Previous Page Next Page 
బొమ్మరిల్లు కధలు -31 పేజి 23

 

    ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసిందా యువతి. ఎవ్వరూ కనబడలేదామెకు. మళ్ళీ నిద్రపోవాలని ఆమె ప్రయత్నిస్తుండగా, "నిద్రించకు సుందరీ! నీతో కబుర్లాడవలెనని నాకు కోరికగా ఉన్నది" అన్నాడు వీరచంద్రుడు.
    ఆ యువతి కళ్ళు పెద్దవి చేసి, చుట్టూ చూసి కోపంతో --- "ఓరీ , మంత్రికాధమా! ఈ రోజు అదృశ్య రూపంలో వచ్చావా ? నువ్వెన్ని ఎత్తులు వేసినా, జిత్తులు చూపినా నీతో పెళ్ళికి నేను ఒప్పుకోను!" అంది.
    అది ఒక మాంత్రికుడి మందిరమనీ, మంత్రికుడా యువతిని నిర్భందించాడనీ వీరచంద్రుడు అర్ధం చేసుకుని ----"సుందరీ! నేను మాంత్రికుడిని కాను. నా పేరు వీరచంద్రుడు ...." అంటూ వివరంగా తన కధను చెప్పాడు.
    "నీ కధను నేనలా నమ్మేది?" అందా యువతి.
    "నేను నిన్ను తాకనైనా తాకను. నాక్కావలసిన దల్లా ఈ మందిరం గురించి వివరాలు. రోజుకు ఒక్క పర్యాయం మాత్రమే నేను అదృశ్యరూపాన్ని వదిలి ధరించగలను. అందువల్ల నీకు నేనిప్పుడు నా రూపం చూపించలేను. నాకు నువ్వు సకహరిస్తే నిన్ను మాంత్రికుడి బారి నుండి రక్షించగలను" అన్నాడు వీరచంద్రుడు.
    ఆ యువతి తన కధను చెప్పింది.
    తాండవ వనంలో సునంద మహాముని తపస్సు చేసుకుంటుంటే , దేవేంద్రుడు భయపడి అప్సరసలను పంపాడు. ఒక అప్సరస కూ, సునందుడికి పుట్టినదే ఈ యువతి. తపోభంగం అయ్యాక బిడ్డను ముని వద్ద వదలి వెళ్ళిపోయింది అప్సరస. సునందుడా పాపకు సుహాసిని అన్న పేరు పెట్టి పెంచుతున్నాడు.
    ఇలా ఉండగా జటాజూటుడనే మాంత్రికుడొకడు తాండవ వనంలో అడుగుపెట్టి సుహాసినిని చూసి మోహించాడు. అయితే సునందుడు తన కుమార్తెను జటాజూటుడి కివ్వడానికి అంగీకరించలేదు. అప్పుడు వాడు అద్రుశ్యుడై సుహాసినిని లోబర్చుకునెందుకు యత్నించాడు. అప్పుడు సుహాసిని పెట్టిన కేకలు విని, సునందుడు విషయం గ్రహించి, ఇష్టం లేని కన్యను బలవంతం చేస్తే జటాజూటుడు బుర్ర పగిలి చస్తాడని శాపం పెట్టాడు. అంతేకాదు, అదృశ్యరూపుడై సంచరించే వారికీ ఫలాలు, కంద మూలాలు పానీయాలు లభించనీయవద్దని అయన తాండవ వనదేవతను శాసించాడు.
    అప్సరస కావించిన తపోభంగం వల్ల, జటాజూటుడు కలిగించిన ఇబ్బందుల వల్ల సునందుడి తపో బలం బాగా తగ్గిపోయింది. సుహాసిని పట్ల ఆయన పెంచుకుంటున్న మమకారం , ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. సాటిలేని మేటి సాహాసికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలని ఆయనకున్నది. సుహాసిని జాతకం పరిశీలించగా ఆమె కింకా అప్పుడే వివాహ యోగం లేదని గ్రహించాడాయన. అందుకని అయన కొంతకాలం హిమాలయాల్లో తపస్సు చేసుకు కొనేందుకు వెళ్ళిపోయాడు. అంతకాలమూ సుహాసిని జాగ్రత్తగా చూడ వలసిందిగా తన శిష్యులిద్దరికీ చెప్పి వెళ్ళాడు.
    సునందుడు తాండవవనం వదలి వెళ్లి పోగానే జటాజూటుడు మళ్ళీ అందులో ప్రవేశించాడు. వాడు విధ్వంసక పర్వతంలో తన నివాసం ఏర్పరచుకుని తన కున్న అద్భుత శక్తులతో ఒక మాయామందిరాన్ని నిర్నించుకున్నాడు. సునందుడి శిష్యులను చంపి సుహాసినిని చేర బట్టాడు. ఎటొచ్చీ సునందుడి శాపం వుండడం వల్ల వాడు సుహాసిని నింతవరకూ బలవంతం చేయలేదు.
    జటాజూటుడు త్రిలోక యాగం అనే మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టాడు. ఆ యాగం చేయాలంటే దేవికి నూరు మంది రాజకుమారుల్ని గానీ, మహామంత్రికుల్ని గానీ బలివ్వాలి. మంత్రికులని బలివ్వడం సాధ్యం కాదు కాబట్టి రాజకుమారుల్ని బలివ్వాలని సంకల్పించాడు వాడు. అందుకు వాడు తెలివిగా స్వరూపరాణి స్వయంవరాన్ని ఎన్నుకొన్నాడు.
    జటాజూటుడొక సాధువు రూపంలో త్రిరూప దేశపు రాజును కల్సుకొని రాజకుమారి స్వయం వరానికిడగవలసిన ప్రశ్న సూచించాడు. రాజకుమారికి నూరు ఉంగరాలు కూడా ఇచ్చాడు. ఆ వుంగరాలలో వాడి మంత్రాల మహిమ వున్నది.
    తాండవ వనంలో అడుగు పెట్టిన రాజకుమారులు క్రూర మృగాల పాలబదకుండా క్షేమంగా తనను చేరడానికి జటాజూటుడొక బ్రహ్మరాక్షసిని నియమించాడు. అడవిలో అడుగుపెట్టిన రాజకుమారుల చేతికి ఉంగరం ఉన్నదీ లేనిదీ చూసి, అది వాళ్ళను తినేది లేనిదీ నిర్ణయించు కుంటుంది.
    ఉంగరం చేతికి ధరించిన రాజకుమారుడు పర్వత ప్రాంతానికి రాగానే కొండ గుహలోంచి పిలుపు వస్తుంది. అది ఉంగరానికి ఉన్న మంత్ర ప్రభావం. కొండ గుహలో అడుగుపెట్టి దేవి విగ్రహాన్ని చూసినవాడు సమ్మోహితుడై మాంత్రికుడు వచ్చే వరకూ అక్కడే ఉండిపోతాడు. నూరుమంది రాజకుమారులు వచ్చేవరకు మాంత్రికుడి యాగం ప్రారంభం కాదు. అంతకాలం ఇంతమంది రాజకుమారుల్ని పోషించడం వాడికిష్టం లేదు. అందుకని వాడు వాళ్ళందర్నీ క్రూర జంతువులుగా మార్చి అరణ్యం లోకి వదిలిపెట్టాడు. వుంగరాలు ధరించి నంత కాలం ఆ జంతువులు ఒకదానికొకటి హాని కలిగించుకోవు. అసలు పేరుతొ పిలవగానే ఆ జంతువుకు తిరిగి రాజకుమారుడి రూపం వచ్చేస్తుంది.
    వీరచంద్రుడు , దేవీ విగ్రహాన్ని చూసి సమ్మోహితుడు కాలేదంటే అందుకు అతడి అదృశ్యరూపమే కారణమైవుంటుంది.
    "ఇంతకూ ఆ త్రిలోక యాగం ప్రయోజన మేమిటి ?" అనడిగాడు వీరచంద్రుడు.
    "త్రిలోకాదిపత్యం !" అంది సుహాసిని. "ఈ యాగం చేసిన వాణ్ణి ఏ దేవతలూ నిర్జించలేరు. ఏ శాపాలు ఆపలేవు. ఈ యాగం పూర్తయితే వాడు నన్ను పెళ్ళి చేసుకోవడానికి నా తండ్రి శాపం కూడా ఫలించదు ."
    "వీడిలాంటి యాగం చేస్తుంటే స్వర్గాధిపతి దేవేంద్రుడెం చేస్తున్నాడు ?" అన్నాడు వీరచంద్రుడు.
    "పవిత్రమైన తపస్సును భంగం చేయగల దేవేంద్రుడు క్షుద్ర దేవతారాధకుల నేమీ చేయలేదు. అదీ కాక ఈ క్షుద్ర- దేవతారాధకులు తమ శక్తులను తుచ్చ శరీర సౌఖ్యాలకే ఉపయోగించుకొంటారు తప్పితే నిజంగా త్రిలోకాధిపత్యం జోలికి వెళ్ళరు. అందుకే దేవతలు కూడా వీళ్ళ సంగతి పట్టించుకోరు" అంది సుహాసిని.
    "ఈ యాగం పూర్తి చేశాడంటే జటాజూటుడికి లోకంలో ఎదురుండదన్న మాట!" అన్నాడు వీరచంద్రుడు తీవ్రంగా ఆలోచిస్తూ.
    "నీ మాటలు నిజమైతే నువ్వు నూరో రాజకుమారుడివి. ఆ యాగం పూర్తీ చేయవలసిన వాడివి నువ్వే !" అంది సుహాసిని.
    అదే సమయంలో దూరంగా పెద్ద అట్టహాసం విన్పించింది.
    "వాడే జటాజూటు మాంత్రికుడు. ఈ గదిలోకి వస్తున్నాడు!" అంది సుహాసిని కంగారుగా.
    "భయం లేదు, నేను అదృశ్య రూపంలోనే వున్నాను కదా!" అన్నాడు వీరచంద్రుడు.


                                     6
    జటాజూటుడు ఆరడుగుల ఎత్తున్నాడు. వాడు కళ్ళు కటిలత్వాన్ని సూచిస్తున్నాయి. నిలువెల్లా ఒకటే అంగీ ధరించాడు. మెడలో రుద్రాక్ష మాల వున్నది. చెవులకు ఏవో పూసల ఆభరణాలున్నాయి. చేతిలో మంత్ర దండ,మున్నది.
    జటాజూటుడు పెద్ద పెద్ద అంగలు వేసుకొంటూ గదిలో ప్రవేశించి మరొక్కసారి వికటాట్టహసం చేసాడు. నిద్ర నభినయిస్తున్న సుహాసిని, ఆ నవ్వుకు ఉలిక్కిపడి లేచి కూర్చుని "మళ్ళీ వచ్చావా - దుష్ట మాంత్రికా !" అంది.
    "పిలు, అలాగే పిలు, నువ్వే పేరుతొ పిలిస్తే ఆ పేరుకే పలుకుతాను. కానీ నన్ను పెళ్ళి చేసుకో !" అన్నాడు జటాజూటుడు. వాడి కంఠం కర్ణకఠోరంగా వున్నది.
    "అది ఈ జన్మకు జరగని పని !" అంది సుహాసిని.
    "జరుగుతుంది. ఈ జన్మలోనే జరుగుతుంది. నూరవ రాజకుమారుడు కూడా అరణ్య ప్రవేశం చేశాడు. గుహ వరకూ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. కానీ లోపలకు ప్రవేశించినట్లు లేదు. ఎక్కడ వున్నా వాడు నా పిలుపు అందుకొని రాక తప్పదు. రేపే నా త్రిలోక యాగానికి నాంది. ఆ యాగం పూర్తయ్యాక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుడు నేను నీ కళ్ళలోకి ఒక్కసారి సూటిగా చూశానంటే నువ్వే నా కాళ్ళ మీద పడి, పెళ్ళి చేసుకోమని ప్రాధేయ పడతావు. అయితే అప్పుడు నేను నిన్ను పట్టమహిషిని చేసుకోను. నాకుండే వేలాది భార్యలలో నువ్వూ ఒకతేవే అవుతావు. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటేనే నిన్ను నా పట్టమహిషిని చేస్తాను. నీకు త్రిలోకాధిపత్యం లభిస్తుంది" అన్నాడు జటాజూటుడు ఈ మాటలు పూర్తీ చేస్తూనే అతను మరొక్కసారి వికటాట్టహాసం చేసాడు.
    "నువ్వు కలలు కంటున్నావు. నీ త్రిలోకయాగం ఫలించదు. నువ్వు సర్వనాశనం మవుతావు. అంది సుహాసిని కోపంగా.
    జటాజూటుడు తన మంత్రదండాన్ని నేలపై ఉంచి, "ఇది మహా మహిమాన్వితమైన నా మంత్ర దండం. నా సర్వశక్తులూ దీనిలో వున్నాయి. కానీ ఇది నా చేతిలోనే పని చేస్తుంది. మరొకడి చేతిలో ఎందుకూ పనికిరాదు. దీన్నిప్పుడు నేలపై ఉంచుతున్నాను. నేను సర్వనాశనం అవుతాననడానికి సూచన ఏమిటో తెలుసా ! నేను దానిని నేలపై ఉంచినపుడు అది దానంతటదే గాలిలోకి లేస్తుంది. నువ్వు నేను సర్వనాశన మావుతున్నావు. ఆ నోటి తోనే ఆ మంత్ర దండాన్ని గాలిలోకి లెమ్మని చెప్పు. అప్పుడు నేను నేను నిజంగానే సర్వనాశనం మవుతాను. ఏదీ నా కోరిక వెలిబుచ్చు , ఎవరు కలగంటున్నది అప్పుడే అర్ధ,మవుతుంది" అన్నాడు.
    అయితే సుహాసిని ఏదో మాట్లాడే లోగా మంత్ర దండం తనంతట తనే గాలిలోకి లేచింది. గాలిలో అది కాసేపు నాట్యం చేసింది కూడా. ఆ తర్వాత అది విరిగి రెండు ముక్కలై నేల మీద పడింది.
    ఈ దృశ్యం చూస్తూనే జటాజూటుడు గుండెలు బాదుకున్నాడు. "జీవితం ధారపోసి నేను సంపాదించిన సర్వశక్తులూ త్రిలోక యాగానికి ముందే సమసి పోయాయి. నేనిప్పుడు సామాన్యుడి నైపోయాను" అంటూ సుహాసిని వైపు తిరిగి, "ఓసీ, పాపాత్ము'రాలా ! హటాత్తుగా నువ్వేమి మాయలు పన్నావే ------నీలో ఈ శక్తి ఎక్కణ్ణించి వచ్చిందే ---- ఇంక నిన్ను వదలను. నిన్ను నా దాన్ని చేసుకుని గానీ వదలను" అని ఒక్క పరుగున ఆమెను సమీపించి ఆమె చేయి పట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS