"ఇంత కొద్దిగా తెచ్చారు . ఇది ఇద్దరి కేం సరిపోతుంది ?" అంది పార్వతి.
"నేను తినే వచ్చాను--" అన్నాను.
"నా అతిధులు హోటల్ లో తినడం నేను సహించలేను. నాతో పాటు ఇంట్లో తిని తీరవలసిందే -- " అంటూ ఆమె టిఫిన్ ని రెండు సమ భాగాలు చేసింది. ఆ క్షణంలో ఆమె ఆప్యాయతకు ఒక యువకుడిలా కాక చంటి పిల్లాడిలా లొంగిపోయాను. ఇద్దరం టిఫెన్ తిన్నాం.
ఆమె టైము చూసుకుని - "నిజానికి ఇది భోజనం టైము అంది.
"ఏడుగంటలకు భోం చేయడం నాకు అలవాటు లేదు --" అన్నాను.
'అవుననుకోండి. కానీ ఏడు గంటల ప్రాంతంలో టిఫెన్ తీసుకుంటే రాత్రికి భోజనం చేస్తారా --- మరి పస్తేనా ?" అనడిగిందామె.
"భోజనం తొమ్మిది గంటలకీ!"
'అయితే అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం తీసుకొస్తారా--" అని నాజవాబుకు ఆగకుండానే -- నా అతిదిని అంత రాత్రి వేళ ఒంటరిగా బయటకు పంపడం నాకిష్ట ముండదు. కాబట్టి హోటలుకు నేనూ మీతో వస్తాను --" అంది.
"అతిధిని హోటల్ లో భోం చేయనిస్తారా మరి --" అన్నాను ఆమెను దెబ్బ తీయగలిగినందుకు సంబరపడుతూ.'
"భలే వారే -- ఆడది ప్రక్కన ఉన్న చోట ఇల్లు కాక హోటలేలా అవుతుందండీ!" అని ఆమె నవ్వేసింది.
ఎనిమిది గంటల ప్రాంతంలో ఇద్దరం గదిలోంచి బయటకు వచ్చి కాసేపు వీధులలో విహరించాం. తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక హోటల్ లో భోజనం చేశాం. అన్ని చోట్ల డబ్బు నేను ఇచ్చాను. భోజనమై బయటకు వచ్చేక ఆమెతో -- మరి నేను సెలవు తీసుకుంటాను. పునర్దర్శనం మళ్ళీ రేపు ఉదయం చేసుకుంటాను --" అన్నాను.
"ఒక్కర్తీనీ ఒంటరిగా అంత ఇంట్లో నేనుండలేను. అంతగా మీకా ఇంట్లో పడుకోవడం ఇష్టం లేక పొతే నేనూ మీతోనే వచ్చేస్తాను--" అందామె.
అది అమాయకత్వమా లేక జాణతనమా అన్నది నాకు తెలియలేదు. నా మనసులోని అభిప్రాయాన్ని ఇంకాస్త స్పష్టంగా చెప్పక తప్పదనుకుని -- " శ్రీధరబాబు నాకు స్నేహితుడు. అతని మనసుకు కష్టం కలిగించే పని ఏదీ నేను చేయలేను-" అన్నాను.
"రాత్రి పూట తన చెల్లెల్ని ఏకాకిగా కొంపలో వదిలేసి పోయిన స్నేహితుడిని అన్నయ్య క్షమించగలడని నేననుకోను-"
శ్రీధరబాబు సంగతి బాగా ఎరిగున్న నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. తిరిగి మళ్ళీ ఆమె అన్నది -" నన్నెంతసేపు మీరు మీ స్నేహుతుడి చెల్లెలుగానే భావిస్తున్నారు తప్పితే ఒంటరిగా ఉండడానికి భయపడుతున్న ఒక ఆడదానిలా గుర్తించడం లేదు. ఇదే పరిస్థితుల్లో మీ చెల్లెలూ ఉంటె మీకింత సంకోచమూ ఉండేదా?"
"అవును నిజమే౧ ఆమె నాలోని లోపాన్ని చక్కగా ఎత్తి చూపించింది. పార్వతిని శ్రీధరబాబు చెల్లెలుగా మాత్రమే నేను గుర్తిస్తున్నాను తప్పితే నా చెల్లెలిగా భావించలేక పోతున్నాను --" ఆప్పుడే పరిచయమైన వయసులో ఉన్న అందమైన యువతిని చెల్లెలుగా భావించడంలో కష్టం ఫీలవుతున్న నేను అదినాలోపమే నని అంగీకరిస్తున్నాను. కానీ ఏ తప్పు చేయకుండా ఉండడం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లోపమని నేననుకోను.
"సరే - ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఉద్దేశ్యం నాకర్ధమయింది. పగలు నాతొ ఏకాంతంగా కొన్ని గంటలు గడపడానికి భయపడని మీరు రాత్రి అలా చేయడానికి జంకు తున్నారు. కారణం తెలుసుకోవచ్చా?
నేను మాట్లాడలేదు. ఆమె ప్రవర్తన నిష్కళంకంకావచ్చు. నేను చాలా బుద్ది మంతుడిలా ప్రవర్తించవచ్చు . కానీ శ్రీధరబాబు లాంటి వాడికి ఆమె చెల్లెలు కావడం కారణంగా నేను ఏవిధమైన రిస్కూ తీసుకోదల్చలేదు.
ఆమె మళ్ళీ అంది - "సరే- మీ మౌనమే సమాదానమనుకుంటాను. నేను రాత్రిళ్ళు ఒంటరిగా గడపలేను. అందుకు చిన్న రిక్వస్ట్. మనం సెకండ్ షో సినిమాకి వెడదాం. వదిలేసరికి ఒంటిగంట దాటుతుంది. అప్పుడు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి మీరు మీ యిష్ట మోచ్చిన చోటుకి వెడుడురు గానీ, చాలా భాగం రాత్రి గడిచిపితుంది కాబట్టి - మిగతా భాగం రాత్రి ఎలాగో అలా ఒంటరిగా గడపడానికి నా బాధ నేను పడతాను.
5
ఒక అరగంట సేపు పార్వతి సినిమా బుద్దిగానే చూసింది. ఆతర్వాత నుంచి కొద్ది కొద్దిగా చిలిపి చేష్టలు ప్రారంభమయ్యాయి. ఉండుండి నావైపు వాలిపోతుండేది. నిద్ర వస్తోందని సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ ఆమె ముఖంలో ఎక్కడా నిద్ర ఛాయలు నాకు కనబడలేదు. ఒకోసారి తన కాలితో నాకాలు నొక్కుతుండేది. చాలా పర్యాయాలు నా చేతిని నొక్కింది.
ఆమె చేసే ఈ చిలిపి పనులు నాకు కోపాన్ని కలిగించడం లేదు. ఒకపక్క సంతోషిస్తూనే మరోపక్క భయపడుతున్నాను.
నేను సినిమా పై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. ఆమె ప్రవర్తనలో నాలో క్రమక్రమంగా అదో రకమైనా ఆవేశం చోటు చేసుకోసాగింది. ఆఖరికి ఒక పర్యాయం ఆమె నాచేతిని తన చేతిలోకి తీసుకొని వంగి మృదువుగా పెదిమలతో స్పృశించింది. నా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆమె భుజాల మీదకు చేతులు పోనిచ్చి ఒకసారి దగ్గిరగా లాక్కున్నాను. కుర్చీ అడ్డు రాకపోతే నా ఆవేశపు బలానికి ఆమె నాలో ఐక్యం కావలసిందే!
"వాడికి మూడింది !" అన్న మాటలు నా చెవిలో పడగా ఉలిక్కిపడ్డాను. ఎదురుగా వెండి తెరపై విలన్ ఆ మాటలు అన్నాడు. ఆ విలాన్ స్థానంలో నాకు శ్రీధర్ బాబు కనపడ్డాడు. చావు దెబ్బ తిని ఓ మూల పడి వున్న పుల్లారావుకూడా నా కళ్ళ ముందు మేదుల్తున్నాడు.
కేవలం నోటి దురుసుతనం కారణంగా సుదర్శనం, పుల్లారావు లాంటి వాళ్ళు శ్రీధర బాబు ఆగ్రహానికి గురయ్యారు. నేనింకా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. ఫలితం ఎలాగుంటుందో?
వయసు - ఆహ్వానించే అందమైన యువతి ! ఈ రెంటికీ అయస్కాంతం , ఇనుము లాంటి సంబంధముందేమో! నేను పార్వతికి లొంగి పోతున్నట్లు గ్రహిస్తూనే -- అసలు పార్వతి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమే మై యుంటుందా అని కూడా ఆలోచిస్తున్నాను. కొంపదీసి ఇదేమైనా పెద్ద పధకం కాదు గదా అని నాకు అనిపించసాగింది. శ్రీధరబాబు ఆగ్రహానికి నన్ను గురి చేసి- అతను నన్ను హత్య చేసే పరిస్థితికి దారి తీసే సంఘటన ఏర్పడ్డానికి పార్వతి కాని ప్రవర్తించడం లేదు కదా అన్న అనుమానం నాకు కలిగింది. అయితే అందుకు కారణమేమై ఉంటుంది? నా శతృవు ఎవడైనా పార్వతికి ప్రియుడై ఉండవచ్చు. వాడి కోరికపై ఈమె ఇలా ప్రవర్తిస్తుండవచ్చు.
ఎంత ఆలోచించినా నాకు ఇంత పధకం వేసి నన్ను చంపధల్చుకునేటంత శతృవేవడుంటాడో తోచలేదు. నా అనుమానం, అర్ధ రహితమని కూడా అనిపించింది. పార్వతి వంటి అందమైన అమాయకమైన ఆడపిల్ల ప్రవర్తన వెనక నేరాన్ని ఊహించడం ఘోరమని కూడా నాకూ తోచింది.....
సినిమా అయిపొయింది.
రిక్షాలో ఇద్దరం ఇంటి దగ్గరది గాక ఆమె తనకున్న భయాన్ని వివరించింది. నాకు తెలుసు - ఆరోజు రాత్రి ఇద్దరం ఇకే ఇంట్లో నిద్ర చెయ్యవలసి వస్తుందని!
ఇద్దరం చెరో గదిలో నిద్రకు పడ్డాం. కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే వ్యవధి ఇచ్చి - ఆమె భయం భయంగా నా గది లోకి పరుగెత్తుకు వచ్చింది. నాకు తెలుసు -- ఆమె అలా చేసే అవకాశమున్నదని!
ఒకే గదిలో ఇద్దరం చెరో ప్రక్క పై నిద్రలో పడ్డాం. నాకు తెలుసు - మరికొద్ది క్షణాలలో ఏమి జరుగ్నున్నదీ!
6
సరిగ్గా అదే జరిగింది!
చాలా మాములుగా తెల్లవారింది. నేను నామీద ఉన్న ఆమె చేతిని పక్కకు పెట్టి లేచాను.
నాకిప్పుడు శ్రీధరబాబు ఏదో చేస్తాడన్న భయం కంటే అతను త్వరగా వచ్చేస్తాడేమోనన్న బెంగ ఎక్కువగా ఉంది. రాత్రి నా అనుభవం అపూర్వం. ఆ అనుభవం నాకు ఇంకా ఇంకా కావాలి. ఇంక శ్రీధరబాబు రావడానికి ఏంతో వ్యవధి లేదు, నాకు పగలల్లా ఆఫీసు పని తప్పనిసరి.......
