Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 24


                                         34
    అలా రోజులు గడిచి పోతున్నాయి. అటు అరుణ చదువు సాగిస్తుంది. ఇటు రఘు వర్కర్ల లో ఒక్కడై, అందరి ప్రేమాను రాగాల్ని చూర గొంటూ, అటు పనివారికీ, ఇటు తలి దండ్రులకూ కూడా సంతోషాన్ని కలగాజేస్తున్నాడు.
    మనం అనుకుంటాం గానీ, మూడేళ్ళు ఎంత కాలంలో గడుస్తా యంటారు? బ్రతుకు బరువై, జీవన మనే కాడిమాను మెడ మీద వేసుకుని, బాధలు పడుతూ, బరువు గా జీవితమనే పాలాన్ని దున్ను తూన్న వారు కూడా రోజులు గడిచే కొద్ది 'అబ్బ, వారం గడిచింది. నెల దాటింది. ఉగాది వచ్చింది!' అనుకుంటారు. తమ ఆయుర్దాయం అంతమయ్యే నాటికి 'అరె! పెను భూతాల్లాటి ఆలలనే ఈ అఖాతమైన మహా సముద్రం లో నేను యానం చేశానా? అంతా నిన్నా, మొన్నా మొదలెట్టి నట్టుంది'-- అనుకుని, గతంలో ఎన్ని కష్టాల్ని, ఎన్ని నిష్టురాల్ని అనుభవించి ఉన్నా, అన్నింటిని తలుచుకుని కాస్త తృప్తి నే అనుభవించి రాబోయే రోజులను గురించి ఆలోచిస్తూ భయకంపితులై బాధ పడతారు.
    అరుణ బి.కాం డిగ్రీ పుచ్చుకుంది. రఘు ఇప్పుడు వెల్ ఫేర్ ఆఫీసర్ హోదాలో ఉన్నాడు. సేతుపతి గారి మీద వర్కర్లు చూసేది భయమయితే, రఘుపతి మీద ప్రేమానురాగాలు చూపేవారు. దానికి కారణం ఆ అబ్బాయి అంతటి సంపత్కుమారుడు కావడం కాదు! నిజంగా రఘులోని మంచితనమే దానికి కారణం.
    పి.యు.సి చదువుకునే రోజుల్లోనే రేసులకు వెళ్లి, పేకాట లాడి నానా అల్లరి చేసిన ఆ కుర్రవాడు మరి ఇప్పుడిలా అయ్యాడంటే దానికి కారణ మేమిటి? తండ్రిగా తన కర్తవ్యమేమిటో సేతుపతి గారికి సమగ్రంగా తెలిసి ఉండడం! ఎవరైనా సరే. సరి అయిన సమయంలో సక్రమమైన మార్గంలో పడ్డారంటే వారు చేడి'పోరు! అది అందరూ ఎరిగి ఉన్న విషయమే!
    ఇకపోతే రఘు వర్కర్ల హృదయం ల్లో అంతటి స్థానాన్ని ఎలా ఏర్పరచుకో గలిగాడూ? అన్నది కూడా మనం తెలుసుకోవాలి.  
    తాను కూలీగా పనిచేసే రోజుల్లోనే , రఘు తనతో పాటు పనిచేసే వారి కష్టసుఖాల్నీ......సాధక బాధకాల్నీ తెలుసు కోడానికి హృదయ పూర్వకంగా ప్రయత్నించాడు! వారి గుడిసెలకు వెళ్ళాడు. వారితో కలిసి ఆడాడు, పాడాడు. ఒక్కొక్క రోజు, అక్కడే ఎవరి ఇంటి లోనో ఆతిధ్యం స్వీకరించి అందరితో పాటు ఆ దోమల కాట్లు భరిస్తూ , వారి మధ్యనే పడుకునే వాడు.
    ఆ పేదవారి కష్టాల్ని అర్ధం చేసుకునే కొద్దీ , రఘు లో ఏదో ఒక నూతన చైతన్యం బయలు దేరింది. తమకోసం చెమట ఓడ్చి పని చేసేవారి బ్రతుకుల కన్నా , తమ ఇంట్లో ఉన్న డాంజుహన్, మేరియాన్నీ అన్న రెండు అల్సేషియన్ల బ్రతుకులే , చాలా గొప్ప గా ఉన్నట్టు అనిపించేడతనికి!
    రఘుపతి లోని మార్పు చూసి, సేతుపతి ఆందోళన పడేవాడు! అయినా అడుగడుక్కి కొడుకు విషయంలో అడ్డం పడడం మంచిది కాదని ఊరుకునే వాడు.
    రఘు వెల్ ఫేర్ ఆఫీసర్ అయ్యాడన్న వార్త వర్కర్ల కు తెలిసింది. అమాంతంగా రఘుని తమ భుజాల మీదికి ఎత్తుకుని, జయజయ ధ్వానాలు చేస్తూ తీసుకు వెళ్లి, రఘు కోసం ప్రత్యేకించి ఉంచిన ఆఫీసు రూం లోని అతని కుర్చీ మీద కూర్చో బెట్టారు, అందరూ కలిసి!
    ఇవన్నీ చూడడానికి, సేతుపతి గారిక తీరిక ఎక్కడ? ఆ నోటా ....ఈ నోటా విన్నాడు; ఆనందించారు!
    వెల్ ఫేర్ ఆఫీసర్  కాగానే , రఘు , వర్కర్స్ వెల్ ఫేర్ ఫండ్ స్థాపించాడు. తన జీతంలో సగాన్ని అందుకు కేటాయించాడు. ,మిగులిన ఉద్యోగుల్ని బ్రతిమాలాడు. అందరూ నెలనెలా అయిదో , పదో ఇస్తామన్నారు; ఇచ్చారు. ఇక వర్కర్లు మాత్రం తమ శక్తికి మించి కూడా ఇచ్చేవారేమో మరి! కానీ రఘు స్వయంగా ఒక రూల్ పాస్ చేశాడు , ఏ వర్కరూ , నెలనెలా యాభై పైసలకంటే ఎక్కువ చందా ఇవ్వరాదని!
    ఆలోచించే పురుషుడుండాలే కానీ....ఈ కూలీ, నాలీ చేసుకుని బ్రతుకే వారి కష్టాలకూ, ఇబ్బండులకూ , సమస్యలకూ కొరత ఏమిటి?
    వెల్ ఫేర్ ఫండు నించే, వర్కర్ల పిల్లల చదువులకు జీతాలిప్పించే వాడు రఘు. పుస్తకాలు కొనిపెట్టే వాడు. దుస్తులు కుట్టించే వాడు. వారి సంసారాల్లో ఎవరు జబ్బు పడ్డా, మెడికల్ ఎయిడ్ ఇప్పించే వాడు. ఇంకా చెయ్యవలసినవి ఎన్నో ఉన్నాయను కునేవాడు! ఎలా సాధించడం? అప్పుడప్పుడు అత్యవసరమైన వాటికే డబ్బు చాలేది కాదు. తండ్రి దగ్గిరికి వెళ్లి, మొర పెట్టుకునేవాడు!
    "ఇంట్లో మాట్లాడదాం మిస్టర్రఘూ!" అనేవాడా తండ్రి ఆఫీసులో.
    "యస్ సర్!' అంటూ , రెండడుగులు వెనక్కి వేసి, ఆ కొడుకు ఆ ఏర్ కండిషన్డ్ రూం నించి బైట పడేవాడు.
