ప్రదీప్ నా కతడి పేరు మాత్రం చెప్పలేదు.
"అతడి పేరు నీకు అనవసరం. అతడి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండడం అవసరం-" అన్నాడు ప్రదీప్.
"జాగ్రత్తగా ఉండడానికి నేనేం చేయాలి?"
"ఏం చేయాలి? కొన్నాళ్ళపాటు స్మగ్లింగ్ ఆపరేషన్సుకు దూరంగా ఉండు. అయినా నీకు స్మగ్లింగుతో పనేముంది? అది నీ ఫీల్డు కాదు కదా!"
అది నిజమే! ఊరికే రెండులక్షల వాటా వస్తోందని ఒక మిత్రుడు కోరితే అంగీకరించాను. ఆ మిత్రుడి పేరు నేను చెప్పకపోయినా ప్రదీప్ తెలుసుకున్నాడు. ప్రదీప్ కు తెలియని దేముంటుంది?
"నీ మిత్రుడు-ఆ అన్నయ్యకు శత్రువు. అతణ్ణి స్వయంగా దెబ్బతీయడానికి భయపడి-నిన్నిందులో ఇరికించాడు.... ..."
నేను ప్రదీప్ మాటలు లెక్కచేయలేదు. ప్రస్తుతం మరో స్మగ్లింగ్ ఆపరేషన్ లో ఉన్నాను. ఇందులో నా వాటా మూడు లక్షలు.
ఇప్పుడీ ఉత్తరం వచ్చింది.
"ఆ అన్నయ్య మరణశిక్ష గురించి వ్రాశాడంటే నీకు చావు తప్పదు...." అన్నాడు ప్రదీప్ ఉత్తరం చదివేక.
"నా ప్రాణాలు తీయడం అంత తేలిక కాదు..."
"నీకు నిరంజన్ తెలుసా?" అన్నాడు ప్రదీప్.
"తెలియదు...."
"అప్సరాథియేటర్ వెనుక మూడంతస్థుల మేడ ఉంది. అది తెలుసా?"
"తెలుసు...."
"ఆ మేడ నిరంజన్ ది...."
"అయితే?"
ప్రదీప్ నవ్వి-"థియేటర్ పరమానంద కూడా అతడిదే! మనూళ్ళో ఉన్నవాటిలోకల్లా అత్యాధునికం అది....?" అన్నాడు.
"కానీ నిరంజన్ పేరు నేనెక్కడా వినలేదే?" అన్నాను.
"ఇనకవిను.....ఈఊళ్ళో నిరంజన్ కు రెండుహోటళ్ళు, ఓ పెద్ద మార్కెట్ కాంప్లెక్సు ఉన్నాయి...."
"ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు?" అన్నాను చిరాగ్గా.
"ఇంతకీ నిరంజన్ ఎవరో తెలుసా?"
"ఎవరు?"
"జిల్లా పరిషత్తు స్కూల్లో అటెండరు...."
"ఆశ్చర్యం....అలా ప్రారంభించాడన్న మాట జీవితం...."
"ప్రారంభించడం కాదు.....ఇప్పటికీ అతడక్కడ అటెండరే! అతడు తనకుతాను సామాన్యమైన పెంకుటింట్లో జీవిస్తున్నాడు...."
"నాకేమీ అర్ధం కావడంలేదు...."
"ఒక్కమాటలో చెబితే నీకర్ధంకాదు. అందుకే ఇంతలా వివరించాను. ఉదాహరణకు కొందరుద్యోగాలు చేస్తూ కథలు రాసి డబ్బు సంపాదిస్తారు. కొందరు వ్యాపారం చేస్తూ స్మగ్లింగులోకి దిగి డబ్బు సంపాదిస్తారు కొందరు రాజకీయనాయకులై ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తారు. అలా కొందరు-.... ఆగాడు ప్రదీప్.
"ఊఁ చెప్పు..."
"ఒక్క మాటలో చెప్పాలంటే-నిరంజన్ ప్రొఫెషనల్ మర్డరర్...."
ఆశ్చర్యంతో నాకు నోటమాటరాలేదు.
"అతడి సంపాదనంతా హాబీమీద సంపాదించిందే! హత్యలు చేయడంలో అతడి కెదురులేదు...."
"నువ్వు నిజమే చెబుతున్నావా?"
"నిజం తప్ప మరొకటి చెప్పాల్సిన అవసరం నాకే ముంది? నేను నీ స్నేహితుణ్ణి!"
"ఇంతకీ ఇప్పుడా నిరంజన్ ప్రసక్తి ఎందుకు?"
"నేను నీకెలాంటి స్నేహితుడినొ-ఆ అన్నయ్యకు నిరంజన్ అలాంటి స్నేహితుడు...."
అర్ధమవుతోంది నాకు. అయినా-"అయితే?" అన్నాను.
"నిరంజన్ నిన్ను చంపాలనుకుంటే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు. అంతే!"
"ఇప్పుడు నన్నేం చేయమంటావు?"
"నా మాట విని-నీ స్మగ్లింగ్ ఆపరేషన్ మానుకో. అన్నయ్యతో శత్రుత్వం పెట్టుకోకు...."
డబ్బు సంపాదించేవాడిలో భయాన్ని ప్రవేశపెడుతున్నావు....."
"భయపడితే నీ డబ్బు నిన్ను సుఖపెడుతుంది. ఆశ పెరిగితే నీడబ్బే నిన్ను చంపుతుంది....."
"ఈరోజు-ఆ అన్నయ్య బెదిరించాడు. రేపింకొకడు నన్ను వ్యాపారం మానేయమని బెదిరించవచ్చు" అన్నాను.
"నాకు తెలిసింది నీకు చెప్పగలను. నా అనుభవంతో నీకు సలహా యివ్వగలను. నేను నిన్ను శాసించలేను...." అన్నాడు ప్రదీప్.
5
నేను వెళ్ళేసరికి నిరంజన్ ఇంట్లోనే ఉన్నాడు. అతణ్ణి చూసి ఆశ్చర్యపోయాను.
అతడి ఎత్తు ఆయిదడుగుల మూడంగుళాలు. మనిషిని చూడగానే యాభైకేజీలైనా ఉంటాడా అనిపిస్తుంది. సన్నగా ఉన్నాడు. పరీక్షించి చూస్తే తప్ప వయసున్న వాడనిపించదు.
అతణ్ణి ప్రొఫెషనల్ మర్డరర్ అంటే నమ్మడం కష్టం.
ఇల్లు కూడా చాలా సింపుల్ గా ఉంది.
డ్రాయింగ్ రూంలో కుర్చీలుకూడా లేవు. అతడు నా కోసం చాప వేశాడు.
ఇద్దరం చాపమీద ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నాం.
"పాలు పుచ్చుకుంటారా?" అన్నాడతడు.
నేను తల అడ్డంగా ఊపాను.
"మా యింట్లో కాఫీ, టీలు నిషిద్ధం...." అన్నాడు నిరంజన్.
నేను మరోసారి ఆశ్చర్యపడి-"ఈరోజుల్లో ఇలాంటి వారు అరుదు-" అన్నాను.
"అదంత అరుదైన విశేషమేంకాదు. మీరు వచ్చిన పని చెప్పండి" అన్నాడు నిరంజన్.
"మిమ్మల్ని చూసేక నేను వచ్చినపని చెప్పడానికి సందేహిస్తున్నాను" అన్నాను.
నిరంజన్ గంభీరంగా-"మీరు చంపమనే వ్యక్తి నా స్నేహితుడు కాకుండా ఉంటే చాలు....ఇంకే షరతులు లేవు. ఎటొచ్చీ నారేటు చాలా ఎక్కువ. నడిరోడ్డుమీద నిస్సహాయుడై తిరిగే బిచ్చగాన్ని చంపడానికే నేను పాతికవేలు తక్కువ పుచ్చుకోను-" అన్నాడు.
"మీరు హత్యలు చేస్తారా? మిమ్మల్ని చూస్తే అలా గనిపించదు" అన్నానేమీ ఎరుగనట్లు.
"నన్ను హత్యలు చేయమని పురమాయించేవాళ్ళను చూసినా మీ కలాగనిపించదు. ఎందుకంటే వాళ్ళలో చాలామంది మన నాయకులు...."
"మీరు మరీ ఓపెన్ గా మట్లాడుతున్నారు. పట్టుబడతారన్న భయం లేదా?" అన్నాను.
"నేను సిద్దేంద్రస్వామి భక్తున్ని. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు...." అన్నాడు నిరంజన్.
ఉలిక్కిపడ్డాను. సిద్దేంద్రస్వామి భక్తుడు హంతకుడా? అందులోనూ కిరాయి హంతకుడు.....
"ఆశ్చర్యంగా ఉంది. సిద్దేంద్రస్వామి అవతారపురుషుడు. ఆయన్ని నమ్మిన మీరు హత్యలెలా చేయగల్గుతున్నారు?"
నిరంజన్ నవ్వి-"భగవంతుడు హత్యలు చేయడనీ, చేయించడనీ మీ నమ్మకమైతే అది మార్చుకోండి. అగ్నిపర్వతాలు బద్దలైనా, సముద్రాలు పొంగినా, క్షామం తలెత్తినా, యుద్దాలు చెలరేగినా భగవంతుడి ఆదేశమే అందుకు కారణం. హత్యలు చేయడానికి భగవంతుడొకోసారి ప్రకృతిశక్తులనీ, ఒకసారి మనుష్యశక్తినీ నిర్దేశిస్తాడు. రెండోది జరిగినప్పుడు నావంటివారు హత్యలు చేస్తారు-" అన్నాడు.
