Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 23

 

                                          ఒక ఇంటర్వ్యూ కధ

                                                                       వసుంధర

    "రిజిస్టర్ లెటర్ -- " అన్నాడు పోస్టు మాన్.
    సుదర్శనం సంతకం పెట్టి కవరు తీసుకుని చించి లోపలి ఉత్తరం చదువుకున్నాడు. అతడి కేసే ఆత్రుతగా చూస్తున్న సుబ్రహ్మణ్యం -- "రిజిస్టరు పోస్టులో వచ్చింది. అపాయింట్ మెంటు అర్దరా?" అన్నాడు.
    "కాదు -- ఇంటర్వ్యూ లెటరు --' అన్నాడు సుదర్శనం.
    "నీ ముఖం చూసి అలాగే అనుకున్నాలే -- " అంటూ సుబ్రహ్మణ్యం నిట్టూర్చాడు.
    'అలా దిగులుపడకు నాన్నా! ఈ ఇంటర్వ్యూ లెటరు ఇంచుమించు అపాయింట్ మెంట్ ఆర్డరు లాంటిదే!' అన్నాడు సుదర్శనం.
    ఎందుకని కూడా సుబ్రహ్మణ్యం అడగలేదు -- "పెళ్ళి చేసుకుంటేనే ప్రేయసీ ప్రియులు భార్యాభర్తలవుతారు. ఇంటర్వ్యూ లెటరు ప్రేమ లేఖ లాంటిది --" అన్నాడాయన.
    "చూడమ్మా -- నాన్న నన్నెలా నిరుత్సాహ పడుస్తున్నాడో!' అన్నాడు సుదర్శనం నిరుత్సాహంగా.
    "బుద్దుల్లో ఈయన శల్యుణ్ణి చంపి పుట్టారులే కానీ -- ఇంతకీ ఈ ఇంటర్య్వూ మీద నీకు బాగా నమ్మకమెండుకుందో చెప్పు --" అంది సుదర్శనం తల్లి కమలమ్మ. కొడుకు వంక ఆప్యాయంగా చూస్తూ.
    "ఈ ఊళ్ళోనే వెంకోజీరావుగారి కాలేజీ వుంది కాగా -- అది ప్రైవేటు కాలేజీ అయినప్పటికీ జీతాలూ అవీ ఖచ్చితంగా ఇచ్చేస్తారుట. అందులో ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టుకి నేనుఅప్లై చేశాను. నాకు ఎమ్మేలో ఫస్టు క్లాసు వచ్చిందిగా! ప్రిన్సిపాలాఫీసులో పనిచేసే ఆనందరావు చెప్పాడు -- అప్లై చేస్తే నేను తప్పకుండా సెలక్టవుతావని!" అన్నాడు సుదర్శనం.
    "ఎందుకట? అప్లై చేసేవాళ్ళ కింకేవ్వరికీ ఫస్టు క్లాసు లుండవటా?' అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "ఎందుకుండవు? కానీ నాకు ఫస్టు క్లాసు మాత్రమే కాక మంచి మార్కులు కూడా వచ్చాయి. ఆపైన అ కాలేజీ ప్రిన్సిపాలు మోహనమూర్తి గారు రికమెండేషన్ లకు లొంగడట. ఫస్టు క్లాసు- ఎక్కువ మార్కులు --  ఆ పైన ఇంటర్వ్యూ పెర్ ఫార్మెన్స్ --......ఇంటర్వ్యూ లో నేను దంచి కొట్టెస్తాను తెలుసా?' అన్నాడు సుదర్శనం.
    "ఇంటర్వ్యూ లెందుకో తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళను తప్పించి -- తమకిష్టమైన వాళ్ళను ఎన్నుకునేందుకు ...."అన్నాడు సుబ్రహ్మణ్యం.
    "ఇంతకీ అవకాశమిస్తే మీరే వాడికి ఉద్యోగామిచ్చేలా లేరు--" అంది కమలమ్మ.
    "అదేమిటే అలాగంటావు. వాడి కుద్యోగం రావాలనే కదా నాకోరిక. ఎటొచ్చీ ఇంటర్వ్యూ కి ముందే లేనిపోని ఆశలు పెంచుకోవడం నాకిష్ట ముండదు. ప్రపంచం తెలిసిన వాణ్ణి కాబట్టి అంతా వివరించి చెబుతున్నాను--...."
    "నాన్నా! ఈ ప్రపంచంలో మనిషి ప్రాణాలు నిలబెడుతున్నది ఆశ ఒక్కటే!" అన్నాడు సుదర్శనం వేదాంతిలా.
    "ఆశను ఎక్కువగా నమ్ముకున్న వాడు తన ప్రాణాలు నిలబెట్టు కోవడం సంగతెలాగున్నా -- నిరాశ ఎదురై నపుడు -- యెదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకునేటంత ఘోరావేశానికి గురి అవుతాడు--" అన్నాడు సుబ్రహ్మణ్యం.
    కమలమ్మ ఈ మాటలు విని కంగారుగా ముందు భర్త వంక, తర్వాత కొడుకు వంకా చూసింది. భర్త కళ్ళలో ఆశ కనబడింది.

