Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 23


    'ఇది నేను ఉండవలసిన ఇల్లు, ఈ బంగళా నాకోసం , ఈ పూల తోట, ఈ అందమైన డ్రాయింగు రూం ఇవన్నీ నావి. ఇవన్నీ నాకోసం' రవిచంద్ర మనస్సు పదేపదే అనుకోసాగింది. "నాకేం తక్కువ? సంఘంలో పెద్ద స్థానం, ప్రాణం ఇచ్చే మిత్రులు,ధనం ఇప్పుడు అన్నీ ఉన్నాయి' అనుకోసాగాడు.
    'నాకేం తక్కువ?' అనే ప్రశ్న ఎందుకనో అతని హృదయాన్ని కలుక్కు మనిపించి, 'ఏదో తక్కువ' అనే భావాన్ని కలగజేసింది. 'వీటన్నిటినీ అనుభవించడానికి నీ వొక్కడవేనా? అలా అయితే జీవితం పరిపూర్ణత ను పొందదు. ఇంకా ఎవరో కావాలి. ఇవన్నీ వారు అనుభవించాలి. అప్పుడే జీవితంలో నిజమైన సంతృప్తి , ఆనందం.' ఎవరో తను అడిగినట్లుగానే తన లోపలి నించి జవాబు ఇవ్వసాగారు.
    'సురేంద్ర ఉన్నాడు. నేను గుండె చెదిరి, మోసగించబడి చీకట్లో తడుముకుంటున్నప్పుడు నాకోసం సురేంద్ర కనిపించాడు. మేమిద్దరమూ ఈ సుఖాన్ని ఈ ఆనందాన్ని అనుభవిస్తాం. నాకిం కెవరూ అవసరం లేదు. నాకు కావలిసింది సురేంద్ర ఉంటె చాలు.'
    మళ్ళీ తనలోనే ఎవరో జవాబు ఇచ్చారు. బయట సుఖంగా ఉన్న అతనికి లోపల ఏదో సంచలనము, భావోద్వేగము, జవాబు లేని ,జవాబు దొరకని ప్రశ్నలు. జీవితం అనే గణిత శాస్త్రంలో ఇంకాసాల్వు చేయనటువంటి, సాల్వు కాబడనటువంటి లెక్కలు.
    కొంచెం చేదిరినట్లయి, లోపాలకు వచ్చిన తరవాత సురేంద్ర ను పొదివి పట్టుకొని, "సూరీ, నీవు నన్నొక రోజు అడిగావు, "నాలో ఎన్ని దోషాలున్నప్పటికి వదిలిపెట్టి వెళ్ళ వద్దని.' నేను ఇప్పుడదే కోరిక కోరుతున్నాను. నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళబోకు, సూరీ. నీవు వెళ్ళిపోతే, నాకు అర్ధం కాని, నన్ను భయపెట్టే ఈ ఆడంబరతను నేను భరించలేను. ఒంటరిగా ఈ సుఖాన్ని నేను అనుభవించలేను. నీవు వెళ్ళ కూడదు. ఎక్కడికీ వెళ్ళ కూడదు" అన్నాడు.
    సురేంద్ర క్షణ కాలం అర్ధం గాక అతణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు:
    'అరే, ఫూల్ , ఏమిటీ పిచ్చి? ఎందుకలా బాధపడుతున్నావు? నీవు అట్లా చెప్పవలిసిన అవసరం కూడా లేదు, నీ హోదా , నీ అధికారం , నీ ఈ బంగాళా నీకు వద్దన్నా, నన్నిక్కడే ఉంటెటట్లు చేస్తున్నాయి. ఐ హేవ్ ఏ వీక్ నెస్ ఫర్ పాంప్ అండ్ షో!" అతని మాటల్లో హాస్యం ధ్వనించింది.
    తనను తాను అదుపులోకి తెచ్చుకోవటానికి క్షణకాలం పట్టింది రవిచంద్ర కు. నెమ్మదిగా తనకోసం అమర్చిన పక్క దగ్గిరికి వెళ్ళాడు. తెల్లటి డ్రస్ లో ఉన్న బంట్రోతు గాజు కూజాలో మంచినీళ్ళు  తీసుకువచ్చి మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద నెమ్మదిగా, చప్పుడు గాకుండా ఉంచాడు.
    రవిచంద్ర సిగరెట్టు తీసి ముట్టించి ఆలోచించ సాగాడు. సిగరెట్టు రవికి కొత్తగా అయిన అలవాటు. ట్రెయినింగ్ లో సరదా కు కాల్చటం మొదలెట్టాడు . అదే అలవాటయింది.
    కాసేపటికి సురేంద్ర కూడా వచ్చి, పక్కనే ఉన్న ఇంకో బెడ్ మీద కూర్చున్నాడు, నిద్రపోవటానికి అయత్తమవుతూ.
    రవి చేతిలోని సిగరెట్టు చూస్తూ, "ఇది ఎప్పటినించి" అన్నాడు ఆశ్చర్యంగా సురేంద్ర.
    రవి నవ్వి జవాబివ్వలేదు. సురేంద్ర దాన్ని గురించి ఇంకోసారి అడగదలుచుకోలేదు.
    ఇద్దరి మధ్య కాస్సేపు నిశ్శబ్దం గూడు కట్టుకుంది.
    సురేంద్ర ఏ విధంగా తను చెప్పబోయే విషయాన్ని ఉపక్రమించాలో తేల్చుకోలేక కాసేపు తికమకపడి చివరకు ప్రారంభించాడు.
    "సురేఖ విషయం చాలా ఘోరంగా తయారయింది!" ఆ విధంగా అంటున్నప్పుడు అతని గొంతులో విషాదం ధ్వనించింది.
    ఉలిక్కిపడ్డాడు రవి.
    "ఏం? ఒంట్లో బాగా లేదా? ఇందాకటి నించి నేను అడిగినప్పటికి చెప్పలేదేం?" కంగారుగా ప్రశ్నించాడు.
    "ఒంట్లో బాగుండలేక పోయినా ఇంతగా అనుకునే వాణ్ణి కాను. కాని....." కాసేపు చెప్పలేక ఆగిపోయాడు.
    "ఏమిటి, సూరీ, ఏం జరిగింది?" రవి కంఠం లో చెప్పలేనంత ఆత్రత.
    "మనిషి పూర్తిగా చెడిపోయింది."
    రవి గుండెలో రాయి పడినట్లయింది. ఆప్రయత్నంగా మంచం మీద నించి లేచి అతని దగ్గిరికి వచ్చి కూర్చొని, "ఏమిటి? నీవనేది నాకేమీ అర్ధం కావటం లేదు" అన్నాడు.
    "నీకేమిటి? బొంబాయి నించి వచ్చిన తరవాత నాకే అర్ధం కాలేదు. ఆమెను చూసిన తరవాత వెనకటి సురేఖేనా అనిపించింది. అప్పుడని పించింది నాకు సినిమాలో నాకు చాన్సు రాకపోయినా బాగుండేదని." అతను కదిలిపోయాడు.గుండెను ఎవరో నలిపి వేసినట్లు బాధపడ సాగాడు. అతని హావాభావాల్లో సురేఖ మీద ఇంతకూ మునుపు ఎన్నడూ వెల్లడి చేయని అనురాగం, ప్రేమ, ఆదరణ, ఆ విధంగా తయారయి నందుకు బాధ , ద్వేషం విచారం -- అన్నీ బయట పడ్డాయి.
    "నన్ను మరింత కంగారు పెట్టకు. ఏం జరిగిందో సూటిగా చెప్పు.' రవి ఆత్రత తెచ్చిన కోపంతో అడిగాడు.
    "సురేఖ కు మొదటి నించి డబ్బన్నా, కార్లన్నా మేడలన్నా తగని పిచ్చి, ఏదో విధంగా డబ్బు సంపాదించి తను ఇవన్నీ సమకూర్చు కోవాలని కోరిక. ఆమెకు నాటకాలలో వచ్చే డబ్బు సరిపోలేదు. ఏదో విధంగా సంపాదించు కోవాలనే కోరికను అణచు కోలేకపోయింది. చిన్నప్పటి నించి తను కన్న కలలు ఎంతకూ నిజాలుగా మారక పోవడంతో దెబ్బ తిన్నది. ఆమె నాటకాలను చూసి మోహించిన దేశ్ పాండే ధనవంతుడని అతని వలలో పడింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను అన్ని ఊళ్లు తిప్పి, మోజు తీర్చుకొని వాసన చూసి వదిలేసిన పువూలా వదిలి పెట్టాడు. ఆ రెండు నెలలు ఇక్కడ లేకపోయేసరికి నాటకాల కాంట్రాక్ట్ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళు ఈమె మీద నమ్మకం కోల్పోయి తిరిగి చాన్సు ఇవ్వలేదు. మంచీ చెడ్డా, నీతి, అవినీతి ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోయి కడుపు కోసం చివరకు నీచమైన వృత్తికి దిగింది. శరీరాన్ని అమ్ముకుంటున్నది." సురేంద్ర కళ్ళల్లో నిప్పులు కురవసాగాయి.

                                     
    రవి దిమ్మెర పోయాడు. తను, సురేంద్ర, తన ఉద్యోగం, బంగళా, మనిషి మీద నమ్మకం, స్త్రీ మంచితనం అన్నీ కలిసికట్టుగా కళ్ళ ముందు గిరగిర తిరగసాగాయి.
    "ఏమిటిది?
    సురేఖ ఈ విధంగా చేసిందా? తను ప్రేమించిన సురేఖ , తన హృదయంలో స్థానం సంపాదించుకున్న సురేఖ, మళ్లీ స్త్రీ అంటే తనకు వ్యామోహం కల్గించిన సురేఖ! పోరపాటయింది. తను ప్రేమిస్తున్నట్లుగా ఆమెకు చెప్పి ఉండవలిసింది. తన హోదా, కారు, మేడ అన్నీఆమె కోసమే అని చెప్పి ఉండవలిసింది. తన సర్వస్వము ఆమె కోసమే అని తను ఇక్కడ నించి ట్రెయినింగు కు పోతున్న రోజైనా, తనను అత్రతతో చూస్తూ కళ్ళతో దీనత్వాన్ని కురిపించిన రోజైనా చెప్పి ఉండవలిసింది.
    ఒక్క మాట, తను వచ్చేంత వరకు వేచి ఉండవలిసిందిగా ఒక్క మాట ఆమెకు చెప్పి ఉండినా ఈ ఘోరం జరగక పోయేది. సురేఖ బజారు స్త్రీ కాకుండా ఉండేది.
    హృదయాన్ని చీలుస్తున్నట్లుగా వెనకటి జ్ఞాపకాలు-- ఏదో తన తప్పు గూడా ఉన్నట్లుగా తనకు శిక్షిస్తున్నట్లుగా కనపడని శక్తి కొట్టే కొరడా దెబ్బలు-- గుండెల్లో పగిలిన పశ్చాత్తాప పర్వతం తాలుకూ లావా!
    ఆ పలుకులతో అశక్తుడయినట్లుగా , జీవం లేనట్లుగా కాంతి విహీనంగా కూర్చున్నాడు రవిచంద్ర తలను రెండు చేతుల్లో పట్టుకుని.
    సురేంద్ర కు ఆవేశం, ఉద్రేకం, విచారం, ఆవేదన, ఆమె మీద కసి ఉప్పెనలా దాడి చేసి, మాటలు రానీయ లేదు కాస్సేపటి వరకు.
    "నీకు చాలాసార్లు చెబుదామను కున్నాను. కాని సమయం రాలేదని ఊరుకున్నాను. రవీ, నేను సురేఖ ను ప్రేమించాను. మనః స్పూర్తిగా ప్రేమించాను" సురేంద్ర మాటలు రవిని నిశ్చేష్టుడ్నీ చేశాయి. అతని మస్తిష్కం ఆలోచించడం మానేసింది. నిశ్శబ్దం గా గుడ్లప్పగించి వినసాగాడు.
    "నేను నాగపూర్ వచ్చిన తరవాత ఆమెతో పరిచయయి స్నేహంగా అది అభివృద్ధి చెందింది. ఆమె నాకు ఈ ఎడారి లో ఒయాసిస్సు లా కనిపించింది. జీవితం ఒక మంచి మలుపు తిరిగిన తరవాత నేను ఆమెను పెళ్లి చేసుకొని నాదాన్ని గా చేసుకుందామనుకున్నాను." అతని గొంతు బొంగురు పోయింది.
    "కాని ఆమె నన్ను తిరస్కరించింది. ఆమె గాలి మేడలతో నేను తూగలేకపోయాను. అంతస్తు కు మించిన ఆమె కోర్కెల గాలిపటాన్ని నేను పట్టుకోలేక పోయాను. అయినప్పటికీ నేను ఆమె సుఖంగా హాయిగా ఉండాలని మనః స్పూర్తిగా కోరుకున్నాను. అంతేగాని ఇంత నీచ స్థితికి దిగుతుందని , ఇంత హీన బ్రతుకు బ్రతుకుతుందని నేను ఊహించలేదు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నదో తెలుసా?"
    రవి తల ఎత్తి అతణ్ణి చూశాడు అలా అడిగినప్పుడు.
    "కుళ్ళిపోయిన మనుషులుండే వీధిలో, పరువు లేని వాళ్ళు నడవటానికి కూడా సిగ్గుపడే వీధిలో కాపరం! సురేఖ బ్రతుకు చూస్తుంటే నాకు అసహ్యం చేస్తున్నది. మళ్ళీ కనబడితే ఏం చేస్తానో అని భయంగా ఉంది."
    "ఛీ...ఛీ....' ఆ ప్రయత్నంగా రవిచంద్ర అన్నాడు. ప్రత్యేకంగా కక్ష కట్టి, గుండెకు గురి చూసి సూటిగా బాణం మీద బాణం కొడుతున్నట్లుగా అతను విలవిల లాడిపోయాడు. సురేంద్ర మాటలు తల మీద సమ్మెట పొట్ల లాగా తగిలాయి.
    ఏమిటీ సృష్టి గమనం? మనిషిలో ఏం కూర్చబడి సృష్టించబడ్డాడు? ఈ కోరికలు , ఈ ఆవేశాలు, ఈ సుఖ దుఃఖాలు ఏమిటీ ఇవన్నీ? ఎవరు ఈ గమనాన్ని అదుపులో ఉంచుతున్నది? ఎందుకు ఈ జీవిత సముద్రంలో అంతులేని ఆటుపోట్లు?
    అర్ధం గాని ప్రశ్నలు, నిరామయంగా స్తంభించి పోయిన ఆలోచన. జగత్తు వైచిత్యం అంచులు చీల్చి, తుదీ మొదలూ తెలుసుకోలేని అనిశ్చిత పరిస్థితి.
    'సురేంద్ర ప్రేమించాడు.....సురేంద్ర సురేఖను ప్రేమించాడు. తనూ సురేఖను ప్రేమించాడు. సురేంద్ర అడిగి కాదని పించు కున్నాడు. తను అడిగినట్లయితే ఎలా ఉండేదో? తను ఒప్పుకోన్నప్పటికి సుఖంగా జీవించ గలిగేవాడా ఆమెతో? ఆమె ప్రకృతి పాదరసం లాంటిది. ఒకచోట నిశ్చలంగా, ఉండే మనస్తత్వం కాదని తనకెందుకో ఎప్పుడో అనిపించింది. అయినప్పటికీ ఆమె అంటే ఏమిటో చెప్పలేని, బయటకు చెప్పని అభిమానాన్ని గుప్తంగా పెంచుకున్నాడు.
    ఒకవేళ తను సురేఖ ను పెండ్లి చేసుకున్నప్పటికీ సురేంద్ర కు నరకాన్ని ప్రసాదించి ఉండేవాడు. అతను ఆశించిన స్త్రీని, ఎంత స్నేహితుడయినా సరే మరొకడు పొంద గలిగే అదృష్టాన్ని చూసి సహించెంత ఎత్తుకు ఎదిగాడా మానవుడు? అతని మంచితనం బయటకు  ఏమీ వెళ్ళబెట్టక పోవచ్చు కానీ అతని అంతరంగం లో సదా నరకం, శాశ్వతమయినా అశాంతి తను సృష్టించి ఉండేవాడు.
    తనకో దారి చూపించటానికి ప్రయత్నించిన సురేంద్ర కు ద్రోహం తలపెట్టడం తనకు సాధ్యమా? అతను ప్రేమించిన పడతిని-- ఆమె ఎంత ఇష్టపడ్డా సరే-- తను పెళ్లి చేసుకో గలిగి ఉండేవాడా?
    తన కసలు పెళ్లి చేసుకొనే హక్కు ఉందా?'
    పీడ కల వచ్చిన వాడిలా ఉలిక్కిపడ్డాడు అతను. గతం అతన్ని భయంకరంగా వెన్నాడుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని పక్క మీద ఒరిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS