ఈలోగా అక్కడికి ఒకతను వచ్చాడు. అతను ప్రతి డ్రమ్ములోంచి శాంపిల్స్ కలెక్టుచేసి అనాలిస్ కిస్తాడు. కరెంట్ పోయిందని తెలుసుగాబట్టి అతను టార్చిలైట్ తీసుకువచ్చాడు. అక్కడ గుమ్మందగ్గర వున్న వీరయ్యను సురేష్ చూసి అతను సెల్యూట్ చేశాడు. కరెంట్ ఫెయిలయినప్పుడు వీరయ్యనక్కడ చూడటం అతనికట్టే కొత్తగాదు. అతను మౌనంగా లోపలికెళ్ళిపోయాడు. అతను శాంపిల్స్ కలెక్టుచేసుకొని వెళ్ళాడు.
వీరయ్య తనుకూడా పద్నాలుగో నంబరు డ్రమ్ములో నుంచి శాంపిల్స్ కలెక్టుజేశాడు.
"ఇది మనం యూనివర్శిటీలో ఫార్మసీ ప్రొఫెసర్ గారికి పంపిద్దాం...." అన్నాడు వీరయ్య. ఆయన వీరయ్యకు బాగా పరిచయస్థుడు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి సైంటిస్టు దగ్గరకు వెళ్ళారు. వీరయ్య ఎప్పటిలాగే కాజువల్-"ఈరోజు శాంపిల్సు అన్నీ ఇంతవరకూ బాగానే వున్నాయా-" అనడిగాడు.
సైంటిస్టు నవ్వి-"అంతా మామూలే!" అన్నాడు.
వీరయ్య అక్కణ్ణించి బయల్దేరి యూనివర్శిటీఫార్మసీ డిపార్ట్ మెంట్ కు వెళ్ళి తనువచ్చినపని చెప్పాడు.
"అదెంతసేపు? అయిదునిముషాలు...." అన్నాడు ఫార్మసీ ప్రొఫెసర్ -"సాధారణంగా రిఫైన్డాయిల్ కి కొన్ని ఫీక్స్ ఉంటాయి. అవికాక ఎక్స్ ట్రా పీక్స్ ఏమైనావస్తే ఏదో కలిసిందని ఈజీగా గుర్తించవచ్చు. రిఫరెన్స్ బుక్ చూసి ఆ పీక్స్ దేనివల్ల వచ్చాయో గుర్తించవచ్చు."
ఆయన భాష వీరయ్యక్కాస్త అర్ధమైంది. యూనివర్సిటీలో చాలారకాల పరికరాలుంటాయి. అవి అనాలిసిస్ ఫలితాలను గ్రాప్సు రూపంలో ఇస్తాయి. ఆ గ్రాప్స్ తరంగాల పద్దతిలో ఉంటాయి. ఒకోరకం పదార్ధం ఒకోరకం గ్రాప్స్ ఇస్తాయి. వేలిముద్రలనుబట్టి మనిషినెలా గుర్తించవచ్చో-ఈ గ్రాప్స్ ను బట్టి పదార్ధాలనలా గుర్తించవచ్చు.
అక్కడి పరీక్ష అనంతరం వీరయ్యకు తెలిసినదేమి టంటే-తన ఆయిల్లో ఏదో కొత్త పదార్ధం కలిసిందని దాని వివరాలు మర్నాటికల్లా తెలియజేస్తానని ఫార్మసీ ప్రొఫెసర్ వాగ్ధానంచేశాడు.
4
"ఇద్దరూ ఒప్పుకున్నారు...." అన్నాడు త్రినాధరావు. "ఒప్పుకోక?" అన్నాడు వీరయ్య గర్వంగా.
వీరయ్య తన పనివారలనెంతో అభిమానంగా చూసుకుంటాడు. వారికన్నిరకాల సదుపాయాలనూ ఏర్పరచాడు. కానీ వారు తనకు ద్రోహం తపపెడితే మాత్రం ఆయన క్షమించడు.
తనకు ద్రోహం తలపెట్టిన పనివారలచేత ముందు నిజం ఒప్పించడంకోసమే అయన జగ్గయ్య అనే రౌడీని పోషిస్తున్నాడు. ఎలాంటిమనిషినైనా చావగొట్టగల ప్రతిభావంతుడు జగ్గయ్య.
ఆ సైంటిస్టు, విషం కలిసిన పనివాడు-ఇద్దరూ తోడు దొంగలని అర్ధంకాగానే వీరయ్య వాళ్ళమీద జగ్గయ్యని ప్రయోగించాడు. నిజాన్ని నోట్ చేసుకునేందుకు త్రినాధరావుని నియమించాడు. త్రినాధరావుచేప్పే విషయం లోనీ నిజానిజాలు తేల్చుకునేందుకు ఆ గదిలో రహస్యంగా టేపు రికార్డర్ కూడా ఏర్పాటు చేశాడు.
"మీ ఫ్యాక్టరీ మొత్తంమీద శత్రువులకు సంబంధించిన మనుషులు వాళ్ళేనట. డబ్బుకు గడ్డి తిన్నారుట. ఒకొక్కడికి యాభైవేలు ముడుతుందట. నూనె శాంపిల్ తీసుకుని వారిద్దరూ కలిసి-అజంతా హోటల్లో పదహారోగదికి ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు వెడితే డబ్బు ముడుతుందిట. ఇంతవరకూ ఇద్దరూ కూడా శత్రువులను చూడలేదుట. వ్యవహారమంతా టెలిఫోన్లద్వారానూ ఉత్తరాల ద్వారానూ నడిచిందిట...." అన్నాడు త్రినాధరావు.
"అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?" అన్నాడు వీరయ్య.
"సైంటిస్టు వేషంలో నే ఒక్కడినీ అజంతా హోటల్ కు వెడదామనుకుంటున్నాను....." అన్నాడు త్రినాధరావు.
"చాలా ప్రమాదం సుమా...." అన్నాడు వీరయ్య.
త్రినాధరావు నవ్వి ఊరుకున్నాడు.
* * *
త్రినాధరావు టాక్సీలో అజంతా హోటల్ ముందుదిగాడు. అతను పరిసరాలనుంచి ఏమీ పట్టించుకోకుండానే-చకచకా అడుగులు వేసుకుంటూ-రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళాడు. అతను చెప్పిన వివరాలు విని-"ఎస్-మీరు వెళ్ళవచ్చు...." అని చెప్పించి రిసెప్షనిస్ట్.
త్రినాధరావు పదహారో నంబరు గదిముందు నిలబడి తలుపు తట్టాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. అతను లోపలకు వెళ్ళి తలుపు గడియవేశాడు.
లోపల ఒక వృద్దుడున్నాడు. గెడ్డం, మీసాలు బాగా పెరిగి ఉన్నాయి.
"మీరు ఇద్దరనుకుంటాను. ఒక్కడివే వచ్చావేం?" అన్నాడు వృద్ధుడు.
"రెండోవాడికి వచ్చే ధైర్యం లేకపోయింది-
"ఎందుకని?"
"మీరు మమ్మల్నిద్దర్నీ చంపేస్తారేమోనని భయపడుతున్నాడతను. నాకా భయంలేదు కాబట్టి ఇద్దరిడబ్బు నేనే వసూలు చేసుకువెడదామని వచ్చాను....."
"ఒకవేళ ఇప్పుడు నిన్ను చంపేస్తే-అతను చేయగలిగినదేముంది?"
త్రినాధరావు నవ్వి-"ఏమీలేదు. మీరు మోసగాళ్ళని తెలుస్తుంది. ఇంతవరకూ మేము ఒక బ్యాచ్ లోనే విషం కలిపాము. అది చాలనుకుంటే మీరు నన్ను చంపేయ వచ్చు. నేను తిరిగిరాకపోతే నా మిత్రుడు-వీరయ్య గారికి క్షమార్పణ చెప్పుకుని అసలు సమాచారం అందజేయగలడు...." అన్నాడు.
వృద్దుడు నవ్వి-"చాలా తెలివైనవాడివే. ఈ తెలివి తేటలు తెగువ ఉన్నవాడివి ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు నేను పద-బయటకు వెడదాం...." అన్నాడు.
ఇద్దరూ బయటకు వచ్చారు. వృద్ధుడు గదికి తాళం వేస్తూ-" అన్నట్లు శాంపిల్ తీసుకొచ్చావా?" అన్నాడు.
"ఊ!" అన్నాడు త్రినాధరావు.
ఇద్దరూ హోటల్ ఆవరణలోంచి బయటకు వచ్చారు. వృద్ధుడు టాక్సీ పిలిచాడు.
ఇద్దరూ మొత్తం నాలుగు టాక్సీలు మారారు-"ఎప్పుడైనా ఎవరైనా మన ననుసరించినా మన మెక్కిన మొదటి టాక్సీనిబట్టి సమాచారం తెలుసుకోవాలనుకున్నా-ఇలా చేయడంవల్ల మనం దొరక్కుండా పోయే అవకాశం పెరుగుతుంది....." అన్నాడు వృద్ధుడు.
