'చాలా టయిమ్ అయిపోయింది రాజు గారూ!' అంది నళిని.
'మీరు కూర్చోమన్నారనే నేను కూర్చున్నాను! నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను అడిగేవారుండరు!' అన్నాడు గవర్రాజు. ఆ మాటల్లో ఒక విధమైన నిరాసక్తత కనపడింది నళినికి.
'నాకు మటుకు ఎవరున్నారు రాజుగారూ?' అంది నళిని.
'మీ నాన్నగారు, బామ్మగారు, అత్తగారు కామేశ్వరమ్మ, వీళ్ళంతా మీ బాగోగుల గురించి తాపత్రయ పడుతారు! నాకూ ఇద్దరన్నతమ్ములున్నారు. వాళ్ళ సంసార తాపత్రయం వాళ్ళదే కాని, నా సంగతి వాళ్ళకి పట్టదు!' అన్నాడు నిరుత్సాహంగా.
'నా సంగతీ మా వాళ్ళకి పట్టదు రాజుగారూ! నేను ఏమయిపోయినా మా వాళ్ళకి అక్కర్లేదు!' అంది నళిని. నళినికి తన పెళ్ళి చూపులు జరగటం అదీ 'రాజు'తో చెప్పాలనిపించింది. మళ్ళీ ఎందుకనో వూరుకుంది. తన జీవిత రహస్యాలు గవర్రాజుతో చెప్పటం అంత బాగుండదు అనుకుంది.
'వస్తారా! మిమ్మల్ని డ్రాప్ చేస్తాను!' అన్నాడు గవర్రాజు.
'అల్లాగే! అంతకంటే గత్యంతర మేముంది ఇంక!' అంది నిర్వేదంగా.
'ఇంత చిన్న వయసులో మీరు అల్లా అధైర్య పడకూడదు నళినీ!' అన్నాడు. మౌనంగా కారు ఎక్కింది. ఆ చంద్ర కాంతిలో వయ్యారంగా, ఠీవిగా కారు ఎక్కుతూన్న నళినిని చూస్తే, గమ్మున సుభద్ర జ్ఞాపకం వచ్చింది. 'ఈ ఠీవి, రాజసం, సుభద్రకి ఎల్లా వస్తాయి?' అనుకొన్నాడు గవర్రాజు. కారు మెత్తగా హాయిగా, తీయని స్వప్నంలా బీచ్ రోడ్డు దాటింది! బీచ్ రోడ్డుమీంచి, మలుపు తిరిగే రోడ్డుమీదనే 'హోటల్ వినోదా వుంది! వినోదాలో మూడవ అంతస్థు గదుల లోంచి చూస్తే, వెన్నెల రోజుల్లోని ఉత్సాహ సముద్ర తరంగాల వెండిపూసలు ఎంతో ధగ ధగ మెరుస్తూ కనిపిస్తాయి. మూడవ అంతస్థులో వున్న గదుల్లో వున్న వాళ్ళు ఎలక్ట్రిక్ దీపాలు ఆర్పి వరండాల్లో ఈజీ చైర్లు వేసుకుని సముద్రతరంగాలను చూస్తూ అర్ధరాత్రి వరకూ కూర్చో నుంటారు!
'మీది హోటలు వినోదాయే కదూ!' అంది నళిని.
'వూఁ!' అన్నాడు గవర్రాజు.
'అప్ స్టయిర్స్ నుంచి చూస్తే సముద్రం ఎంతో అందంగా ఆహ్లాదంగా కన్పించుతుందట! నిజమేనా?'
'నిజమే! చూద్దామనుందా!' అన్నాడు గవర్రాజు. ఆ పిల్లలో యవ్వనపు ఉత్సుకత ఉప్పొంగింది!
'పదండి! చూద్దాం!' అన్నది.

ఎంబాసిడర్ '54780' వినోదా పార్కింగ్ ప్లేస్ లో ఆగగానే, మేనేజర్ గాభరాగా హోటలు వరాండా మెట్లమీదకు వచ్చి నించున్నాడు!
'యనీ రూమ్స్ ఇన్ అప్ సయిర్స్ త్రీ!' అన్నాడు గవర్రాజు!
'ప్చ్! లాభంలేదు సార్! టుడే ఈజ్ ఫుల్ మూన్ డే! ఈ రోజు మీరు మర్చినట్లు న్నారు!' అన్నాడు.
'అయితే పై డాబామీదకు పోదామా!' అన్నాడు గవర్రాజు.
'అక్కడ మరీ బాగుంటుంది!' అంది నళిని. నాలుగు అంతస్తులు దాటి పై డాబామీదకి వచ్చారు. ఇద్దరూనూ! విశాలమైన డాబామీద తామిద్దరూ! విశాలమైన పాలనురుగు లాంటి కాంతిని చిమ్ముతూ ఆకాశం నిండా చంద్రుడే గబ గబా నడుచుకొంటూ పోతున్నాడు! నిస్తబ్ధ ప్రకృతిలో ఒక వింత సౌందర్యం ప్రదీప్తమై పోతూ వుంది! సముద్ర్రుడు ఉవ్వెత్తుగా లేచిపడే తరంగాల ఘోషని భరించలేక హోరుహోరుమని పిలుస్తున్నాడు! గవర్రాజు డాబా 'పేరపెట్ వాల్' కానుకుని కాంతితో మెరిసిపోయే నళినిని చాలాసేపు చూసాడు! 'నళిని' తన్మయా వస్థలో సముద్రంకేసే చూస్తూ ఉండిపోయింది! గవర్రాజు ఆమె ప్రక్కకు వచ్చి నించుని-
'చాలా రాత్రయిపోయింది నళినీ! నిన్ను దిగబెట్తాను ఇంటివద్ద! రండి!' అన్నాడు! నళినికి బాగా మత్తుగా వుంది. గవర్రాజు అంటున్నదేమిటో ఆమెకి అర్ధంకాలేదు! అతనికేసి కలలో లేచిన దానిలా చూసింది!
'మొదటాట సినిమా వదిలిపెట్టేసారు! ఇంటికి పోదాం రండి!' అన్నాడు.
'నాకు ఇక్కడ్నే బాగుంది రాజూ!' అంది. ఆమె చూపుల్లోని కాంక్ష గవర్రాజుకి తెలిసింది. నెమ్మదిగా, సున్నితంగా, ఆమె నడుము చుట్టూ చేతులువేసి, మృదువుగా ఆమె చెంపల్ని తన పెదాలతో స్పృశించాడు! 'నళిని'కి శరీరం అంతా పులకించి పోయింది! గవర్రాజుని గాఢంగా, పెనవేసుకి పోయింది!
అలసి నిద్రపోయిన నళినిని, గవర్రాజు చూసాడు! అతనికి నవ్వు వచ్చింది!
'ఏమిటి ఆడపిల్లలు? ఇంత తేలిగ్గా లొంగిపోతారు? ఒకనాడు సుభద్రతో మాట వరుసకు అన్నాడు! 'నళిని'కి తనంటే ఇష్టమున్నదనీ, ఆమెని తను స్వీకరించలేననీ సుభద్ర ముందు గొప్పకి చెప్పుకున్నాడు అదే ఈ రోజు నిజమయింది! ఆడపిల్ల ముందు ప్రతీ ఆడపిల్లా తనంటే పడి చస్తుందని చెప్పటం ప్రతీమగాడికీ అలవాటే నేమో! ఇంత చదువు చదువుకొని, ఇంత ధన వంతుడి కూతురై వుండీకూడా క్షణికోద్రేకాలను వశంలో వుంచుకోలేని అల్పురాలయిపోయింది! ఈ నళిని! ఛీ! ఛీ! ఏం యువతులు? వీళ్ళు!' అనుకున్నాడు గవర్రాజు. ఆ తర్వాతకూడా చాలాసార్లు నళిని గవర్రాజుతో 'హోటల్ వినోదా'లో కాలక్షేపం చేయటానికి రావటం అలవాటు పడింది!
* * *
మంగళగిరి పానకాలస్వామికి మ్రొక్కుబడులు చెల్లించుకుని, కొండమెట్లు దిగి వస్తున్నారు కామేశ్వరీ, సీతమ్మనూ ఈ మధ్య సీతమ్మకు కామేశ్వరిమీద ప్రేమాభిమానాలు ఎక్కువయినాయి! 'నళిని' పరీక్ష ప్యాసయినది! ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు! ఇంక కామేశ్వరి కడుపు ఫలించి ఒక వారసుడు కలుగుతే తను బ్రతికినందుకు ఫలితం అనుకుంది సీతమ్మ! అంచేత ప్రతీ యాత్రా స్థలానికి, కామేశ్వారిని తీసుకొని వెళ్ళుతున్నది. పెద్ద తిరుపతి, కంచి, కాళహస్తి కనకదుర్గ గుడి చూసుకొని, మంగళగిరి వచ్చారు అత్తా కోడళ్ళిద్ధరూను. సీతమ్మ అటుకులు కూడా తెచ్చుకుంది. అర్ధశేరు పాలు కొనుక్కుని, అందులో అటుకులు నానవేసుకుని పంచదార కలుపుకొని తినే వాళ్ళు. పళ్ళుకూడా కొనుక్కునేవారు! అత్తాకోడళ్ళ తీర్ధయాత్రలకి పుష్కలంగా డబ్బు ఇచ్చేడు కేశవ! కామేశ్వరి, సీతమ్మకి తగ్గవిధంగా ఆచారం మడీ దడీ పాటించుతుంది. శుభ్రంగా ముఖం నిండా పసుపురాసుకొని స్నానం చేస్తూంది. నుదుట గుండ్రంగా కుంకుమ పెట్టుకుంటుంది. మెడమీంచి జారుగా వదులు తోన్న జుట్టుని ముడి పెట్టుకుంటుంది! మెట్లు దిగుతూన్న కామేశ్వరికి తనకి పరిచయం అయిన ముఖం కనపడేసరికి గతుక్కుమని నిలబడింది! సీతమ్మ ఇదేమీ గమనించకుండా చక చకా మెట్లు దిగి పోతూంది! కామేశ్వరి నిలబడటం చూసిన ఆ వ్యక్తి చటుక్కున చీర చెంగు నెత్తి మీదకు లాగుకొని అవనత వదనగా నిలచింది! చంకన ఆరు నెలల పసివాడు తెల్లగా బొద్దుగా వుండి 'వూఁ. వూఁ!' అంటూ తల్లి చంకన ఇమడక ఊగుతున్నాడు!
'భద్రీ!' అంది కామేశ్వరి.
సుభద్ర మాట్లాడలేక పోయింది! ఆ పిల్ల కళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కడ్తున్నాయి.
'భద్రీ! ఇల్లాంటి పని ఎందుకు చేసావ్!' అంది కామేశ్వరి అంటూ ఆమె దగ్గరికి వచ్చి చీర చెంగు ఆమె ముఖం మీంచి తీసింది. సుభద్ర ముఖంలో మునుపటి కళా కాంతులు లేవు! ఆ సౌందర్య దీప్తులు లేవు! పాలిపోయిన పెదవులు! కారుణ్యాన్ని కోల్పోయిన చెంపలు!
'అక్కా! నమ్మి మోసపోయాను! దాని ప్రతిఫలం వీడు! అక్రమమైనా కడుపుతీపి నన్ను వదలలేదు! అందుకని........'వెక్కి వెక్కి ఏడ్చింది భద్ర.
'నిన్ను మోసగించిం దెవరు భద్రా! ఏదో చిన్నతనం తెలీకచేసినా, తెలిసి చేసినా ఫలితం మటుకు నెత్తి కెక్కి కూర్చుంటుంది? అమ్మ వ్రాసిన జాబుచూసి నేను అచేతనురాలయిపోయేను! నిన్ను ఏమీ అనవద్దనీ మరిమరీ అమ్మతో చెప్పి పంపించేసాను? తీరా అమ్మ మంచి మనస్సుతో నిన్ను క్షమించాలనుకోవటం, నీవు ఆమె రాకముందే ఇల్లు వదలిపోయావట! ఎందుకు అంత తొందరపడ్డావు? అనవసరంగా ఇల్లు వదలి నీ జీవితం నరకం ఎందుకు చేసుకున్నావ్! నీ కొడుకు భవిష్యత్తు ఎందుకు అంధకారమయం చేసుకున్నావ్!' తీవ్రంగా అంది కామేశ్వరి!
'అమ్మ నన్ను క్షమించుతుందని ఊహించలేకపోయేను! ఎన్ని ఉత్తరాలు వ్రాసినా గవర్రాజు బాబు వ్రాయలేదు! నాలో పాపం పెరిగిపోతుందనీ భయమేసి ఇంటినించి పారిపోయేను!' ఏడుస్తూనే చెప్పసాగింది భద్ర.
'గవర్రాజు కెందుకు జాబులు వ్రాయటం?' ఆశ్చర్యపోతూ అడిగింది కామేశ్వరి!
'వీడి తండ్రి అతనే!' సుభద్ర సిగ్గు పడింది.
'ఆ వెధవ కింత పొగరు వుందా! వాడు ఇలాంటివాడని మాకు తెలీదు! ఇప్పుడు పెద్ద బిజినెస్ మాన్ అయిపొయ్యాడు! కార్లూ షికార్లూ బహు పెద్దమనిషి అయిపొయ్యాడు! వాడి వలలో పడిపోయేవా చెల్లీ! అయితే వాదివద్ధకు వచ్చి నీ భవిష్యత్తుని కనుక్కోలేక పిరికిదానివయి దీన జీవితం గడుపుతున్నావా!' కామేశ్వరి అంది.
'అక్కా! అవి అన్ని నోటితో చెప్పలేను! నేను మీ వూరు వచ్చాను! వాడిని కలుసు కొన్నాను! నాకు కలిగిన అవస్థ చెప్పాను! దానికి 'పెళ్ళి చేసుకుందామనుకున్నాను. నిజంగా నమ్మాను నిన్ను! కాని పెళ్ళి కాకుండానే నాకు లొంగిపోయేవు? ఇల్లా ఇదివరకు ఎంతమందికి లొంగిపోయేవో! నేను పెళ్ళి చేసుకుంటే 'సచ్చీలం' నిలుపుకున్న యువతినే కోరుకుంటాను! లేకపోతే ఇల్లానే వుండిపోతాను! నాలాంటి వాళ్ళ అవసరాలు తీర్చటానికి నీలాంటి వాళ్ళు చాలామంది వుంటారు!' అన్నాడు. ఎంత ప్రాధేయపడినా అతని రాతి మనసు కరుగలేదు! అది నా పూర్వజన్మ సుకృతం అనుకొన్నాను! బెజవాడ వచ్చేసాను అక్కడ కూలీనాలీ చేస్తూ కాలం గడిపాను. వీడు పుట్టాక ఈ వూరు వచ్చేను. ఇక్కడ పూజార్ల ఇళ్ళల్లో అంట్లూ చెంబులూ తోముకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అంటూ ఏడ్చింది సుభద్ర.
కామేశ్వరికి కళ్ళమ్మట నీళ్ళూరాయి.
'క్రిందికి పద! మేము సత్రంలో వుంటూ రాళ్ళూ న్నాము. ఆలోచించుకున్నాక మా వూరు వచ్చేద్ధువుగాని! అంటూ కామేశ్వరి సుభద్ర కళ్ళు తుడిచింది సుభద్ర ఏమీ అనకుండా అక్క వెంట మెట్లు దిగుతూ, అక్క ముఖంకేసి చూస్తూ ఆలోచించింది! ఒకనాడు అందరూ కామేశ్వరికంటే తనే అందమైన పిల్లని అందలమెక్కించేవారు! ఇప్పుడు చూస్తే కామేశ్వరే ప్రశాంతమైన గృహస్థ జీవితంతో శాంతమూర్తిగా కన్పడుతోంది! ఆమె పవిత్ర శీలమేఆమెకి వింత సోయగాన్ని తెచ్చింది! నేను నిజమైన గృహిణి నుదుట నున్నాను- అన్న గర్వంతో ఆ సౌభాగ్య కుంకుమరేఖ తళతళా మెరుస్తోంది! తన కేముంది? ఒక అవ్యక్తమైన అనుభవంతోతన జీవితానికి నూరేళ్ళూ నిండాయి! క్షణికానందంతో తన భాగ్య జీవితం భగ్గుమంది! తను గృహిణి ఎల్లా అవుతుంది? తన పిల్లడికి తను తల్లి అయ్యింది. ఇప్పుడు తెలిసీ తెలియని వయసులో వాడికి తాను ఆలంబనగా అంగీకరించక తప్పదు! కాని పెరిగి పెద్దయినాక ఈ సభ్య ప్రపంచంలో వ్యక్తిగా తాను వాడికి ఈయ గలిగిన స్థానం ఏమిటి! వ్యక్తిగా ఈ సంఘం వాడ్ని అంగీకరిస్తుందా! పతిత కన్నకొడుకుని ఎవరు గౌరవిస్తారు? గవర్రాజూ! కన్నెమనసుతో తీయని ప్రేమతో నా శరీరం నీ కర్పించాను! దానికి ప్రతిగా నీవు నా కిచ్చిన బహుమానం బ్రతుకంతా తీరని అవమానంతో కృంగిపోమనే అభిశాపం కాదూ! గవర్రాజూ నీకు నేనేమీ అపకారం చేసేను? అమ్మా! మా నాన్న ఎక్కడ? నాన్న ఎవరో చెప్పుకోలేని నన్ను నీవెందుకు ఈ లోకంలోకి తీసుక వొచ్చావు? అని నీ రక్తం పంచుకుపుట్టిన బిడ్డ నన్ను అడుగుతే ఏమి సమాధానం చెప్పను? ఈ ఆలోచనలతోనే అక్కతో సత్రము చేరింది సుభద్ర. వరండాలో వున్న ఒక స్తంభం నానుకొని కూర్చుంది. సుభద్ర పిల్లవాడిని ప్రక్కన పడుకోబెట్టుకుంది. కామేశ్వరి తన అత్తగారున్న గదిలోకి వెళ్ళింది.
'ఏమే అమ్మాయ్! వెనక్కు పడ్డావ్!' అంది సీతమ్మ.
'నడవలేకపోయేను అత్తా! రోడ్డంతా రాళ్ళూ రప్పలూ గతుకులుగా వుందీ వూరు!' అంది కామేశ్వరి.