                                    2
    పార్కులో ఓ మూల ఆ జంట కూర్చున్నారు.
    "నిన్న రాలేదేం సుభాష్ -- " అంది సుశీల.
    "మా నాన్న దగ్గర్నించి ఉత్తరం వచ్చి మనసు పాడైంది --" అన్నాడు సుభాష్ అదోలా.
    "ఏం రాశారేమిటి-- మీ నాన్నగారు...."
    "నాకోసం నాలుగు సంబంధాలున్నాయట. అందరూ యాభై వేలకు పైగా కట్న మిస్తానంటున్నారుట...--"
    సుశీల సుఖం మాడిపోయింది - "మగ పుట్టుక పుట్టావు. అదృష్ట వంతుడివి" అందామె.
    "నువ్వలాగంటున్నావు. నువ్వు భార్యగా దొరక్కపోతే నా అంత దురదృష్టవంతుడుండడని నేననుకుంటాను" అన్నాడు సుభాష్.
    సుశీల కళ్ళు మెరిశాయి -- "నిజంగా ?" అందామె.
    "ఈ ప్రపంచంలో నీకు తప్ప వేరెవ్వరికీ నేను నిజం చెప్పను. ఎవరైనా సరే -- నానుంచి రాబట్టాలంటే నిన్నుపయోగించుకోవాల్సిందే..."
    సుశీల ముఖంలో గర్వం కనబడింది -- "అయితే మీ నాన్నగారి కేమని రాస్తావు?' మన ప్రేమగురించి చెప్పేస్తావా?"
    "మన ప్రేమ గురించి చెప్పెయగానే అయన నన్నింట్లోంచి గెంటేస్తాడు. అదీ నా భయం...."
    "నేనుండగా నీకు భయమెందుకు? " అంది సుశీల.
    "ఎందుకో చెప్పనా?" అన్నాడు సుభాష్.
    అతడిదా ఊరు కాదు. అతడి బాబాయి ఊళ్ళో ఉంటున్నాడు. ఆయనేమో రెండు నెలల క్రితం ఫారిన్ వెళ్ళాడు. ఆయనకో పద్దెనిమిదేళ్ళ కూతురూ, పద్నాలుగేళ్ళ కొడుకు ఉన్నారు. అతడి పిన్ని సుభాష్ ను కొన్నాళ్ళ పాటు తన దగ్గర వచ్చి ఉండమని కోరింది. ఇంకో నేల్లాల్లలో బాబాయోచ్చేదాకా అతడిక్కడే ఉంటాడు.
    ప్రస్తుతం సుభాష్ ఎమ్మే ప్యాసై ఉద్యోగ ప్రయత్నాల్లో వున్నాడు. ఖాళీగా వున్నాడు కాబట్టి తోడుగా ఉండడానికి పిన్ని అతణ్ణి రప్పించుకుంది. పిన్నికూతురు రత్నకుమారికి సుశీల స్నేహితురాలు. ఆ విధంగా సుశీలకూ సుభాష్ కీ పరిచయమైంది. తోలి పరిచయం లోనే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ పుట్టింది. అందులోనూ సుభాష్ కి చొరవ ఎక్కువ. సుశీల అతడంటే బాగా ఆకర్షించబడింది.
    "నెల్లాళ్ళలో మా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. మా నాన్న నన్నిట్లోంచి గెంటేస్తే ఎవరు నన్నధరిస్తారు? ఎవరాదరిస్తే వాళ్ళ మీద నాన్న పగ బట్టేస్తాడు. అందుకని నాకాళ్ళ మీద నేనే నిలబడే దాకా ఆయనతో మన ప్రేమ సంగతి చెప్పలేను...." అన్నాడు సుభాష్.
    "చాలామంది రచయితలు, రాసినట్టు ప్రేమ కధల్లో అబ్బాయిలు తండ్రి చాటు బిడ్డలు. అసలబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడానికే ప్రేమిస్తారని నా నమ్మకం...."
    'అబ్బాయిలూ అమ్మాయిలూ అంటూ దొంక తిరుగుడు కబుర్లెందుకూ? నా గురించి నువ్వేమనుకుంటూన్నావో చెప్పు...."
    "ఈ ఊళ్ళో ముడ్నేల్లు ఉండాలి. ఇరవై నాలుగ్గంట లూ పిన్ని, చెల్లెలు, తమ్ముడు తో కూర్చుంటే ఏం కాలక్షేపమవుతుంది. నీకు రోమాన్స్ కావాలి. నాతొ స్నేహం చేశావు. తెలివిగా అక్ర్శించావు. మూడు నెలల పాటు నీకు మధురమైన కాలక్షేపం . ఆ తర్వాత నాకు మిగిలేవి కలలు. నువ్వింకో అమ్మాయిని వెతుక్కుంటావు...."
    "సుశీలా!" అన్నాడు సుభాష్- "నువ్విలాగనడం చాలా అన్యాయం. నేను నిన్ను ఏకాంతంగా కలుసుకుందుకు ప్రయత్నించలేదు. నీకూ నాకూ మధ్య ఎప్పుడూ దూర ముంచడానికే చూస్తున్నాను. నా ప్రేమలో స్వార్ధం లేదు...."
    "నీ ప్రేమలో స్వార్ధమున్నా నేను నీకా అవకాశమివ్వను. నీక్కావలసింది కాలక్షేపం. అదీ మధురమైన కాలక్షేపం...." అంది సుశీల.
    'అక్కడే మగాడికీ, ఆడదానికి తేడా, నా బాధ నీకర్ధం కావాలంటే నువ్వూ మగాడివి కావాలి. ఆడది కబుర్ల తోనూ, ఊహలతోనూ సరి పెట్టుకోగలదు. మగాడి కలా కుదరదు. అనుభవం కావాలి. నిన్నిలా కలుసుకోవడం -- నీకు మధురం కావచ్చు. నాకు మధురం కాదు...."
    సుశీల అతడి వంక జాలిగా చూసి -- "ఇంతకీ మన భవిష్యత్తేమిటంటావు?" అంది.
    "అంతా మీ నాన్నగారిలో వుంది-"
    సుశీల ఆశ్చర్యంగా -- "మా నాన్నగారేం చేయగలరు?" అంది.
    "చేయగలరని కాదు -- ఏం చేయలేరూ అని అడుగు ...."
    సుశీల ఓ క్షణమాలోచించి -- "మీ నాన్నగారు నిన్నింట్లోంచి గెంటేస్తే మా యింటి కొచ్చి వుండాలను కుంటున్నావా?' అంది.
    'ఛీ మగాడి కంతకంటే అవమాన మింకొకటి వుండదు...."
    'అయితే మరేమిటి?"
    "ఈ ఊళ్ళో వెంకోజీరావు గారి కాలేజీ వుంది తెలుసు కదా!"
    సుశీల నవ్వి -- "వేళాకోళ మాడుతున్నావా?" మా నాన్నగారా కాలేజీకి ప్రిన్సిపాలని నీకు తెలియదా?' అంది.
    "అందుకే కదా -- తెలుసా అని కాకుండా తెలుసు కదా అనడిగాను".... అని - "ఆ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ పోస్టు అడ్వర్టయిజైంది. ఆపోస్టుకి నేను అప్లై చేయాలను కుంటున్నాను...." అన్నాడు సుభాష్.
    సుశీల ముఖం గంభీరంగా అయిపొయింది -- "మా నాన్నగారంటే నాకూ చాలా భయం, అయన చాలా స్ట్రిక్ట్."
    "నువ్వేమీ చేయక్కర్లేదు. ఒకసారి మీ అమ్మగారిని మా పిన్ని దగ్గరకు తీసుకుని వెళ్ళు. అక్కడ మా పిన్ని అన్నీ మీ అమ్మకు చెబుతుంది....'
    'అంటే మన ప్రేమ గురించి మీ పిన్నికి చెప్పెశావా?" అంది సుశీల కంగారుగానూ, భయంగాను.
    "ప్రేమిస్తే భయమెందుకు? మన ప్రేమకు పెద్దలే విధంగానూ, ఎదురు చెప్పలేరు. అడ్డొచ్చేదల్లా డబ్బొక్కటే! ఆ డబ్బు నాకక్కర్లేదు..."
    'అంటే ఉద్యోగమే నీకు కట్నమంటావు...."
    "ఉద్యోగం కట్న మేలాగవుతుంది? అది నా అర్హతలో సంపాదించుకుంటున్నది...." అన్నాడు సుభాష్.
    "అర్హతతో సంపాదించుకునే మాటైతే మా నాన్నగారి సాయం నీకెందుకు? ఇంటర్వ్యూ లో అది చూస్తారుగా..." అంది సుశీల.
    "అర్హత ను బట్టి ఇంటర్వ్యూ లో ఎన్నిక చేస్తే మాటైతే నాకీ పాటికే ఉద్యోగం సంపాదించుకుని వుండేవాడిని" అన్నాడు సుభాష్.
    సుశీల నవ్వుతూ -- "అయితే ఇంకేం -- ఉద్యోగం కట్నం గానే అడుగుతున్నారన్న మాట!" అంది.
    "నువ్వేమైనా అనుకో -- త్వరగా నీతో కీవితం ప్రారంభించాలన్న నా కోరిక తీరాలంటే ఈ ఉద్యోగం నాక్కావాలి. అందుకు నువ్వు కొంత సాయం చేయక తప్పదు" అన్నాడు సుభాష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS