"ఏమిటా బలమైన కారణం?" అంది ఉదయ అనాసక్తిగా.
"వాడిప్పుడు వాడు కాదు...."
"అంటే ?" అంది ఉదయ యధాలాపంగా.
"పోనీ వాడు మనిషే కాదనుకో...."
ఉదయ చిరాగ్గా...."మనిషి కాకుంటే దెయ్యమా ?" అంది.
వేదాంతం మాట మార్చుతూ -- " నిన్న నువ్వు గమనించే ఉండాలి. వాడితో చాలాసేపు మాట్లాడేవూగా ...." అన్నాడు.
"అప్పుడే నేను గ్రహించాను. బావ పూర్వపు బావ కాదనీ బాగా మారిపోయాడని " అంది ఉదయ.
ఆ మాటలకు వేదాంతం కళ్ళలోకి కొత్త మెరుపు వచ్చింది.
"అమెరికా వెళ్ళే ముందు బావకు ప్రేమ కబుర్లు తెలియవు. మేమెప్పుడూ ఇద్దరం స్నేహితుల్లా మాట్లాడుకునే వాళ్ళం . ఇప్పుడలా కాదు. మొదటిసారిగా మేమిద్దరం ప్రేమికుల్లా మాట్లాడుకున్నాం...."
"ఉదయ బుగ్గల్లో కప్పుడు గులాబీల ఎరుపు వచ్చింది. జరిగినది తల్చుకుంటూ ఆమె పరవశిస్తూ పరిసరాలను మరిచినట్లుంది.
"అంటే?' అన్నాడు వేదాంతం.
ఉదయ ఏదో చెప్పబోయి అప్పుడే స్పృహ వచ్చినదానిలా ...."ఛీ నీకు చెప్పను...." అంది. అప్పుడామె సిగ్గుల మొగ్గలా ఉంది.
"కానీ.....' అన్నాడు వేదాంతం.
"నువ్వింకేమి చెప్పకు నాకు. విస్సీ బావ నాకిప్పుడిది వరకటి కంటే ఎక్కువగా నచ్చాడు. నీ మీద నాకు అసహ్యం ఏర్పడకుండా ఉండాలంటే వెంటనే వెళ్ళిపో జరిగినదంతా మర్చిపోయి నిన్ను క్షమిస్తాను " అంది ఉదయ.
"నువ్వు పోరబడుతున్నావు. విస్సీకి నీ మీద ప్రేమ లేదు. కోరికా లేదు. వాడు కేవలం అమ్మ తృప్తి పరచడం కోసం నీకు దగ్గరగా వస్తున్నాడు. అసలు విషయం తెలిసినరోజున నీ గుండె బద్దలవుతుంది. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను....' అన్నాడు వేదాంతం. అతడి గొంతులో బాధ ఉంది.
"నువ్వు విస్సీ బావ నేదో చేశావు. నాకు మందు పెట్టి బ్రతికించినట్టే విస్సీ బావకూ ఏదో మందు పెట్టి పాడు చేశావు. అత్తా బావను బాగు చేయగలదు. బావ నా గురించి కాక అత్త కోసం నా దగ్గరకు వస్తే అది నాకు చిన్నతనం కాదు. పెద్ద మనసున్న బావ ఏదో విధంగా నా దగ్గరకు వస్తే అదే నాకు గొప్ప! ఆ విధంగా చిన్న మనసున్న వాళ్ళ కుయుక్తులకు దూరంగా ఉండగల్గుతాను...."
వేదాంతం దెబ్బతిన్నట్లు....."నువ్వు నిజం గ్రహించే రోజు దగ్గర్లోనే ఉంది. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను. నా ప్రేమను అపార్ధం చేసుకు సూటీ పోటీ మాటలతో నన్ను బాధ పెట్టకు. ప్లీజ్ నన్నర్ధం చేసుకో! విశ్వనాద్ నిన్ను పెళ్ళి చేసుకోడు. నువ్వు వాడిని కాక వేరొకర్ని వివాహం చేసుకోక తప్పదు....' అన్నాడు.
"అదే తప్పని సరైతే - నేను నిన్ను కాక వేరేవరినైనా చేసుకుంటాను. దయుంచి ఇక వెళ్ళు. నన్ను వదిలి పెట్టు. మనమిక్కడిలా కలుసుకోవడం చాలా అసహ్యంగా ఉంది" అంది ఉదయ.
వేదాంతం ఇంకా ఏదో అనబోయి ఆగిపోయాడు.
అతడు బాత్రూం విండో లోంచి బయటకు దూకాడు.
ఆమెకు దూరమైనా ఆమె కనులలోని నిప్పుల వేడి అతడి నింకా తాకుతూనే ఉంది.
*****
ఒకరోజున సీతమ్మ ఇంట్లో అందరూ ఉండగా చెప్పింది -- తామందరూ కలసి అలౌకికానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళాలని!
'ఆ నీచుడి దగ్గరకా ?' అన్నాడు వేదాంతం కోపంగా.
సీతమ్మ కళ్ళెర్ర బడ్డాయి.
"నీ నమ్మకంతో నాకు నిమిత్తం లేదు. నేను నమ్మిన దేవుణ్ణి నాకు వినబడేలా దూషిస్తే నేను సహించలేను..." అంది.
"వాడి మీద నీకెందు కింత నమ్మకం ?"
"వాడు అనడం మాని ---ముందు స్వామి అను -----చెప్పుకుంటాను -" అంది సీతమ్మ.
"వాణ్ణి వాదనే అంటాను ---" పట్టుదలగా అన్నాడు వేదాంతం.
"ఈ ఇంట్లో నా మాటకు విలువ పోయింది -' అంటూ కళ్ళు వత్తుకుంది సీతమ్మ.
'అమ్మ మనసుకు కష్టం కలిగింది. తప్పోప్పుకుని క్షమార్పణ అడుగు" అన్నాడు కులభూషణ్.
వేదాంతం ఏదో అనేలోగా -- 'ఊ అడుగు ' అన్నాడు విశ్వనాద్.
వేదాంతం ఆశ్చర్యంగా మిత్రుడి వంక చూశాడు.
"నువ్వు కూడా ఇలాగంటున్నావా ?' అన్నట్లున్నాయతడి చూపులు.
విశ్వనాద్ ముఖం తిప్పుకున్నాడు.
"అమ్మా! నన్ను క్షమించు --" అన్నాడు వేదాంతం.
కులభూషణ్ నవ్వాడు.
'అమ్మ మాట కాదనడం కష్టం-" అంటోందా నవ్వు.
తన ఉక్రోషాన్ని మనసులోనే అణచు కున్నాడు వేదాంతం.
"ఆ స్వామి దయవల్లనే ఈ రోజు మనమంతా ఇలా ఉన్నాం ....' అంది సీతమ్మ. విశ్వనాద్ బ్రతికి రావడం, ఉదయ పునర్జన్మ ఎత్తడం -- అలౌకికానంద స్వామి కారణంగానేనని ఆమె నమ్ముతోంది.
వేదాంతం వాదించలేదు.
"మనమంతా రేపుదయమే బయల్దేరి స్వామి ఆశ్రమానికి వెడదాం --' అంది సీతమ్మ.
"ఉదయ కూడానా?" అన్నాడు వేదాంతం.
"ఉదయ మనలో మనిషి కాదా?' ఎదురు ప్రశ్న వేసింది సీతమ్మ.
"మనం వెడదాం.....కానీ ఉదయ వద్దు...."
"ఎందుకు?"
"స్వామి ఆశ్రమంలో అందమైన యువతులకు రక్షణ లేదు...."
సీతమ్మ కళ్ళు మళ్ళీ ఎర్రబడ్డాయి. ఆమె ఏదో అనబోయేలోగా -" అదృష్టం బాగుండక పొతే నాకు మనింట్లోనే రక్షణ ఉండదు --' అంది ఉదయ.
ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు వేదాంతం.
కసి -- ఆమె కళ్ళ వెనుక దాచుకుందామన్న దాగడం లేదు.
"ఏమిటి -- నేనిలా అందరికీ శత్రువునై పోయాను?' అనుకున్నాడు వేదాంతం.
"నీ క్షేమం కోరి చెబుతున్నాను. స్వామికి వ్యతిరేకంగా మాట్లాడకు -" అంది సీతమ్మ.
"ఏమవుతుంది?" అన్నాడు వేదాంతం.
'ఆకాశం మీద ఉమ్మేస్తే మనమీదే పడి మలినమావుతాం. మహర్షుల జోలికి వెడితే శాపగ్నిలో మలమల మాదిపోతాం...."
"స్వామి మహానుభావుడే అయితే -- అయన పట్ల గౌరవ భావాన్ని నాలో ఎందుకు ప్రవేశ పెట్టలేదు?" అన్నాడు వేదాంతం.
'అది పూర్వ జన్మ సుకృతం. కృష్ణుడి రోజుల్లో కూడా కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు -- ఆయన్ను నమ్మలేదు. వాళ్ళగతేమయిందో నీకు తెలుసు గదా !" అంది సీతమ్మ.
'అమ్మా! నీ అనుభవం నిన్ను స్వామిని నమ్మమంటుంది. ఆయన్ను నిరసించడానికి నా అనుభవం నాకుండవచ్చుగా --" అన్నాడు వేదాంతం.
"నా అనుభవం ముందు నీ అనుభవమేపాటిది ?"
వేదాంతం కోపంగా -- "నీ అనుభవం ఆ అలౌకికానందుడు సాక్షాత్తూ దేవుడి అవతారమని చెబుతోందా ?" అన్నాడు.
"కాదు, నా కన్న బిడ్డలను కాపాడుకొందుకు ఏమైనా చేయమంటుంది , అనుమానమున్న ఏ శక్తి తోనూ తలపడవద్దంటుంది-" అంది సీతమ్మ.
"అంటే..."
'అమ్మ మన విషయంలో చిన్న రిస్కు కూడా తీసుకోదు-- ' అన్నాడు కులభూషణ్.
వేదాంతం సీతమ్మ వంక చూశాడు.
ఆ చూపులతడికి కొత్త కావు.
చిన్నప్పట్నించి ఆ చూపులతో ఆమె అతడి నుంచి సాధించిన లేదు. అమ్మ అలా చూసినప్పుడతడు వివశుడై ఈ లోకం మరిచిపోతాడు.
ఆ చూపుల్లో అమృతముంది.
'ఆ చూపుల్లో మాత్రుహృదయముంది.
'అమ్మా! మీ మనసుకు కష్టం కలిగిస్తే నన్ను క్షమించు --" అన్నాడతను.
"మన మందరం వెళ్లి స్వామి దర్శనం చేసుకుందాం -' అంది సీతమ్మ.
