జానకి నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. ఇంట్లో అందరూ స్నానాలు వగైరా పనులన్నీ అప్పటికే పూర్తీ చేసేరు. జానకి దంతధావన చేసి వచ్చేసరికి , కనకం కంచు గ్లాసుతో కాఫీ తెచ్చింది.
"మీరంతా తాగేరా, వదినా?" అన్నది జానకి.
"ఆ. చాలాసేపటి కిందనే మావి అయిపోయాయి. నీకోసం అలా పొయ్యి పక్కన పెట్టి ఉంచాను, వేడిగా ఉంటుందని."
"కలిపి ఉంచిన కాఫీ నేను తీసుకోలేననా, చేతి కందిస్తున్నావు?"
"ఎంతైనా నా ఆడపడుచువి కదమ్మా?"
"ఎప్పుడో నాడు అత్తవారింటి నుంచి వచ్చి, చూసి పోయే ఆడపడు చైతే ఆ మర్యాదలన్నీ చేసినా బాగుంటుంది కాని, నాలా సంతరం ఇంట్లో ఉండేవారి కెందుకమ్మా ఈ మన్ననలు, మర్యాదలు? అది సరే కాని వదినా, ఈరోజు నన్ను త్వరగా లేపమన్నానా? ఇదేనా లేపడం? నిన్ను నమ్ముకొంటే...."
"అన్ని పనులు అయినట్లే అంటావు. ఇంతకీ అంత త్వరగా లేచి ఏం చేస్తావేం? నాతొ పాటు నీళ్ళు సెరుగుతానంటావు. అందుకేనా లేపమన్నది? నాకు తెలుసు నీ పని ఏమిటో . అందుకే లేపలేదు. చూడు, జానకీ! కొవ్వొత్తి రెండు వైపులా నుండి కాలుస్తే ఎంత కాలం కాలుతుందంటావు? పగలల్లా పిల్లలతో అక్కడ పడిపాట్లు పడి, రానూ పోనూ ఈ కోసుదూరం నడవడంతో ఎలాగై పోయేవో ఎప్పుడైనా సరిగా అద్దంలో చూసుకోన్నావా? పైగా ఇంట్లో చాకిరి కూడా చేస్తానంటావా? ఇంక నేనున్న దెందుకనుకున్నావు?"
"నువ్వున్నది మా అందరికీ చాకిరీ చేసింది కెనా, వదినా? దాని కోసమేనా నువ్వీ ఇంట్లో అడుగు పెట్టేవు?" అన్నది జానకి.
అల్ప సంతోషి అయిన కనకం, ఇంట్లో తనకే కోరతా లేదని సంతృప్తి గా బతుకుతున్నా, తోటి వాళ్ళతో పోల్చి చూసి, తన వదిన గారికి ఏ సరదా తీరలేదని బాధ పడుతుంది జానకి.
"వదినా మరదళ్ళు ఒకర్నొకరు మెచ్చుకొంటూ ఓదార్చుకుంటూ అలా కూర్చోండి. మరీ రోజు ఎవరికీ తిండక్కర్లేదు. ఇంకో గంటకల్లా పీటేసుకొని మగరాయుళ్ళలా కూర్చుంటారు ఒక్కొక్కరూ." సుందరమ్మ వంట ఇంట్లోంచి కేకేవేసింది.
"ఈ పూట నే భోజనం చేయబోవడం లేదమ్మా! నీ వంటకి తొందర లేదు. అన్నయ్య ఆఫీసు వేళకి తయారవుతే చాలు."
"ఏం, ఏం వచ్చింది?"
"బాలవిహార్ లో ఉద్యోగస్తులకి ఇల్లు కట్టేరని చెప్పెను కదూ/ అక్కడ ఈరోజు గృహప్రవేశం. మా అందరి భోజనాలూ ఈరోజు అక్కడే వచ్చేసరికి కాస్త పొద్దు పోవచ్చు. మరేం కంగారు పడకండి."
"అయితే అక్కా, ఉండాలనుకొంటె నీక్కూడా అక్కడ ఇల్లిస్తారా?" శాంత కుతూహలంగా ప్రశ్నించింది.
ఆ మధ్య ఒకసారి ఎప్పుడో అక్కతో అక్కడికి వెళ్ళి చూసింది. కొత్తగా, నీటుగా కట్టిన ఇళ్ళు. ఇంటి ముందు పూల మొక్కలు. ప్రతి గదిలోనూ ఎలక్ట్రిక్ లైట్లు, ఫానులు, నున్నటి గచ్చులు. ఎంత బాగున్నాయి ఆ ఇళ్ళు! హాయిగా తామంతా ఆ ఇంట్లోకి మారిపోతే ఎంత చక్కగా ఉంటుంది! అనుకొంది.
