విభ్రాంతిపడ్డాను. నాకళ్ళని నేను నమ్మలేక విచిత్రంగా చూస్తూండిపోయాను. నాకళ్ళ ముందు నావంటి ఓఆడది! అప్పటికప్పుడు తెర వెనుక అవతరించినట్టు-గోడలోంచి పుట్టుకొచ్చినట్టు ప్రత్యక్షమైంది. తెల్లటి జరీచీరలో మిలమిలలాడుతూ దేవతలా కన్పించింది. ఒంటినిండా ఒంటెడు నగలు! జుట్టునిండా పుట్టెడు పూలూ! ఆ ప్రశాంతమైన చిరునవ్వు నన్నుచూసే నవ్వినట్టయింది. సరోజ! ఎంత అందమైందీ! నాకు తెలీకుండానే సరోజ పాదాలదగ్గర కూర్చుండిపోయాను. ఆ పచ్చటి పాదాలు తాకి కళ్ళకద్దుకున్నాను-"ఎంత దృష్టవంతురాలిని సరోజా! ఇంతటి భాగ్యం కొందరికే సొంతమవుతుంది..నువ్వు ఎప్పుడూ ఆయన మనసులో సజీవంగానే వుండిపోతావు. నీ భర్త నింతగా బంధించుకోగల్గిన నువ్వెంత అదృష్టవంతురాలివి సరోజా!"
"నీ చోటులో నేను ప్రవేశించానమ్మా! అది నామమాత్రం కాకుండా నీవు పొందే అనురాగమే నాకు లభ్యమవుతుందని దీవించు అక్కయ్యా! నువ్వు పెద్దదానివి. నేనీ ఇంటిలో ప్రవేశించింది నీ భర్త మీద జాలి చేతే గానీ నీమీద అసూయతో కాదు. నాకు తెలుసు. నువ్వెక్కడవున్నా దేవతగా నీ భర్తని చూచుకుంటూనే వుంటాను. ఆయన సుఖమే కదా నువ్వు కోరేది." ఎన్నోవిధాల మనసు లోనే ఆవిడకి మొరబెట్టుకున్నాను. అన్నిటికీ ఆ చిరునవ్వే సమాధానమైంది-ఆయనకి మెలకువ వస్తుందేమోనని తొందరగా లేచి తెరనిండుగా కప్పి నాగదిలోకెళ్ళిపోయాను.
నామనసంతా అల్లకల్లోలమైపోయింది. ఆయన విషయం నేను చాల తేలిగా తీసుకున్నానుగానీ ఆ సరోజని ఆయన స్మృతినుంచి తప్పించటం ఆస్థానం నేనాక్రమించటం స్వప్నంలో కూడా జరిగే సంగతులు కావేమో! ఎప్పుడూ ఆతెర లోపలికి చూస్తూ వుంటే చాలు సరోజ సాన్నిధ్యంలో వున్నట్టే భావించుకోవచ్చు.
రోజులు గడుస్తున్నాయి. పరిస్థితి ఎప్పటి లానే వుంది. ఆయన వుదయమే లేచి సరోజకి పూలమాల అలంకరిస్తారట. రోజూ బజారు నుంచి పువ్వులొస్తాయి. సరోజ వున్నప్పుడు దొడ్డినిండా కావలసినన్ని రకాల పువ్వులు పూసే వట. సరోజ రోజూ ఆయన ఫోటోకి పూలమాల వేసేదట. ఆనాడు నిండైన మనసుతో చేసింది. ఈనాడు చేయించుకొంటూంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతకదా? ఎప్పటికప్పుడు అత్తయ్య చాలా సంగతులు చెప్తూంటారు.
క్రమంగా నా పద్ధతిలో చాలా మార్పులు తెచ్చుకున్నాను. దానికి అత్తయ్య ప్రోత్సాహం చెప్పుకోదగ్గది. పగలంతా ఎక్కువగా ఆయన పరిసరాల్లోనే మసిలేదాన్ని. లేచింది మొదలు పనిమనిషి అవసరంలేకుండా ఆయన అవసరాలన్నీ చూడబోయేదాన్ని. మొహం కడుక్కోవటానికి నీళ్ళూ, సబ్బూ -కడుక్కు వచ్చేసరికి రెడీగా తుండూ అందించేవాడు పనిమనిషి. ఆపనులేవో నేను చెయ్యబోతే ఆయన చిరాకుపడేవారు.
"నువ్వెళ్ళు. వాడొస్తాడు."
"వాడు లేడు. అత్తయ్య ఎక్కడికో పంపించారు." అటువంటప్పుడు ఆయనే స్వయంగా చేసుకొనేవారుగానీ నానీడనైనా పడనిచ్చేవారు కాదు.
"రోజూ ఏమిటమ్మా ఇది? ఇదే టైంకి వాడు బజారుకి పోతాడెందుకనీ?"
"బావుందిరా నీ గొడవ. పనివుండి నేనే పంపించాను. ఏం? ఎవరు చేస్తే నీదేం పోయింది? పని మనిషే అనుకోరాదూ? వాడికంటే పనికిరానిదా ఏమిటది?"-చేసేది లేక నాచేతుల్లో టవలు తీసుకుని వెళ్ళిపోయారు. పాలు తీసుకెళ్ళాను.
"అక్కడ పెట్టి వెళ్ళు." నేను వచ్చేశాను. పదినిముషాలు పోయాక గ్లాసు తీసుకురావటానికి వెళ్ళాను. రానురాను ఆయనకి పనిమనిషిగా మాత్రం స్థిరపడగలిగాను. పనిమనిషితో మాట్లాడినట్టే ముభావంగా మాట్లాడటం. పనిమనిషికి ఆజ్ఞాపించినట్టే ఆజ్ఞాపించటం- ఆయన అవసరాలు కనిపెట్టి ఎంతో మెలకువగా చనువుగా ప్రవర్తించేదాన్ని. ధైర్యంగా దగ్గిర చేరి యజమానిని అడిగినట్టు ఎన్నో విషయాలు అడిగేదాన్ని. ఏవో పుస్తకాలిమ్మని గుమ్మంలోనే కూర్చుని చదువుకునేదాన్ని, ఆయనకి భార్యననే విషయం మరుపు వచ్చేటట్లుగా పనిమనిషిగానే ప్రవర్తించేదాన్ని.
నెలదాటింది. నాన్న వచ్చారు నన్ను తీసుకెళ్ళాలని. ఆ పరిస్థితిలో వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. నాలుగురోజులుండి ఆయన వెళ్ళిపోయారు.
ఓనాడు అత్తయ్య ఆయనకి నన్నే భోజనం వడ్డించమన్నారు. వంటగదిలో కూడా నేనే సిద్ధమయ్యేసరికి ఆయనకి కోపం వచ్చింది.
"అమ్మని రమ్మను."
నేను ఏదో చెప్పబోయేలోపునే ఆవిడే అందుకున్నారు పక్కగదిలోనుంచి-"నాకు తలనొప్పిగా వుందని పడుకున్నానురా. దాన్ని పెట్టనీ, దాన్నంత అసహ్యించుకుంటావు. పాపం అదేం బాధపడుతుందో అనైనా అనుకోవేంరా!" అంటూ.
ఆయన కిక్కురు మనకుండా భోంచేసి వెళ్లారు. ఆనాటినుంచీ తరచు ఆయన భోజనం విషయం కూడా నేనే చూసేదాన్ని-సరోజ చెప్పేదట. అత్తయ్య మాట ఎప్పుడూ తీసి వెయ్యొద్దని. ఆయనకి అదే వేదవాక్కు.
ఉదయమే ఆయన సరోజకి పూలుగుచ్చు తూంటే దగ్గిరే చూస్తూ నిలబడేదాన్ని-ఓసారి- "నేను బాగా మాలకట్టగలను. అంత చక్కగా వుంటే సరోజ మురిసిపోతుంది." అన్నాను. ఆయన క్షణం నా మొహంలోకి చూసి పూలన్నీ నా ముందుపోసి- "అయితే నువ్వే కట్టు. చాల చక్కగా వుండాలి." అని నేను పూలుకడుతూంటే చూస్తూ కూర్చున్నారు. ఆరోజు ఆయన సరోజకి మాలవేస్తుంటే నేనూ దగ్గిరే నుంచున్నాను. సరోజకి పూలు నేనే కట్టి ఇచ్చే దాన్ని. సరోజ కబుర్లుచెప్తే ఆయన ఎటువంటి చిరాకునైనా మర్చిపోతారు. సరోజని ఆయన మనసునుంచి దూరం చెయ్యటానికి బదులు నేను ఆయనకి చనువు కావాలంటే ఆ సరోజ కబుర్లే ప్రస్థావించవలసివచ్చేది. నాకావిషయం కొంచెం కష్టంగానే వున్నా తప్పనిసరైంది.
నా పద్ధతిలో కొంచెం ముందుకు సాగాను, ఎప్పుడూ చక్కగా అలంకరించుకునే దగ్గిర తిరిగే దాన్ని. చొరవగా ఆయనకి చాల దగ్గిరే మసిలే దాన్ని. ఆయన నావైపు చూసినా నేను చూసి నట్టు తెలీగానే మొహం తిప్పుకొనేవారు. ఆయన ధోరణి క్షణం ఆశ కలిగించినా మరుక్షణమే నిరాశలో ముంచివేసేది.
ఓసారి ఆయన తల దువ్వుకొంటూంటే దగ్గిరే నిలబడి-"నేను దువ్వనా? సరోజ దువ్వే దట." అన్నాను.
ఆయన చాల హేళనగా "సరోజ చేసినట్టు చేస్తావా?"
"ఎందుకు చెయ్యను చెపితే?'
"సరోజ చెప్తేనే చేశేదా?" ఇంకేమనను. సరోజంటే అంతలక్ష్యం ఆయనకి. ఒక్కోరాత్రి నాలో నేనే కుమిలిపోయేదాన్ని. నిజంగా మూర్కంగా ప్రవర్తించి బ్రతుకంతా నాశనం చేసుకున్నానేమో అనిపించేది. ఏమిటీ దేవిరింపు? ఎన్నాళ్ళు గడపాలి ఇలా? ఆయన మనసునుంచి ఆ సరోజ ఎప్పటికి తప్పుకొంటుంది? భార్యగా నా చోటు నాకెప్పటికి దక్కుతుంది? ఎవరికోసం ఈగొడవ కోరి తెచ్చుకున్నాను? ఎప్పటికో ఈయనలో మార్పు వచ్చినా అది అంతంత మాత్రమే. ఆ సంతోషం పరిపూర్ణమైంది మాత్రంకాబోదు. ఒక్కోసారి నా భవిష్యత్తు తల్చుకొని ఏడ్చినా మరుక్షణంలోనే ఏదోధైర్యంతో ఆశతో నిలవగలిగే దాన్ని.
ఆయన ప్రవర్తనలో కూడా నాకు మార్పు గోచరించసాగింది. నన్ను చనువుగా పిల్చి కబుర్లు చెప్పటం-నేనేది చెప్పినా శ్రద్ధగా వినటం-ఏవిధంగానూ నన్ను అసహ్యించుకోకపోవటం-ఒక స్నేహితురాలిగా ఆయన మంచిచెడ్డలు చూడటం తప్ప అంతకన్నా దగ్గిరికి రాలేకపోయాను. నన్ను గురించి ఆయనేం ఆలోచిస్తారోనాకు తెలీదు-ఓనాటి రాత్రి సూటిగా ఆవిషయమే అడిగాను.
"నేను మీకేమవుతానో గుర్తుందా?" ఆయన నాకేసి చూసి వూరుకున్నారు.
"నన్నెందుకింత దూరంగా వుంచుతారు? నన్ను మీరు అగ్నిసాక్షిగా పెళ్ళిచేసుకున్న సంగతి మర్చిపోయారా?"
"ఇప్పుడెందుకా గొడవ?" "ఇన్నాళ్ళూ అడగలేకే వూరుకున్నాను. మర్చిపోయి వుంటారు ఇప్పటికైనా గుర్తుచేద్దామని- ఈమాత్రానికి నన్నెందుకు పెళ్ళిచేసుకున్నారు? నాకూ అందరి ఆడవాళ్ళలా గడపాలని వుంటుందని మీకు తెలీదా?'
"నన్నడక్కు. పెళ్ళికి ముందే అన్నీ నీకు తెలుసు. నిన్నేం చెయ్యాలో నేనాలోచించలేదు. అమ్మమాట మాత్ర, తీర్చాను. అంతే. నాపొరపాటేం లేదు. నువ్వూ అన్నీ తెలిసే ఇష్టపడ్డావు'.
"పొరపాటు నాదే. మీమనసింత పాషాణమని అప్పుడనుకోలేకపోయాను. కాని మీరే ఆలోచించండి. పోయిన వాళ్ళతో పోతామా? నేనిలా కుళ్ళి ఏడిస్తే మీకు సంతోషంగా వుంటుందా? నేనేం పాపం .....
"వెళ్ళు శాంతా! నన్ను విసిగించకు. నాకు సరోజే నాకు కానప్పుడిక ఎవరూవద్దు. నామనసుని నేను మభ్యపెట్టుకొని నీకు సంతోషం కల్గించలేను-"
ఆయన నన్ను పేరుతో పిలిచింది అదే మొదటి సారి. అంత కఠినంగా మాట్లాడుతుంటే ఆపరిస్థితిలో సంభాషణ పెంచలేక లేచిపోయాను. మర్నాడంతా ఆయన చాలముభావంగా వుండిపోయారు.
"నీగురించి ఎంత ఆలోచించినా నాకు ఒకటే అనిపిస్తుంది. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నాకిక ఏ ప్రసంగమూ వద్దు. గడిచినన్నాళ్ళిలాగే గడుస్తుంది. తర్వాత సరోజ దగ్గిరకే పోతాను." అన్నారొకసారి.
ఆయన చెప్పింది ఎలా ఉన్నా నన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నారని మాత్రం అనుకున్నాను.తర్వాత ఆయన నాతో ఎక్కువగా మాట్లాడటమే తగ్గించారు. నేనూ ముభావంగా నాపనులు చేసుకొనేదాన్ని. 'నీకు చాలా అన్యాయం చేశానమ్మా! వీడింత బండలా వుండిపోతాడని అనుకోలేదమ్మా!" అంటూ అత్తయ్య చాలాసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు-నాకిక ఏఆలోచనా లేదు. ఆయన మారినా మారకపోయినా ఆయనకి భార్యగా ఆ యింట్లో వుండటం తప్ప మరో కర్తవ్యం లేదు. ఏధైర్యంతో పెళ్ళిచేసుకున్నానో ఆదైర్యంతోనే బ్రతుకు గడుపుకొంటాను.
కాని నా నిరాశ నిరాశగానే వుండిపోలేదు. అనుకోని విధంగా నా బ్రతుకు బాగుపడింది. నా జీవన లత చిగుర్చి పూలు పూసింది. కరుణామయి సరోజ నా కన్నీరు పన్నీరుగా మార్చింది. దేవతవంటి సరోజ దేవతనేనని ఋజువుచేసుకొంది. ప్రేమ మూర్తి సరోజ మాఇద్దరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆరోజు ఆయన ఒంట్లో బావులేదని లేవలేదు. నేను ఆయన గదిలోనే కూర్చున్నాను. కళ్ళుపెట్టుకు చూడాల్సిందేగానీ ఆయన శరీరం చేతులేసి సేవచేసే భాగ్యం లేదు కదా? రోజంతా మాటామంచీ లేకుండా కళ్ళుమూసుకు పడుకున్నారు. సాయంత్రమైంది. లైటువేసి మళ్ళా కూర్చున్నాను.
"శాంతా!" అయన నన్ను పిలిచారు. అలా పేరుతో పిలిచింది రెండోసారి. అంత అనునయంగా పిలిచినందుకు ఆశ్చర్యంతోనే దగ్గిరకెళ్ళాను.
"కూర్చో" తాను కొంచెం ఒత్తిగిలి పక్కలో చోటు చూపించారు. నేను అయోమయంగా నించునే వున్నాను.
"కూర్చో శాంతా!" అంటూ చేతులుజాపి నాచేయి తీసుకు దగ్గిర కూర్చోబెట్టుకున్నారు. అదంతా వాస్తవమో-కాదో నాకు నమ్మకంలేదు-"తలనొప్పిగా వుంది శాంతా!" వేళ్ళతో నుదురు నిమరసాగాను. ఆయన కళ్ళవెంట వెచ్చటి నీళ్ళు పారుతున్నాయి-"ఛ! ఏమిటది? అంటూ కళ్ళు తుడిచాను. రెండుచేతుల్లో నన్ను ఇముడ్చుకుని దగ్గిరికి తీసుకున్నారు. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏమిటిది? మతిగాని భ్రమించలేదు కదా! స్పృహలో వుండే ఇలా ప్రవర్తిస్తున్నారా?
"ఏమిటింత దయ?" అనాలనుకున్నానుగానీ మాటలు పెగిలిరాలేదు. ఆయన చెప్పుకుపోతూంటే వింటూ కూర్చున్నాను.
"సరోజ కన్పించింది శాంతా రాత్రి. సరోజే చెప్పింది నిన్ను దగ్గిరికి తీసుకోమని. నామొండి తనానికి సరోజకి కోపం కూడా వచ్చింది."
"రాత్రి మీకు కలవచ్చిందా?" "కలా? కాదు. సరోజ నిజంగా వచ్చింది, పక్కలో కూర్చుని మీదికి వంగి ముద్దుపెట్టుకొంది. ఎప్పుడూ అలాగే చేసేది-సరూని చూస్తూ నిర్ఘాంతపోయాను. ఆతృతగా చేతుల్లో ఇముడ్చుకున్నాను. ఒళ్లంతా నిమిరాను. ఆశగా మొహం లోకి చూశాను. చిరునవ్వు నవ్వింది-"సరూ! ఇన్నాళ్ళూ ఎక్కడున్నావ్ సరూ?నన్ను మర్చి పోయావా సరూ?" అంటూ ప్రశ్నించాను ఆతృతతో.
సరూ మళ్ళా నవ్వింది - "స్వర్గంలో వున్నాను." అంది.
"నువ్విక ఎక్కడికీ వెళ్లొద్దు. వెళ్తే నన్నూ తీసికెళ్ళు." "తప్పుకదూ? నువ్విక్కడేవుండాలీ రఘూ! నిన్ను నేనెప్పుడూ మర్చిపోనుగా? ఎప్పుడూ ఛాయలా నీ మనసులోనే వుంటాను. ఎక్కడికీ వెళ్ళిపోయానని ఎందుకనుకుంటావు?" అంది. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పింది. సరూ కబుర్లు వింటూ ఏమీ అడగలేకపోయాను.
