"నా ప్రతిభగురించి చెప్పి భయపెట్టి పంపించేయాలని ప్రయత్నించాను....." అన్నాడు గణపతి...... "కానీ కుర్రాడు చాలా ధైర్యవంతుడు. యుద్దానికి సిద్దపడుతున్నాడు....."
కుసుమ కుతూహలంగా విఠల్ వంక చూసింది. గణపతితో పోలిస్తే అతను పలచగా వున్నాడు. ఇద్దర్నీ పక్కపక్కన చూస్తూంటే పెద్దన్న, చిన్నతమ్ముడు పద్దతిలో ఆన్తున్నారు. బట్టలువిప్పి నిలబడితే విఠల్ చాలా సన్నగా అగుపిస్తున్నాడు.
"సరే-అయితే విజిల్ వేస్తున్నాను...." అందామె.
ఇద్దరూ సిద్దంగా ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. కుసుమ విజిల్ వేసింది.
దొంగ యుద్ధం ఆరంభమైంది. ఒకరికొకరు హానికలగకుండా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాను. అలా ఓ పదినిముషాల యుద్ధం జరిగేక విఠల్ నేలమీద పడిపోయినట్లూ, అతనిమీద కూర్చుని గణపతి పీకపట్టుకున్నట్లూ అభినయించారు.
"కుసుమా! నువ్వుచెప్పు. వదిలేయనా?" అన్నాడు గణపతి.
"మీ ఇద్దరిలో ఒక్కరే మిగలాలని ఎప్పుడో చెప్పాను...." అంది కుసుమ.
"ఒక నిండుప్రాణాన్ని నిష్కారణంగా తీయమనడం నీకు ధర్మంకాదు. వదిలిపెట్టేస్తాను...." అన్నాడు గణపతి.
"వీల్లేదు. అతను నాకోసం ప్రాణాలను త్యజించడానికి సిద్దపడ్డాడు. నేను లేకపోతే బ్రతకలేనన్నాడు. చావ్వలసిందే...." అంది కుసుమ.
"ఇప్పుడు కూడా ఆ మాట అంటాడేమో కనుక్కోనా?" అన్నాడు గణపతి.
"నీకు నన్ను పెళ్ళి చేస్కోవాలనివుంటే అతనిపని పూర్తిచేసేయ్...." అంది కుసుమ.
నేలమీద పడుకునివున్న విఠల్ కీ మాటలతో బాగా ఆవేశం కలిగింది. అతను చటుక్కునలేచి గణపతి నొక తోపు తోశాడు. అంతవరకూ అంతా నాటకం కావడం మూలాన గణపతి చాలా ఈజీగా వున్నాడు. అతను వెంటనే వెనక్కి పడిపోయాడు.
గణపతి తేరుకునేలోగానే విఠల్ అతన్ని నాలుగు తోపులు తన్నాడు. గణపతి లేవడానికి ప్రయత్నిస్తూంటే ఆ ప్రయత్నం సాగకుండా చేస్తున్నాడు విఠల్.
విఠల్ నాటకమాడుతున్నాడో ప్లేటు మార్చాడో తెలియడంలేదు గణపతికి. అతని ఒళ్ళు హూనమై పోతోంది. అతను బాగా అలసిపోగా చూసి అతని వీపు మీద కూర్చున్నాడు విఠల్.
కుసుమ చప్పట్లు చరిచింది. యుద్ధం ఈ విధంగా మలుపుతిరగడం ఆమెకు చాలా సంతోషంగా వుంది. అంత వరకూ జరిగిన యుద్ధం ఆమెకు నిస్సారంగా అనిపించింది. ప్రస్తుతం ఆమెకళ్ళలో ఆసక్తి మినహా మరేభావమూ లేదు.
విఠల్, గణపతి మెడమీద చేతులువేసి నొక్కడానికి ప్రయత్నిస్తూ-"కుసుమా! చంపేయనా?" అని అరిచాడు.
"ఉఁ" అంది కుసుమ-చావుకి అర్ధం తెలియని పసిపాపలా.
అదే సమయానికి గణపతి కాళ్ళు విసిరి విఠల్ ని పడగొట్ట గలిగాడు. సుమారు పదినిముషాల సేపు వారిద్దరి మధ్యనూ దారుణయుద్ధం జరిగింది. ఇద్దరూ పరమశత్రువుల్లా కొట్టుకున్నారు.
ఈ పర్యాయం గణపతి విఠల్ ని జాలి తల్చలేదు. పచ్చడిక్రింద తన్నేడతన్ని. ఒళ్ళు హూనమై నేలకూలిన విఠల్ ని పీక పట్టుకుని స్వరం తగ్గించి-మెడవాల్చేయ్. వదిలేస్తాను...." అన్నాడు.
అంతవరకూ ప్రాణభీతి కనబడిన విఠల్ కళ్ళలో కాస్త మెరుపువచ్చింది. గణపతి ఇప్పుడతనికి దేవుడిలా కనిపించాడు. అతను మెడవాల్చేశాడు.
"చచ్చాడు....." అంటూ లేచాడు గణపతి. కుసుమ వుత్సాహంగాలేచి అతన్ని సమీపించి-"కంగ్రాట్యులేషన్స్ బావా!" అంది.
"విఠల్ చచ్చాడని నీకేం బాధగాలేదా?" అన్నాడు గణపతి బాధగా.
"పుట్టిన ప్రతివాడూ ఏదో రోజున చావాల్సిందే. ఇందులో బాధపడవలసినదేముంది? అందులోనూ అతను నేను లేకపోతే బ్రతకలేనని ఎలాగూ అన్నాడు....."
భయం భయంగా చూస్తున్నాడు గణపతి ఆమెవంక. ఇటువంటి ఆడదాన్ని తను భార్యగా భరించగలడా?
చిన్నతనం నుంచీ ఆమె అతనికి తెలుసు. ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. ఆమె ప్రతిచేష్టకూ అతను పరవశిస్తాడు. ఆమెకున్న ఈ భయంకరమైన కోరిక విన్నప్పుడు అతను సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈరోజు అతనికి నిజంగానే భయంగా వుంది. కుసుమను పెళ్ళాడబోయే ముందు మరోసారి ఆలోచించుకోవాలి-అని అతననుకున్నాడు.
