33
రఘు తన మొదటి పది, పదిహేను రోజులూ ఫాక్టరీ లో ఎలా గడిపాడో కూడా కాస్త తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడం మంచిది.
మొదటి రోజు రఘుతో అక్కడి సూపర్ వైజర్ దగ్గిర నించి మామూలు కూలీ వరకూ ఎవ్వరూ మాట్లాడలేదు. నిమిషాలు గడిచే కొద్దీ రఘుకు విసుగెక్కు వైపోతుంది. తానెం చెయ్యాలో తెలుసుకోడానికి ఒకటి రెండు సార్లు సూపర్ వైజర్ దగ్గిరికి వెళ్ళాడు. రఘును చూడగానే సూపర్ వైజర్ దిగ్గున లేచి , "యస్ సర్?' అన్నాడు.
"నేను సర్ ని కాను! కూలీగా ఉద్యోగం ఇచ్చారు. కూలీగానే ట్రీట్ చెయ్యండి!" అన్నాడు రఘు ఆనాటి ఉదయాన్నే జరిగిన సంఘటన తనలో చెలరేగిన ఆరాటాన్నీ.....అసహనాన్ని మరిచిపోలేక. అది విని సూపర్ వైజర్ బిక్కమొగం వేశాడు... విసుగ్గా వెళ్లి, రఘు మళ్ళీ ఏదో ఒక స్టూలు మీద కూర్చున్నాడు.
ఫాక్టరీ లో ఉన్న అంత హడావిడి లోనూ , రఘు ఆవేశ పూర్వకంగా అన్న ఆ మాటలు ఒకరిద్దరి చెవుల్లో పడ్డాయి. అవే ఆ నోటా ఈ నోటా పాకుతూ, రఘు కూర్చున్న చోటి వరకూ వ్యాపించాయి. ఒక వర్కర్ అంతా విని మరీ కడుపు మండిన వాడిలా అన్నాడు.
"ఇదంతా ఒక నాటకం రా! తన కొడుకే -- అన్నది కూడా మనసులో ఉంచుకోక సేతుపతి గారు ఈ చిన్న జమిందారు గారిని కూలీగా పంపించాడంటే ఎవడి కడుపు నిండుతుందనీ? రెండు రోజులిక్కడుంటాడు. మూడో రోజు దీనికంతటి కి మేనేజింగ్ డైరెక్టరవుతాడు. ఇప్పుడూ గొప్పే, అప్పుడూ గొప్పే! అసలు గొప్ప ఎప్పుడూ గొప్పే!"
మరొకడందుకుని, "కారులో వచ్చాడురా మన కార్మికుడు! నాకు తెలీకడుగుతానూ , ఆబూట్స్ ఖరీదు ఎంతుంతుందంటావు?" అన్నాడు.
"ముప్పై అయిదు!"
"మరి ఆ మేజోల్లో?"
"ఏసుకో, జతకో పన్నెండు రూపాయలు!"
"అసలు.....వాచీ సంగతి మరిచే పోయాం!"
"అమ్మ బాబో! అది స్మగుల్డు సామాను! ఐదారు వందలన్నా ఉంటుంది!"
"సెభాష్ , మనదేశంలో కార్మికుల పరిస్థితి, మూడు పువ్వులూ, ఆరు కాయల్లా ఉందిరా! అందుకు మచ్చుకు మన కూలీ జమిందారు గారున్నారుగా?"
అందరూ గొల్లుమని నవ్వారు.
"ఒరేయ్ , నేనోమాటంటాను, నమ్ముతార్రా? రేపో మాపో ఫోటోలు తీసేవాడు వస్తాడు. వచ్చి కూలీ జమీందారు గారి ఫోటో వారు కూలి పని చేస్తుండగా తీసి, అన్ని పేపర్ల లోనూ అచ్చు వెయ్యకపోతే నా ముక్కు కోయించు కుంటాన్రా!"
"ఎదవా! ఏదయినా ఆక్సిడెంటు జరిగి , ఇక్కడ ముక్కు పొతే కాంపెన్సేషన్ వస్తుందిరా! నీ అంతట నీవు కోయించు కుంటే పైసా రాదు! పైగా ఉన్న ముక్కు కూడా పోతుంది!"
"మళ్ళీ నవ్వు!
రఘు ఉడుకుతూన్న అన్నంలా కుతకుత లాదిపోతున్నాడు! అదృష్టం కొద్దీ లంచ్ కి కూత కూసింది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపి చద్ది తెచ్చుకున్న కారియర్లతో బయలుదేరారు. కాంటీన్ ఎక్కడో రఘుకేం తెలుసు? అందుకని వాళ్ళనే అనుసరించి వెళ్ళాడు. తీరా వర్కర్లందరూ భోజనాలకూ కూర్చునే సరికి, తాను అయ్యంగారు నడిగి అర్ధరూపాయి తీసుకోడం మరిచిపోయిన సంగతి గుర్తు వచ్చింది. కళ్ళు నీళ్ళతో నిండాయి. ఏం చెయ్యాలో తోచలేదు రఘుకు. అనవసరంగా తింటున్న వాళ్ళ ఎదట నుంచోడం ఇష్టం లేక రఘు అగమ్యగోచరంగా అడుగులు వేశాడు.
"ఇదుగో ...బాబూ!" అందొక గొంతుక!'
రఘు, ఆ ధ్వని కేసి చూశాడు. దాదాపు అరవై ఏళ్ళ వయసు వాడు, కూలీయే ; తన సెక్షన్ లో అతణ్ణి చూచిన జ్ఞాపకం లేదు. దయగా తననే చూస్తున్నాడు. అయినా....అనుమానంగానే ఉంది!
"నిన్నే!"
'ఊ?"
"చద్ది తెచ్చుకోలేదా?"
"ఉహు."
"కొత్తగా సేరావా?"
"ఊ.."
"ఏ సెక్షన్?"
"మెకానికల్."
"ఇంతో అంతో సదువుకున్న కుర్రోడులా ఉండావు. అట్టనే ఇంకాసింత దూరం సదువు కోలేక పోయావా? ఏ టైప్ మిశన్ గుమస్తాగానో లచ్చనంగా ఉండేవోడివి! నువ్వు అంతదూరం సదువు కోలేదా?"
"లేదు."
"సదువుకుని సేసే ఉద్యోగాల్లోని సుకం, కూలీ, నాలీ పనుల్లో ఉండవు బాబూ! సరిలే , అందరూ సదువుకున్న ఉద్యోగాల కోసమే పాకులాడితే కష్ట పడేవాళ్ళోరుంటారూ? ఏమంటావు?"
"నిజమే."
"సరే , రా, నీ అదృష్టం! రోజూ రెండు రొట్టెలు కట్టేది , ఇయ్యాల మూడు కట్టింది, నంజు కోడానికి వంకాయ ఇగురు కూడా ఉంది! రా!"
"వద్దులే, తాతా, నువ్వు తిను!"
"నేను తినేవి రెండే నాయనా! ఎందుకని కట్టేరో మరి? ఉంది గందా అని, ఎక్కువ తింటే కడుపు సెడి పోదూ? రా, ఏం ఫరవాలేదు లే. రేపెప్పుడన్నా నేను నీ అన్నంలో భాగం పంచుకుంటాను లే! రా, కూకో!"
రఘు సందేహించాడు . కానీ....ఆ వయసు మళ్ళిన వాని మంచి మనసును గాయపరచడానికి ఇష్టం లేక అతని కెదురుగా కూర్చున్నాడు.
"నీ పేరెం పేరు బాబూ?"
"రఘు."
"మంచి పేరు. శ్రీరామ శంద్రమూర్తిది. ఇందా, తీసుకో" అంటూ, ఒక జొన్న రొట్టె మీద ఇంత వంకాయ ఇగురు వేసుకో ఇచ్చాడతడు. దాన్ని
"ఆ? ఏంటది?"
"ఏమీ లేదులే తాతా. నీ పేరెం పేరు?"
"ఏదో...పాతకాలం పేరులే; ఓబులేసు!"
"మంచి పేరే!"
"ఆ....అదేం పేరు? దానికేం అర్తమా పర్తమా!"
"అర్ధం లేకేం తాతా? ఓబులేసు , అంటే ఆహోబలేశ్వరుడన్న మాట! అంటే నరసింహుడు!"
"ఆ? అంత పెద్ద పేరా నాది?"
"నిజంగా తాతా!"
"బేస్, నువ్వు నిజంగా తెలివి గల కుర్రోడీవే! తోరలోనే ఏ క్లాసు మెకానిక్కు వవుతావు! ఇదోర కేక్కడన్నా పనిసేశావా?"
"లేదు, చదువు మానేసి, సరాసరి ఇక్కడికే వచ్చాను."
"అదే బుల్లోడా నువ్వు సేసిన తప్పిదం! సదువు పూర్తీ సేసుంటే ఎంత బాగుండేది? కర్మ!"
"అంతే తాతా!"
"ఇంకో అర రొట్టె...."
"వద్దు, వద్దొద్దు."
"నాకేం తక్కువ కాదులే!"
"వద్దు. నిజంగా వద్దు!"
"సరే, అయితే లేసి సెయ్యి కడుక్కుని నీల్లు తాగిరా!" రఘు పోబోయాడు.
"రగూ!"
"ఊ!"
"ఏమీ అనుకోమాక! అట్టగే ఈ గిన్నె రొంత కడిగి, నాకూ కాసిన్నీ మంచి నీల్లు తెచ్చి పెట్టు నాయనా!"
రఘు పది, పదిహేను సెకండ్లు తటపటాయించాడు. ఓబులేసు దాన్ని గమనించలేదు. జొన్న రొట్టె తో వంకాయ ఇగురు లోని సారాన్ని చవి చూడడం లోనే ఏదో తన్మయత్వాన్ని పొందు తున్నాడతడు! రఘు ఆ సత్తు గిన్నె తీసుకుని కొళాయివద్దకు బయలుదేరాడు!
సరిగా ఆ సమయానికే అయ్యం గారు ఆదరా, బాదరాగా అటు వైపే వచ్చాడు. అతనికీ పాపం, అప్పుడే జ్ఞాపకం వచ్చింది కాబోలు, అబ్బాయి గారి లంచ్ కి అర్ధ రూపాయ తానివ్వ లేదని! రఘును కొళాయి వద్ద చూశారాయన.
"చినబాబు గారూ...." అనేసి, భయపడుతూ చుట్టూ పక్కల్ని కలయజూచాడాయన పొరపాటున సేతుపతి గారు ఆ చుట్టుపక్కల్లో ఉన్నారేమో, కొంపదీసి అని.
"మరిచి పోయా చినబాబూ!"
"ఫరవాలేదు లెండి, నా లంచ్ అయింది!"
"ఓ, థాంక్ గాడ్. మీరు ఈ పూట పస్తుండిపోయారేమోనని భయపడ్డా. మరి, నాకు సెలవా?"
"యస్!"
ఈలోగా నలుగురయిడుగురు కూలీలు అటు వైపు రావడం వల్ల రఘు వారిని రఘూ, అయ్యం గారు దారిని అయ్యం గారూ వెళ్ళిపోయారు.
మొదటి రోజు అలా జరిగిపోయింది!
* * * *
ఇక రెండో రోజు సంగతి.
ఆనాడు తండ్రీ -- కొడుకు లిద్దరే బయలుదేరారు. ఇంటి దగ్గిర నుంచి బయలు దేరినప్పుడే సేతుపతి గారికి రఘు కో అదేదో మార్పు అగుపడింది. "ఏమిటా?' అని గమనించి చూశారు సేతుపతి.
"ఏం?' షూస్ లేకుండా బయలుదేరావు?"
"నాలాటి కూలీ పని చేసుకునే వాడు, ముప్పై అయిదు రూపాయలు విలవ చేసే జత బూట్సు అక్కడికి తోడు క్కేళ్ళడం, ఎబ్బెట్టుగా ఉంటుంది సార్! అదీ గాకుండా మా సెక్షన్లో ఏ అయిదారు గురికో తప్ప, ఎవరికీ పాదరక్ష లంటూ లేవు!"
ప్రోప్రయిటరు గారి అబ్బాయి అని, మిగిలిన వర్కర్లు ఏదో హేళన చేసి ఉంటారు. అందుకే మనసు చిన్న బుచ్చుకుని రఘు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడను కున్నాడు సేతుపతి.
"మరి, వాచీ ఏది?"
"దాని అవసరం నా కగు పడ్డం లేదు సర్! లంచ్ కి సైరన్ మోగుతుంది. పని ముగింపు సమయానికి మళ్ళీ సైరన్ మోగుతుంది, ఇక వాచీ ఎందుకూ?"
"నిన్న అయ్యం గార్ గారు అర్ధరూపాయ ఇచ్చారా?"
