Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 24


                                 15
    నాగపూర్ కలక్టరేట్ ముందు రవిచంద్ర కారు ఆగింది.
    ఒక బంట్రోతు వచ్చి కారు డోర్ తీశాడు. నెమ్మదిగా రవిచంద్ర దిగాడు.
    ఆఫీసు మెట్లు ఎక్కుతుంటే అతనికి ఎవరో తెలియని వ్యక్తులు కూడా నమస్కారాలు చేయసాగారు.
    అతనికి తెలియకుండానే అతనిలో దర్పం వచ్చింది. హుందాగా తలాడిస్తూ అతని గది దగ్గిరికి వచ్చాడు. "రవిచంద్ర ఐ.ఎ.యస్ . " అనే బోర్డు అతని కంటే ఎక్కువ దర్పంతో గదికి ఒక పక్కగా కొట్టవచ్చినట్లు వేలాడుతున్నది.
    అప్పటి దాకా పెద్దగా మాట్లాడుకుంటున్న క్లర్కు లు, చప్రాసీ లు కూడా అతని రాకను చూసి గప్ చిప్ అయ్యారు.
    నెమ్మదిగా స్ప్రింగ్ డోర్ ను ఇంకో బంట్రోతు తెరిచి వినయంగా తల వంచుకొని నిల్చున్నాడు.
    రవిచంద్ర లోనికి ప్రవేశించి తన మెత్తటి సీట్లో కూర్చున్నాడు. అప్పటిదాకా స్తబ్ధత పేరుకున్న ఆఫీసులో ఒక్కసారి జాగృతి విద్యుత్తులా ప్రవహించింది.
    అప్పటికే రవిచంద్ర చాలా స్ట్రిక్టు ఆఫీసరని, క్రమబద్దమైన వ్యక్తీ అని పేరు తెచ్చుకున్నాడు. అతనిలో ఈ పాత పద్దతులంటే అసహనం, ప్రతి ఫైలు త్వరగా కదలాలనే పట్టుదల ఎక్కువయ్యాయి. వయస్సు మించిన హెడ్ క్లర్క్స్, వారి కింది వారు అతనితో సమానంగా ఆఫీసు విషయాల్లో అడుగు వేయలేకపోతున్నారు. ఆలస్యం చేసే ఏ పని అన్నా నిర్లక్ష్యంగా చేసే ఏ క్లర్కన్నా అంతు తెల్చుకుంటూన్నాడు. రాజకీయ వాదుల సిఫారుసులు, వ్యాపారస్థుల బహుమానాలు అతని దగ్గర పనిచేయటం లేదు. పనికి రాని కాగితాలతో బాటు అవి కూడా చెత్త బుట్టలోకి వెళుతున్నాయి.
    "పని మొదట, విశ్రాంతి తరవాత" అనే సూత్రం అతను ప్రవేశ పెట్టాడు. జాగ్రత్తగా పని చేసేవారు అతని అభిమాన పాత్రులవుతున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నవారు అతణ్ణి చూసి పెదవి విరుచుకొని "ఇంకా కొత్త గదూ , గురుడికి. తరవాత తెలియ వస్తుంది" అని అనుకుంటున్నారు.
    అతనిలోని చైతన్యానికి, క్రమబద్దత కు కలెక్టర్ ధర్మరాజ్ ముగ్ధుడయి అతనంటే అభిమానాన్ని పెంచుకో సాగాడు. కొన్ని అధికారం మెలుకువలు చెప్పడం లోను, కొంచెం సూక్ష్మ బుద్దిని ఉపయోగించి పరిష్కరించే సమస్యల్లోను అతను సహాయపడడమే కాకుండా , అనుభవం కోసం చాలా ఎక్కువ బాధ్యతలు రవిచంద్ర కు అప్ప జెప్ప సాగాడు.
    రవిచంద్ర జీవితంలో ఇదో కొత్త అధ్యాయం. అతనికి ఇదో కొత్త ప్రపంచం. బయటి ప్రపంచాన్ని కావాలనే మరిచిపోవడం మొదలు పెట్టాడు. అతనికి ఆఫీసే స్వర్గంగా, కలక్టరేట్ నందనవనంగా మారిపోయాయి.
    ఏదో ఫైలు చూస్తుంటే పక్కనున్న ఫోను మోగింది.
    "హలో, రవిచంద్ర స్పీకింగ్" అన్నాడు విసుగ్గా ఎత్తి.
    "నేను రాజగోపాలాన్ని" అవతలి గొంతు.
    అతని విసుగు మటుమాయమైంది. "నమస్తే. ఏమిటీ సంగతులు?"
    "మమ్మల్ని పూర్తిగా మరిచిపోయినట్లున్నారే?"
    "క్షమించాలి . అదేం లేదు. నిన్న వద్దామనుకొని బయలుదేరే సమయానికి కలెక్టరు గారు పిలిచారు. ఏదో పని తగిలింది."
    "ఫరవాలేదు. నిన్న మేమే మీ క్వార్టర్సు కు వచ్చాం. సురేంద్ర కూడా లేడు,"
    'అరెరే.......వాడు ఏదో నాటకాని కని వార్ధా వెళ్ళాడు. మీకు చెప్పలేదా? పాపం , నిన్న వచ్చారా?....... సారీ సర్, అనవసరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను."
    "నో....నో.....అలాంటి దేం లేదు. మరి ఇవ్వాళ కలుస్తారా? మీరు మా ఇంటికి వచ్చి నెలరోజులయిందని ప్రియ కంప్లయింట్ చేస్తున్నది."
    "నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారా మీ కంప్లయింట్ పెట్టుకొని?"
    ఫోను దగ్గిరే ఉంది కాబోలు ప్రియ గొంతు కూడా వినిపించింది.
    రవి మనసారా నవ్వుతూ, "నాకన్నీ వినబడుతూనే ఉన్నాయి లెండి. ఎవరు చేసినా కంప్లయింట్ కంప్లయింటే . తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను. సురేంద్ర వార్ధా నుంచి తిరిగి వస్తే వాణ్ణి కూడా తీసుకొని వస్తాను" అన్నాడు.
    "ఓ.కే." ఫోను పెట్టేసిన ధ్వని వినిపించి నెమ్మదిగా ఫోను పెట్టేసి ఫైలు లో తల దూర్చాడు.
    "బ్రోతల్ యాక్టు కింద బుక్ చేసిన కేసు హియరింగ్ మధ్యాహ్నం ఉంది. రెండు గంటలకు పెట్టమంటారా?' పర్సనల్ క్లర్కు ఫిలిప్స్ ఇంగ్లీషు లో అడిగాడు.
    "అలాగే" అని, "ఏదీ , 144 వ సెక్షన్ కేసులో రికార్డు చేసిన సాక్ష్యాల ఫైలు ఇలా తెచ్చి ఇవ్వండి" అన్నాడు.
    'అలాగే సార్ " అని ఫైలు తెచ్చి ముందుంచాడు ఫిలిప్స్.

                         *    *    *    *
    మధ్యాహ్నం రెండు గంట లయింది.
    రవిచంద్ర తల వంచుకొని తన స్థానంలో కూర్చున్నాడు.
    పర్సనల్ క్లర్కు ఫిలిప్స్ కేసుకు సంబంధించిన కాగితాలన్నీ శ్రద్దగా ముందుంచాడు.
    డోర్ తెరుచుకొని కానిస్టేబుల్ ఎవరో స్త్రీతో లోనికి ప్రవేశించి సవినయంగా రవిచంద్ర కు సాల్యూట్ చేశాడు.
    "మీ పేరు." పర్సనల్ క్లర్కు అడిగాడు.
    "షేక్ హుస్సేను."
    "ఏం ఉద్యోగం?"
    "సదర్ స్ట్రీట్ హెడ్ కానిస్టేబుల్."
    "ఈ కేసు ఎప్పడు నమోదు కాబడింది?"
    షేక్ హుస్సేను జవాబు చెప్పాడు.
    "నీ పేరు?" పర్సనల్ క్లర్కు ఆ స్త్రీని అడిగాడు.
    "సురేఖా దేశ్ పాండే."
    వేయి తుపాకులు రవిచంద్ర గుండెల మీద ఒకేసారి పేల్చినట్లయింది! విస్మయంతో తల ఎత్తి చూశాడు.
    తెల్లటి ముసుగులో ఆమె. పరీక్షగా తనను చూస్తున్న కళ్ళు! బెదిరిన ఆమె కళ్ళు! చెదిరిన ఆమె కళ్ళు! సిగ్గుతో రెప్పలు వాల్చుకున్న ఆమె కళ్ళు! ఆమె సురేఖ! తన వెంబడే సినిమాలకు, షికార్ల కు తిరిగిన సురేఖ! తనకు జ్వరం వస్తే పది రోజులు పక్కనే కూర్చుని శుశ్రూష చేసిన సురేఖ! 'మాస్టారూ , గురువు గారూ" అంటూ తన్ను హాస్యం పట్టించిన సురేఖ! వ్యభిచారి నేరం కింద పట్టుబడింది. తను న్యాయం సక్రమంగా చెప్పడం కోసం పట్టుబడింది!
    తల గిర్రున తిరగసాగింది. చెమటలు విపరీతంగా పోయసాగాయి. గుండెను రెండుగా ఎవరో విభజించి కారంలో అద్దుతున్నట్లు గా బాధ! హృదయంలో కమ్ముకు వచ్చిన వణుకు! వణుకుతున్న కలం! తిరుగుతున్న ఫాను! చెదురుతున్న మనసు!
    గుండెలు బిగపట్టుకొని, "నీవు నెల రోజుల కిందట సదరు లోని మారు మూల గొంది లోని నీ గృహం లో వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నట్లుగా పోలీసు వారు నీమీద అభియోగం తెచ్చారు. నీవేమైనా చెప్పుకోవలిసి ఉందా?అది నిజమేనా?' రవిచంద్ర అడిగాడు. హృదయం అక్రోశిస్తున్నప్పటికి అధికారం తెచ్చిన దర్పం గొంతును వణకనీయలేదు. ఖంగున అడిగాడు.
    ఫిలిప్స్ ఆశ్చర్యంగా తన అధికారిని చూశాడు.
    ఆమె మాట్లాడలేదు. తల ఎత్తలేదు....కానీ రెండు కన్నీటి బొట్లు సూటిగా వచ్చి భూమి లో ఇంకి పోయాయి. ఆ ప్రదేశం అపవిత్రమై పోయినట్లుగా తడిసి పోయింది.
    "నీ తరపున నీవు నేరం చేయనట్లుగా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?' ఆమె మాట్లాడలేదు.
    "నీ తరపున వాదించటానికి వకీలు ఉన్నాడా?"
    "లేడు'" అన్నట్లుగా ఆమె తల ఊపింది.
    "నీవు ఏమైనా చెప్పు కోవలసి ఉందా?"
    ".............."
    "పోలీసులు తెచ్చిన అభియోగాన్ని ఒప్పుకుంటున్నావా?"
    ఆమె తల అటూ ఇటూ ఊగి భూమిలో కుంగి పోతున్నట్లుగా కిందికి వంగింది.
    పది నిమిషాల్లో జడ్జిమెంటు వ్రాసి పైకి చదివాడు.
    "పోలీసు వారు సురేఖా దేశ్ పాండే పై తెచ్చిన అభియోగం నాముందు ఈరోజు విచారించ బడింది. ఆ అభియోగాన్ని దోషి స్వయంగా ఒప్పుకుంది. ఇకముందు తిరిగి ఈ నేరం పైన పేర్కొనబడిన దోషి చేసినట్లయితే చాలా తీవ్రమైన శిక్ష వేయబడుతుందని మందలిస్తూ మొదటి తప్పుగా భావించి యాభై రూపాయల జరిమానాతో వదిలి వేస్తున్నాను.    
    ఇది నా సీలుతో నేను స్వయంగా వ్రాసిన జడ్జిమెంటు."

                            *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS