Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 23

 

    "మళ్ళీ కనబడలేదా నీకా దెయ్యం?" అనడిగాడు ముకుందరావు.
    "లేదండి " అన్నాడు సుబ్బయ్య.
    "నేను చూసిన దెయ్యం ముఖం నల్లగా భయంకరంగా వుంది" అన్నాడు ప్రతాప్.
    "అయ్య బాబోయ్ రెండు దయ్యాలన్నమాట!" అన్నాడు సుబ్బయ్య.
    "రెండని ఎందుకనుకోవాలి? ఒకే దెయ్యం యెన్ని వేషాలైనా మార్చగలదు గదా!" అన్నాడు సుబ్బారావు.
    "నేనింక అ గదిలోకి వెళ్ళను" అన్నాడు ప్రతాప్.
    "ఎవరైనా లోకువకట్టి నిన్నేడిపిస్తున్నారేమో?" అన్నాడు సుబ్బారావు.
    "ఈ రోజుతో అన్ని సందేహాలు తీరిపోతాయి. ఆ దెయ్యం మనిషి, జంతువూ కాని ఒక కంఠంతో అరిచింది. అది చాలా విచిత్రమైన అరుపు. నేను దెయ్యం అని భ్రాంతి పడుతూనైనా వుండాలి , నిజంగా దెయ్యమైనా అయుండాలి --తప్పితే అది మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఆ అరుపు మానవాతీతశక్తి , అందులో నాకింకేమీ సందేహం లేదు "అన్నాడు ప్రతాప్ నమ్మకంగా.
    "అయితే ఏం చేద్దాం?" అన్నాడు ముకుందరావు.
    "నేను మీ గదిలో పడుకుంటాను...." అన్నాడు ప్రతాప్.
    ప్రతాప్ గదికి తాళం కూడా ముకున్దరావే వేశాడు. ముగ్గురూ సుబ్బారావు గదిలో పడుకున్నారు.

                                    4
    "టైము పన్నెండయిండాలి" అన్నాడు ప్రతాప్.
    "ఏం?" అన్నాడు ముకుందరావు.
    "ఆ టైమయ్యే సరికి నాకు తెలియకుండానే నరాల్లో సంచలనం పుట్టుకొస్తోంది. వళ్ళంతా వణికిపోతోంది." అన్నాడు ప్రతాప్.
    సుబ్బారావు వాచీ వంక చూసి "నువ్వు చెప్పింది కరెక్టే !" అన్నాడు.
    ప్రతాప్ నిజంగా వణుకుతున్నాడు. అతణ్ణి భయం నరనరాలా అవహించినట్లుంది.
    "దెయ్యం వస్తుందంటావా?" అన్నాడు ముకుందరావు.
    "రాకపోతే సంతోషిస్తాను. కానీ వస్తుందేమో అని భయంగా వుంది" అన్నాడు . ప్రతాప్ మాటలో వణుకు స్పష్టంగా తెలుస్తోంది.
    "మేమున్నామని రాదేమో?" అన్నాడు ముకుందరావు.
    "ఏదో కారణంగా రాకపోతే చాలు...." ఇంకా ఏదో అనబోతూ ఆగిపోయాడు ప్రతాప్. అతడి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి--" అదిగో దెయ్యం వచ్చింది ....." అన్నాడు, ఆతర్వాత అతడి గొంతు పెగలలేదు. మనిషిలో వణుకు ఇంకా పెరిగింది.
    ముకుందరావు , సుబ్బారావు అటూ ఇటూ చూసి "ఎక్కడ ?" అనడిగారు.
    'అదిగో - ఆ కిటికీ దగ్గర" అన్నాడు.
    "నాకేం కనిపించడం లేదు" అన్నాడు ముకుందరావు.
    "నాకూ కనిపించడం లేదు" అన్నాడు సుబ్బారావు.
    'అదిగో ఆ భయంకరమైన చేతులు చూడండి. చెవులు బద్దలయ్యే ఆ శబ్దాన్ని వినండి" అసహనంగా అరిచాడు ప్రతాప్.
    "శబ్ధమా?" ఆశ్చర్యంగా అన్నాడు ముకుందరావు. "ప్రశాంతంగా వున్న ఆ గదిలో శబ్దమంటావేమిటి?"
    "నువ్వేదో భ్రాంతి పడుతున్నావ్ ప్రతాప్!" అన్నాడు సుబ్బారావు.
    "దెయ్యం నాకు స్పష్టంగా కనబడుతోంది. అది చేసే శబ్దం కర్ణకఠోరంగా వినబడుతోంది. మీకేమీ కనబడలేదు. వినబడలేదు -- అంటుంటే ఆ భయం పెరుగుతోంది" అన్నాడు ప్రతాప్.
    "కిటికీ దగ్గరకు వెళ్ళి తలుపు తీస్తాను" అన్నాడు సుబ్బారావు.
    "వద్దు. మీ ఇద్దరికీ కాక నాకు మాత్రమే కనబడే అ దెయ్యం లోపలకు ప్రవేశించి నామిదేక్కి కూర్చున్నా కూర్చోగలదు" అంటూ అరిచాడు ప్రతాప్. అతడు కిటికీ వైపు చూడడం లేదు.
    'అది దెయ్యమే అయితే దాన్ని కిటికీ తలుపు లడ్డగలవా?" అంటూ సుబ్బారావు కిటికీ దగ్గరకు వెళ్ళి తలుపులు తెరిచాడు. ముకుందరావు కూడా అతన్ని సమీపించి, "ఇక్కడేమీ లేదే?" అన్నాడు.
    "రోజూ ఇంతసేపే వుంటుంది. ఈరోజు కూడా తన పని కానిచ్చుకుని వెళ్ళిపోయింది. అసలు విషయం ఈ రోజు తెలిసిపోయింది. అది నామీద మాత్రమే పగ పట్టింది. అందుకే నాకొక్కడికే కనిపించింది" అన్నాడు ప్రతాప్. మాట్లాడుతుంటే అతడిలో ఆయాసం స్పష్టంగా తెలుస్తోంది.
    "నువ్వెవరైనా సైకాలజిస్టును సంప్రదించటం మంచిది, ఏదో భ్రమలో వున్నావని నా అనుమానం. నీమీద పగ వున్న బంధవు లెవరైనా ఇటీవల చచ్చిపోయేరా?" అడిగాడు ముకుందరావు.
    "నిస్సందేహంగా ఇది దెయ్యమేనని తేలింది కదా-" రేపు ఇందుకు పాయం ఆలోచించాలి. లక్ష్మీ నారాయణను కలుసుకుంటాను. అన్ని వివరాలూ నేను సరిగా చెప్పలేనేమోనని భయంగా వుంది. మీరిద్దరూ కాస్త నా పక్కనుండాలి " అన్నాడు ప్రతాప్.
    "తప్పకుండా!" అన్నారిద్దరూ.
    