"లేదు సర్! అడగడం నేనే మరిచిపోయాను."
"మరి పస్తున్నావా?"
"లేదు సర్! ఓబులేసు అని, ఒక వర్కరున్నాడు. ఒక జొన్న రొట్టె ఇచ్చాడు. అది తిని, నీళ్లు తాగాను!క్" అమాంతంగా కారు ఆపించి కొడుకును వెనక సీట్ లోకి రమ్మని ఆ అబ్బాయిని హృదయానికి హత్తుకోవాలని పించింది ఆ తండ్రికి! ఆ ఆవేశాన్ని ఆపుకో గలిగాడాయన, లోలోన తృప్తి నే అనుభవించారు సేతుపతి.
మళ్ళీ ఫాక్టరీ , మళ్ళీ వర్కర్లు చురచుర చూసే చూపులు! రఘుపతి లోని మార్పును వాళ్ళు మాత్రం గమనించ కుండా ఉంటారా? రఘు ఏదో పని మీద సూపర్ వైజర్ గారి సీటు వైపు వెళుతున్నాడు.
"ఆ....ఆ....భద్రం అండీ చినదొర గారూ! ఇక్కడి నేలంతా ఇనప ముక్కల మయం! గుచ్చుకుంటే ...గిచ్చుకుంటే ....." అని ఒకడంటుండగానే, మరొకడు "మరేం పరవాలేదురా! జనరల్ హాస్పిటల్ లో ఏ క్లాసు వార్డు వీళ్ళ కోసం టపీమని ఖాళీ చేయిస్తారు!" అన్నాడు.
"ఈ మాత్రం దానికే?"
"నీకేం తెలుసురా గోప్పోళ్ళ సంగతి? రాత్రి దోమతెర లోకి ఒక్క దోమ దూరితే .....అంటీ మలేరియా ఇంజక్షన్ పుచ్చుకుని, ఇల్లంతా డి.డి.టి. కొట్టించి, ఇంటికి కొత్త రంగులు వేసుకుంటారు , కల మహారాజులు!"
మళ్ళీ నవ్వు! రఘు ఏమీ బాధపడలేదు.
"అరె! అబ్బాయి గారు వాచీ కట్టుకు రాలేదురా ఇయ్యాల!"
"అయితే , ఫోటో తీసేవాడు రావడం లేదన్న మాటే!"
మళ్ళీ నవ్వు!
ఆ పూట కూడా రఘు ఆ సెక్షన్ లో చేయవలసిన పని ఏమీ లేకపోయింది . లంచ్ బ్రేక్ కి కూత కూసింది . రఘు , తాను తెచ్చుకున్న కేస్ బుట్ట తీసుకుని, సరాసరి ఓబులేసు దగ్గిరికి వెళ్ళాడు.
"రా రగూ, ఇయ్యాల ఇంటి కాంనించే బువ్వ తెచ్చు కుండా వల్లే ఉంది?"
"అవును తాతా, నీక్కూడా తెచ్చాను!"
"ఓరి నీ ఇల్లు బంగారం కానూ! అదేదో పెద్ద రునమైనట్టు, ఇయ్యాలె తీర్చేద్దామనుకుంటుండావా? మల్ల ....నా జొన్న రొట్టేలెం కాను?"
"నీ రొట్టెలు రేపటి దాకా ఉన్నా, చెడిపోవు తాతా!"
"రైటు! దా, కూకో! అంటూ ఓబులేసు తన చద్ది మూట ఓ పక్క ఉంచాడు. తీరా రఘు తన కెన్ బాస్కెట్ లో నుంచి క్యారియర్ , నీళ్ళ సీసా, ఫ్లాస్కు , నాప్ కిన్సు, ప్లేట్లు, స్పూన్లు ఒక్కటోక్కటిగా తీస్తుంటే ఓబులేసు తన కళ్ళను తానె నమ్మలేకపోయాడు!
"ఇదేంటి నాయనా....నా తండ్రీ! నువ్వు కూలీవా....లచ్చాది కారివా? ఓరి బాబు ఓరి బాబు! ఇయ్యన్నీ ఏంటి? ఒకేళ ఇంట్లో ఉండాయనుకో ఈటినన్నింటి నీ ఈడకు తెస్తే , అందరూ కన్ను కుట్టి సావరూ?!"
"రేపటి నించీ తీసుకురానులే!"
"పాపం, ఏదో గొప్పింటి బిడ్డలా గుండావు. నీకీ కర్మ ఎందుకు పుట్టింది సెప్పు! అంతేలే! ఎంత పెద్దోళ్ళయినా.....ఏ చనాన ఏ కష్ట మొచ్చి పడుతుందో మనం సేప్పలెం! అదే ...భగవంతుడి లీల!"
ఎలాగయితేనేం? ఇద్దరూ తృప్తిగా భోం చేశారు. పైపు దగ్గిరికి వెళ్లి, ఎవరెవరి ప్లేట్లు వాళ్లు కడుక్కున్నారు.
"శ్రీరామ చంద్రా, ఇంత మంచి తిండి తిన్నాక, ఇక పనేం చేస్తాం మనం? ఏ పంకా కిందో పడుకుని నిదరోవాల్సిందే!" అన్నాడు ఓబులేసు.
రఘు నవ్వాడు. ఈలోగానే తన సెక్షన్ లో పనిచేసేవారు అటు వైపు వస్తుండడం గమనించి, అవసరవసరంగా అన్నీ సర్దుకుని , "వస్తా తాతా" అంటూ అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓబులేసు మీసాల మీది తడి తుడుచుకునే లోగానే రఘు సెక్షన్ లోని వర్కర్లు అక్కడికి వచ్చారు.
"అదుగో.....పెరుమాల్లూ! ఆ కుర్రాడేవరంటావు?"
"ఏం?ఏమన్నా బెదిరించాడా?"
"రామరామ! బంగారం లాంటి కుర్రాడు. ఎంత మంచోడనుకున్నావు? పాపం, ఏదో బతికి చెడిన కుటుంబం లోని కుర్రాడిలా ఉండాడు!"
"నీ మొహం! బతికి బ్రహ్మాండంగా బాగుపడుతూన్న కుటుంబం లోని కుర్రాడాయన!"
"అంటే?"
"మన సేతుపతి గారి అబ్బాయోయి! రఘుపతి గారు!"
"ఓరి బాబో, ఓరి బగమంతుడా!"అంటూ ఓబులేసు పరుగు లంకించుకున్నాడు. సరాసరి రఘు పనిచేస్తూన్న సెక్షన్ కి వెళ్ళాడు. ఇంకా ఏడెనిమిది నిమిషాల వ్యవధి ఉంది, మళ్ళీ పని మొదలెట్టండని సైరన్ కూలీల్ని హెచ్చరించడానికి. ఒక్కరొక్కరుగా .......ఇద్దరిద్దరుగా ఆ సెక్షన్ లోకి వర్కర్లు వస్తున్నారు. అందరినీ దాటి వచ్చి రఘు పాదాల నాశ్రయించాడు ఓబులేసు.
"తాతా! ఇదేమిటి? తప్పు! లే...."
"ణా తండ్రి , మారాజా! ఆ మారాజుకు తగ్గ కొడుకు వనిపించుకున్నావు! నీ తల్లి కడుపు చల్లగా.........వెయ్యేళ్ళు వర్ధిల్లు , నాయనా! నాకు తెలియదు, నీవు ఫలానా అని!"
"నే నెవరినైతే ఏం తాతా? ఇక్కడున్నంత కాలం మీలో ఒక్కడ్నే! ఇక్కడి నించి వెళ్ళిపోయిన తరవాత కూడా నేను మీ మనిషినే!"
సైరన్ మోగింది!
"వస్తా తండ్రీ! టైమయిపోయింది!" అంటూ ఓబులేసు మళ్ళీ దండం పెట్టి వెళ్ళిపోయాడు.
ఎందుకో గానీ.....ఆ క్షణం నించి ఆ సెక్షన్ వాతావరణం మారిపోయింది . ఆ తరవాత రెండు మూడు రోజులకు ఓబులేసు కధ, కధలు కధలుగా వర్కర్సు అందరి లోనూ వ్యాపించింది. అదీ గాకుండా వారం తిరిగేసరికి, ఆ ఫాక్టరీ లోని వర్కర్లందరి కీ కాన్ వాస్ షూస్ సప్లయి చేయబడ్డాయి! దానితో ....రఘు అందరి తోటీ కలిసి పోయాడు. ఆ అందరిలోనూ అలాంటి ఒకడయ్యాడు.
