Previous Page Next Page 
శంఖారావం పేజి 24

 

    'అమ్మా-- నేను నిజం చెబుతున్నాను. ఉదయను తీసుకెళ్ళవద్దు " అన్నాడు వేదాంతం. అతడి కళ్ళలో అర్దింపుంది.
    "ఉండి పోవడానికి నాకభ్యంతరం లేదు. కానీ నువ్వు స్వామి దర్శనం చేసుకుని రావాలి --" అంది ఉదయ వేదాంతాన్నుద్దేశించి.
    తనతో ఏకాంతం కోసం వేదాంతం అలాగంటున్నాడన్న భావమేమో చూపుల్లో కనబడింది.
    వేదాంతం గొంతు సవరించుకుని ఏదో అనబోయే లోగా --" ఉదయ కూడా మనతో వస్తుంది. మీరిద్దరూ బ్రతకడానికి మించి దాని జబ్బు తగ్గడం పెద్ద విశేషం. అది స్వామి దర్శనం చేసుకుని తీరాలి. అసలు మనం వెడుతున్నది దాని కోసమే" అంది సితమ్మ.
    'అక్కడ ఉదయ కేమైనా అయితే ఆ తర్వాత విచారించి ఏమీ లాభం లేదు ....' అన్నాడు వేదాంతం.
    "ఎవరికీ ఏమీ కాదు. అది కూడా రుజువు చేస్తాను. అందుకే మన ప్రయాణం ' అంది సీతమ్మ.
    "నిన్ను సవాలు చేస్తున్నానని అనుకోకు. స్వామి దేవుడు కాడనీ తుంటరి అని నేను రుజువు చేయగలను -- ' అన్నాడు వేదాంతం.
    "వద్దురా -- ఇలాంటి కాని పనులకు నువ్వు తలపడోద్దు-" అంది సీతమ్మ కలవరపడుతూ.
    "లేదమ్మా! నేను రుజువు చేయగలను. ఆ శక్తి నాకుంది ...."
    "వద్దు --' అంది సీతమ్మ.
    "వద్దనకమ్మ!"
    "అంటాను ......" దృడంగా అంది సీతమ్మ.
    "నేనేమీ చేయను. ఎవరి జోలికి వెళ్ళను. కానిపని చేయను. కానీ నువ్వు నా వంటి మంచివాడి మాటలను కాక స్వామి మాటలు నమ్ముతున్నావు. ఈ తప్పు స్వామిని వెంటాడి వేటాడుతుంది ....' అన్నాడు వేదాంతం.
    "నువ్వు స్వామి గురించి ఇలా మాట్లాడ్డానికి వీల్లేదు..."
    "పోనీ రేపు స్వామి తనంత తాను తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. అప్పుడేనా నువ్వు నా మాటలు  నమ్ముతావా ?"
    "లేదా అమ్మతో వేళాకోళం వద్దు " అన్నాడు కులభూషణ్.
    "ఇది వేళాకోళం కాదు. సవాలు...."    
    "ఏమిటి నీ సవాలు ...."
    రేపు నా శక్తితో స్వామి నిజం చెప్పేలా చేస్తాను...."
    "ఎలా ?"
    నేనాయన్ను తాకను. ఆయనతో మాట్లాడను. మీతో పాటే నేనూ ఉంటాను. కానీ స్వామి నిజం చెబుతాడు...."
    "స్వామి ఎప్పుడూ నిజమే చెబుతాడు ...." అంది సీతమ్మ.
    "స్వామి చెప్పింది నిజమని నువ్వు నమ్మితే చాలు ...."
    'అమ్మా ఒప్పుకో ...." అన్నాడు కులభూషణ్.
    సీతమ్మ అయిష్టంగానే ఒప్పుకుంది.
    ఉదయ వేదాంతం వంక కుతూహలంగా చూసింది.
    కులభూషణ్ విశ్వనాద్ వంక చూశాడు.
    అతడు తీవ్రాలోచనలో ఉన్నాడు.
    "భూషణ్! నాకు నీ సాయం కావాలి " అన్నాడు వేదాంతం.
    "దేనికి ?"    
    "స్వామి బండారం బయట పెట్టడానికి !"
    "ఏమిటి స్వామి బండారం ?"
    'అక్కడ కొత్త కొత్త యువతులను పట్టి వివస్త్రలను చేసి అర్ధరాత్రి పూట కుక్కను తరిమినట్లు స్వామి కుటీరంలోకి తరుముతారు ...."
    'అంటే "
    వేదాంతం అతడికి వివరంగా చెప్పాడు.
    "నీకెలా తెలుసీ విషయం ?"
    'ఆ విషయం నన్నడగొద్దు ...."
    "వేదా నువ్వేదో భ్రమలో ఉన్నావు. ఆరోజు రాత్రి నువ్వు నన్ను కలుసుకుని అలౌకికానంద స్వామి ఆశ్రమానికి బయల్దేరావు. అక్కడేం జరిగిందో కాని, చనిపోయాడన్న విశ్వనాద్ నీ, ఉదయకు ప్రాణం పోసిన అమృతాన్నీ తెచ్చావు.....'
    'అదంతా నీ భ్రమ!"
    "నీ భ్రమను నిజమని నువ్వేదో రోజున ఒప్పుకుంటావు. నాకా నమ్మకముంది...." అన్నాడు కులభూషణ్.
    'అదంతా ఇప్పుడప్రస్తుతం . ఆలౌకికానందుడి ఆగడాలు బయట పెట్టడం ఇప్పుడు నా జీవితాశయం. అందుకు నీ సహకారం కావాలి..."
    "ఏ విధంగా ?"
    "నీకు చాలా మంది యువతులతో పరిచయం ఉంది. రేపోక్క రోజుకీ నాకో అందమైన యువతిని అప్పజెప్పాలి. ఆమె నేను చెప్పినట్లు వినాలి...."
    "చెప్పినట్లు వినడమంటే ?" అనుమానంగా అడిగాడు కులభూషణ్.
    "స్వామి నాకర్షించాలి ...."
    "ఎలా ?"
    "ఆ విధానం నాకు తెలుసు, నేను చూసుకుంటాను...."
    'ఆమెకు ప్రమాదముంటుందా?"
    "ఉండదు, నీకు ఏనుగుల లెక్క కధ తెలుసా ?"
    "ఏమిటది ?"
    "ఒకాయనకు పదిహేడునుగులుంటే వాటిలో సగం పెద్ద కొడుక్కి ఆరో వంతు రెండో కొడుక్కి, తొమ్మిదో వంతు మూడో కొడుక్కి రాసిచ్చి చచ్చిపోయాడు. లెక్క తేలక పంపకాలకి ముగ్గురన్నదమ్ములూ సతమతమవుతుంటే ఓ పెద్ద మనిషి తన ఏనుగును వాళ్ళ ఏనుగులకి కలిపాడు. ఏనుగుల మొత్తం పెద్దేనిమిది అనే లెక్క సులభంగా తేలిపోయింది. వాళ్ళ తండ్రి ఆ దేశం ప్రకారం ఏనుగుల్ని పంచగా పెద్ద మనిషి ఏనుగు పెద్ద మనిషికే మిగిలిపోయింది. నీ స్నేహితురాలు నాక్కావలసింది కూడా అదే విధంగా...."
    "వేదా ఏం జరిగిందిరా ? ఏం చేస్తావురా ?" అన్నాడు కులభూషణ్ ఆశ్చర్యంగానూ, కుతుహలంగానూ.
    "స్వామి బండారం బయట పెడతాను..."
    ఈ విషయమై ఎందుకు నీకింత పట్టుదల ?"
    "మన ఉదయను రక్షించుకునేందుకు !"
    కులభూషణ్ మాట్లాడలేదు.
    "నాకు సాయపడతావు కదూ!" అన్నాడు వేదాంతం.
    "ఊ అని" నాకూ నీ సాయం అవసరముంది" అన్నాడు కులభూషణ్.
    "ఏమిటి?"
    "గులాబీ నర్సింగ్ హోం లో ఉదయకు లాగానే మరో ఇద్దరు పేషెంట్లు రక్షించబడ్డారు. ఏడుకొండలు గారు నన్నిప్పుడు వదలడం లేదు. నువ్విచ్చిన ఆకుల్లో ఏ రసాయనాలున్నాయో పరీక్షిస్తున్నాను. కానీ నీకా మొక్క ఎక్కడ దొరికింది ఎలా దొరికింది బ్లడ్ క్యాన్సర్ కా ఆకులూ మందని నీకెలా తెలిసింది నువ్వు నాకు చెప్పాలి " అన్నాడు కులభూషణ్."
    "ప్రస్తుతానికి మొక్క మనింట్లోనే వుందిగా -- అవసరమైతే అన్ని వివరాలు తప్పక చెబుతాను" అన్నాడు వేదాంతం.
    మిత్రులిద్దరూ విడిపోయారు.
    తర్వాత వేదాంతం ఎదురింటికి బయల్దేరాడు. వెళ్ళేముందతడు విశ్వనాద్ తో మాట్లాడాలనుకున్నాడు. కాని అతడు ఉదయ మాట్లాడు కుంటున్నారు. వేదాంతం నిట్టూర్చి ఎదురింటికి వెళ్ళాడు.
    వాళ్ళింట్లో అతడు టెలిఫోన్ డైరక్టరీ నుంచి పుర ప్రముఖుల చిరునామాలు నోట్ చేసుకున్నాడు. అందులో మేయర్, ఎమ్మెల్యే, డియస్పీ లు కూడా ఉన్నారు. మొత్తం పన్నెండు చిరునామాలతడు నోట్ చేసుకున్నాడు.
    తర్వాత అతడొక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో ప్రవేశించాడు. ఓ నంబర్ తిప్పి డయల్ టోన్ రాగానే డబ్బులు వేసి "హలో! రేపు అలౌకికానంద స్వామి తన ఆశ్రమంలో గొప్ప సంచలనం కలిగించబోతున్నాడు. మీరు తప్పక ఆశ్రమానికి రండి " అని ఫోన్ పెట్టేశాడు.
    అక్కణ్ణించి మరో చోటకు వెళ్ళి మరో నంబరుకు ఫోన్ చేశాడు.
    అలా మొత్తం పన్నెండుగురు పుర ప్రముఖులకూ ఫోన్ చేశాడతడు. ఆఖరుసారిగా అతడు స్థానిక ప్రాంతీయ పత్రిక సంపాదకుడికి ఫోన్ చేసి ఈ వార్త మీ పత్రికలో వేయండి. ఇంత గొప్ప వార్తను ముందుగా ప్రచురించిన ఖ్యాతి మీకు దక్కుతుంది" అన్నాడు.
    ఆ సాయంత్రం స్థానిక పత్రిక మొదటి పేజీలో "అలౌకికాశ్రమం లో సంచలనం" అన్న వార్త ప్రచురితమైంది. ఇలాంటి వార్తలకు ఆ పత్రిక ప్రాముఖ్యత వస్తుందని వేదాంతానికి తెలుసు.
    కులభూషణ్ వేదాంతానికి జలజను పరిచయం చేశాడు.
    జలజ అతడితో " ఈ ప్రపంచంతో నాకు నిమిత్తం లేదు. నా జీవితం నాది. నా సుఖం నాది. ఎవడో స్వామి ప్రజల్ని మోసం చేస్తుంటే నాకేమీ బాధ లేదు. భూషణ్ కోసం ఇందుకొప్పుకుంటున్నాను. అయితే నానుంచి సాహస కృత్యాలాశించవద్దు." అందామె.
    "స్వామి దర్శనం తప్ప నీనుంచి నేనాశించేదేమీ లేదు.' అన్నాడు వేదాంతం. అతడికామే అందం తృప్తిని కలిగించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS