Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 23


    త్రినాధరావు. అరుణవంక అదోలా చూసి-"రమేష్ మీకేమవుతారు?" అనడిగాడు.
    "రమేష్ మా అన్నయ్య ఆమె నా వదిన....." అన్నాడు సురేష్.
    "అలాగా...." అన్న త్రినాధరావు కన్నుల్లో క్షణం సేపు లీలగా విషాదం తొంగి చూసింది. అనుమానంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. బహుశా చెప్పదల్చుకున్న విశేషం ఎలా చెప్పాలా అన్నది అతనికి అంతుబట్టడం లేదు కాబోలు.
    "మీరేదో చెప్పడానికి వచ్చేరనుకుంటాను?" అన్నాడు సురేష్.
    "అవును లోపలకు రావచ్చా...." అన్నాడు త్రినాధ రావు.
    వచ్చిన వ్యక్తిని లోపలకు రమ్మని మర్యాద చేయలేదని సురేష్ కి అప్పటికి గుర్తువచ్చింది. "అయామ్ సారీ-అన్నయ్య వస్తాడని మేమందరమూ    ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాము. ఆ ఆదుర్దాలో కొన్ని....."
    "మరేం ఫరవాలేదు...." అంటూ త్రినాధరావు ముందుకు నడిచి సోఫాలనుచేరి ఒక దాంట్లో కూర్చున్నాడు. సురేష్, అరుణ పక్కపక్కన మరో సోఫాలో కూర్చున్నారు.
    "మీ అన్నయ్య ఈరోజు రావడం లేదు. ఏదో ముఖ్యమైన వ్యవహారంలో అనుకోకుండా చిక్కుకుపోయారు. అయితే ఆయన అర్జంటుగా మీ కందజేయవలసిన సమాచార మొకటుంది. అది నా ద్వారా పంపించారు....." అన్నాడు త్రినాధరావు. అతను జేబులోంచి ఏదో ఒక కవరు తీసి సురేష్ కి అందించాడు.
    సురేస్ కవరందుకుని-అందులోని కాగితాలు తీసి కాసేపు చదివాడు. చదువుతున్న కొద్దీ అతని ముఖంలో రంగులు మారసాగాయి. చదవడం పూర్తయ్యేసరికి-అన్యాయం, దారుణం...." అన్న మాటలతని నోటమ్మట అప్రయత్నంగా వచ్చాయి.
    "అవును ఈ అన్యాయం, దారుణం ఆపాలి అందుకు సరైన మనిషిగా మీ అన్నయ్య నన్నెన్నుకున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయం అయినా నాకేమీ భయంలేదు. మంచివారికీ, ప్రజలకూ ప్రయోజనం కలిగించే ఏ పనులు చేయడానికైనా నేను వెనుకాడను. అయితే ఈ విషయంలో నాకు మీ సహాయ సహకారాలు కావాలి...." అన్నాడు త్రినాధరావు.
    "అవి మీకు తప్పక లభిస్తాయి....." అన్నాడు సురేష్.
    
                                       3
    
    "ఇది రమేష్ చేతివ్రాతే అనడంలో ఇంకేమీ సందేహంలేదు...." అన్నాడు సురేష్.
    "అదిసరే-నువ్వు గమనించలేదో-కవరుకు కాస్త పక్కగా ఉన్న ఎర్రటి మచ్చని...." అన్నాడు వీరయ్య.
    అప్పుడే సురేష్ ఆ మచ్చని పరిశీలనగా చూసి-"బాప్ రే-ఇది రక్తం కావచ్చు...." అన్నాడు.
    "అవును-అదే నా అనుమానం అయితే ఈ కవరు మీదకు రక్తపు మచ్చ ఎందుకు వచ్చింది? రమేష్ ఏదైనా ఆపదలో ఉన్నాడా? ఇప్పటికే అతనికేదైనా ప్రమాదం జరిగిందా? అసలు త్రినాధరావు ఏ పరిస్థితుల్లో రమేష్ ను కలుసుకున్నాడు?"
    "అవునండీ-వీటిలో కొన్ని అనుమానాలు నాకూ వచ్చాయి. అయితే మనకిప్పుడు త్రినాధరావుగురించి ఆలోచించడానికి వ్యవధిలేదు. అతన్నుపయోగించి ప్రమాదాన్నరికట్టాలి....."
    "అదిసరేనయ్యా-అసలు త్రినాధరావే శత్రువుల మనిషి అయితే! సులభంగా కోటలో పాగావేసినట్లే కదా!" అన్నాడు వీరయ్య.
    సురేష్ ఆలోచనలో పడ్డాడు. నిజమే-తనకీ అనుమానం రానేలేదు. అన్నయ్య దుర్మార్గులకు సంబంధించిన పథకాన్ని తెలుసుకుంటే అది అన్నయ్య దగ్గర్నుంచి ఈ త్రినాధరావు సంపాదించి ఉండవచ్చు. మన వేలితో మన కన్నే పొడుచుకునెలా చేయడంకోసం ఈ ఉత్తరంతో నాటకమాడవచ్చు.
    "మీరన్నదీ నిజంకావచ్చు. అలాంటప్పుడు మనమేం చేయాలంటారు?" అన్నాడు సురేష్.
    వీరయ్య నవ్వి-"నీకు ఆవేశమేగానీ ఆలోచనలేదు. మనం త్రినాధరావు మీద నిఘావేయాలి...." అన్నాడు.
    "ఆ బాధ్యత నాదనుకోండి....." అన్నాడు సురేష్. "సూటిగా మనం రంగామలోకి దిగనవసరంలేదు. వాళ్ళ ప్లానుప్రకారం ఈరోజు పదిగంటలకు ఆయిల్ లో విషం కలుస్తుంది. మన క్వాలిటీ కంట్రోల్ సైంటిస్టు పరీక్షలో ఆ విషాన్ని గుర్తించికూడా ఊరుకుంటాడు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలంటే-మనకు కాస్తనష్టం వచ్చినా కొంతసేపటి వరకూ ఊరుకోవాలి. విషం కలిసినంతవరకూ, ఆ విషాన్ని సైంటిస్టు గుర్తించనంతవరకూ మనం త్రినాధరావు గురించి పట్టించుకోవద్దు. ఆ రెండూ జరిగితేమాత్రం అతణ్ణి రంగంలోకి దింపుదాం....."
    "ఫరవాలేదు నీ ఆలోచన బాగానే వుంది. విషం కలవడం వల్ల మనకు వెంటనే వచ్చేనష్టం పదివేలు. పోతే పోనీ-పదివేల నష్టంతో సహ్త్రువులను పట్టుకోగలిగితే చాలు...." అన్నాడు వీరయ్య.
    ఇద్దరూ అక్కణ్ణించికలిసి వీరయ్య ఫ్యాక్టరీకి వెళ్ళారు. సురేష్ వేయికళ్ళతో వ్యవహారాన్ని కనిపెడుతున్నాడు. అతని కళ్ళముందే ఒకవ్యక్తి-ఎవరికీ అనుమానం కలిగించని రీతిలో-ఒక డ్రమ్ము నూనెలో ఏదో వేశాడు.
    సురేష్ ఆ వ్యక్తినీ ఆ డ్రమ్మునీ గుర్తుపెట్టుకున్నాడు. తర్వాత అక్కడికి వీరయ్యవచ్చాడు. సురేష్ కనుసైగను బట్టి-నూనెలో నిజంగానే విషయం కలిసిందని ఆయనకర్ధమైంది.
    మరో నిముషంలో ప్రొడక్షన్ యూనిట్లో కరెంట్ ఫెయిలయింది. ఇలాజరగడం అప్పుడప్పుడు మామూలే! కరెంట్ ఫెయిలయితే ఒకోసారి కొన్ని గంటలు పడుతుంది ఒకోసారి త్వరగానే రిపేరైపోతుంది. ప్రొడక్షన్ యూనిట్లో కరెంట్ ఫెయిలయితే అందులోని పనివారలకు తీరిక సమయం ఏర్పడుతుంది. ఆ తీరిక సమయంగడవడానికి వారికో చిన్నక్లబ్ ఫ్యాక్టరీలోనే ఏర్పాటు చేయబడివుంది. అందులో ఎన్నో పుస్తకాలూ, రకరకాలగేమ్సు ఉంటాయి.
    పనివారంతా పొలోమంటూ అక్కన్నించి బయటపడి క్లబ్ కు వెళ్ళిపోయారు. సురేష్ వీరయ్యకు తనుచూసిన వివరం చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS