Previous Page Next Page 
వసుంధర కథలు-7 పేజి 23


    "మరైతే వెంటనే ఎందుకు చెప్పలేదు?" అన్నాడు రవి.
    "వాడెంత భయంకరమైన మనిషో కలలో చూసేక నాకు చాలా భయంవేసింది. వాన్నిలా బయటి ప్రపంచంలో చూస్తానని అనుకోలేదు. వాడి ఉనికి తెలిసి నందుకు మననేం చేస్తాడోనని భయంవేసింది. అందుకే....."
    "అయితే వాడు తనింట్లో వున్నట్లు మాధురికి తెలియదంటావా?"
    "తెలుసుకునే నా అనుమానం. చప్పుడయిందనీ కంగారుపడి వెళ్ళిచూస్తే నాకో మనిషి కనిపించాడనీ నేను చెప్పినపుడు ఆమె కంగారుపడలేదు. నేను భ్రమపడి ఉంటానంది. అంటే ఆమెకు లోపల ఆ మనిషి వున్నట్లు తెలుసు. ఆ విషయం మనకు తెలియడం యిష్టంలేదు. అందుకేనేమో ఊరుకుని ఆమె అభిప్రాయాన్ని బలపరిచాను. ఆ మనిషి వున్నట్లు ఆమెకు తెలియని పక్షంలో తనూ కంగారుపడి మనతోపాటు పరుగెత్తేది. వాణ్ణి పట్టుకునేందుకు మన సాయం తీసుకుని వుండేది" అంది సుజాత.
    "నువ్వు చూసిన ఆ హంతకుణ్ణి నా క్కూడా చూపిస్తే బాగుండేది. వాడిగురించి ఆరాతీసివుండేవాణ్ణి."
    "లేదురా అది చాలా ప్రమాదకరమైన క్షణం. వాణ్ణి నేను చూసినట్లూ, హంతకుడిగా గుర్తించినట్లూ ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకంటే ఈ హత్య నిజానికి నా భ్రమ కావచ్చు. భ్రమకాక నిజమే అయినప్పటికీ అందుకు రుజువున్నదన్న అనుమానం కూడా ఆ హంతకుడికి లేక పోవచ్చు. అలాంటప్పుడు కోరి ప్రమాదం తెచ్చుకోవడమెందుకు?" అంది సుజాత.
    "నా శాంతి పోయాక జీవితేచ్చ నశించింది. నేనే మైనా ఫరవాలేదు. ఆ కిరాతకుణ్ణి పట్టుకోవాలి" అన్నాడు రవి ఆవేశంగా.
    "అది నిజమే అయితే యిప్పుడొచ్చిన నష్టమేముంది? వాడిగురించి ఆధారం దొరికింది. మాదురికీ వాడికీ సంబంధముంది. మాధురి ద్వారా నెమ్మదిమీద వాడి ఆచూకీ రాబట్టవచ్చు. మనవల్ల' కాదంటే ఈ వ్యవహారాన్ని ఎవరైనా డిటెక్టివ్ ల కప్పగించఅవచ్చు" అంది సుజాత.
    ఇద్దరూ ఇల్లుచేరారు. ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడుదామనుకుని తమ గదిలోకి వెడదామనుకుని నడవబోగా పక్కగదిలోంచి ఏదో సంభాషణ వినిపించి ఆగిపోయారు.
    సుజాత తల్లిదండ్రులు కాస్త గట్టిగానే వాదించుకుంటున్నారు.
    "నాకు మీ మీద బాగా అనుమానముంది. మీకు తెలియకుండా ఆ పిల్ల మాయంకాదు. కాబోయే కోడలనైనా జాలి తలచకుండా ప్రాణాలు తీయించడానికి మీకు మనసెలా ఒప్పిందండీ" అంటోంది సుజాత తల్లి.
    "ఇన్నేళ్ళుగా నాతో కాపురం చేస్తున్నావ్. నేను మరీ అంత పరమ కిరాతకుడిలా తోస్తున్నానా - చూస్తూ చూస్తూ ఓ నిండుప్రాణాన్ని బలిగొంటాననుకుంటున్నావా?"
    "అయితే మనపిల్లలమీద ఒట్టువేసి చెప్పండి. ఆ పిల్ల మాయంకావడం గురించి నిజంగా మీకేమీ తెలియదూ?" అంది సుజాత తల్లి.
    "నిజం చెబుతాను విను. నాకా పిల్లను కోడలిగా చేసుకోవడం ఇష్టంలేదు. ఇంత బ్రతుకు బ్రతికి ఓ దౌర్భాగ్యుడితో వియ్యమందాలంటే నాకు వళ్ళంతా కంపరమెత్తినట్లనిపించింది. అందుకే నాకు తెలిసిన మనిషిని పిలిచి కొంతకాలంపాటు ఆ అమ్మాయినీ ఊళ్ళో కనబడకుండా చేయమని చెప్పాను. అతను ఒప్పుకున్నాడు. అంతే జరిగింది."
    "అయితే ఆ పిల్ల బ్రతికేవుందంటారా?"
    "ఉంటుందనే నా అనుమానం. అయినా అడ్డమైన వాళ్ళగురించీ ఆలోచిస్తూ కూర్చోడం తప్ప నాకేం పని లేదనుకుంటున్నావా?" అన్నాడు సుజాత తండ్రి విసుగ్గా.
    "అలాగంటారేంటండీ మీ కన్నబిడ్డ ప్రాణాలన్నీ ఆ పిల్లమీదే వున్నాయని తెలియదా నీకు."
    "ఏమిటే ఊరికే కబుర్లు చెబుతావు. చిన్నప్పుడు నేనూ ఓ పిల్లను ప్రేమించాను. మా నాన్న నా మెడలు విరిచి ఈ పెళ్ళిచేశాడు. ఇప్పుడు నాకొచ్చిన లోటేముంది? వీడూ అంతే-కొన్నాళ్ళ తర్వాత ఆ పిల్లను మర్చిపోతాడు. అప్పుడు లక్షణమైన ఓ పిల్లను చూసి తెచ్చి వీడికి పెళ్ళి చేయవచ్చు."
    రవి ఆవేశంతో ఊగుతూంటే సుజాత అతని చేయి పట్టుకుని ఆపి "అనవసరంగా ఆవేశపడకు అన్నయ్యా-శాంతి మాయం కావడంలో నాన్నచేయి వున్నదని తెలిసింది గదా-నెమ్మదిగానే మాట్లాడి విషయం రాబడదాం" అంది.
    రవికి చల్లబడ్డానికి కాసేపు పట్టింది. తర్వాత ఇద్దరూ నెమ్మదిగా తల్లిదండ్రులున్న గదిలో ప్రవేశించారు. వీళ్ళను చూస్తూనే తండ్రి తెల్లబోయి "ఇప్పుడే వస్తున్నారా?" అన్నాడు.
    "అవును నాన్నా - మీ సంభాషణంతా విని ఇప్పుడే లోపలికి వస్తున్నాం" అంది సుజాత. సౌమ్యంగా మాట్లాడాలనుకున్నా ఆమె మాటలు కటువుగా వచ్చాయి.
    "ఏం విన్నారు?" అన్నాడు తండ్రి.
    "శాంతిని మాయం చేయమని మీరు వినియోగించిన మనిషి ఎవరు?" అన్నాడు రవి తాపీగా.
    "ఏమిటి నువ్వంటున్నది?" అన్నాడు తండ్రి ఏమీ ఎరుగనట్లు.
    "మీరు నిజం చెప్పకపోతే మీ కళ్ళముందే పొడుచుకు చచ్చిపోతాను" అన్నాడు రవి.
    తండ్రి ఏమీ మాట్లాడలేదు.
    "మీరు ఇంత దుర్మార్గానికి తలపడతారని నే నెప్పుడూ అనుకోలేదు నాన్నా" అంది సుజాత.
    సుజాత తండ్రి రెచ్చిపోయాడు "ఏమిటే నేను చేసిన దుర్మార్గం? ఓ ముష్టిపిల్లను మీ అన్నయ్య చేసుకుంటా నంటే వద్దన్నాను. అంతేనా? అందులో తప్పేముంది? ఆ పిల్లతో వీడి పరిచయం ఆర్నెల్లు. ఆ కొద్ది సమయం లోనూ అది దేవత అయిపోయిందా? తండ్రికంటే ఎక్కువైపోయిందా? వయసుమైకంలో వీడికేమీ తెలియకపోయినా నా భయాలు నాకుంటాయి గదా-వాళ్ళేదైనా ఆస్తికోసం వలపన్నారేమోనని నేను అనుమానిస్తే అది తప్పా? ఈ రోజుల్లో అలాంటివాళ్ళు లేరా?"
    ఏం మాట్లాడాలో వెంటనే సుజాతకు స్ఫురించలేదు. తండ్రి మాటల్ల్లో సబబు ఉన్నదనిపించింది.
    సుజాత తండ్రి మళ్ళీ మొదలుపెట్టాడు "నేనాపిల్లను డబ్బిచ్చి వదుల్చుకుందామని ప్రయత్నించాను. డబ్బక్కర్లేదంది. నా వెర్రికానీ లక్షలకు లక్షలు ఆస్తివచ్చి పడుతూంటే చిల్లర డబ్బులకెందుకే కక్కుర్తి పడుతుంది? అప్పుడు నేనా పిల్లని కొన్నాళ్ళపాటు ఈఊళ్ళో లేకుండా చేసిచూడమన్నాను నా మనిషికి."
    "ఎవరా మనిషి?"
    "ఆ మనిషి నీ ఊళ్ళోనే వున్నాడు. అతని దగ్గర ఆ పిల్ల క్షేమంగానే వుంటుందని నా అనుమానం. కొంత మందికి భగవంతుడు చాలా ఆయుర్దాయమిస్తాడు. నా కంటిలో నలుసుకావడం కోసం అది యింకా క్షేమం గానే వుండివుంటుంది. ఆ పిల్ల చచ్చిందని తెలిస్తేనైనా వీడి మనసు మారుతుందేమోననుకున్నాను. కానీ వీడికి చిన్నప్పట్నించీ పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకంటే-ఆ పిల్లే ఎక్కువగా వుంది" అన్నాడు సుజాత తండ్రి.
    "మా ఊళ్లోనా? ఎవరు నాన్నా అతను?" అనడిగింది.
    "అతని పేరు సుధాకర్. అడ్రస్ యిస్తాను. అతన్నడిగితే శాంతిగురించి అన్ని వివరాలూ చెబుతాడు" అన్నాడు సుజాత తండ్రి.
    "అంటే నేను మీకు చెప్పిన సుధాకర్ ఇతడూ ఒకరు కాదుగదా" అంది సుజాత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS