మొదటి బాల్ దూసుకు వొచ్చింది. హుక్ చేద్దామనుకుని, మూవ్ అవుతూ వికెట్స్ మీదకు రావటంతో, ఆ ప్రయత్నం విరమించుకుని, డిఫెన్స్ ఆడాడు.
రెండవ బాల్-కొట్టబోయి బీటిన్ అయిపోయాడు. బాల్ బాగా ఫ్లయిట్ అయి స్టంప్స్ ప్రక్కనుంచి వెళ్ళిపోయింది.
మూడవ బాల్-అవుత సైడ్ ది అఫ్ స్టంప్స్ కొట్టబోయి క్యాచ్ వెళ్ళి పోతుందేమోనన్న భయంతో వొదిలేడు.
నాలుగో బాల్- అనుకూలంగా వొచ్చింది. బ్యాట్ విసురుగా గాలిలో తిరిగింది. అతని ఫ్యావరేట్ స్ట్రోక్.
ఫీల్డ్ చెయ్యటానికికెవరికీ అందలేదు. వేగంగా దొర్లుకుంటూ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయింది.
ప్రేక్షకుల్లో కరతాళ ధ్వనులు-ప్రియంవద, సునంద కూడా సంతోషం పట్టలేక చప్పట్లు కొట్టేశారు.
"మహేష్ అంటే స్టూడెంట్స్ లో చాలా క్రేజ్ వుంది తెలుసా?" అంది సునంద.
ప్రియంవద ఏమీ జవాబివ్వలేదు.
"ముఖ్యంగా అమ్మాయిలు అతనంటే".....
ప్రియంవద వినీ విననట్లు ఊరుకుంది.
ఆంజనేయులు తప్ప యీ మూర్ఖురాలికి వేరే ప్రపంచం తెలీదు కాబోతున్నట్లు ఆమెవైపు వింతగా చూసి, మళ్ళీ ఆటను తిలకించటంలో లీనమైపోయింది సునంద.
సరుసగా పరుగులు వొస్తున్నాయి.
పది.... యిరవై.... యిరవై అయిదు.... నలభై..... అరవై.....
అవతలవాళ్ళు అతనికి సెంచరీ యివ్వకూడదన్న పట్టుదలతో ఆడుతున్నారు.
ఒక భాల్ విసురుగా వొచ్చి అతని మోచేతికి కొట్టుకుంది. మోచెయ్యి విరిగిపోతుందన్న బాధకలిగింది. బ్యాటు పట్టు జారిపోతుందేమో ననిపించింది. కళ్ళముందు ప్రియంవద ముఖం కనిపించింది. ఎక్కడలేని ఓపికా తెచ్చుకున్నాడు.
చెయ్యి స్వాధీనంలోకి రావటానికి నిరాకరిస్తోన్నా - పట్టుదలతో బ్యాట్ పట్టుకుని స్థిరంగా నిలబడ్డాడు.
తర్వాత బంతి- శక్తినంతా కూడదీసుకుని కొట్టాడు. చెయ్యి వొణికి ఊడిపోతుందేమో నన్నంత బాధ కలిగింది.
ప్రియంవద రూపం కళ్ళముందు మెదుల్తోంది.
ప్రియంవద! ప్రియ..... ఆమె....
బంతి విసురుగా వొచ్చింది. మళ్ళీ బ్యాట్ విసిరాడు. ఫోర్.
డబ్బయి..... ఎనభయి..... తొంభయి.....
ప్రేక్షకుల్లో ఉత్కంఠత, ప్రతిపరుగూ కరతాళధ్వనులు.....
వన్ టూ.....వన్ టూ....
ప్రియ..... ప్రియ....
తొంభయి ఆరు.....
శక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మి అసలు కనబడటం లేదు.
బౌలర్ విసిరిన బంతి స్పిన్ తిరుగుతూ స్టంప్స్ మీదకు దూసుకువొచ్చింది.
బ్యాట్ కదలటానికి నిరాకరిస్తోంది స్టంప్స్ ఎగిరిపోయేటట్లు వున్నాయి.
శరీరంలోని ప్రతి అణువులోనుంచీ- శక్తి పొంగుకు వొచ్చింది. బ్యాట్ గాలిలోకి లేచింది.
బ్యాట్ బంతిని తాకిన చప్పుడు.
ఏం జరిగిందో తెలీదు. క్షణంపాటు బంతి ఏమయిందో కనబడలేదు. తర్వాత వినబడింది- మిన్నుముట్టిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు.
సిక్సర్....సిక్సర్....
అతనివొళ్ళు తూలింది.
8
మహేష్ మంచం మీదనుంచి లేవబోయాడు.
"కదలొద్దు" అన్న మృదువైన స్వరం వినిపించింది.
తలత్రిప్పి చూశాడు. ప్రక్కనే ప్రియంవద నిలబడి వుంది. ఆమె ముఖంలో ఆర్ద్రతతో కూడిన వ్యాకులత.
నవ్వి "ఫర్వాలేదు" అని లేవబోయాడు. కాని శరీరం స్వాధీనంలో వున్నట్లు లేదు. కుడిచెయ్యి అంగుళం కూడా కదల్లేదు.
"అమ్మా!" అన్నాడు బాధగా.
"ఏమిటి? నొప్పిగా వుందా?" అని ఆమె అతని ప్రక్కనే మంచం మీద కూర్చుని నుదుటిమీద చెయ్యివేసింది.
"అయ్యో! వొళ్ళు కాలిపోతోంది, జ్వరంకూడా వచ్చినట్లుంది." అన్నది కొంచెం కంగారుగా.
ఆమెచెయ్యి అప్రయత్నంగా అతని నుదురు నిమురుతోంది. మధ్య మధ్య ఆమెవ్రేళ్ళు అతని జుట్టును ఆప్యాయంగా సవరిస్తున్నాయి.
ఈ అనుభూతి అతనికి చాలా మధురంగా వుంది. చరిత్ర ఎన్ని సార్లయినా పునరావృత్తం కానియ్యి - స్త్రీ పురుషుడికి ఎప్పుడూ అద్భుతమే.
"మీకు మధ్యలోనే దెబ్బతగిలింది కదూ" అనడిగింది.
అవునన్నట్లు తలఊపాడు.
"మరి ఆట ఆపి వొచ్చెయ్యకుండా ఎందుకంత ప్రయాసపడ్డారు?"
"నీకోసం." అందామనుకున్నాడు. అంతలోనే అతని చూపు గోడకు తగిలించి వున్న ఆంజనేయస్వామి చిత్రం మీదపడింది.
నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది.
"ఎలాగైనా సెంచరీ సాధించాలని పట్టుదల అవునా?"
అతనామె కళ్ళలోకే నవ్వుతూ చూశాడు.
"నీకిచ్చిన మాట ప్రకారం సెంచరీ కొట్టాను. నాకేమిస్తావు?" అన్నాడు.
కొన్ని సందర్భాలలో మనసును, నాలికను అదుపులో పెట్టుకుందామన్నా అదుపులో వుండవు. మనవొస్తువు కాదనుకున్నా పరాధీన అని తెలుస్తోన్నా ఆకర్షణ శక్తి అలాంటిది.
"ఏం కావాలి?"
"అడిగి యిస్తారా?"
"కొన్నిటిని గురించి తెలీదుగా"
"సరే అయితే నేనే చెబుతాను" అనిఏదో ఆలోచిస్తున్నట్లు ఊరుకుండి పోయాడు.
"చెప్తానని ఆగిపోయారేం?"
"ఊ?"
ఆమె చెయ్యి అతని తలమీదనుంచి గుండెల మీదకు జరిగి, అక్కడ వ్రేళ్ళు గోముగా నిమురుతున్నాయి.
"నువ్వు కావాలి" అతని పెదవులు కదిలాయి. కాని గోడమీద ఆంజనేయుడి బొమ్మకనిపించి మాట బయటకురాకుండాలోపలే వుండిపోయింది.
నువ్వు కావాలని అడగరేం? అడగరేం? ఆమె హృదయం ఘోష పెట్టింది. అంతలోనే గోడమీద బొమ్మ కనిపించి - ఘోష సద్దుమణిగి పోయింది.
* * *
