"అయితే నేను సెలవు తీసుకుంటానండి. మళ్ళీ ఏడింటికల్లా వచ్చేయాలిగా --" అన్నాడతడు.
"ఎక్కడుంటున్నావు బాబూ!" అన్నాడు శేషగిరి ఆప్యాయంగా.
"హోటల్ అనార్కలీ లోనండి -- వెళ్ళి వీసీఅర్ తీసుకుని ఏడుకు కాస్త ముందే వచ్చేస్తానండి ...." అని వెళ్ళిపోయాడు గోపాల్.
"ఎడంటే ఇంకా గంటన్నరే టైముంది. మరి మేమూ వెళ్ళి ఇంట్లో వాళ్ళక్కబురు చెప్పి తీసుకుని రావద్దూ!" అంటూ లేచారు శేషగిరి స్నేహితులు.
శేషగిరి స్నేహితులను పంపించి గేటు వేసి లోపలకు వెళ్ళాడు.
శేషగిరి భార్య, కొడుకు, కోడలు కూతురు - అక్కడ కూర్చుని పెకాడుకొంటున్నారు.
"వంటయిందా?" అన్నాడు శేషగిరి.
"ఏం -- ఈ రోజప్పుడే ఆకలిగా ఉందా మీకు?" అంది శేషగిరి భార్య పేక ముక్కల మీంచి దృష్టి మరల్చకుండా .
"ఆకలి కాదు -- సినిమా ఉంది --"
"సినిమా ఏమిటి?" అంది శేషగిరి కూతురు. ఆమె కూడా పేకముక్కల మీంచి దృష్టి మరల్చలేదు.
"మాయాబజార్ -- వీసీఅర్లో -- మనింట్లో !" అన్నాడు శేషగిరి.
ఒక్కసారి అక్కడున్న నలుగురి చేతుల్లోంచి పేక ముక్కలు జారిపడ్డాయి.
"ఏమిటి మీరంటున్నది ?" అంది శేషగిరి భార్య.
శేషగిరి వారందరికీ జరిగిందంతా వివరించి చెప్పాడు.
"చాలా తమాషాగా ఉందే--" అంది శేషగిరి కోడలు.
"ఇందులో ఏదో మోసముంది !" అన్నాడు శేషగిరి కొడుకు.
"ఎమిటంటావ్ ?" అన్నాడు శేషగిరి.
"నాన్నా -- మోసం గురించి అన్నయ్యా నువ్వు చర్చిస్తుండండి . ఈలోగా నేనూ, అమ్మా, వదినా వంట పని పూర్తీ చేసుకుని వస్తాం --" అంటూ లేచింది శేషగిరి కూతురు.
"మాయాబజార్ సినిమా చూసి చాలా కాలమయింది. మొదట్నించి చూడాలి --" అనుకుంటూ లోపలకు నడిచింది శేషగిరి భార్య, మిగతా అడవాళ్ళిద్దరూ ఆమె ననుసరించారు.
"ఏమిట్రా -- ఇందులో మోస మేముంటుంది ?" అన్నాడు శేషగిరి.
"ఏమో -- ఏముంటుందో నేనూ చెప్పలేను. వినగానే అలాగనిపించిందంతే --" అన్నాడు శేషగిరి కొడుకు.
'ఆ కుర్రాడు చాలా బుద్ది మంతుడిలాగానూ, మర్యాదస్టుడిలాగానూ ఉన్నాడు. ఇందులో మోసముండే అవకాశం లేదు. ఇలా వంక పెట్టి మనిల్లు దోచుకుని వెళ్ళిపోడానికి -- మనదేమైనా భాగ్యవంతుల కొంపా ఏమన్నానా?" అన్నాడు శేషగిరి.
"కానీ మనతో పాటు - మరో నాలుగు కుటుంబాలు కూడా సినిమా చూడ్డాని కొస్తాయి కదా!" అన్నాడు శేషగిరి.
"అయితే ఆ నలుగురిళ్ళలోనూ దొంగతనాలు జరుగుతాయంటావా?" అన్నాడు శేషగిరి.
"ఏమో - ఆ నలుగురూ ఎప్పుడూ యిళ్ళకు తాళాలు పెట్టుకుని బైటకు వెళ్ళలేదా? ఈ చుట్టుపక్కల దొంగతనాలు జరగడం వినలేదు నేను...." అన్నాడు శేషగిరి కొడుకు.
"ఏమిటో -- అన్నీ నువ్వే అంటావు -- నీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలియడం లేదు --" అన్నాడు శేషగిరి.
శేషగిరి కొడుకు కొద్ది క్షణాలాలోచించి -- "నాకొకటనిపిస్తోంది ....." అన్నాడు.
"చెప్పు "
"ఆ గోపాల్ మీకన్నీ అబద్దాలు చెప్పాడు. అతడు వీసీఅర్ కొన్నాడనుకొను -- అమ్మే ప్రయత్నంలో ఉన్నాడు ...."
"ఎందుకలాగనుకుంటున్నావు."
"అతడు చెప్పిన కధంతా అనుమానాస్పదంగా ఉంది. టెస్టు చేయకుండా ఎవరూ వీసీఅర్ కొనరు....అందులోనూ ఇతడు పదమూడు వేలకు కొన్నానంటున్నాడు. అదేం తక్కువ మొత్తం కాదు..."
'అయితే ?"
"నా అనుమానం ప్రకారం మీరు చెప్పిన గోపాల్ దగ్గరికి వీసీఅర్ సక్రమమైన మార్గంలో రాలేదు. దాన్నతను స్మగ్లింగ్ చేస్తూనైనా ఉండాలి. లేదా దొంగతనం చేసి ఉండాలి...."
'అయితే మనింట్లో సినిమా చెయడ మెందుకు ?"
"ఎందుకేమిటి ? ప్రచారానికి ...."
"అంటే?"
"ఇంకా అర్ధం కాలేదా నాన్నా! కూడా మాయాబజార్ సినిమా తెచ్చాడు. వీసీఅర్ ఫ్రీగా మనింట్లో సినిమా చేస్తున్నాడు. అంటే - అతడు తన వీసీఅర్ని ప్రదర్శిస్తున్నాడు. పరోక్షంగా మన నా కర్శించాలని చూస్తున్నాడు.
"మనమెందు కాకర్శించబడతాం ?" అన్నాడు శేషగిరి.
"పదమూడు వేల రూపాయలు ఖరీదైన వస్తువు చవగ్గా ఏడెనిమిది వేలకు వస్తే మనమే కాదు- ఎవరైనా ఆకర్షించబడతారు !"
'అంటే అతడు మనకది ఏడెనిమిది వేల కమ్ముతాడంటావా?" అన్నాడు శేషగిరి అనుమానంగా.
"వ్యవహారం చూస్తె నా కలాగే అనిపిస్తోంది....."
'అమ్మితే కోనేద్దాం రా ...." అన్నాడు శేషగిరి.
శేషగిరి కొడుక్కు నవ్వి --"ఇదంతా ఊహ మాత్రమే! వాస్తవం కాదు...." అన్నాడు.
శేషగిరి రవంత నిరుత్సాహపడి -- "చవగ్గా వచ్చే పక్షంలో మనమూ వీసీఅర్ కొందామనుకున్నట్లు అతడికేలా సూచించాలి కదా !" అన్నాడు.
"మనం సూచించడ మెందుకూ ? అమ్మాలను కుంటే అతడే మనకేదో సూచన ఇస్తాడు " అన్నాడు శేషగిరి కొడుకు.
"సూచిస్తే మాత్రం మనం తప్పక కొందాం ' అని. "రాత్రికి రాత్రే ఊరెళ్ళి పోతున్నా నన్నాడు....డబ్బు వెంటనే యివ్వాలో ఏమిటో .....?" అన్నాడు శేషగిరి.
"అవసరమైతే ఆఫీసు డబ్బు - ఇంట్లో ఏడు వేలుంది రేపు బ్యాంకులో టీడీఆర్ మీద లోను తీసి ఆ డబ్బు సర్దేయోచ్చు..."అన్నాడు శేషగిరి కొడుకు.
"ఏడు వేల కతడొప్పుకోకపోతే?"
"దొంగసరుకు కదా - ఎంతకయినా ఒప్పుకుంటాడు. మన దగ్గర డబ్బెక్కు వుంటే మనకు మన దగ్గిరున్న ఏడు వేలూ చాలు ...." అన్నాడు శేషగిరి కొడుకు.
"ఏమో అంతా నీ యిష్టం ...ఇంట్లో వీసీఅరుంటే సుఖంగా తెలుగు సినిమాలు చూడొచ్చు...." అన్నాడు శేషగిరి.
"ఏం సుఖం లెండి- తెలుగు సినిమాలు చూడ్డం ఓ శాపమని అంతా అనుకుంటుంటే ...." అన్నాడు శేషగిరి కొడుకు.
'అది మీ తరం కాదురా -- నీ చిన్నప్పటి దాకా ప్రతి తెలుగు సినిమా ఓ కళాఖండం అనిపింసుకునేది ...."అన్నాడు శేషగిరి.
"పాత సినిమాలు మనూళ్ళో దొరకటం - అంత సులభమేమీ కాదు....' అని - 'అన్నట్లు మనం వీసీఅర్ కొంటె అదేలాంటి కండిషన్ లో వుందో తెలుసుకుందుకు సినిమా చూస్తె సరిపోదు. మా స్నేహితుణ్ణి పిలవనా?" అన్నాడు శేషగిరి కొడుకు.
"ఎవరినీ మిశ్రానా? అతడు చాలా గట్టివాడని విన్నాను. కానీ తెలుగు సినిమా చూడ్డం అతడికి పనిష్మంట్ కదూ?"
"కాదు....ఖరగ్ పూర్ లో చదువుకునే రోజుల్లో అక్కడ తెలుగు మిత్రులతో కలిసి అతడు మాయాబజార్ సినిమా చూశాట్ట. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా అంటే అతడు నమ్మలేనన్నాడు. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుందని అతడు నాతొ చాలసార్లన్నాడు. కాబట్టి అతడు వీసీఅరే కాదు ...తెలుగు సినిమా చూడ్డానిక్కూడా వస్తాడు...."
"సరే అయితే - అతగాడు ఒకే అన్నాడంటే వీసీఅర్ తీసుకుందాం" అన్నాడు శేషగిరి.
అనుకున్న ప్రకారం సరిగ్గా ఏడింటికి సినిమా మొదలయింది. వీసీఅర్ టీవీకి కలిపి పలికించడానికి గోపాల్ ఒక మెకానిక్ ని కూడా తీసుకొచ్చాడు. తన పని అయిపోగానే మెకానిక్ వెళ్ళిపోయాడు.
అందరూ ఉత్సాహంగా సినిమా చూస్తున్నారు.
సినిమా మొదలయిన కాసేపటికి మిశ్రా వచ్చాడు. వస్తూనే అతడు సినిమా చూడసాగాడు.
చూస్తున్నంతసేపూ ఎవరికీ టైము తెలియలేదు.
మూడు గంటలకు పైగా ఉన్న ఆ సినిమా మూడు క్షణాల్లో అయిపోయినట్లుంది.
సినిమా అయిపోయినా చాలామంది ఆ పరవశం నుంచి తేరుకోలేదు.
"వీసీఅర్ బాగుంది -- ఎక్కడా ట్రబులివ్వలేదు ...." అంటూ గోపాల్ని మెచ్చుకున్నాడు శేషగిరి.
"వీసీఅర్ లో ఏముందండీ -- మీ టీవీ రిసెప్ షన్ చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ కంటే బాగుంది" అన్నాడు గోపాల్.
"ఇతడు నా స్నేహితుడు మిశ్రా -- మీ కోసం తీసుకొచ్చాను. వీసీఅర్ కండిషనేలాగుందో చెప్పగలడు. ఎలక్ట్రానిక్స్ ఎక్స్ ఫర్ట్ ...." అన్నాడు శేషగిరి కొడుకు.
"చాలా థాంక్స్ " అన్నాడు గోపాల్.
మిశ్రా వీసీఅర్ చూస్తుంటే గోపాల్ శేషగిరి దగ్గిరగా వెళ్ళాడు.
అప్పటికే సమయం పదిం పావు దాటడం వల్ల శేషగిరి స్నేహితుల కుటుంబాలు వెళ్ళిపోయాయి.
"వీసీఅర్ ఎంతో బాగుంది. అయినా నాకు సంతోషంగా లేదు...." అన్నాడు గోపాల్.
