సుమారు మూడు రోజులు గడిచాక శ్రీధర బాబు దగ్గర నుంచి ఒక కార్డు వచ్చింది. తనపని ఇంకా కాలేదని బహుశా మరి వారం రోజుల వరకు తను రాలేక పోవచ్చుననీ అతను రాశాడు. ఈ విషయం పార్వతికి చెప్పగా ఆమె కంగారును వ్యక్తపరుస్తూ "పెద్ద ఇబ్బంది వచ్చిందే!" అని ఊరుకుంది.
నాకేమీ ఇబ్బంది అనిపించలేదు, ఆ కార్డు ఇచ్చిన బలంతో ఆమెను మరికాస్త దగ్గరగా లాక్కుని - "ఇది దేవుడు నాకిచ్చిన అపూర్వావకాశం అన్నాను. ఆమె నావంక ప్రేమగా చూస్తూ --" మీరు మరోలా అనుకోనంటే అడుగుతాను. అన్నయ్య వచ్చేవరకు నాకు కాస్త డబ్బు సర్ధగలరా ?" అంది.
నాకు జాలి కలిగి "ఎంతేమిటి?" అన్నాను.
"చిన్న మొత్తమయితే నాకు బెంగ లేదు. ఈ రోజు నేను సాయంత్రం నాలుగు గంటల లోపులో ఒక నెక్ లెస్ కొనుక్కో వలసి ఉన్నది. అసలు నేను అన్నయ్య దగ్గరకి వచ్చినదే అందుకు-"
"నాకు సరిగ్గా అర్ధం కాలేదు. నెక్ లెస్ కొనుక్కోవడానికి ఒక ప్రత్యెక మైన టైమెందుకు?" అన్నాను.
ఆమె వివరించింది. ఆమె కొనబోయే నగ గురించి తన ఉళ్ళో నే నిర్ణయించుకుంది. ఆమె స్నేహితురాలు అదే రకం నగను ఈ ఊళ్ళో ఒక స్మగ్లింగ్ వ్యాపారస్తుని దగ్గర కొంది. పార్వతి అభిలాష , విన్నాక ఆమె స్నేహితురాలు తనకు తెలిసిన వారిద్వారా ఎంక్వయిరీ చేయించింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అనగా స్మగ్లర్ వద్ద ఉంటుంది. దాని ఖరీదు పదహారు వందల యాభై అయిదు రూపాయలు.
నా దగ్గర ప్రస్తుతం ఆఫీసు డబ్బు పన్నెండు వేల రూపాయలుంది. ఉళ్ళో నా బ్యాంకు బేలన్స్ రూపాయాలలో అయిదంకెల స్థానంలో ఉంది. నేను ఆమె అడిగిన మొత్తాన్ని అప్పుగానేం కర్మ -- బహుమతిగానే ఇవ్వగలను - " ఇంతకూ మీ అన్నయ్యకు నగ కొనబోతున్న విషయం తెలుసా?" అనడిగాను.
"తెలియదు. వాడి దగ్గర డబ్బుంటుందని మాత్రం తెలుసు. ఎటొచ్చీ ఇదంతా విని ఏమంటాడో మాత్రం తెలియదు."
నేను కాస్త గర్వంగా ముఖం పెట్టి -- "ఇది కొనడానికి జంకకు. మీ అన్న వద్దంటాడన్న అనుమానం ఉంటె అది నా కానుకగా భావించు" అన్నాను.
ఆమె ముందు కాస్త ఆశ్చర్యపడినట్లుగా కనబడింది. ఆ తర్వాత లేత తామర తూడు ల్లాంటి తన రెండు చేతుల్నీ నా నడుము చుట్టూ చుట్టింది.
పార్వతీ -- నీ వంటి ఆడది ఊ అనే అదృష్టం పట్టాక గానీ ఈ డబ్బు నాకో లెక్క లోది కాదు -" అనుకున్నాను.
7
నేను అక్కడ మొత్తం పదహారు రోజులు గడిపాను. శ్రీధరబాబు ఐపు లేడు. పార్వతీ , నేనూ విచ్చలవిడిగా విహారం సలిపాం. నాకు పార్వతి గురించి రొక్ఖం రూపేణా అయిన ఖర్చు రెండు వేల పై చిలుకు, కానీ నేనందుకున్న అనుభవపు టనుభూతులు ఊహకందనిది, పార్వతి ఇంటికి వెళ్ళి పోవలసి ఉన్న కారణంగా నేను నా ఆఫీసుకు ఎక్స్ టెన్షన్ గురించి రాయవలసిన అవసరం కలగలేదు.
వెళ్ళి పోయేటప్పుడు పార్వతి తన గురించి టెలిగ్రామ్ కాగితం నింపి ఆవల పారేసి - "తను లేని సమయంలో నేనిక్కడకు వచ్చి పదహారు రోజులు గడిపి వెళ్ళిన సంగతి అన్నయ్యకు తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది. "అంది.
అదంత సులభం కాదని నాకు తెలుసు. ఆ వీధిలో ఎంతో మంది ఆమెను చూశారు. ఆఫీసు పని మీద వచ్చిన నాకూ ఆమెకూ గల సంబంధం ఏమిటో ఎంత మందికి తెలుసునో నాకు తెలీదు. ఇంటాయన లేకపోవడమూ, శ్రీధరబాబు కు పనిమనిషి అంటూ ఎవరు ఉండక పోవడమూ బహుశా మా వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి కొంత వరకు సహకరించవచ్చు. ఎటొచ్చీ ఇంటాయన తిరిగి వచ్చేక శ్రీధరబాబు ఆయన్ను కలిసేక అసలు టెలిగ్రాం అనేదొకటి వచ్చిన సంగతి తెలుస్తుంది.
మరి పార్వతి ఇంటి దగ్గర వాళ్ళకు ఎలాగూ తెలుస్తుంది కదా - ఆ అనుమానాన్ని పార్వతి వ్యక్త పరచగా ఆమె నవ్వి - "ఆ భయం నాకు లేదు. నేను అన్నయ్య దగ్గరకు వేడుతున్నట్లుగా ఇంట్లో చెప్పలేదు. నా స్నేహితురాలితో కలిసి ఎక్కడికో వెడుతున్నట్లుగా ఇంట్లో చెప్పి బయల్దేరి చెరో చోటికీ ప్రయాణమయ్యాం. నేను ముందు నా స్నేహితురాలిని కలిసేకనే ఇంటికి వెడతాను" అంది.
'అసాధ్యురాలివే!" అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాయి - ఒక్క పార్వతి విపరీత ప్రవర్తనకు కారణ మేమిటీ అన్న ప్రశ్నకు తప్ప.
పార్వతి నగ కొనాలనుకుంది. తను బయల్దేరి వస్తున్నట్లుగా అన్నకు టెలిగ్రామ్ ఇచ్చింది. అన్న లేకపోతె నా దగ్గర డబ్బు తీసుకుని నగ కొనుక్కుంది. ఇది అని చెప్పలేని కారణాల వల్ల నాతొ కొన్ని రోజులు సంసారం చేసింది. అందుకు ప్రతిఫలం నా దగ్గర ధన రూపేణా పొందింది . ఇప్పుడు తిరిగి ఇంటికి వెడుతోంది. అటు అన్నకు, ఇటు తలిదండ్రులకు తన రహస్యం తెలియకుండా జాగ్రత్త పడుతోంది.
నా ఆఫీసు పని ముగిసింది. పార్వతి వెళ్ళిపోయింది. ఆ కారణంగా నేను తిరుగు ప్రయాణం చేయవలసి ఉంది. శ్రీధరబాబు నించి మళ్ళీ ఉత్తరం లేదు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక -- ఇంటాయనకో రిజిష్టర్ పార్శిల్ లో శ్రీధర బాబు గది డూప్లికేట్ తాళం పంపించి ఒక ఉత్తరం కూడా రాశాను. అందులో ఎందుకైనా మంచిదని ఒక చిన్న అబద్దం కూడా రాశాను! టెలిగ్రాం ప్రకారం - శ్రీధర్ బాబు చెల్లెలు రావలసి ఉన్నప్పటికీ ఏ కారణాల వల్లనో ఆమె రాలేదని.
నేను ఇల్లు చేరిన నాలుగు రోజులకు శ్రీధర బాబు నించి ఉత్తరం వచ్చింది. అనుకోకుండా ఎదురైన గృహ సమస్య కారణంగా తను చిరునామా కూడా ఇవ్వకుండా మాయమైనాడని ' అన్యదా భావించవద్దని అతను రాశాడు. సేల్సు వ్యవహారంలో అనుకోకుండా అతను తన ఊరు వెళ్ళడం సంభవించిందట. అనుమాన పరిస్థితుల్లో అతని చెల్లెలు మాయమైదంట.
"నీకు తెలుసు గదా - నాకు నా చేల్లెల్లికీ ఉన్న అనుబంధం, ప్రస్తుతం అన్వేషణ లో వున్నాను. అన్వేషణ ముగిసే వరకూ మరేపనీ చేయలేను. అందుకే వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. బల్ల మీద నీ చిరునామా వదిలి వెళ్ళినందుకు ధన్యావాదాలు. చాలాకాలం తర్వాత కలుసుకున్నందుకు సరిగ్గా గడప లేకపోయాను. మరోసారి మంచి అవకాశం వస్తుందనీ, అది సక్రమంగా వినియోగించుకోగలమనీ ఆశిస్తున్నాను"-- అని రాశాడతడు.
8
ఆ రోజు అరుణ హోటల్ చాలా రష్ గా ఉంది. నన్ను బాగా తెలిసున్న సర్వర్ - "అలా వెళ్ళండి సార్! అక్కడ కాళీ ఉంది --" అని దారి చూపించాడు.
అది ఫామిలీస్ కోసం ఉద్దేశించబడిన అపార్టు మెంట్. అలాంటి అపార్ట్ మెంట్స్ అక్కడ చాలా ఉన్నాయి. ఒకో అపార్టు మెంట్లో నాలుగు సీట్లు మాత్రం ఉంటాయి. సాధారణంగా బ్రహ్మచారి యువకులు ఒంటరిగా వాటిలోకి వెళ్ళే అవకాశం రాదు. సర్వర్ చెప్పాడు కదా అని నేను వెళ్ళాను. అక్కడ రెండు సీట్లు కాళీగా ఉన్నాయి. ఒక సీట్లో కూర్చున్నాక యధాలాపంగా ఎదుటి సీట్లో ఉన్న జంటను చూశాను ఉలిక్కి పడ్డాను , పార్వతి!
ఆ ప్రయత్నంగా "పార్వతీ!" అన్నాను. ఆమె నన్ను చూసి ఉలిక్కిపడింది. ఆమె ప్రక్క నున్న యువకుడు నావంక గుర్రుగా చూశాడు.
"ఇక్కడి కెప్పుడోచ్చావ్ పార్వతీ!" అన్నాను నేను.
"ఎవరు మీరు?" అనడిగాడా యువకుడు.
"ఆమెనే అడగండి -" అన్నాను ధైర్యంగా. సర్వర్ లోపలకు వచ్చాడు. వాళ్ళూ నేను కూడా మా ఆర్డర్స్ చెప్పాం. సర్వర్ మంచి నీళ్ళు పెట్టి వెళ్ళిపోయాడు. మరో జంట మా అపార్ట్ మెంట్లో కి తొంగి చూసి - ఒక సీటే కాళీ ఉండడం చూసి వెనక్కు వెళ్ళిపోయారు.
"మీరెవరో నాకు తెలియదు -" అంది పార్వతి.
'అబద్ద మాడకు పార్వతీ ...." అన్నాను.
"ఆమె పేరు పార్వతి కాదు - " అన్నాడా యువకుడు.
"ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు పేరు మార్చుకోవడం అసహజం కాదు-" అన్నాను చలించకుండా.
"ఎవరండీ మీరు ? అంత నమ్మకంగా మాట్లాడుతున్నారు -" ఈమె మీ కేమవుతుంది?" అన్నాడా యువకుడు చిరాగ్గా.
"ఈమె నా స్నేహితుడి చెల్లెలు. ప్రస్తుతం ఈమె అన్న ఈమె గురించి అన్వేషణ లో ఉన్నాడు." అన్నాను.
"మీరు నిజంగా పొరబడ్డారు. ఈమె పేరు శారద. మీరనుకుంటున్న పార్వతి ఈమె కావడం అసంభవం -" అన్నాడా యువకుడు.
"ఎందువల్ల ?" అన్నాను అసహనంగా.
"ఎవరైనా పరాయివాడు మీ ఆవిణ్ణి పార్వతీ అని పిలిచి నప్పుడు - ఆ పేరు నిజమో , తప్పో మీకు తెలియదా?" అనడిగింది పార్వతి.
"అంటే-?"
"మేమిడ్డటం భార్యా భర్తలం -" అన్నాడా యువకుడు.
ఆశ్చర్యపడ్డాడు. నాకదంత సంభవం అనిపించలేదు-"ఎన్నాళ్ళయింది మీ వివాహమై?" అనడిగాను.
"పదినెలలు -"
పార్వతి తో ఆ అపూర్వాను భవం జరిగి ఇంకా రెండు నెలలు పూర్తీ కాలేదు. అందుకే "రెండునెలల క్రితం మీ భార్య తన అన్నగారింటికి వెళ్ళడం సంభవించి ఉండాలి!" అన్నాడు.
