గణపతికీ, విఠల్ కీ పరస్పరం పరిచయం జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. గణపతి కంటే విఠల్ ఓ రెండు సంవత్సరాలు చిన్న అని తప్పితే మిగతా విషయాల్లో ఇద్దరూ సమ ఉజ్జీలుగా కనిపించారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొన్న చూపుల్లో ద్వంద్వయుద్దపు అంచనాలు కనబడ్డాయి.
"బాగా ఆలోచించుకోండి. ఇందులో నేను నష్టపోయే దేమీలేదు. ద్వంద్వయుద్దానంతరం మీ ఇద్దరిలోనూ మిగిలేది ఒక్కరే! నాకోసం ఆ రిస్క్ తీసుకోదల్చుకుంటే అందుకు నా బాధ్యత లేదు....." అంది కుసుమ. విఠల్ ఏమంటాడోనని కుతూహలంగా ఉన్నదామెకు.
"ఎక్కడ, ఎప్పుడు, ఎల్లా? ఇంతకుమించి నేనేమీ తెల్సుకోదల్చుకోలేదు...." అన్నాడు విఠల్ .
"మీ ఉత్సాహాన్నభినందిస్తున్నాను. కానీ నా సంగతి మీకు తెలియదు. నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకండి. నాతో తలపడకండి...." అన్నాడు గణపతి.
"అలాగనడానికి కారణం మీ ధైర్యమో. భయమో అర్ధంకావడంలేదు నాకు...." అన్నాడు విఠల్ .
"రేపు ఆదివారం. సెలవురోజు. ఎక్కడికైనా పిక్నిక్ వెడదాం. అక్కడ తేల్చుకుంటే బాగుంటుంది...." అంది కుసుమ.
"పిక్నిక్ అయితే గంభీరగడ్డకు వెడదాం. అన్ని సమయాల్లోనూ అందరూ వుండరక్కడ. మన వ్యవహారానికది చాలా బాగుంటుంది...." అన్నాడు గణపతి. విఠల్ తలూపాడు.
"అక్కడకు వెళ్ళేదెలా?" అంది కుసుమ.
"టాక్సీ మాట్లాడుకుందాం. వచ్చేటప్పుడు ఏ లారీలో నైనా వచ్చేయొచ్చు...."
"కూడా ఏమేం తీసుకెళ్ళాలి..." అన్నాడు విఠల్.
"అది ద్వంద్వయుద్ధం చేసేవాళ్ళు నిశ్చయించుకోవాలి ...." అంది కుసుమ.
"కత్తులూ, కఠార్లూ అయితే విఠల్ గారు క్షణంకూడా నాముందు నిలబడలేరు. వాటిలో నాకు కాస్త అనుభవముంది. అందువల్ల చేతులే మా ఆయుధాలు. అప్పుడు బలాబలాలు నిర్ణయించుకోవచ్చు...." అన్నాడు గణపతి.
3
"టాక్సీ వెళ్ళిపోయింది....." అన్నాడు విఠల్.
"చుట్టూ ఎవ్వరూలేరు...." అంది కుసుమ.
గణపతి లేచి నిలబడ్డాడు. అతను షర్టువిప్పి కుసుమకు అందించాడు. అతన్నిచూసి విఠల్ కూడా లేచినిలబడ్డాడు. ఇద్దరూ నెమ్మదిగా పై బట్టలు విప్పుకున్నారు. ఇప్పుడు ఇద్దరివంటిమీదా డ్రాయర్లు మినహాయిస్తే ఏమీలేవు.
గణపతి ఒక విజిల్ ను కుసుమకు అందించి-"మేమిద్దరమూ ఇలా ఎదురెదురుగా నిలబడతాం. నువ్వు విజిల్ వేయగానే మా పోరాటం ప్రారంభమవుతుంది...." అన్నాడు.
"మామూలు పోరాటంకాదు. జీవన్మరణపోరాటం....."అన్నాడు విఠల్.
"ఒక్కక్షణం నాతో అలా వస్తారా?" అన్నాడు గణపతి. విఠల్ ని ఉద్దేశించి.
"ఎందుకు?" అన్నాడు విఠల్.