                                5
    "నువ్వు చెప్పింది నిజమే అయితే అది దెయ్యం అనడంలో సందేహం లేదు- " అన్నాడు లక్ష్మీనారాయణ.
    లక్ష్మీనారాయణ కూ, ప్రతాప్ కపూ స్నేహముందనడానికి కారణం దైవభక్తే! ఇద్దరూ భజనల దగ్గర కలుస్తుంటారు. ఎటొచ్చీ లక్ష్మీనారాయణ ఏ దేవుడి గురించి ప్రచారం చేయడు. తను పాపాలు చేస్తున్నారని, వాటిని మానడం కష్టమనీ గ్రహించి వాటి పరిహారానికి సులభమైన పద్దతి దేవుణ్ని భుజించడం అని నమ్మించాడు. అతడికి అన్ని రకాల దురలవాట్లూ వున్నాయి. దేవుణ్ణి మాత్రం ఎన్నడూ హేళన చేయడు.
    "ఏం చేయాలో పాలుపోవడం లేదు నాకు!" అన్నాడు ప్రతాప్ దీనంగా.
    "మా అమ్మగారు నాకు రెండ్రోజుల క్రితం పోస్టులో కొంత కుంకుం పంపించారు. అది పార్వతీదేవికి పూజ చేసిన కుంకుమట. అది దగ్గరుంటే నీ దుష్టశక్తులూ పీడించవుట. దగ్గరకు రాలేవుట. ఇలాంటి వాటిమీద నీకు నమ్మక ముందంటే కొంత నీకూ యివ్వగలను" అన్నాడు లక్ష్మీ నారాయణ.
    "నాకు చాలా నమ్మకం, తప్పకుండా ఇయ్యి" అన్నాడు ప్రతాప్.
    "అలాగే యిస్తాను. కానీ ఈ కుంకం నీ దగ్గరున్నప్పుడు నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి. ఏమైనా శంకలు తీర్చుకోవలసి వస్తే కుంకాన్ని వేరే వుంచి, శంక తీరాక స్నానం చేసి మరీ కుంకాన్ని దగ్గరుంచుకోవాలి. రాత్రి పడుకోబోయేముందు కుంకాన్ని తలగడ క్రింద వుంచుకొని ఎనిమిదిసార్లు ఆంజనేయ నామం స్మరించి నిద్రపోతే ఏ బాధా వుండదు."
    'అయితే ఇప్పుడు నేను స్నానం చేయవలసిన అవసరం వుంది. బాత్ర్రూం ఉపయోగించుకోవచ్చా" అన్నాడు ప్రతాప్.
    "నిస్సందేహంగా !" అన్నాడు లక్ష్మీనారాయణ.
    ప్రతాప్ లక్ష్మీనారాయణ యింట్లోనే స్నానం చేసి అతడి దగ్గర ఓ ఇస్త్రీ లుంగీ అడిగి పట్టుకున్నాడు. అతడిచ్చిన కుంకాన్ని తీసుకుని తన గదికి వెళ్ళి జాగ్రత్తగా భద్రపరిచాక బట్టలు మార్చుకుని లుంగీ తీసుకుని వెళ్ళి లక్ష్మీనారాయణ కిచ్చేశాడు.
    "కుంకుం పని చెస్తుందంటారా?" అనడిగాడు సుబ్బారావు.
    'అలాంటి ప్రశ్నలు నా ఎదురుగా వేయవద్దు అన్నాడు ప్రతాప్.

                                     6
    
    'అతడి గదిలో ఇప్పుడు కుంకముంది" అన్నాడు ముకుందరావు.
    'అది నేనే ఇచ్చాను" అన్నాడు లక్ష్మీనారాయణ.
    'అంటే ఈరోజుకు దెయ్యం ప్రతాప్ ని బాధించదు అన్నాడు సూర్యం.
    "నీ అయిడియా ఏమిటో పూర్తిగా చెప్పు" అన్నాడు సుబ్బారావు.
    "రోజురోజుకూ ప్రతాప్ నమ్మకం పెరుగుపోతోంది" అది దేయ్యమేనన్న నమ్మకం అతడిలో నానాటికి పారిపోవాలి." అన్నాడు సూర్యం.
    'అందువల్ల ప్రయోజనం ?" అన్నాడు ముకుందరావు.
    "ప్రతాప్ వ్యవహారం భవనంలో చాలామందికి కాలక్షేపంగా వుంది. అయితే నేనిది కేవలం కాలక్షేపం కోసం చేయడం లేదు. ప్రతాప్ తను ఓ మనిషిని దైవముగా నమ్మి ఆ దైవం గురించి విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. అ ప్రత్యక్ష దైవం మీద అతడి కున్న నమ్మకమూ, ఇతరులకతడి ప్రచారం మీద వుండే ఆసక్తిని పోగొడితే, నేను కొంత ప్రజాసేవ చేసినవాడిని అవుతాను. కుంకుం కోసం లక్ష్మీ నారాయణ దగ్గరకు వచ్చాడంటే -- ప్రతాప్ లో చాలా వరకు నేను కోరిన మార్పు వస్తోందన్నమాట! కాని ఇంకా ఈ అణు యుగంలో దెయ్యాన్ని నమ్మేవాళ్ళూ దాన్ని దేవుడి కుంకంతో పారద్రోలవచ్చు ననుకునేవాళ్ళూ వుండడం దురదృష్టం" అన్నాడు సూర్యం.
    "ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కానీ ఈ నీ అట మాకందరికీ మంచి వినోదాన్నిస్తోంది. అందుకే అంతా నీకు సహకరిస్తున్నాం" అన్నాడు లక్ష్మీనారాయణ.
    "ఎదుటి మనిషి బలహీనత నాధారంగా చేసుకుని మనిషి మనిషిని హింసించడం అన్యాయమని ఒకప్పుడనుకునేవాడ్ని. కానీ ఎందుకో ప్రతాప్ మీద అసహ్యమే తప్ప జాలి కలగడం లేదు నాకు" అన్నాడు సూర్యం.
    "కానీ నువ్వాడే దెయ్యం అట నిజంగానే అద్భుతం. నీ కాళ్ళు ఏ జింకవో అనిపిస్తున్నాయి. క్షణాల మీద మాయం కాగల్గుతున్నాయి. నువ్వరిచిన అరుపు మానవాతీతమైనదని ప్రతాప్ అంటున్నాడు" అన్నాడు ముకుందరావు.
    'అదంతా నమ్మకం కలిగించే భ్రాంతి. నిన్న చప్పుడు వినిపించి కూడా వినిపించలేదని, నన్ను చూసి కూడా చూడలేదని మీరాడిన నటన మాత్రం అద్భుతం కాదా?" అన్నాడు సూర్యం.
    "కానీ మనమిది యిలా ఎంతకాలం కొనసాగిస్తాం?" అన్నాడు సుబ్బారావు.
    'ఆరంభమే కానీ అంతం నాకూ తెలియడం లేదు. చూద్దాం. న్యూటన్సు లా ప్రకారం ఏదైనా సరే అలా ఆగకుండా నడిచిపోదు. ఎక్కడో అక్కడ ఆగాలి. ఎందుకంటె ఈ ప్రపంచంలో ఫ్రిక్షన్ లేనిదెక్కడ?" అన్నాడు సూర్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS