Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 24


                         14

    అసిరి
    'అసిరిపల్లె రావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది నాయనా!' అప్పుడే లోపలికి వచ్చిన టి.సి.ని అడిగింది ఆమె.
    'సరీగ గంట పడుతుంది' టి.సి. చెప్పి ముందుకు సాగాడు.
    'ఇంకా గంట కూర్చోవాలన్నమాట!' స్వగతంగా అనుకుంది ఆమె.
    ఆమె ఎదుటి బెర్త్ మీద కూర్చుని 'కాలమా ఆగిపో' అన్న నవల చదువుతున్న యువతీ ఓ సారి తలెత్తి ఆమెవేపు చూసి మళ్ళీ నవలలోకి తల దూర్చుకుంది.
    ఆ కంపార్టుమెంటులో పదిమందిదాకా ఉన్నారు. ఎవరి గోల వాళ్ళది. అందరూ వెళుతున్నది మాత్రం అసిరిపల్లె. ఆ వూళ్ళో కొండమీదనున్న పరమేశ్వరీదేవి ఆలయ మహత్యాలు విని ఆయా వూళ్ళ నుంచి బయలుదేరి ఈ రైలు ఎక్కినవాళ్ళు వీళ్ళు.
    ఆమె వయసు యాభయ్ యాభై అయిదు లోపల వుంటుంది. కళకళలాడే ముఖం. పెద్దబొట్టు, సగం నెరిసీనెరవనట్లున్న, తలకట్టు బర్మా ముడి చుట్టుకుంది. సింపుల్ గా వున్న పట్టుచీర కట్టుకుని ఉత్తమ ఇల్లాలి తరహాగా పమిట నిండుగా కప్పుకుంది. వంటిమీద వున్న బంగారాన్ని బట్టి ధనవంతులే అనిపిస్తున్నది. కళ్ళజోడు వుంది. కళ్ళజోడును తీసి మాటిమాటికీ కళ్ళని తుడుచుకోటం జోడుని తుడవటం చేస్తున్నది. మధ్యమధ్య భారంగా ఓ నిట్టూర్పు వదులుతున్నది.
    ఆమె పక్కనే ఇరవయ్యి ఇరవైరెండు ఏళ్లుగల కుర్రాడు ఆమెను అతుక్కున్నంత దగ్గరగా కూర్చుని ఉన్నాడు.
    ఉన్నట్టుండి ఆ కుర్రాడు 'అమ్మే!' అన్నాడు. ఆవు అంబా అన్న తీరులో.
    'ఏంటి నాన్నా!' అంది ఆమె.
    'ఆపిచ్చి కావాలి కావాలి' అన్నాడు ముద్దుముద్దుగా.
    'తీసిస్తానుండు' అంది ఆమె. ఆ మాట అంటూనే సీటు కిందగా పెట్టిన టిఫెన్ క్యారియరును, మరచెంబుని ఇవతలికి లాగింది. క్యారియరు మూత తెరిచి ఒక అరిశ ఒక సున్నుండ తీసి ఆ కుర్రాడి చేతిలో పెట్టింది.
    ఆవురావురుమంటూ ఆరగించటం మొదలుపెట్టాడు. ఇరవైఏళ్ళు దాటిన ఆ బుజ్జి తండ్రి.
    ఆమె చేతిలోకి రెండు అరిశెలు తీసుకుంది 'అమ్మాయీ!' అంటూ ఎదురు బెర్తుమీద కూర్చున్న అమ్మాయిని పిలిచింది.
    'నన్నేనా పిలిచింది' అన్నట్లు ఆ యువతీ నవలలోంచి మొహం యివతలకి పెట్టింది.
    అరిశెలు అందిస్తూ 'తీసుకోమ్మా! తిను' అంది ఆమె.
    'నో థాంక్స్!' అంది ఆ యువతీ.
    'నేతి అరిశెలు అమ్మాయీ! మా వంటావిడ చేస్తానన్నా వడ్డన స్వయంగా నేనే చేశాను. మీ పట్నం వాళ్ళకి వీటి రుచి సరిగ్గా తెలియదు తీసుకోమ్మా! తిను' ఆప్యాయంగా అంది మరోసారి ఆమె.
    'తీసుకుని తినండి! భలే బావుంటాయి' అన్నాడా కుర్రాడు.
    ఆ యువతి ప్రక్కనే కూర్చున్న అతను "తీసుకో సరితా!" అన్నాడు.
    అతను ఆ మాట అన్న తరువాత ఆ యువతి తీసుకుంది. ఒకటి అతనికిచ్చి, తనొకటి మునిపంటితో సుతారంగా కొరుకుతూ తినటం మొదలుపెట్టింది.
    కొద్దిగా తిన్న తరువాత మర్యాద కోసం సరిత అంది. "బావున్నాయి పిన్నిగారూ! ఇలాంటి పిండివంటలు మాకు తెలియవు" అంది.
    ఆమె అరిశలు ఇవ్వటంతోనూ, ఆ యువతీ బావున్నాయి అనటంతోనూ, వాళ్ళ మధ్య మాటలు ప్రారంభమయినాయి.
    "నీ పేరేమిటమ్మా!" ఆమె అడిగింది.
    "నా పేరు సరిత" అంది సరితాదేవి.
    'అతను నీకు.... .... .... ....' నాన్చుతూ ఆగింది ఆమె.
    'మావారు, పేరు సతీష్ షా' భర్త పేరు చెప్పటానికి ఏమీ సిగ్గుపడకుండా చెప్పింది సరిత.
    'ఎక్కడికి వెళుతున్నారు?' ఆమె అడిగింది.
    'అసిరిపల్లె' ఈ తఫా అతను జవాబు చెప్పాడు.
    వెంటనే అంది ఆమె 'మేమూ అక్కడికే'
    'మీ పేరు?'
    'నా పేరు అన్నపూర్ణమ్మ. వీడు మా ఒక్కగానొక్క అబ్బాయి పేరు శ్రీశైలం. మేము ఆ అసిరిపల్లె వెళ్ళటం ఇదే మొదటిసారి. అమ్మవారి మహత్యం విని ఏ పుట్టలో ఏ మహత్యం వుందో అని బయలుదేరాము. మా ఆయనగారు నాలుగురోజులు ఆగి వస్తామన్నారు. ఇప్పుడు కోతల రోజులు కదమ్మాయ్? దగ్గరుండి చూసుకోకపోతే కూలీలు ఏ పని సవ్యంగా చేయరు.' అంతవరకూ చెప్పి, 'అసిరిపల్లెలో మీకూ ఎవరయినా తెలిసినవాళ్ళున్నారా? అసిరిపల్లె మీకు బాగా తెలుసా? ఆత్రుతగా అడిగింది అన్నపూర్ణమ్మ.
    'జస్ట్, సరదాగా బయలుదేరాము. మా మ్యారేజి అయి ఇంకా ఆర్నెల్లు కూడా కాలేదు, నాకేమో కాశ్మీర్, కొడైకెనాల్, మైసూర్ లాంటివి ఇష్టం. మన ప్రాచీన కాలసంపద గుడులూ గోపురాలే అంటాడు. దానికో నోట్స్. ఒక పుస్తకం పట్టుకుని ప్రతి దేవాలయ విశేషమూ దాని పుట్టు పూర్వోత్తరాలూ రాసుకుంటూ ఉంటాడు. అలా అని దైవభక్తి పెద్దగా ఏమీలేదు. దేవుడికో దండం పారేసి ఊరుకుంటాడు. భక్తంతా పుస్తకాలు నింపటంతోనే సరిపోతుంది. ఈ మధ్య పేపర్ లో పరమేశ్వరీ ఆలయం గురించి చాలా విశేషాలు ప్రకటించారు, సతీష్ ఎలాగూ బయలుదేరుతున్నాడు కదాని, నేను కూడా తోకలాగా బయలుదేరాను' సరిత నవ్వుతూ చెప్పింది.
    "యూ నాటీ గర్ల్!' నవ్వుతూ సరితతో అని, అన్నపూర్ణమ్మ వైపు తిరిగి 'మా మ్యారేజీ అయిన తరువాత సరిత అడిగిన ప్రదేశాలు అన్నీ చూపాను. ఎప్పటికయినా గుడులూ, గోపురాల మీద మన ప్రాచీన కళాఖండాల మీద రీసెర్చీ చెయ్యాలని నాకెంతో కోరిక. నా కోరిక విని సరిత ఏమంటుందో తెలుసా అంటి? 'నేను బాగా చదువుకున్న చాదస్తపు మొగుడిని అంట. నా పేరు సతీషా అని కాకుండా తోకలేని ఆంజనేయులూ అంటే బావుండేదిట. సరిత చూడటానికి మంచి అమ్మాయిలాగా కనిపిస్తుంది కానీ, నన్ను మాత్రం చంపేస్తుంటుంది వెక్కిరింతలతో వేళాకోళాలతో" నవ్వుతూ చెప్పాడు సతీష్ షా.
    "ఇలా అయితే దిగిపోతాను" సరిత చిరుకోపంతో బెదిరింపుగా అంది.
    "ఇంత వేగంగా వెళుతున్న రైలులోంచి దిగుతావా! మూతిపళ్ళు రాలతాయి"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS