇద్దరూ కలిసి చివరకు ఒక ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన పదినిమిషాలక్కాబోలు-ఆ ఇంటిచుట్టూ పోలీసు బలగం ఉంది.
5
"నాపేరు సుందర్" అన్నాడు ఇన్ స్పెక్టర్ సుందర్.
అరుణ అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"ఊరిచివర హైవే పక్క తోటలో రెండు శవాలున్నాయి. అవి గుర్తుపట్టడంలో మీ సహకారం అవసరం....." అన్నాడు సుందర్.
అరుణ గుండెలు గుబగుబ లాడాయి-"నా సహకార మెందుకు!"
"హతుడు మీభర్త రమేష్ అని అనుమానంగా వుంది. ఇంతవరకూ లభించిన వివరాలు మా అనుమానాన్ని బలపరిచాయి. మీరు సహకరిస్తే....."
అరుణ కుప్పలా కూలిపోయింది. అంతవరకూ సుందర్ తన మాటలామెపై ఏ విధమైన ప్రభావం చూపిస్తాయో ఊహించలేక పోయాడు.
అరుణకు అవసరమైన ఫస్ట్ ఎయిడ్ చేశాక స్పృహ వచ్చింది. ఇంటిల్లిపాదీ బయల్దేరారు సుందర్ తో.
రమేష్ శవాన్ని చూడగానే కెవ్వున అరచి మళ్ళీ స్పృహతప్పి పడిపోయింది అరుణ. శచి, రామనాధం- హృదయవిదారకంగా ఏడ్వసాగారు. ఇన్ స్పెక్టర్ సుందర్ కి వాళ్ళను ఓదార్చే శక్తిలేకపోయింది.
"ఇద్దరూ ఒకరితో నొకరు తలపడ్డారనిపిస్తోంది. ఆ పోరాటంలో ఇద్దరూ చనిపోయారు అని అనుకోవలసివస్తోంది....." అన్నాడు సుందర్. అతని మాటలు అక్కడ ఎంతమంది విన్నారో తెలియలేదు.
* * *
సురేష్, త్రినాధరావు ఉత్సాహంగా ఇల్లు చేరారు. త్రినాధరావు చేతికి హెవీ బ్యాండేజ్ వుంది.
"మీ సహకారం మరచిపోలేనిది. నగరంలో ఎందరో ప్రముఖులు మీకుబాగా రుణపడి వున్నారు. ఒక ముఠా మీ కారణంగా పట్టుబడింది. ప్రాణాలకు తెగించి మీరు శత్రువుల కూటంలో ప్రవేశించారు. శత్రువులీ ప్రమాదాన్ని ఏ మాత్రమూ పసికట్టని కారణంగా చాలా సులభంగా లొంగిపోయారు" సురేష్ త్రినాధరావుని పొగడుతున్నాడు.
అతని ఉత్సాహంలో ఇంట్లో దిగాలుపడ్డ ముఖాలతో వున్న కుటుంబ సభ్యులభావాల నతను గమనించలేదు. జరిగినదంతా అందరికీ వివరించి చెప్పాడు. అది పూర్తయ్యేక అతను వారి ముఖభావాల్ని గమనించి కమగారుగా "ఏమయింది?" అనడిగాడు.
ఏమయిందో తెలిసేక అతను చప్పున నేలమీద కూలబడి పోయాడు. "అన్నయ్యా" అంటూ ఓ కేకపెట్టాడు.
"ఏ దుర్మార్గుడీ దారుణానికి తలపడ్డాడో తెలియదు......అన్నాడు రామనాధం.
సురేష్ తేరుకొని-"శత్రువుల కుట్రకు అన్నయ్య బలయిపోయాడు. వీరయ్యగారికి జరుగబోయే అన్యాయం అన్నయ్య గ్రహించాడని శత్రువులకు తెలిసిపోయింది. అందుకే వాణ్ణి అటకాయించి చంపేశారు. కానీ త్రినాధరావు కారణంగా అన్నయ్య తలపెట్టిన పని పూర్తయ్యింది. ఇతని మూలంగా అన్నయ్య ఆత్మకు శాంతి లభించిందనుకుంటాను....." అన్నాడు ఏడుస్తూనే.
త్రినాధరావు నెమ్మదిగా నేలమీద కూర్చొని-"నా మూలంగా మీ అన్నయ్య ఆత్మకు శాంతి లభించగలదని నేననుకోవడంలేదు...." అన్నాడు.
"ఏం?" అన్నాడు సురేష్.
"మీ అన్నయ్యని చంపిన దుర్మార్గుడిని నేనేకనుక...." అన్నాడు త్రినాధరావు.
అందరూ మ్రాన్పడిపోయారు.
"నేనొక దారిదోపిడీ మనిషిని టాక్సీ నడుపుకుంటూ వీలున్నప్పుడల్లా నా ప్రయాణికుల్నే చంపిపారేస్తూంటాను. మీ అన్నయ్య నాటాక్సీ ఎక్కగానే డబ్బున్నవాడని గ్రహించాను. ముందుగానే అనుకొని ఊరిపొలిమేరలోకి రాగానే టాక్సీ ఇంజను ట్రబులిచ్చినట్లు నటించి-అతన్ని టాక్సీ దిగేలా చేశాను. తరువాత హైవే పక్కకి తోటలోకి తీసుకుపోయి చంపేశాను.
చనిపోయే ముందు మీ అన్నయ్య-తన ప్రాణాలను గురించి బాధలేదని-కానీ తనవద్ద దేశ ద్రోహులకు సంబంధించిన వివరాలున్నాయనీ జరగబోయే ఒక నేరాన్నరికట్టడమే ప్రస్తుతానికి తన ఆశయమనీ-అది ఎలాగైనా నెరవేరేలా చూడమనీ కోరాడు.
అతని దగ్గర నాకు దొరికిన కాగితాలు తీసుకున్నాను. ఈలోగానే మా టాక్సీ ననుసరించి రఘురామయ్య మనిషి అక్కడకు వచ్చాడు. వాడ్నికూడా చంపేసి యిద్దర్నీ అక్కడే వదిలేశాను.
ఏ మూలనో నాలోవున్న మానవత్వం మీ అన్నయ్య ఆశయం నేరవేర్చమని పురికొల్పింది. అందుకే రంగం లోకి దిగాను. ప్రాణాలకు తెగించాను.
ఒకసారి గంగలో మునిగినవాడిని పాపాలంటవు. ఒకసారి మంచిపని చేసినవాడు మరి దొంగతనాలూ, దోపిడీలూ చేయలేడు.
వీరయ్యగారికి నేనుచేస్తున్న సహాయం మానసికంగా నాకెంతో తృప్తినిచ్చింది. ఆ తృప్తిముందు-యెంతడబ్బయినా ఆగదు. నేను చేసిన మంచిపనికి లభించిన ప్రశంసలు నన్ను కదిలించేస్తున్నాయి.
ఇంక నేను దానవుడిగా బ్రతకలేను. నేనూ అందరి మనుషుల్లాగానే బ్రతకాలనివుంది. అలాగని నా పాపాలు దాచుకోలేను. అవి మీముందే బయటపెడుతున్నాను. ఆలోచించి మీరే చెప్పండి నేనేం చేయాలో? మీరు నిర్ణయిస్తే ఉరిశిక్షనుకూడా ఆప్యాయంగా స్వీకరిస్తాను నేను."
ఒక మనిషిని చంపిన నేరానికి త్రినాధరావు కోర్టులో ముద్దాయిగా నిలబడి తీరాలి. కానీ ఎందరో మనుషులను రక్షించినందుకు ప్రతిఫలంగా అతని నేరం క్షమింప బడుతుందా?
మన చట్టంలో నేరానికి శిక్ష తప్పితే మంచితనానికి ప్రతిఫలమున్నట్లులేదు. నేరం ఒప్పుకోకుండా జరగబోయే దేశద్రోహాన్ని పట్టించుకోకుండా వుండి వుంటే త్రినాధ రావు మరికొంతకాలం దానవుడిగా బ్రతకగలిగి వుండేవాడు.
అక్కడున్న అందరూ ఆలోచిస్తున్నారు-మనిషిగా బ్రతకలనుకుంటున్న ఒక్క త్రినాధరావుతప్ప.
* * *