"మీకు కాస్త హితబోధచేయాలి. కుసుమ ఎదురుగా వుంటే మీ అహం రెచ్చిపోతుంది. అందుకని అలా పక్కగా వెడదాం...." అన్నాడు గణపతి.
"నాకే హితబోధలూ అవసరంలేదు...." అన్నాడు విఠల్ మొండిగా.
"అలా అనడానికి వీల్లేదు. ముందు నామాట వినవలసిందే...." అంటూ అతను విఠల్ చేయి పట్టుకుని లాక్కుంటూపోయాడు. ఆ పట్టు వుడుంపట్టులా వుంది. ఆ చేయి చాలా కర్కశంగా వుంది. విఠల్ మనసులో క్షణంపాటు తడబడ్డాడు.
కొంతదూరం వెళ్ళాక గణపతి నెమ్మదిగా అన్నాడు- "ఈపాటికి మీ కర్దమయుండాలి. నేను మిమ్మల్ని పచ్చడి క్రింద తన్నేయగలను. అయితే అలాచేయడం నాకిష్టం లేదు. నా మరదలు కుసుమ మానసికంగా ఇంకా ఎదగలేదు. లేకపోతే దానికి లాంటి సరదావుండి వుండాల్సింది కాదు....."
"అయితే ఏం చేయాలంటారు?"
"ఒకరినొకరు బాధపెట్టుకోకుండా ద్వంద్వ యుద్దాన్ని నటిద్దాం...."
"అందువల్ల ప్రయోజనం....?"
"నీకు బాధకలిగించకుండా నేను యుద్ధంచేస్తాను. మీరు ఓడిపొండి. ఫలితంగా నా మరదలు నన్ను పెళ్ళి చేసుకుంటుంది....." అన్నాడు గణపతి.
"కానీ ఆమెను నేనుకూడా ప్రేమిస్తున్నాను....."
"కుసుమ గురించి మీకుతెలియదు. ఇప్పుడు మనం చేయబోయే ద్వంద్వ యుద్దంలో ఒకరుమాత్రమే మిగుల్తారని ఆమె అనుకుంటోంది. అంటే నేను మిమ్మల్ని హత్య చేశానన్న మాట. దాని పరిణామం గురించి ఆమె ఆలోచించడం లేదు...."
"ఇవన్నీ మనకు ముందే తెలుసు. మీరెందు కంగీకరించారు?"
గణపతి నవ్వి-"చూడండి. వయసులో నేను మీకంటే కాస్త పెద్దవాణ్ణి. ఇలాంటి ద్వంద్వ యుద్ధం కోసం కుసుమ చాలాకాలంగా ఎదురుచూస్తోంది. దురదృష్టంకొద్దీ మీరు దానికి తటస్థపడ్డారు. మనిద్దరం నిజంగానే యుద్దంచేసి ఒకరు ఒకరిని చంపారనుకోండి. రెండో వాడిగతి ఏమవుతుంది? హత్యానేరానికి జైలు పాలవడం మినహా సాధించేదేముంది? అయితే నేను కాస్త ఆలోచించి ఇందుకంగీకరించాను. అటు కుసుమ సరదా తీర్చడానికీ-ఇటు ఎవరికీ ప్రమాదం వుండకూడదూ ఇదే నాకు తోచిన వుపాయం. మన ద్వంద్వ యుద్ధం నాటకం కావాలి. మీరు ప్రాణభీతినటించి ప్రాణభిక్ష అడగండి. కుసుమ వదిలేయమంటే వదిలేస్తాను. లేదా మిమ్మల్ని చంపడం కూడా మన నాటకంలో వుంటుంది. చిన్నప్పట్నించీ నాకు తెలుసును కాబట్టి కుసుమను పెళ్ళాడి నేను భరించగలను కానీ ఇలాంటి మనిషిని పెళ్ళాడి మీరు వేగలేరు...." అన్నాడు.
విఠల్ కాసేపాలోచించి-"సరే-అయితే అలాగే చేద్దాం...." అన్నాడు.
గణపతి అతన్నభినందించాడు. ఇద్దరూకలిసి కుసుమ దగ్గరకు వచ్చారు.
"ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరూ?" అంది కుసుమ.