"ఆ కావాలంటే ఇస్తారు. కాని మిమ్మల్నందరినీ వదిలి నేనెక్కడికి పోతాను?"
"మీ అన్నయ్య వెళ్ళిన పని సానుకూల పడితే అత్తారింటికి" అన్నది కనకం నవ్వుతూ.
"నిజంగానే వెళ్తాననే అనుకొంటున్నావా వదినా?" కాస్త తీక్షణంగానే ప్రశ్నించింది జానకి.
"ఏం ఆడపిల్లవి కావా? సన్యాసం పుచ్చుకోన్నావా? మగడు ముద్దుగా రమ్మంటే, ఎందుకు వెళ్ళవేం?"
"అ మగాడికి ఆత్మాభిమానం, సిగ్గూ లేకపోయినా నాకున్నది. కాలి కింద కుమ్మెటప్పుడు తుంగ; నెత్తి మీద పెట్టుకొంటే దర్భ అయిపోదు ఆడదాని జీవితం."
"ఇలాటి మాటలు చాలా విన్నానులే, జానకీ! మనసులో మహా గుబులు పడే వాళ్ళే పైకి అలాటి మాట లంటారు. నాలుగు రోజుల్లో చూడనా, అమ్మాయి గారి....."
"అలాగే , కళ్ళింత చేసుకొని చూస్తుండుకాని, నీతో వాదన పెంచుకోందికి నాకు టైము లేదు. తొందరగా రమ్మని అనసూయమ్మ మరీ మరీ చెప్పింది." అంటూ లేచి వెళ్ళి తన పనుల్లో మునిగిపోయింది జానకి.
అరాగంట గడిచి జానకి తిరిగి వచ్చేసరికి గోడ కానుకొని సాంబశివం , ఆమె లోపలికి వెళ్ళేముందు ఎలా కూర్చున్నాడో , అలాగే ఉన్నాడు.
"అదేమిటిరా సాంబూ! ఇంతసేపై చూస్తూన్నాను. అంతా తలొకటి వాగుతున్నాం. నువ్వు మాత్రం ఉలుకూ, పలుకూ లేకుండా అలాగే కూర్చున్నావు?"
"ఏం చెయ్యమంటావు అక్కా? పరీక్షలు , చదువు అయిపోయేయి. పనీ పాటు లేకపోతె ఇలాగే సోమరి తనం అలవాటయిపోతుంది."
"పోనీ, ప్రకాశం తో పాటు కాస్త సేపు తిరిగి రాలేక పోయావా? ఏవో కొత్త పుస్తకాలు వచ్చేయంటున్నాడు. పోయి చూడరాదూ?"
"ఎక్కడికి పోవాలని లేదు. ఏ పనీ చెయ్యాలని లేదు."
'అది కనిపిస్తూనే ఉంది. అందుకే నేనంటున్నది. నేటికి రెండు నెలలై చూస్తున్నాను. ఆఖరి పరీక్ష రాసి ఇంటి కొచ్చేక మరి ఇంటి నుండి కదల్లేదనుకొంటాను. నవ్వుతూ తుళ్ళుతూ ఉండవలసిన వయస్సులో మరీ ఇలా నీరు కారి పోతున్నావెంరా? ఒంట్లో సరిగా ఉంటున్నదా?"
"నా ఆరోగ్యానికేం! దివ్యంగా ఉంది."
"ఏం దివ్యమో? పీక్కుపోయిన ఆ ముఖం, వాలి పోయిన బుగ్గలు-- ఈ వయస్సులో ఇలాగేనా ఉండడం? ఈరోజు నాతొ బాలవిహార్ కి రాకూడదూ! కాస్త కాలక్షేపం అవుతుంది. గోవిందబాబు గారు ఓసారి చూసి ఒంట్లో ఏం చికాకో చెప్తారు."
"నాకు ఒంట్లో ఏం చికాకూ లేదక్కా! మా రిజల్టు కోసమే చూస్తున్నాను. అవి కాస్తా తెలిసిపోతే...."
"ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అవి త్వరగా వస్తాయా? ఈ వారంలో ఎలాగా తెలుస్తాయి. దాని కోసం ఇంత గాభరా ఎందుకూ?"
"......."
"లే, లేచి బట్టలు మార్చుకో. నీకు బాగుంటే ఉందువు గాని, లేకపోతె తిరిగి వచ్చేయచ్చు" అన్నది జానకి.
ఆమె చెప్పినట్లు రెండు నెలలై సాంబశివం గుమ్దిగలేదు. రాత్రి, పగలు పరీక్ష ఏమవుతుందో అనే బెంగతోనే అతనికి సరిపోతున్నది. అన్న సూర్యారావు మాటలు అతని చెవుల్లో దూది పెట్టుకొన్నట్లు అడ్డుకున్నాయి. ఉండి ఉండి అవే ప్రతిధ్వనిస్తున్నాయి కాని బయటి మాటలు చెవుల్లో కోరాబడలేదు.
"నా ఆశలన్నీ నీమీద పెట్టుకొన్నాను సాంబూ! నువ్వు సహకరించకపోతే నేను దేశాలు పట్టుకు పోవాలి. అన్న చెల్లెలికి పెళ్ళి చెయ్యలేని అసమర్దుడని అంతా నా వైపు వేలెత్తి చూపిస్తుంటే, నే బ్రతకలేను. ఏం చేస్తావు, సాంబూ? నన్నో ఒడ్డుకి చేరుస్తావా లేదా? నా పరువు ప్రతిష్టలు కాపాడుతావా, లేదా?"
సాంబశివానికి తను వింటున్న ప్రతిధ్వని , అన్న మాటలు గానే వినిపిస్తున్నది. చూస్తున్న ప్రతి వస్తువూ దిగాలు పడి కూర్చున్న అన్న రూపం గానే అగుపిస్తున్నది.
యంత్ర ప్రాయంగా బట్టలు వేసుకొని జానకి వెంట బయలుదేరాడు . దారి పొడుగునా జానకి అతనికి ధైర్యం చెబుతూనే ఉంది.
"నీ పరీక్ష పాసవుతుంది. సాంబూ, నాకు నమ్మాకం ఉంది. ఒకవేళ పోయినా, మరేం ప్రాణ హాని , మాన హాని జరిగిపోదు. సెప్టెంబరు కి కడుదువు గాని. అన్నయ్య డబ్బు పెట్టలేకపోతే నే పెడతాను. ప్రకాశం ఇస్తాడు. నువ్వేం కంగారు పడకు. అన్నయ్య కి పెళ్ళిళ్ళ పిచ్చి పట్టుకొంది. అందుకే పదేపదే నీతో అలా అంటుంటాడు. అంతకి మించి మరే ఆపదారాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండు. అదే మేమంతా కోరుతున్నది."
సాంబు ఆ మాటలన్నీ విన్నాడు. ఒక్కటైనా అతని బుర్ర లోకి దూరిందో, లేదో తెలియదు. బజారు దాటి కొంతదూరం నడిచేసరికి కాలేజీ పిల్లలు గుంపుగా కనిపించేరు.
"సాంబశివం , సాంబశివం" అని పిలిచేరు. అతన్ని తెలిసిన వాళ్ళు. సాంబు వెనుతిరిగి చూసేడు.
"ఈరోజు మన రిజల్టు వస్తాయనుకొంటున్నారు. స్టేషను కి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా?"
సాంబు అక్క వైపు చూసేడు. జానకికి ఆ పరిస్థితిలో అతన్ని ఒంటరిగా పంపడానికి ఇష్టం లేదు. కాని తను కూడా వెళ్లేందుకు వీలుకాదు. పది గంటలకల్లా గృహప్రవేశ ముహూర్తం . కాస్త ముందుగా రమ్మని అనసూయమ్మ మరి మరీ చెప్పింది. చేసేది లేక "వెళ్ళు" అన్నది.
ఆ పిల్లల వంక తిరిగి, "మా తమ్ముణ్ణి కాస్త చూస్తుండండి" అన్నాది.
ఇదేమిటి? బి.ఏ పరీక్షకు వెళ్ళిన తమ్ముణ్ణి , చంటి కుర్రాడిలా అప్పచెప్పుతున్నది? అనుకొన్నారు ఆ పిల్లలు.
వాళ్ళ భావాలు అర్ధం చేసుకొన్న జానకి "ఏం లేదు. వాడి ఆరోగ్యం అంత బాగలేదు, అందుకని" అన్నది.
వాళ్ళు ఆ వీధి మలుపు తిరిగేవరకూ జానకి అలా చూస్తూ నిలబడిపోయింది. ఆరోగ్యంగా, ఉత్సాహంగా బంతుల్లా ఉన్న ఆ పిల్లల మధ్య , సాంబ శివం తెల్లగా పాలిపోయి, వాడిపోయిన తోటకూర కాడలా ఉన్నాడు.