    ఇక ఇంటి వద్ద , రఘు , సేతుపతి , అయ్యం గారూ , సుబ్బారావూ, అప్పుడప్పుడూ అరుణా కలిసి, ఈ విషయాల్ని గురించి చేర్చించేవారు. సేతుపతి, ఒకప్పుడు అడగ్గానే ఇచ్చేవాడు. ఒక్కొక్కప్పుడు అన్ని విషయాల్లోకి చాలా లోతుగా వెళ్ళేవారు.

                               *    *    *    *
    ఆనాడూ అదే జరిగింది! తండ్రి కొడుకులు ఇద్దరే ఉన్నారు. ఓబులేసు కూతురి పెళ్ళికి ఒక వెయ్యి రూపాయలు దానమిప్పించడం రఘుపతి సమస్య.
    "ఆ....ఏమిటి బాబూ , నీ సమస్య?" అన్నారు సేతుపతి.
    "అన్నీ సమస్యలే నండీ . రోజులు రాను రానూ మరీ గడ్డు రోజులయి పోతున్నాయి. మన వర్కర్ల పరిస్థితి , వాటి తోనే దిగజారిపోతుంది."
    "మన వర్కర్సే ఏమిటి? ప్రపంచంలోని అందరి పరిస్థితి అలాగే ఉంది! ఈ ఇంటర్ నేషనల్ పాలిటిక్సు వల్ల నైతేనేమి.... ఎక్కడో ఒక చోట ఎల్లప్పుడూ జరుగుతున్న యుద్దాల వల్లా......ఘర్షణల వల్లా నయితే నేమి..... టాక్సేషన్ పాలసీల వల్ల నైతేనేమి ....కరువు కాటకాల వల్ల నైతేనేమి .....కష్టాలన్నవి , అందరికీ ఉంటూనే ఉన్నాయి. కానీ.... అందరినీ మనం ఉద్దరించ గలమా? మనకున్న సాధక బాధకాలూ, సమస్యలూ మనకు లేవా?"
    "వాటిని ఎదుర్కోడానికి మనకు కావలసినంత శక్తి ఉంది నాన్నగారూ! దినదిన గండంగా బ్రతికే మన వర్కర్స్ కి మీరు అన్నదాతలు. వారి కష్టసుఖాల్ని మీరు విచారించ కుంటే మరెవరు పట్టించు కుంటారు?"
    "నిజమే , నా చేతనయింది నేను చేస్తున్నాను బాబూ! నేనేం వారికీ తక్కువ సౌకర్యాలు ఇవ్వడం లేదు. బోనసుల రూపంలో ....యూనిఫారాల రూపంలో ..... ఇన్సూరెన్సుల రూపంలో ఎంత ఖర్చవు తూందటావు?"
    "వాళ్ళు సంపాదించి పెడుతున్నారు కాబట్టే, మనం ఖర్చు పెడుతూన్నాం నాన్నగారూ!"
    "ఆ మాట నాకు నచ్చలేదు రఘూ. వాళ్ళు సంపాదించడమేమిటి? మనకు పెట్టడ మేమిటి? అర్ధం లేదు! వాళ్ళు సంపాదిస్తున్నది వాళ్ళ జీతాల్ని! అంతే! వాళ్ళేదో మనల్ని ఉద్దరించేసేస్తూన్నరన్న వాదంలో అసలు పాయింటు లేదు! ఇవాళ నువ్వున్నావు, నాలుగు వందలు నీజీతం. అందులో సగాన్ని వర్కర్స్ వెల్ ఫేర్ ఫండు కు దానం చేస్తున్నావు! ఎలా చెయ్య గలుగుతున్నావు? నీకు బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి! ఈ ఇల్లు లేదనుకో! నీకు భార్య , పిల్లలు ఉన్నారనుకో; తలిదండ్రుల మీద నీ నాధారపడడం కాకుండా, ఆ తలి దండ్రులే నీ మీద ఆధారపడి ఉన్నారనుకో! అప్పుడూ ఈ మెర మెప్పుల కోసం పోయి, నీవీ దుబారాలన్న చెయ్య గలిగేవాడివా? నాకూ సమస్యలున్నాయి! ఇదంతా మన సొంతమా? మంచికో, చెడ్డకో ఎన్నో సంస్థల్లో నేను డైరెక్టర్ ని. దీనికి మేనేజింగ్ డైరెక్టర్ని . నేను ఎన్నిటికి....ఎంత మందికి జవాబు చెప్పాలంటావు?"
    "అంటే, మీ అందరికీ -- మీ కోసం పాటు పడేవాళ్ళను గురించిన బాధ్యత ఒక్కటీ లేదంటారా? సంపద అన్నదాన్ని, అవసర మున్నవారితో మనం పంచుకో గలిగిన వాడే, అందులోని ఆనందాన్ని మనం అనుభవించ గలం నాన్నగారూ! అది ణా వ్యక్తిగతమైన అభిప్రాయ మనుకోండి...."
    "నీ వ్యక్తిగతమయిన దృక్పధం కాదది! ఈమధ్య నీవు కలగ జేసుకుంటూన్న రాజకీయాల దృక్పధం అది!"
    "అయితే ఈ బూదానమూ....సంపత్తి దానమూ ఇటువంటి వన్నీ ఏమిటంటారు? ఆ మాటకి వస్తే రాధాకృష్ణ న్ లాటి మహా మేధావి కూడా ఆ మాటే అంటున్నారిప్పుడు! రాజకీయాలకూ మనమిప్పుడు చర్చించే సమస్యకూ ఏమీ సంబంధం లేదు నాన్నగారూ! నేను మిమ్మల్ని అడిగేది వెయ్యి రూపాయలు! ఆ వెయ్యి రూపాయలుంటే గానీ, ఓబులేసు కూతురు పెళ్లి కాదు."
    "దాని వల్ల నాకు కలగ బోయే నష్టం ఏమీ లేదు, రఘూ! ఇక్కడ నేనొక వ్యాపారం నడుపు తున్నానంటే, వర్కర్ల కూతుళ్ళ కు పెళ్ళిళ్ళు చేయించడానికి కాదు! దేనికయినా ఒక హద్దు ఉంది! ఆ హద్దు నీ పిచ్చికి ఉంది! వెయ్యి రూపాయలు నేనివ్వలేక కాదు, ఇవ్వగలను. కానీ, ఇవ్వను! ఇచ్చాననుకో , దాన్ని ఆధారంగా తీసుకుని మిగిలిన అందరూ అడుగుతారు! ఇప్పుడు నీవు పని చేసే సంస్థలో మామూలు వర్కర్సే ఆరువందల మంది ఉన్నారు. లెక్క వెయ్యి. ఒక్కొక్కడి కొంప లో సగటున ఇద్దరాడపిల్లలున్నారనుకో! అందరి పెళ్ళిళ్ళ కూ నీవు అన్ని వేలూ ఇస్తూ పోగలవా? అయాం సారీ , నేనొక్క నయా పైసా ఇవ్వను!"
    "థాంక్ యూ సర్!" అంటూ రఘు పోబోయాడు.
    "రఘూ, ఒక్క విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకో. మంచి అయినా మనం వీర శైవం తో శివమెత్తిన వాళ్ళలా చెయ్యలేం!"
    "రైట్ సర్!" అంటూ రఘు వెళ్ళిపోయాడు,.
    ఎక్కడికి వేడతాడూ , పాపం , సరాసరి అరుణ గది చేరుకున్నాడు. సెలవులు కాబట్టి అరుణ తన సెక్రటరీ ఉద్యోగ ధర్మం ప్రకారం సేతుపతి గారికి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫైల్సు ను ముందు వేసుకుని, వాటిలోని విషయాల్లో మునిగి తేలుతుంది. రఘు కాస్త విసుగుగానే రావడం వల్ల అరుణ అతని వైపు తన చూపుల్ని మరల్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS