స్వదేశానికి వచ్చిన వెనుక హిందూదేశమంతా సంచారం చేసి మదరాసు నగరంలో శిల్పాశ్రమం ఒకటి స్థాపించినాడు. మహారాజులు, కోటేశ్వరులు, ప్రసిద్దులు, రాజకీయవేత్తలు అనేకులు తమ తమ మూర్తుల్ని పాలరాతిలోనో, లోహంలోనో, రాతిలోనో రూపం పోందించుకొన్నారు. పాశ్చాత్య శిల్పవిధానంలో భరతదేశంలో అతన్ని మించినవారు లేరు. అతని యశము తీగలల్లుకుపోయినది. అతని విగ్రహాలలో పాశ్చాత్యుల కందరాని ఏదో స్పర్శ భారతీయమైనది; ఆశయ స్వరూపమైనది ఉన్నదని రసజ్ఞులు భావించి, ఆయన విధానాన్ని సంభావిస్తారు. ఆయన నిర్మించిన శిల్పాశ్రమము గౌరవము సముపార్జించి, అనేక విద్యార్ధులను వివిధ ప్రాంతాల నుండీ ఆకర్షిస్తూ ఉంటుంది.
ఆ రోజున మేమంతా ఆయన ఆశ్రమాన్ని దర్సించినాము. సిద్దప్పగారు రచించినవీ, విద్యార్ధులు రచించినవీ ఎన్నో విగ్రహాలట ఆనందంతో సందర్శించినాము. ఆశిల్పదేవాలయంలో నాహృదయం చైతన్యం తప్పింది. ఏదో నిర్వచింపరాని ఆనందము నన్ను ముంచివేసింది. నాలోన నేను పొంగి, నాలోన నేను తాండవించి, నాలోన నేను భువనాలకు ప్రాకిపోయినాను.
మట్టితో, మైనంతో పాఠాలు నేర్చుకొంటున్న విద్యార్థుల పరిశ్రమ చూచి నా వ్రేళ్ళలో ఏదో వణకు, ఏదో విద్యుల్లత ఉద్భవించింది. నాలోన వివిధ మూర్తులు అస్పష్టమై నాతిదూరాన గోచరించాయి.
ఒక విద్యార్ధి దగ్గరనుండి మైనంలా తయారుచేసిన మట్టిముద్ద ఇంత తీసికొని ఎదురుగా ఉన్న ఒక విగ్రహ శిరస్సును అనుకరిస్తూ, పది నిమిషాలలో తల నొకదాన్ని రచించినాను. ఇంతలో శిల్పగురువు మాకడకు వచ్చి ఒక నిమేషము నా రచనను పరిశీలించి చూచినారు.
''మీ చేతిలో అపారమైన శిల్పశక్తి గర్భీకృతమై ఉన్నది, ఇదివరకు మీ రీ విద్యను అభ్యసించి ఉన్నారా?''
''లేదండీ.''
ఆయన నన్ను కళ్ళల్లో కళ్ళుగా ఒక క్షణము చూచినాడు. నా కేదో ఆనందము! ఏవో కాంతులు నన్ను చొచ్చినవి.
''మీరు మద్రాసులో ఏం చేస్తున్నారు?''
''నేను ఇంటరు చదువుతున్నాను ప్రెసిడెన్సీ కాలేజీలో.''
''నా అదృష్టము! కళాశాల చదువులో మీకు తీరుబడి ఉన్నప్పుడు డల్లా ఈ ఆశ్రమానికి వస్తే ఈ ఉత్తమ విద్యను మీకు చెలియలుగా అర్పించగలను.''
''ఎంతో కృతజ్ఞుణ్ణి.''
ఆనాటినుంచీ ఒక మహాయోగంలో దీక్షాపరుడ నయ్యాను. సిద్దప్ప గురువర్యులు నాలోని పాతాళగంగను పైకి వుప్పొంగించి, ప్రవహింప చేశారు. మనుష్యుని బాహ్యమూర్తి, లోనిమూర్తి, కంఠాది అవయవాల కండరాలు, నరాలు, రక్తనాళాలు, అంతరింద్రియాలు, ఎముకలగూడు వాని స్వరూపాలు అన్నీ నా గురువులు నాకు వుద్బోధించినారు. జంతువులు, పక్షులు, వృక్షాలు, వాటి మూర్తులు, అంగాంగ సౌందర్యమూ వారు పరిశీలించి ఉపన్యసించారు. సిద్దప్పగారి ప్రతిభాపూర్ణ దేశికత్వములో దినదినాభి వృద్దినంది నావ్రేళ్ళు పరమేష్టి సంకల్ప రూపాలే అయినవి. విశ్వకర్మ దేవుని దివ్యహాసము నాలోన వెన్నెలలు నిండించినది. సూక్ష్మవిన్యాసాలు తీర్చుటలో, స్తూలాంగిక భంగిమలు దిద్దుటలో, భావాలు సర్వమూర్తిలో ప్రతిష్ట చేయుటలో ప్రవీణుడ నయినాను.
దసరా సెలవలకు మా ఊరు వెళ్ళువరకు మైనముతోనూ, మట్టితోనే అభ్యాసము చేసినాను. నేను విరచించే మట్టిబొమ్మలకన్న నా ఆత్మేశ్వరీ దివ్య విగ్రహము ఎదురాడలేని సందేశము నాకు కనిపించినది.
దసరాకు తప్పక రమ్మని ఆ బాలిక నాకు వుత్తరాలు వ్రాసినది. ఉత్తరాలలో ఇదివరకు బావా అని సంబోధించేది. వివాహం అయిన వెనుక ఏ సంబోధనము లేకుండా చిత్రంగా వ్రాయడం సాగించినది.'' బావా'' అని ఎందుకు వ్రాయకూడదని నా ఉత్తరం పృచ్ఛచేసింది. అందుకు జవాబు రాలేదు. కాని తాను క్రొత్తగా అవలంబించిన విదానంతోనే ఉత్తరాలు వస్తున్నాయి ఏమిటీ ఉత్తరాలు! ఆ ఉత్తరాలంటే అంత ఆనంద మెందుకో! ఆ పదకొండేళ్ళ బాలికకు ఉత్తరాలు వ్రాయడం ఎంత చిత్రంగా అలవడింది!
కొల్లిపర, 18-9-1925
శ్రావణ మంగళవారం నోములు బాగా జరిగాయి. వరలక్ష్మీ పూజకు అత్తగారు రావడం మా అందరకు ఎంతో సంతోషమైంది. మీరే కొన్నారట చీర! మనదేశంలో అలాంటి చీరలు ఫాషనుకాలేదు. కానీ ఎంత అందంగా ఉంది! అంత ఖరీదు ఎందుకు పెట్టారు? చబుల్ దాసులో కొన్న ఆ కొత్త ఫాషను గొలుసు మెళ్ళోవేసుకొని అత్తయ్యగార్కి దణ్ణం పెట్టితే ఆమె కళ్ళ నీళ్ళు నా తలపై వెచ్చగా పడ్డాయి. దసరాకు తప్పక రావాలి. వదినగార్లి రువురూ వస్తారు.
చిత్తగించవలెను
శకుంతల.
7
ఉత్తరాలు మనస్సులో ఎందుకు ఆనంద తరంగాలు విరిగిపడ జేస్తాయో? కొందరి స్నేహితులకన్న వారి ఉత్తరాలు ఎక్కువ ఆనందం సమకూరుస్తవి. కొందరు స్నేహితులూ, ఉత్తరాలూ సాయంత్రం బంగారు కాంతిలా, వెన్నెల తుంపురుల్లా, నిలువెల్లా పూలు వికసించిన పొగడ చెట్టులా ఆ ఆనందం ప్రాభృతం ఇస్తారు.
శకుంతల ఉత్తరాలను ఏమని వర్ణించుకోను? పరీక్ష ప్యాసు అయ్యావు అని చెప్పే వార్తాపత్రికను కూడ ఉత్తరాలతో పోల్చడానికి వీలు లేదు. హిమాలయ పర్వతోత్తుంగ సానుప్రపతద్గతంగా నిర్ఘరీ సందర్శనా నందమును ఆ ఆనందానికి పోల్చవచ్చునని ఊహించుకొంటాను.
దసరాకు కొల్లిపర వెళ్ళినపుడు, మా ఊరు నాకు వేరై కన్పించింది. కొల్లిపరలో ఎన్నో కొత్త అందాలు చూచాను. ఇప్పుడనుకుంటాను-శకుంతలను ఆ రోజుల్లో అలా ఆరాధించే వాణ్ణే. దానిలో ఉండే నిజతత్వం ఏమిటి అని! ఆ పూజ స్త్రీ పురుష సంబంధమయినదా? నాలో ఉదయిస్తూ ఉన్న పురుషత్వము ఆమెలో ఉదయిస్తూ ఉన్న స్త్రీతత్వాన్ని ఆశించినదా? ఆలాగు స్త్రీని ఆశిండమే అయితే, స్త్రీత్యోదయం నవనవలు సాగుతూ మిసమిసలాడే నా సహాధ్యాయినులు ఎంతమందో వున్నారే! అందమయినవారున్నారే! ప్రౌఢతనాన్ని పరిమళింపచేసే చమత్కారిణు లున్నారే! వారంతా స్త్రీలుగా వాంఛనీయులుగా నాకు ప్రత్యక్షం కాలేదే!
