Previous Page Next Page 
కృష్ణవేణి పేజి 24

   
    "రఘూ! నేనొకమాట చెప్తాను వింటావా?"
    "ఏమిటది సరూ? ఆజ్ఞాపించేదానివే గానీ ఏనాడైనా ఇలా అడిగావా?"
    "అవును ఆ ధైర్యంతోనే వచ్చాను. కాని."
    "చెప్పు సరూ! నీమాట ఆజ్ఞగా అనుసరిస్తాను."
    సరూ కొంతసేపు మవునంగా వుండిపోయింది. -ఏ ఆడదీ కూడా భర్త అనురాగానికి దూరం కాకూడదు రఘూ! అటువంటి బ్రతుకుకంటే చావు మేలుకదూ? నేను నిన్ను జీవితాంతం సుఖపెట్టలేకపోయాను. నీ పరిస్థితికి జాలిపడి నీ శ్రేయస్సు కోరి వచ్చిన శాంత అలా ఎన్నాళ్ళు నేలనపడి నిద్రపోతుంది? నన్ను తప్ప మరో వ్యక్తిని కన్నెత్తి చూడనంటావు గానీ నాకోరిక మాత్రం అదికాదు. నువ్వు అన్నివిధాలా సుఖపడాలి. నువ్వు సంతోషంగా వున్ననాడే నాకు నిజమైన శాంతి. ఆ సంతోషంలో నన్ను మర్చిపోయినా బాధపడను. చూడు రఘూ! శాంత- ఎంత ధైర్యం చేసిందో ఆలోచించావా? నా భర్తని సుఖపెట్టటానికొచ్చిందనే అభిమానమేగాని నాచోటు ఆక్రమించుకొంటుందనే అసూయ లేదు నాకు. శాంత నాకు చెల్లే కదా? నామాట వింటావు కదూ రఘూ! ఏనాడూ నాకు ఎదురు చెప్పలేదు. శాంతగానీ నవ్వుగానీ బాధతో కాలం గడపకూడదు. మీరిద్దరూ కలిసి సంతోషంగా వుండాలని మనస్పూర్తిగా వాంచిస్తున్నాను. శాంతని చేరదీస్తావు కదూ? నామాట వింటావు కదూ!" అంటూ లేచివెళ్ళి ఆ తెరచాటు చిత్రంలో లీనమై పోయింది-"సరూ! సరూ!" అంటూనే ఉలిక్కిపడి లేచాను. నా దగ్గిర ఎవరూ లేరు. నువ్వు నేలమీద నిద్రపోతున్నావు. లేచి వెళ్ళి సరోజ పటం దగ్గిర కూర్చుని ఏడిచాను-"వచ్చి నట్టే వచ్చి వెళ్ళిపోతావా సరూ! మరి కాస్సేపు వుండాలని నీకు అనిపించలేదా? నీరఘునెలా మర్చిపోయావు? ఎంతచిత్రంగా మారిపోయావు సరూ! వూఁ" అంటూ వెళ్ళిపోయాను-ఉన్నట్టుండి సరోజ కోరిక గుర్తు వచ్చింది. నిన్ను దగ్గరకు తెచ్చుకోమంది. నిన్ను చూశాను. నిద్రపోతున్నావు. అప్పటికీ నిన్ను తెచ్చుకు సరోజ చోటులో పడుకోబెట్టటానికి నామనసు అంగీకరించలేదు. సరోజనే తల్చుకుంటూ కళ్ళు మూసుకున్నా. సరోజ తరుచు నాకు నిద్రలో కన్పిస్తూనే వుంటుంది. కాని ఇంత యధార్ధంగా ఏ నాడూ జరగలేదు. సరోజ రోజూ అలా దగ్గిర కూర్చుని వెళ్ళినా సంతోషంగా బ్రతుకు గడిపివెయ్యగలననుకున్నాను. ఎప్పుడో తెల్లవారుజామున మళ్ళా నిద్రపట్టింది. ఆమగతలోనే సరోజ మళ్ళా ప్రత్యక్షమైంది. కానీ ఈసారి నా దగ్గిరకు రాలేదు. తెర దగ్గిరే నుంచుంది. చాలా కోపంగా వుంది. నేను లేచి వెళ్ళి చేయిపట్టుకు న్నాను.
    "సరూ! నామీద కోపమా? ఏనాడైనా నామీద నీకు కోపంగా వచ్చిందా?" అంటూ దేవుళ్ళాడాను. సరోజ చాలా ఉదాసీనంగా వుంది. -'నువ్వు చాలా మారిపోయావు రఘూ! నే నేది చెప్పినా తహతహలాడుతూ చేసేవాడివి. కాని ఇప్పుడు సరోజఅంటే అలక్ష్యంలేదు నీకు. నామాట...."
    "సరూ! నన్ను మన్నించు సరూ! తప్పక నీమాట వింటాను, శాంతని స్వీకరిస్తాను. నామీద కోపం తెచ్చుకోకు సరూ!" అంటూ ప్రాధేయపడ్డాను - సరూ చిరునవ్వు నవ్వింది. నా దగ్గిరే కూర్చుని నన్ను నవ్వించింది. సరోజ ఒడిలో కన్నుమూశాను. ఎప్పుడు వెళ్ళిపోయిందో కనిపెట్టలేదు. లేచేసరికి నువ్వూ లేవు. తెలతెల వారుతోంది. లేవబుద్ధి గాక అలానే పడుకున్నాను. నిన్ను పిలిచి అంతా చెప్పాలనుకుంటూనే వుదయం నుంచీ ఇప్పటివరకూ గడిపాను-నిన్ను అన్యాయం చెయ్యవద్దని సరోజ చెప్పింది. సరోజ మాటకి ఏనాడూ ఎదురులేదు. మనిద్దరినీ సరోజ దీవిస్తుంది. శాంతా! చూశావా సరూ ఎంత మంచిదో!"    
    అంతా విని - "అవును. సరూ మంచిది దేవత." అన్నాను. ప్రేమమూర్తి సరోజ అందర్నీ ప్రేమించడమే గానీ ద్వేషించటం ఎరగదు. "ఒక్కసారి అమ్మని పిలిచుకురా శాంతా!"
    నేను క్రిందికెళ్ళి అత్తయ్యకి చూచాయగా అంతా చెప్పాను. ఆవిడ ఆనందానికి హద్దులు లేకపోయాయి.
    "చిన్నదానివైనా పెద్దల్లో కలిశావు గాబట్టి చేతులెత్తి మొక్కుతున్నాను తల్లీ! నీ ఇంటిని నువ్వే కాపాడుకున్నావు." అంటూ ఆవిడ సరోజ నుద్దేశించి నమస్కరించారు. ఇద్దరం పైకి వెళ్ళాము.
    "అమ్మా! సరూ రాత్రి కన్పించింది."
    "అంతా శాంత చెప్పింది రఘూ! ఇకనుంచి శాంతనే సరోజ అనుకుందాం. మీ రిద్ధరూ సంతోషంగా వుంటే చాలు."
    "నీ చేతులతోనే సరూనగలు శాంతకివ్వమ్మా! అత్తయ్య వెంటనే పెట్టె తీసి ఏమిటేమిటో బోలెడు వస్తువులు నాచేతిలో వుంచారు బీరువాతీసి చీరలు చూపించారు.
    "వస్తువులన్నీ పెట్టుకో వస్తాను." అంటూ పోయారు. ఆయనలేచి తెల్లటి జరీ చీరతీసి ఇస్తూ-"ఇదే సరోజకెంతో ఇష్టం. ఫోటోలో కట్టుకొంది. ఈచీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని సరోజలాగే కన్పించాలి నాకు. ఏదీ? మరి." అన్నారు.
    "ఇక్కడేనా?
    "ఆ ఇక్కడే సరోజ నాదగ్గిరే కట్టుకొనేది." చేసేదిలేక పుట్టెడు సిగ్గుతో అక్కడే జరీచీరలో ముస్తాబయాను. నగలన్నీ ఆయనే స్వయంగా అలంకరించారు. ఇద్దరం సరోజ ముందు చేతులు జోడించి నిలబడ్డాము. సరోజ చిరునవ్వులో నిండుతనం గోచరించింది.
    మనసులోనే మూగగా ఏదో ప్రార్దించారు. ఇది జరిగి మూడురోజులైంది. మేమిద్దరం సంతోషంగా వున్నాము. నాకు మిమ్మల్నందరినీ చూడాలని వుంది. త్వరలోనే ఇద్దరం కలిసివస్తాము. బావ గార్ని మీకు పరిచయం చేస్తాను.
            మీ ప్రియమైన శాంత!
    ఉత్తరం పూర్తిచేసి నామొహంలోకి చూసింది రేణు. "నేను" నమ్ముతాను. నీ సైన్స్ ఇక్కడేమీ పమిచెయ్యదు." అన్నాను. చెప్పింది శాంత కాబట్టి నేనూ నమ్ముతాను." అంది రేణు. ఈవిషయం రేణు అంగీకరించిందీ అంటే అది శాంతపట్ల దానికున్న నమ్మకం.
    శాంత గురించి వదినతో అమ్మతో చెప్పాను. అంతా అదె మాట్లాడుకొనేవాళ్ళం. పదిరోజుల్లో శాంతా రఘూ వచ్చారు. రేణూ నేనూ వెళ్ళాం శాంతని చూస్తూనే ఆశ్చర్యపడ్డాను. ఒంటి నిండా నగలతో అసలే అందమైన శాంత మరీ అందంగా కన్పించింది. నవ్వుతూ మాయిద్ధర్నీ గదిలోకి తీసికెళ్ళింది. రఘు వాలుకుర్చీలో కూర్చుని ఏదో చదువుకొంటున్నాడు.
    "రేణూ కృష్ణవేణీ అని చెప్పానే నా స్నేహితులు వీళ్ళే-బి.యస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈవిడ కృష్ణవేణీ! ఆవిడ రేణుక-" అంటూ పరిచయం చేసింది శాంత. నమస్తేల తదనంతరం ఇద్దరం చెరో కుర్చీలో కూర్చున్నాం. నాకు కొత్తవాళ్ళతో కలగజేసుకుని మాటలు పెంచడం అలవాటులేదు. రేణు ఏదో మాట్లాడటం మొదలుపెట్టింది రఘూతో. రఘూ కూడా చనువుగానే మాట్లాడాడు.
    "ఏమండీ కృష్ణవేణీ! మీరేం మాట్లాడటం లేదు" అన్నాడు.
    "నా ఒంతుకూడా రేణు చాలండీ" అన్నాను నవ్వి.
    "మా ఇద్దర్నీ విమర్శిస్తున్నారు. పోనీ శాంత ఎటువంటిదో చెప్పండి." అంది రేణు.
    "అది ఎదురుగా వుండగానే అడిగితే ఏంచెప్పేదండీ? ఐనా మీశాంత చాలా మంచిదిలెండి. అసలు మంచితనమంతా దాని స్వంతమే. నెత్తి మీద పెట్టుకు పూజించినా ......"
    "ఆ నన్నేం పూజించనూ వద్దు. వేధించనూ వద్దు. మాటిమాటికీ తోసిపారెయ్యకుండా కాస్త కట్టుకున్న దానిలా ఉండనిస్తే చాలు" శాంత కోపం అభినయిస్తూ.
    "చూశారూ? ఇంతమంచిది. పూజిస్తానంటే ఒద్దంటుంది." అన్నాడు రఘు. అంతా నవ్వు కున్నాం.
    శాంత తర్వాతకూడా చాల కబుర్లు చెప్పింది వాళ్ళ దాంపత్యం గురించి. రఘూలో మార్పు వచ్చింది కానీ .....
    "ఒక్కోసారి చాల కష్టమనిపిస్తుంది కృష్ణ వేణీ! ఎంతో సర్దాగా మాట్లాడుతూ మాట్లాడుతూ మూతి ముడుచుకుంటారు. నవ్వుతూ నవ్వుతూ కళ్ళనీళ్ళు పెట్టుకొంటారు. దగ్గిరకి తీసుకున్నట్లే తీసుకొని దూరంగా వెళ్ళిపోతారు. ఆయన అనేది ఒక్కటే-"సరూ! జ్ఞాపకం వస్తూంది శాంతా!" - నాకెంత నిరాశైపోతుందో చూడు. ఓసారి సినిమాకెళ్ళాం. చాల సర్దాగా మాట్లాడుతూనే వున్నారు. ఉన్నట్టుండి -"సరోజ కన్పిస్తూంది శాంతా! ఇలాగే నా గుండెలకి తల ఆన్చి సినిమా చూసేది." అంటూ దగ్గిరగా కూర్చున్న నన్ను తోసిపారేస్తే నేనే మవ్వాలి? ఇక సినిమా చూడలేనని ఆరోజున లేచి వచ్చేశారు.
    సరోజంటే నాకెంత గౌరవం వుందో-సరోజకి నేనెంత ఋణపడివున్నానో మీకు తెలుసు. ఐనా నన్ను మాటిమాటికీ వేధించమని చెప్పిందా సరోజ?-" సరోజ ఇలా చేసేది శాంతా! సరోజ అలా అనేది శాంతా!" ఇక నాస్మరణెప్పుడు?
    ఓసారి నిజంగా నాకు కోపం వచ్చింది-"సరోజ మీకు కొత్తగా గుర్తు వచ్చేదేముంది? ఇరవైనాల్గు గంటలూ మీ ధ్యాసే సరోజ.' అన్నాను.
    "ఐతే సరోజని మర్చిపొమ్మనా నువ్వనేది?"
    "అంత దుర్మార్గురాలిని కాదు-చూడండీ! సరోజంటే నాకసూయ కాదు. కానీ మీరంత నిర్దయగా ప్రవర్తిస్తూంటే ఎప్పటికప్పుడెలా కుమిలిపోతున్నానో మీకు తెలుసా? ఇలాగే ఏడిపించమని చెప్పిందా సరోజ మీకు?"
    ఎన్నోవిధాల ఆయనకి దగ్గిర కావాలని చూస్తాను కాని సరోజ భాగ్యంనాకెక్కడిది కృష్ణ వేణి? కాలం జరగాలి. క్రమంగా ఆయన ధోరణిలో మార్పు రావాలి. మన గురించి ఒక వ్యక్తి తపించిపోయి నప్పుడే మన బ్రతుకుకి సార్ధకత-అనుకొంటాను."
    శాంత పుట్టింట్లో వుండేది చాల తక్కువే. వచ్చినా పదిరోజులుండి వెళ్ళిపోయేది. ఏడాది నాటికి దాని దాంపత్యం చాలావరకు కుదుట పడింది. ఇప్పుడు తల్లి కాబోతోంది.
    "ఈ శుభవార్త ఆయనకి సంతోషం కల్గించటం లేదు."
    "సరోజ కూడా ఇదే ప్రమాదానికి గురై నాకు దూరమై పో బోయింది. నీకు కూడా ఏమి టిది శాంతా?" అంటారాయన ఆయనకేమిటో భయం-నేనే ధైర్యం చెప్తూంటాను ఆయనకి." అని రాసింది శాంత.
    శాంతకి పాపాయి పుడితే అందరికీ సంతోషమే కదా?

                            *    *    *

                   

    సీరియల్స్ లా మాధవ్ కి వుత్తరాలు రాయటమో-మాధవ్ వుత్తరాలు చదువుకోటమో లేకపోతే మతి పోయేది. ఎప్పుడూ ఎన్నో విషయాలు-ఎక్కడ చూసినా, ఎక్కడ చదివినా మాధవ్ కి చెప్పాలనిపించేది. శాంత కథ చదివిన మాధవ్-'ఈ రోజుల్లో నమ్మ శక్యంగాని విషయమే ఐనా నమ్ముతున్నాను. పవిత్రమైన దాంపత్య జీవితానికి చక్కని వుదాహరణే సరోజా రఘూల సంసారం. సరోజ ఎంత అదృష్టవంతురాలో అంత దురదృష్ట వంతురాలు కూడా-పోనీ రఘుజీవితం ఓ దరికి చేరటం సంతోషకరం-అందుకే కాబోలు కష్టసుఖాలు వెలుగు నీడలవంటి వంటారు. ఆమాటమీద ఎంతమాత్రం నమ్మకం వుండేదికాదు. కాని నా నమ్మకాల్లో-నా ఆలోచనలలో-నా బ్రతుకులోనే ఎన్నో మార్పులు రాబోతున్నాయి. నేనూ ఒక వ్యక్తిగా పదిమందిలో తిరగగలుగుతాను. అందరిలానే నన్నూ సంసార బాధ్యతలూ కష్టసుఖాలూ చుట్టుకొంటాయి.
    నావేణు నా ఇంట్లో అడుగుమోపిన పవిత్ర క్షణానే నాఆశాలత పుష్పించటం మొదలు పెడుతుంది. వేణూ! తొలిసారి నీకన్నులలోకి చూసిన దెంత శుభక్షణమో సుమా! నిన్ను ధ్యానించని ఘడియవుందా? ఆధ్యాసే నాకింత హాయి నిస్తుందే! ఇక నీ సన్నిదెంత శాంతి ప్రసాదిస్తుందో మరి, ఏనాడో నువ్వు వస్తానని-నాహృదయం లోనే కాకుండా నాగృహంలోకూడా అడుగు పెడతావని-నీ చల్లటి ఒడిలో పడుకో బెట్టుకుని బుజ్జగిస్తావనీ-నీ అనురాగాభిమానాలతో శాశ్వతమైన శాంతి సౌఖ్యాలు ప్రసాదిస్తావనీ-....కృష్ణా! నానుదుట కూడా అదృష్ట రేఖ గీచివుందని ఏనాడూ అనుమానించలేక పోయాను. నలుగుర్లో గర్వంగా తలెత్తుకు తిరగ గలిగిన హోదా-కడుపునిండా తిని ఇతరులకింత పెట్టగలిగిన సంపాదన, వుండి కూడా ఛీ! ఎందుకీ పాడు బ్రతుకు? అని నన్ను నేనే అసహ్యించుకున్న కాలం అనుభవించి నట్టేలేదు సుమా! ఏనాడూ దురాశలకి పోలేదు. ఒక్కటే-అదే పరిపూర్ణమైన హృదయ శాంతి కావాలని కోరుకున్నాను. నేను చిన్నతనంలోనైనా తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యలేదు. నాకూ అన్యాయం జరుగదు వేణూ!
    నీ చదువు పూర్తి అయ్యేవరకు-మరికొన్ని నెలలు ఇలాగే లేఖలతో-వూహలలో కాపురం చేద్దాం".
    మాధవ్ అన్నట్టుగా వూహలలోనే అనుభవాలు గడిచిపోతున్నట్టుండేవి. రోజులూ, వారాలూ దొర్లిపోతున్నాయి. వుత్తరాల దొంతర్లు పెరిగి పోతున్నాయి. ఇద్దరి మధ్యా దూరాలు తరిగి పోతున్నాయి. మాధవ్ కి చిత్ర చిత్రమైన సందేహాలు పుట్టుకొచ్చేవి. నా సమాధానాలు అంతకన్నా విచిత్రంగా వుంటాయంటాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS