Previous Page Next Page 
వసుంధర కథలు-15 పేజి 23

 

                   దొంగతనం నా ధ్యేయం కాదు!

                                                                             వసుంధర

    బాగా అలోచించి ధైర్యం చేసి తలుపు తట్టి టైము చూసుకున్నాను. సుమారు పదకొండవుతోంది. ఆమె వస్తుందా? తలుపు తీస్తుందా? ఆలోచిస్తున్నాను....
    అయిదు నిముషాలు గడిచాయి. తలుపులు తెరుచుకోలేదు.
    బహుశా ఆమె నిద్రపోతూ ఉండి వుండాలి. మళ్ళీ తలుపులు తట్టాను. - ఈసారి కాస్త గట్టిగా.
    లోపల ఏదో కదలిక తెలుస్తోంది. లైటు కూడా వెలిగినట్లుంది. తర్వాత అడుగుల చప్పుడు వినిపించింది. తలుపులు తెరచుకున్నాయి.
    ఆమె నన్ను చూసి కంగారు పడినట్లుంది. నేను మాములుగా -- "మోహన్ ఉన్నాడాండీ" అన్నాను.
    "లేరు" అందామె.
    "ఒక్క పర్యాయం లోపలకు రానిస్తే మోహన్ కి చాలా అర్జంటు కబురు చెప్పాలి ...." అన్నాను.
    ఆమె తటపటాయించింది. కానీ నేనే చొరవగా చటుక్కున లోపలకు ప్రవేశించాను. ఆమె కాస్త కంగారుగా నావంక చూస్తోంది.
    "భయపడకండి. ముందా తలుపులు వేసేయండి. ఇది చాలా రహస్యం" అన్నాను.
    ఆమె తలపులు వేయలేదు. అనుమానంగా నా వంకనే చూస్తోంది. నేను నా బ్రీఫ్ కేసు గదిలో బల్ల మీద పెట్టి క్షణాల మీద గుమ్మం దగ్గరకు వెళ్ళి - తలుపులు వేసేశాను. ఈ పర్యాయం ఆమె కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
    "భయపడకు . నిన్నేమీ చేయను బుద్దిగా ఉంటె" అన్నాను.
    "ఎవర్నువ్వు?" అందామె.
    "ఒక మామూలు దొంగను" తాపీగా అన్నాను. "ఇంత వరకూ హత్యలు చేయలేదు. నువ్వు కూడా నాకా అవసరాన్ని కల్పించకుండా ఉండగలవని ఆశిస్తున్నాను."
    అమెమట్లాడలేదు. ఆమె కళ్ళలో భయం ఇంకా నాకు కనబడుతోంది.
    "అనవసరంగా కేకలు వేయవద్దు. నా పని చేసుకుని వెళ్ళిపోతాను నేను. కానీ అందాకా సేప్టీ కోసం చిన్న జాగ్రత్త నీ బెడ్రూం లోకి పద" అన్నాను. అమెమౌనంగా బెడ్రూం లోకి నడిచింది.
    నా బ్రీఫ్ కేసు లోంచి సన్నని తాడు తీశాను. ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టాను. మంచం మీద పడుకోమని - ఆమె కాళ్ళు కూడా దగ్గరగా కలిపి కట్టాను. పక్కనే ఉన్నటేబుల్ మీద ఏదో నవల ఉంటె తీసి సగం ఓపెన్ చేసి మంచం మీద బోర్లా వేశాను. ఆమె నోటిలో గుడ్డలు కుక్కాను.
    "ఏమీ భయపడవద్దు. నా పని చూసుకున్నాక నీకు నేను విమిక్తి కలిగిస్తాను" అని ఆమెకు ధైర్యం చెప్పి, ఇల్లంతా వెదకసాగాడు.
    ఒక పెట్టెలో కొద్దిగా నగలున్నాయి. వాటి విలువ అయిదారు వేలుంటుంది. తీసి బ్రీప్ కేసులో వేసుకున్నాను. ఇంకో పెట్టెలో వెండి సామానుంది. వాటి విలువ కూడా మూడు నాలుగు వేలుంటుంది. జాగ్రత్తగా బ్రీఫ్ కేసులో సర్ధాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మంచి బేరమే దొరికింది.
    నేను దొంగనే కానీ దొంగతనం నా ధ్యేయం కాదు. సుఖజీవనానికి డబ్బు అవసరం. అ డబ్బు సంపాదించడానికి మరే ఇతర మార్గాలూ తెలియవు నాకు. చిన్నప్పట్నించి  ధైర్య సాహసాలకు పెట్టింది పేరు నేను. వాటినిప్పడిలా ఉపయోగించు కుంటున్నాను.
    దొంగతనం చేసి డబ్బు సంపాదించ వచ్చి కానీ-- మనశ్శాంతి పోతుంది. అనుక్షణం భయపడుతూ జీవనం కొనసాగించాలి. ఈ రకం జీవితం నా కిబ్బందిగానే ఉంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇలా దొంగతనం చేసి కూడబెట్టిన డబ్బును బ్యాంకులో వేసుకుని, వచ్చే వడ్డీతో హాయిగా జీవించాలి.హాయిగా జీవించేటంత వడ్డీ రావాలంటే - బ్యాంకులో కనీసం రెండు లక్ష లుండాలి.
    నాకు చాలా ఖర్చులున్నాయి. వృత్తి రీత్యా ఏర్పడ్డ మొహమాటలున్నాయి. వీటి కారణంగా ప్రస్తుతం నాకు నెలకు రెండు వేల రూపాయల ఖర్చుంది. నా సంపాదన ఎన్నడూ నెలకు అయిదు వేలు దాటడం లేదు.
    మంఛి సంపాదన కావాలంటే మంచి ఇల్లు దొరకాలి. మంచి ఇల్లంటే కేవలం డబ్బున్న ఇల్లు మాత్రమే కాదు- నాకు ప్రమాదకారి కాకుండా ఉండాలి.
    గొప్పవాళ్ళ ఇళ్ళకు పటిష్టమైన గోడలుంటాయి. యముడి లాంటి వాచ్ మన్ ఉంటాడు. యముడి దగ్గరకు తీసుకుపోగల కుక్కలుంటాయి. నా ధైర్య సాహసాలను వీటినదిగమించడానికి ప్రయత్నించడం లేదు నేను. రిస్కు తీసుకోవడం నాకిష్టం లేదు. ఎందుకంటె దొంగతనం నా ద్యేయం కాదు కనుక!
    నా ఉద్దేశ్యంలో మంచి ఇల్లంటే మధ్యతరగతి వాళ్ళదే! వీళ్ళ దగ్గర తగుమాత్రం డబ్బుంటుంది. అదృష్టం బాగుంటే ఖరీదైన నగలుంటాయి. తమ ఇంటికి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేసుకోలేరు సరి గదా - వస్తువులు పొతే వీళ్ళు నీళ్ళోదులుకోవలసిందే -- ఎందుకంటె -- దొంగతనం కేసుల్లో పోలీసులు శ్రద్దగా పనిచేయాలంటే డబ్బయినా ఉండాలి - పలుకుబడయినా ఉండాలి. మధ్యతరగతి వాళ్ళకీ రెండూ ఉండడం అరుదు. అందుకే అన్నివిధాలా వీళ్ళదే -- మంచి ఇల్లు!
    మంచి ఇల్లు సెలక్టు చేసుకోవడం లో నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ముందుగా ఆ ఇంటిని గుర్తు పెట్టుకుంటాను. తర్వాత ఆ ఇంట్లో ఎంత మందుంటున్నారో ఏమేం చేస్తున్నారో గమనిస్తాను. వారంలో ఏరోజు అనువైనదో అంచనా వేస్తాను. తర్వాత సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే ఉండే సమయం చూసి మర్యాదదస్తూడిలా తలుపు తట్టి ప్రవేశిస్తాను. నాక్కావలసినవన్నీ మూట కట్టుకుని, దర్జాగానే బయట పడతాను.
    ఆడవాళ్ళని కానీ, మగవాళ్ళని కానీ భయ పెట్టడానికి , నా దగ్గర తిరుగులేని సాధనాలున్నాయి. వీటిని నేను క్రమంగా సంపాదించాను. నా ధైర్య సాహసాల కివి కూడా తోడు కావడంతో, రెండు సంవత్సరాలుగా నా దిన్గాతనాలు అవిచ్చిన్నంగా సాగిపోతున్నాయి.
    సుమారు రెండు సంవత్సరాల క్రితమే నేను దొంగతనాలు మొదలుపెట్టాను. నా డిగ్రీ నాకు కూడు పెట్టదని గ్రహించేకనే నేనీ వృత్తికి దిగాను. కానీ రెండు సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నా నా నిల్వ ఇంకా పదిహేను వేలు దాటలేదు. ఎప్పటికి రెండులక్షలు చేస్తానో, ఎప్పటికీ దొంగతనాలు మానగాలనో అని దిగులు పడుతుంటాన్నేను.
    ఈఇంట్లో ఇప్పటికి సుమారు పది వేల రూపాయల విలువ గల సామాను దొరికింది. క్యాషు కూడా దొరికితే బాగుండును.నేను చాలా శ్రద్దగా ఇల్లంతా పరిశీలిస్తున్నాను. ఇంతలో ఎవరో తలుపు తట్టారు.

                                       2
    నా అంచనా తప్పయింది. నా పధకం తారుమారయింది. ఎవరో తలుపు తడుతున్నారు. బహుశా ఆమె భర్తే అయుంటాడు. నా బుర్ర త్వరగా పని చేసింది. తొందరగా ఆమెను సమీపించాను.
    "నిన్ను వదిలి పెడుతున్నాను. వెళ్ళి తలుపు తీయి. నీ భర్త లోపలకు వస్తాడు. అతనికి నా సంగతేమీ చెప్పకు. అతనికి నేనిచ్చిన జేబురు మాలిచ్చి, ఈరోజు మీ గురించి నేనో కొత్త సెంటు కొన్నాను వాసన చూడండని చెప్పు. అతను వాసనా చూస్తాడు ...." అంటూ ఆమె కట్లు విప్పి నోట్లో  గుడ్డలు తీశాను.
    "నేను చెప్పినట్లు చేశావా -- నేను దొంగగానే మిగిలి పోతాను. లేదూ, హంతకుడిగా మారిపోతాను" నా చేతుల్లో మెరుస్తున్న రివాల్వర్ వంకే ఆమె భయంగా చూస్తోంది.
    "నీకు నిద్రపట్టక నవల చదువు కుంటున్నావు. అందుకే లైటు వేసి ఉంది. కానీ మధ్యలో నీకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. అందుకే తలుపు తీయడం ఆలశ్య మయింది. ఇదుగో, ఈ రుమాలు తీసుకో. నేను చెప్పినట్లు మాట్లాడి, చెప్పినవిధంగా చేయి. లేదా, రివాల్వర్ రెండు సార్లు ప్రేల్తుంది. దీనికి సైలెన్సరుంది. మీ ప్రాణాలు తీస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా."
    బయట మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు.
    "ఆ వస్తున్నా" అంటూ ఆమె గట్టిగా అరిచి కదిలింది. నేనిచ్చిన రుమాలుతో. నేను రివాల్వర్ దగ్గరుంచుకుని ఒక మూల నక్కాను. వీధి గుమ్మం నాకు స్పష్టంగా కనిపిస్తోంది.
    ఆమె తలుపులు తీసింది. అతను లోపలకు వచ్చి "ఏమిటి విశేషాలు?" అన్నాడు.
    "ఒక నవల చదువుతుంటే ఒళ్ళు వేడెక్కింది. ఒక సెంటు కొన్నాను. అది వాసనా పీలుస్తుంటే ఒంటికి మత్తు కలుగుతోంది. మీరు వస్తే బాగుండుననిపించింది.
    "ఏమిటా నవల, ఎదా సెంట్ ?" అన్నాడతనుమానంగా ఆమె కళ్ళలోకి చూస్తూ.
    "నవల లోపలుంది.సెంటిక్కడే ఉంది. చూడండి" అంటూ ఆమె రుమాలు నతని కందించింది. అతను ఎడమ చేతిలోని బ్రీఫ్ కేసును కింద పెట్టాడు. ఆ చేత్తోనే ఆమెను దగ్గరగా లాక్కుని, కుడి చేత్తో రుమాలు అందుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS