"మీ అభిప్రాయం చెప్పండన్నగారూ-" అంది మహాలక్ష్మి.
సుబ్బారావు సాలోచనగా - "మా ఆవిడా నేనూ ఉండగా మాటలు జరిగిపోయుంటే బాగుండేది. నేను రోజల్లా బ్యాంకులోనే వున్నాను. కబురు పంపాల్సింది" అన్నాడు.
"ఎదురింటి కుర్రాడిని కబురు పంపాం. అతడు మీతో కబురు చెప్పాననే అన్నాడు. అందుకే మీ గురించి చాలాసేపు ఎదురుచూశాం. ఆయనేమో ఊళ్ళోలేరు. ఆ విషయం వదినగారికి చెప్పలేదు. మొగుడు లేకుండానే వ్యవహారాలు చక్కబెట్టేస్తోంది అని అనుకుంటారని భయపడి - ఆయనే బ్యాంకుకు వెళ్ళారని వదినగారికి చెప్పాను. వాసుదేవరావు రేపు వెళ్ళిపోవాలి. అందుకని తొందరపడ్డాను. అదృష్టం బాగుంది. ఆయనా వచ్చారు. మీరూ వచ్చారు-" అంది మహాలక్ష్మి.
విషయం నిజంగానైనా జరిగుండాలి-లేదా మహాలక్ష్మికి అబద్దాలాడ్డంలో చాలా నేర్పండి వుండాలని అనుకున్నాడు సుబ్బారావు.
ఎవరో చాలా పెద్ద నాటకం ఆడుతున్నారు. ఈ నాటకానికి చివరి అంతం రేపు వస్తుంది. అప్పుడేదో జరుగుతుంది. దాని ఫలితంగా తన బ్యాంకు కొన్ని లక్షలు నష్టపోతుంది.
రేపు ఏం జరగబోతోంది?
"అన్నయ్యగారు మాట్లాడడంలేదు-"అన్నది మహలక్ష్మి.
బ్యాంకుకు సంబంధించి పెద్ద చిక్కులో పడ్డాను. ఆ సమస్య తేలేవరకూ కుటుంబ వ్యవహారాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేను. మీకు సంబంధించినంతవరకూ అభ్యంతరం చెప్పడానికి కారణమేమీ కనబడ్డంలేదు. అయినా నేను వెంటనే ఏ మాటా చెప్పకపోవడానికి కారణం ఒక్కటే-ఒక్కసారి నేను మాటిచ్చానంటే మరి తిరుగుండదు!" అన్నాడు సుబ్బారావు.
"సరేలెండి-మీ యిబ్బందులేవో మీకుంటాయి. మీకు వీలుకాగానే చెప్పండి. అటు అమ్మాయీ ఇటు అబ్బాయీ ఇష్టపడ్డ సంబంధ మొకటి. ఒకసారి అనుకున్నదే అయిన సంబంధ మింకోటి-ఈ రెండూ సెటిలైపోవడానికింక మీరు ఊఁ అనడం మాత్రమే అడ్డు-" అన్నాడు సూర్యనారాయణ.
"సూర్యనారాయణగారూ- మీ ఎదురింటి కుర్రాడి నోసారి కనుక్కుని - నాకెందుకు కబురు చెప్పలేదో, చెప్పేనని ఎందుకబద్ధమాడాడో అడిగి తెలుసుకోండి. ఆ సమాచారం నాకు చాలా అవసరం -" అన్నాడు సుబ్బారావు.
"ఆఁ ఎందుకులెండి వృధాశ్రమ - తను చెప్పలేదని ఆ కుర్రాడొప్పుకుంటాడేమిటీ?" అంది మహాలక్ష్మి.
సుబ్బారావు మరి నొక్కించకుండా - "సరేలెండి, మళ్ళీ వస్తాను-"అని లేచి వెళ్ళిపోయాడు. సురేంద్ర ఆయన్ననుసరిస్తూన్నప్పుడు-ఎవరూ చూడకుండా అప్సర ఒకసారి అతడి చేయి నొక్కివదిలింది.
8
"హలో-సుబ్బారావుగారేనా మాట్లాడుతూంట-"
"అవును-ఎవరది?
"నాగు చెప్పేవుంటాడు. నా పేరు రంగనాథ్ -"
సుబ్బారావుకు క్షణం మాటరాలేదు-"చెప్పాడు-" అన్నాడు క్షణం ఆగి.
"అన్నీ గుర్తున్నాయి కదా-ఏమీ మర్పిపోరు కదా-"
"నేను బాధ్యతగల ఉద్యోగిని. నా బాధ్యతలు నే నెప్పుడూ మరిచిపోను-" అన్నాడు సుబ్బారావు గంభీరంగా.
"మంచిది కానీ మనిషి ఉద్యోగం చేసేది బ్రతకడం కోసమేనని వేరే నేను చెప్పక్కర్లేదు. జీవితంపట్లకూడా మీకు చాలా బాధ్యతలున్నాయి. అవీ మీరు మరిచిపోకూడదు. గోటితోనూ, తల వెంట్రుకతోనూ పోయే విషయాన్ని తలకాయడాక లాగకండి-నాగు హెచ్చరికలన్నీ గుర్తుంచుకోండి-"
కంఠం కాస్త కటువుగా ధ్వనించగా సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. ఆయనకు పిల్లలు, భార్య-వీళ్ళే జీవితం, వాళ్ళకు ఊహలో ఆపద కలిగినా భరించలేడు.
"సుబ్బారావుగారూ-మీ సంగతి నాకు పూర్తిగా తెలుసును. మీమీద గౌరవంతో, పూర్తి నమ్మకంతో- మీ భార్యాబిడ్డలు ముందుగానే మీ యింటికి చేరే ఏర్పాటుచేశాను. రేపు నేను ఫెయిలయ్యానంటే-మీ కుటుంబం ఏమైపోతుందో నాకే తెలియదు. ఎందుకంటే కోపంలో నేనేం చేస్తానో నాకు తెలియదు-"
"బెదిరింపా?"
"కాదు - సమాచారం! ముందుగానే ఈ సంగతీ తెలిసుంటే జాగ్రత్తపడేవాడినని తర్వాత మీరు విచారించకుండా - ఈ సమాచారాన్నందిస్తున్నాను. మనం ఒకపని చేయబోయేముందు పూర్వాపరాలాలోచించాలి గదా-అలా ఆలోచించడానికి సమాచారం కావాలి గదా-అదే నేను మీకు చెప్పాను-"
"సరే-థాంక్సు-"
"నో మెన్ షన్! మీరేమీ కంగారు పడకండి-ఎటొచ్చీ రేపు కూడా మీ పనులన్నీ ఎప్పటిలాగే చేసుకోండి. పోలీసుల గురించిన ఆలోచన బుర్రలోకి రానీయకండి. పోలీసులు హంతకుల్ని పట్టుకోగలరుకానీ హత్యల్ని ఆపలేరు. మీ ధ్యేయం హత్యలు జరుగకూడదనేకదా-"
"సరే- రేపు నేను చేయవలసినదంటూ స్పెషల్ గా ఏమీ లేదుగదా-"
"ఏమీలేదు. నాగు చెప్పినట్లు చేస్తే చాలు. మిగతా వన్నీ నేను చూసుకుంటాను-"
"మీ కబుర్లూ, చేతలూ చూస్తూంటే ఆరితేరినవారిలా గున్నారు-నా సహాయం అవసరం లేకుండానే మీ పనులు మీరు ముగించుకోగలరేమో-ఎందుకీ రిస్కు తీసుకుంటున్నారు?"
"ఆ రిస్కుకంటే-ఈ రిస్కే మంచిది. మా గురించి తెలియని వాళ్ళకి మేమంటే అంత భయముండదు. తెలిసినవాళ్ళలో ఏ ఇబ్బందీ ఉండదు. అందుకే..."
"అయ్ సీ..." అని-"మరి నేను సెలవు తీసుకోవచ్చా?" అన్నాడు సుబ్బారావు.
"అలాగే-మీరు సాయపడ్డందుకు మీ ఋణముంచుకోములెండి. మీ యింట త్వరలోనే వైభవంగా కల్యాణాలు జరుగుతాయి-"
అవతలవైపు క్లిక్ మంది. సుబ్బారావుకూడా ఫోన్ పెట్టేశాడు.
ఉదయం లేస్తూనే సుబ్బారావు భార్యను పిలిచాడు. ఆయనకు రకరకాల ఆలోచనలలో రాత్రి తెల్లవార్లూ నిద్రపట్టలేదు.
సులోచన హడావుడిగా వచ్చి-"మెలకువొచ్చిందా?" అంటూ పలకరించింది.
"వచ్చింది కానీ అందరూ త్వరగా తెమలండి. ఈ రోజు మీరందరూ నాతోపాటే బయల్దేరాలి-" అన్నాడు సుబ్బారావు.
"అదేమిటండీ-" అంది సులోచన ఆశ్చర్యంగా.
"కారణం ఇది అని చెప్పలేను కానీ - ఏదైనా ప్రమాదం జరుగవచ్చునని నాకు భయంగా వుంది. ఈ రోజు మీరెవ్వరూ ఇంట్లో వుండిపోవద్దు. అమ్మాయేమో కాలేజీలో రోజల్లా ఫ్రెండ్సుతోనే గడపాలి. యెవరు వచ్చి పిల్చినా వెళ్ళకూడదు. అలాగే అబ్బాయి ఆఫీసులో తనతోటి ఉద్యోగస్థుల్లో గడుపుతాడు. నువ్వు ఇన్ స్పెక్టర్ మధుమూర్తి యింట్లో కాలక్షేపం చేద్దువుగాని, బాగా ఆలోచించే నేనీ నిర్ణయానికి వచ్చాను. ఎందుకని అడగొద్దు. ఇంకేమీ చెప్పొద్దు-" అన్నాడు సుబ్బారావు.
సులోచన ఆశ్చర్యంగా భర్తవంక చూసింది. వేళాకోళంగా ఏదో అనబోయి ఆయన ముఖం గంభీరంగా వుండడం చూసి ఇంకేమీ మాట్లాడలేదు. పదికి లోపు గానే అందరూ బయల్దేరాల్సిన అవసరముండడంవల్ల పనులన్నీ తొందరగా చేయడంకోసం లోపలకు పరుగెత్తింది.
అయితే టైము సుమారు పావు తక్కువ తొమ్మిది అవుతున్న సమయంలో ఎవరో వీధి తలుపులు తట్టారు. సుబ్బారావే స్వయంగా వెళ్ళి తలుపులు తీశాడు.
