
జగదాంబ ఆలోచించింది. నిజమే! కామేశ్వరి అబద్ధం ఏమీ చెప్పలేదు! సుభద్రని తాను ఎందుకు దూషించాలి? కన్నెవయస్సులో కోరికలు ఉరకలు వేస్తూంటే ప్రేమించానంటూ, అవసరాలు తీర్చుకోజూచే యువకులకు శరీరాల్ని అర్పించుతారు! తను మటుకు చిన్నప్పుడు పెళ్ళికాని రోజుల్లో, ప్రక్కవాటాలో అద్దెకుంటూన్న నాగరాజుకి వశం కాలేదూ! భార్యని పురిటికి పంపిన ఆ ఆర్నెల్లూ, నాగరాజు తను అడిగినన్ని పరికిణీలూ, వోణీలూ, అన్నీ కొనిపెట్టి తన అవసరం తనతో తీర్చుకున్నాడు! అది వ్యభిచారము అవుతోందా!
అదొక సరదా అప్పుడు! అది నీతో మంచో చెడ్డో ఏమీ తెలీదు! ఆర్నెల్లు అతనితో అనుభవించినా, సుభద్రకి కలిగిన చిక్కు తనకి కలగలేదు! కలిగితే ఏమయ్యేది? అమ్మా నాన్న ఇంటిలోంచి గెంటేసేవారు! తనకా చదువూ చట్టు బండలూ లేవు! ఎల్లా బ్రతికేది! క్రిష్ణ కాలువలో పడి చచ్చును తనయితే! ఈ సంసారం, పిల్లలూ, ఇల్లూవాకిలీ, భర్తా, ప్రేమా, ఇవి అన్ని తన ఆ ఒక్క అవివేకపు పనివల్లో, తనకి దక్కకుండా పోవాల్సినవే! నాగరాజుమటుకు తనని పెళ్ళాడతానని అన్నాడా! అదివరకు ముగ్గురు పిల్లల తండ్రి! భార్యని నాలుగోపురిటికి పంపించిన భర్త! తనని ఎల్లా పెళ్ళాడతాడు? తనకా ఆలోచనే కలిగేది కాదు! నాగరాజు భార్య. శంకరి కూడా తనకి బాగా చనువుగా వుండేది. రాత్రిళ్ళు నాగరాజు ఉద్యోగరీత్యా కాంపులు వెళ్ళి రాకపోతే, శంకరి, జగదాంబని తమవాటాలో సాయం పడుక్కోమనేది! పిల్లలు రాత్రిళ్ళు లేచి, పాలకో నీళ్ళకో ఏడ్చేవాళ్ళు! ఆ పిల్లల్ని తను సముదాయిస్తోంటే శంకరిలేచి పాలుకలిపి తెచ్చేది. నాగరాజు కాంపుల్నించి వస్తూ, పూలూ, పాలకోవా మైసూరు పాక్ మొదలయిన స్వీట్సూ తెచ్చేవాడు. వాటిలో తనకీ భాగం పెట్టేది శంకరి! వాళ్ళగదిలో పెద్ద పందిర పట్టె మంచం వుండేది! నాగరాజు ఇంట్లో వుంటే ఎప్పుడూ దానిమీదపడి దొర్లుతూనే వుండేవాడు! శంకరి పురిటికి వెళ్ళినప్పుడు, మిట్టమధ్యాహ్నం తమ ఇంట్లో అందరూ నిద్రపోతూండగా, తను మెల్లగా లేచి ప్రక్క వాటాలోనికి జారుకునేది! నాగరాజు తీపి సామాన్లు ఏవేవో తెచ్చేవాడు! మళ్ళీ మాట్లాడకుండా తను పందిరి మంచంకేసి వెళ్ళిపోయేది! నాగరాజు ఇప్పుడెక్కడున్నాడో! అప్పుడు తనకి భలే సరదాగా వుండేది!'
వయసులో వున్న పెళ్ళి కాని పిల్లలు కనపడితే, పెళ్ళయి సంసారం చేసుకుంటూన్న పురుషులుకూడా అవకాశాలుంటే అనుభవించటానికి సిద్ధమవుతారు! అదొక సరదా వాళ్ళకి! దానివల్ల కలిసివచ్చేదేమీ లేక పోయినా, ఆ సరదాలుమటుకు స్త్రీ పురుషులకి తీరవేమో!
జగదాంబ కనులమ్మట అవిరళంగా నీరు స్రవించటాన్ని చూసిన, కామేశ్వరి.
'వూరుకో అమ్మా! వూరుకో! ఏమీ బాధపడకు! మా అత్తగారూ వాళ్ళూ ఏమన్నా అనుకుంటారు. పైకి నవ్వుతూ సరదాగా వుండు!' అంది. అంటూనే తన చీరచెంగుతో తల్లికళ్ళని ఒత్తింది. జగదాంబ కూతురి రెండుచేతులూ పుచ్చుకుని,
'నా తల్లీ! నీకు మేము అన్యాయం చేసినా నీకుమటుకు మేమంటే గౌరవము పోలేదు! నిన్ను కన్నందుకు గర్విస్తున్నాను. తల్లీ!' అంది!
'నాకేం అన్యాయము చేయలేదులే అమ్మా! గతమంతా తవ్వుకొని బాధపడకు!' అంది కామేశ్వరి!
నళినికి ఇంట్లో ఏమీ తోచటంలేదు! పరీక్షలు అయిపోయేయి! ఇంట్లో మేనత్త, కామేశ్వరి తల్లి వాళ్ళంతా వుండటంనించి చిరాకుగా ఇబ్బందిగా వుంటోంది! ఆ మధ్య నళినికి పెళ్ళివారు వొచ్చారు! వసుంధర మాట్లాడిన సంబంధమే అది! ఆ అబ్బాయి చాలా బాగానే వున్నాడు! కాని నళిని కెందుకో నచ్చలేదు! పెళ్ళిచూపులు చాలా మామూలుగా జరిగాయి! పెళ్ళి కొడుకూ తండ్రీ వొచ్చారు! నళినిచేత వసుంధర కాఫీలు తెప్పించింది. కాఫీ కప్పులున్న ట్రే తెచ్చి టేబులు మీద పెట్టింది నళిని! కేశవ పెళ్ళికొడుక్కి, పెళ్ళికొడుకు తండ్రికీ కాఫీలు ఇచ్చాడు!
'ఈ అమ్మాయే మా కోడలు! రావు గారూ!' అంటూ, వసుంధర సంభాషణ ప్రారంభించింది.
'అల్లాగా! బాగుంది! ఏంచదువుతున్నా వమ్మా!' అన్నాడు రావు.
'బి. ఎ. ఫైనల్ పరీక్షలు వ్రాసాను!' అంది నళిని. కేశవా ఖాళీగావున్న కుర్చీ చూసి,
'కూర్చో నళినీ'! అన్నాడు. నళిని కూర్చోబోతూంటే, పెళ్ళికొడుకు నరసింహ మూర్తి, నళినికేసి చూసాడు! అందంగా, చలాకీగా హూషుగావున్న నళిని, మూర్తిని ఆకర్షించలేదు. అతను బి.ఇ ఆనర్సుతో ప్యాసయ్యాడు! విదేశాల్లో ఇంకా చదువు కుందుకు వెళ్ళబోతూన్నాడు! కాని నళిని స్టయిల్ అతనికి నచ్చలేదు. నళిని జుట్టంతా వదులుగా దువ్వుకుంది. జుట్టు సగంలో రెండు పెద్ద ముత్యాలు పొదిగిన రింగుపెట్టి, ఆ జుట్టంతా భుజంమీంచి ముందుకు వేసుకుంది! రెండు కనుబొమ్మలు మధ్యా ఆవగింజంత బొట్టు పెట్టింది. తెల్లని టెర్లిన్ చీర, తెల్లని రుబీ వాయిల్ స్లీవ్ లెస్ బ్లవుజూ వేసుకుంది. సన్నని మంచి ముత్యాలహారం రెండు వరసలూ పొడుగ్గావుండేట్లు వేసుకుంది!
మూర్తికి ఆమె వేషధారణ నచ్చలేదు. మూర్తి సన్నని బంగారపు 'రంగు' జలతారు అంచువున్న సేలం అంచు పంచె ధరించి సన్నని గ్లాస్కో లాల్చీవేసుకున్నాడు! గోల్డు ఫ్రేమ్ కళ్ళద్దాలు ధరించిన మూర్తి వేషధారణ నళినికీ నచ్చలేదు. నిర్భయంగా, నిర్లజ్జగా చూస్తున్న నళిని చూపులని మూర్తీ ఎదుర్కోలేక తల వంచుకున్నాడు! రావు కాస్సేపు నళినితో ఆమె అభిరుచులగురించి బి.ఏ. లో ఆమె చదివిన సబ్జక్ట్స్ గురించీ మాట్లాడేడు.
'వెళ్ళివస్తాం బావగారూ! మీకు వీలున్నప్పుడు అటు వకసారి రండి!' అని వెళ్ళి పోవటానికి లేచేసారు. కేశవ.
'నాకు ఇల్లాంటివిషయాలు మాట్లాడటం అట్టే చేతకాదు! మీ అభిప్రాయాన్ని ప్లెయిన్ గా చెప్పండి!' అన్నాడు వినయంగా.
'అబ్బే దానిదేముంది? ఇంటికి వెళ్ళగానే అబ్బాయిని కనుక్కుంటాను! మీరు రేపొకసారి మాఇంటికి రండి!' అన్నాడు రావు, వెళ్ళుతూ, దారిలో.
'ఏరా! అమ్మాయి బాగానే వుంది కదురా పైగా చదువుకుందికూడాను?' అన్నాడు.
'నాకంత నచ్చలేదు! నాన్నా!' అన్నాడు మూర్తి.
'ఎంచేత? బి.ఎ. ప్యాసవపోతోంది! తండ్రికి వక్కత్తే కూతురు! బోలెడుఆస్తి వుంది! నీవా విదేశాలకు వెళ్ళటానికి ఉబలాటపడుతున్నావు! నీకు ఆర్ధిక సాయం కావాల్సి వొచ్చినా వెనక్కు దీయరు వాళ్ళు! డబ్బుకోసం మనం అడగక్కర్లేదు వేరే!' అన్నాడు రావు.
'సర్లెండి! ఆపిల్ల వేషభాషలు నాకు నచ్చలేదు. ఇంతకంటే బెస్ట్ మాచ్ దొరక్క పోతే చూద్దాం!' అన్నాడు మూర్తి. ఇంటికి కెళ్ళాక, భార్యతో చెప్పాడు రావు. ఈ సంబంధం చూసినసంగతి!
'వసుంధర మేనకోడలా! అయితే ఫరవాలేదు! పిల్ల చురుకుగానే వుంటుందట! మన ప్రక్కింటి తాయారుతో చదూతూంది. ఒకటి రెండుసార్లు చూసిన జ్ఞాపకం కూడానూ! కాని ఆ లెక్చరరుగారు ఈమధ్యనే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడట! పేదఇంటిపిల్లని! మరి కట్నం గొడవ ఆస్తిపాస్తులు ముందస్తుగా మాట్లాడుకోకపోతే లాభంలేదు!' అంది రావుభార్య. నందమ్మ.
'అదేం? మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడా ఎందుకూ?' ఆశ్చర్యపోయాడు రావు.
'ముందు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో, మళ్ళీ పెళ్ళీ అందుకే చేసుకుంటాడు! పెళ్ళి ఎందుకు అన్న ప్రశ్నేమిటి?' అంది నందమ్మ.
'పెళ్ళి కెదిగిన కూతురుండగా పెళ్ళేమిటి తనకి? మతిలేదా? ఈ చేసుకునేది, రాజేశ్వరి పోగానే చేసుకుంటేపోలా?' అన్నాడు రావు.
'ఎవళ్ళఇష్టం వాళ్ళది! మనకెందుకు! పిల్ల మీకు నచ్చితేమటుకు, ఆస్తిపాస్తుల విషయంముందు ఖచ్చితంగా తేల్చుకోండి!' అంది నందమ్మ.
'అల్లాగే చూడాలి మరి!' అన్నాడురావు.
ఇక్కడ, కేశవ, నళినిని, 'పెళ్ళి కొడుకు నీకు నచ్చాడా' అని అడగలేదు. ఎందుచేతనో కేశవకి పెళ్ళివిషయాలు నళినితో మాట్లాడటం సిగ్గు కలగచేస్తుంది!
* * *
11
'ఆ అబ్బాయి తరహా నాకు నచ్చలేదు!' అని నళిని తండ్రితో కాని మేనత్తతోకాని చెప్పలేదు! వాళ్ళు తన అభిప్రాయం కనుక్కోకుండా సంబంధాలు చూస్తోంటే తనేం చెబ్తుంది? అందుకని నళిని మెదలకుండా ఊరుకుంది. పరీక్షలు కాగానే మాధవ కూడా తను వూరు వెళ్ళిపోయేడు! మాధవకి ఈ మధ్య నళినితో అంత స్నేహంగా ఉండటం బాగుండలేదు! కాలేజీలో జేరిన చక్కగా ఆరు నెలల్లోగా మాధవ నళినితో ఒకర్ని చూడకుండా వేరొకరు ఉండలేనంత గాఢంగా స్నేహం చేశాడు! ఈ మూడేళ్ళ చదువుతోపాటు అతనికి నళినిపట్ల ప్రేమా స్నేహభావమూ కూడా బలంగా పొదుకున్నాయి! మధ్యలో కామేశ్వరి, రామనాధం గొడవతో మాధవ మనసు చెదిరిపోయింది. తన అన్నని అలక్ష్యంచేసి అతని ప్రేమనీ ఆరాధననీ తేలిగ్గా తీసిపారేసిందని 'నళిని' మీద ఒకవిధమైన అలసభావం కలిగింది! నళినికి కూడా 'మాధవ' యొక్క మునుపటి చిలిపితనం, మాటకారితనం పోయి గాంభీర్యం, ఔదాసీన్యత ఆశ్చర్యం కలిగించింది! కానీ ఆవేదన కలిగించలేదు. ఆరాధన లుప్తమైనప్పుడు ఆవేదన ఎందుకు కలుగుతుంది?
నళిని వంటిగా వుండి ఏమీ తోచకుండా వుంటే, సముద్రతీరం వెంపు వెళ్ళింది. సముద్ర తీరం దగ్గరకు వెళ్ళగానే ఆమెకు మాధవ జ్ఞాపకం వచ్చాడు! ఎప్పుడూ, వాళ్ళిద్దరూ కలిసి బీచ్ కి వచ్చేవారు! రాత్రి పదిగంటలదాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు! దూరంగా, జంటలు జంటలుగా కొందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూంటే, 'నళిని'కి అసూయ కలిగింది!
తనకి ఈ చదువు విసుగెత్తుతూంది! చక్కగా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది! చక్కగా వెన్నెల్లో భర్తతో షికార్లు హేస్తూ, కాలం గడపాల్సిన రోజుల్లో బండెడు పుస్తకాలు ముందువేసుకుని చదువుకుంటూ, ఆ చదివిన పాఠాలు అర్ధంకాకపోతే విసుక్కుంటూ కాలం గడపాల్సి వస్తోంది! ఈ సంబంధం కుదిరిపోతే బాగుండును! అనుకొంది నళిని. ఒక వేళ కుదరకపోతే?' అనే సందేహం వచ్చింది! 'ఈ సంబంధం కుదురుతుంది! ఒకవేళ కుదరకపోతే మాధవకి వుత్తరం వ్రాస్తుంది! తను వుత్తరం వ్రాస్తే, మాధవ తప్పక పొంగిపోతాడు! హాయిగా జీవితంలో ఆనందం అనుభవించాల్సిన వయస్సులో పంతాలు పట్టుకుని బ్రతుకును నిర్వీర్యం చేసుకోవటం దేనికి?
'మూడువంతులు ఈ సంబంధం కుదిరే తీరుతుంది! తన తండ్రి తనకి బోలెడు కట్నం ఇస్తాడు! ధనలోపం లేనప్పుడు సంబంధం ఎందుకు కుదరదు?' ఇల్లా తనలో తనే ఆలోచించుకుంటూ చీకటిపడి నదికూడా గమనించకుండా అల్లానే కూర్చుంది నళిని.
'హల్లో! నళినీ కుమారీ! వక్కరూ కూర్చున్నారేం?' అంటూ గవర్రాజు వచ్చి పలకరిస్తూ నళినికి కాస్త దూరంలో కూర్చున్నాడు!
'ఏమీ తోచక వచ్చాను ఇల్లా!' అంది నళిని. ఈ మధ్య అప్పుడప్పుడు, గవర్రాజు పట్నంలో మకాం పెట్టేక కేశవ ఇంటికి వస్తూ పోతూనే వున్నాడు. ఈ రోజు గవర్రాజు ఫుల్ సూటులో వున్నాడు! ఉదయించే చంద్రకాంతిలో సముద్రతీరంలో, గవర్రాజు సినిమా హీరోలా కనుపించేడు నళినికి.
'నేను కొత్తగా కారు కొన్నాను! దాన్ని వేసుకుని వచ్చాను ఏమీ తోచక. పార్కింగ్ లో మీ కారు లేదే ఎల్లా వచ్చారు?' అన్నాడు గవర్రాజు!
'నేను కారులో రాలేదు! కారు మా అత్త షాపింగ్ కి తీసుక వెళ్ళింది! మీ కారు ఏ కంపెనీదీ!' అంది నళిని.
'ఎంబాసిడర్ దే! సెకండ్ హాండ్ ది కొన్నాను. మీది, ప్లిమత్ కదూ! స్టాండర్టు హోరాల్డు అన్నా కొత్తది కొనాలనుకుంటున్నాను!' అన్నాడు గవర్రాజు.
'అది సెకెండ్ హాండ్ ది కొనరా?' అంది నళిని. కాస్సేపు కార్ల మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్నారు ఇద్దరూను. సఖ్యం సాప్తపదీనం అన్నట్లు ఇద్దరికీ ఒకరి సన్నిధిలో ఒకరికి, వంటరితనం పారిపోయినట్లు అన్పించింది. చంద్రుడు ఆకాశం మధ్యకి ఎగబ్రాకాడు.
