
శాంత చీర కోసం ఆ కొట్టులో తీసుకొన్న అరువు ఎంత తొందర లో చెల్లుబెట్టాలని ప్రకాశం తొందర పడ్డాడో, అంత గానూ ఆలస్యం కాసాగింది. అప్పన్న రాగానే సొమ్ము తీసుకొని తీర్చి వేయవచ్చుననుకొన్నాడు. కాని అప్పన్న ఖర్చును వెంట బెట్టుకుని మరీ వచ్చాడు.
"ప్రకాశం బాబూ! నాకు వచ్చే రెండు నెలల్లో కొంచెం సొమ్ము సర్దాలి" అన్నాడు అప్పన్న.
ఏనాడూ అప్పన్న నోట సొమ్ము సర్ధమన్న మాట ప్రకాశం వినలేదు.
'అప్పన్నా, నీ వంతు సొమ్ము ఇంతోచ్చింది ఏం చెయ్యమంటావు?" అంటే, 'అసలుకి కలపండి, బాబూ" అనేవాడు.
అప్పన్న జీవితానికి ఆ కిళ్ళీ కొట్టు మీద వస్తున్న రాబడి సరిపోయేది. అతని అవసరాలు , కోర్కెలు చాలా పరిమితం. రెండు పూటలా ఇంత తిండి, కట్టుకోడానికి రెండు పంచలు, లాల్చీలు ఉంటె చాలు. అప్పన్న కూతురు మాణిక్యం కూడా తండ్రి చేతుల్లో పెరిగిన పిల్ల. అయ్య ఎంత చెప్పితే అంత.
"మొన్న ఊరెళ్ళి వచ్చానా? మా మాణిక్కానికి ఓ సంబంధం మోసుకోచ్చేను. తల్లి లేని పిల్ల నా కాళ్ళూ, సేతులు ఈపాటి ఆడుతుండగానే దాన్నో ఇంటి దాన్ని సేసేస్తినా నా బెంగ తీరిపోతుంది. ఆపై నా బతుకు ఎలా పోయినా పరవాలేదు.
'అదే సంబంధం సూసుకొచ్చానని సెప్పేనా? ఈ వైశాఖ మాసంలో పెళ్ళి సేసేయ్యాలనుకొంటున్నాను. కాస్త ఈ రెండు నెల్లూ కనిపెడితివా...."
"అలాగే అప్పన్నా! నీకెంత కావాలో చెప్పు. కావాలంటే కొట్టు అయివేజు పెట్టిసోమ్ము తీసుకుందాం అన్నాడు ప్రకాశం.
మాట మాత్రం అన్నా అప్పన్న, ప్రకాశం దగ్గర అంతగాసోమ్ము తీసుకోనేలేదు. కిళ్ళీ కొట్టు అమ్మి పెళ్ళి చేసేడు. "ఇంక కొట్టు మీద కూర్చునే ఓపిక లేదు, పంతులూ! నీ పుస్తకాల కొట్టున్నది కదా?దానిలోనే ఓ పక్క నేనూ కూచుని తోసింది సేస్తాను" అన్నాడు. ప్రకాశానికి కూడా ఆ ఏర్పాటు బాగున్నట్లే అనిపించింది. తనేదైనా పని మీద బయటికి వెళ్ళినా, కొట్లో ఇంకో మనిషి ఉంటే మాటిమాటికి తలుపులు మూయనక్కరలేదు అనుకొన్నాడు.
అప్పన్న కూతురు పెళ్లయింది కాని, ప్రకాశం బట్టల కొట్లో పెట్టిన అప్పు తీరలేదు. చేతిలో కాసు సొమ్ము ఆడుతున్నాదంటే , యేవో ఖర్చులుతోసుక వచ్చేవి. ఒకసారి అప్పుల్లో పడ్డవాళ్ళు ఎందుకు తెరుకోలేరో అర్ధం చేసుకున్నాడు ప్రకాశం. ఆ వారంలో ఏమైనా అప్పు తీర్చాలన్న పట్టుదలతో పనిచేసి, పది హీను రూపాయలు కూడబెట్టాడు. సొమ్ము చేతిలో పట్టుకొని బాలలు వెతికితే , అది ఎక్కడ పడిపోయిందో గుర్తు రాలేదు. కొట్టు పేరు, కొన్న వస్తువు గుర్తు వుంది కాబట్టి మరేమీ ఇబ్బంది ఉండదని బయలుదేరాడు.
షాపువాడు ప్రకాశాన్ని చూస్తూనే , "ఏం కావాలండీ?" అన్నాడు అలవాటు పడిన ధోరణి లో.
ప్రకాశం తను వచ్చిన పని చెప్పేడు. "చాలాకాలం అయిపోయిందండీ క్షమించాలి. సర్దుకోలేక పోయాను." అన్నాడు.
"మీ దగ్గర బిల్లు ఉందా?"
"లేదండీ, ఎక్కడో పెట్టి మరిచిపోయెను. ఆరోజు మీ పుస్తకంలో కూడా రాసుకున్నారు. చూడండి. కనిపిస్తుంది."'
షాహుకారు పేజీలు తిప్పసాగేడు. ప్రకాశం తేది, వారం కొన్న వస్తువు చెప్పేడు. తన పేరు, అడ్రసు చెప్పేడు.
"ఆ....ఆ.... కనిపించింది. మీ పేరు ప్రకాశం. బజార్లో పుస్తకాల కొట్టు."
"అవునండీ, ఆ పద్దు నాదే."
"కాని, మీరు సొమ్ము చెల్లించే, మా కొట్లో చీర తీసుకున్నారు పంతులు గారూ! ఇంకే కొట్లో అయినా అప్పు పెట్టారేమో గుర్తు చేసుకోండి."
ఎదురుగా ఉన్న పుస్తకంలో ప్రకాశం పేరుకు ఎదురుగా "కాష్ స్టాంపు' కొట్టబడి ఉంది. అటు తరువాత అ పేజీ అంతా కాష్ ఇచ్చి తీసుకున్న వాళ్ళే . తను ఆ రోజు సొమ్ము చెల్లించలేదు. ఇంకే కొట్లో బట్టలు కొనలేదు. తను అప్పు చేసి చీర కొన్న సంగతి ఇంట్లో ఎవరికి తెలియదు కాబట్టి, ఇంకెవరైనా తీర్చి ఉంటారన్న అనుమానం లేదు. ఆరోజు దిగాలు పడి కూర్చున్న ఒక ముసలి గుమస్తా కౌంటరు దగ్గర ఉన్నాడు. "అరువు....అరువు' అన్న మాటలతో విసిగిపోయి ఉన్నాడు. ఆ చికాకులో పొరపాటుగా తన పేరుకు ఎదురుగా కాష్ స్టాంప్ కొట్టి ఉంటాడు-- అనుకొన్నాడు ప్రకాశం.
కొంచెం సేపు త్రాసుకు మధ్యన వ్రేలాడే ముల్లులా ప్రకాశం మనసు అటు ఇటు ఊగులాడింది. 'అతడు బాకీ తేదంటూన్నాడు కదా? ఇయ్యడపోతెనేమీ? ఒకవేళ పరాగ్గా ఎప్పుడైనా ఇచ్చేసేనెమో? అంతగా ఖర్చు పెట్టుకోవాలనుకొంటె నీకో షర్టు తీసుకో, నీ అక్కకో చీర కొను." మనసు ఇటు అటు నొక్కుతూనే ఉంది.
మనసు సరఫరా చేస్తున్న సలహాలను పక్కకు నెట్టి "లేదండీ, షాహుకారు గారూ! నేనీ సొమ్ము తీర్చలేదు" అన్నాడు ప్రకాశం.
షాహుకారు ప్రకాశం వైపు వింతగా చూసేడు. ఈ రోజుల్లో కూడా ఇంటువంటి వాళ్ళు ఉన్నారా? అన్నట్లుంది అతని చూపు. అంతలో ఆరోజు ప్రకాశం చీర కొన్నప్పుడు కౌంటరు దగ్గర ఉన్న వ్యక్తీ లోపలికి వచ్చేడు.
"ఏంటయ్యా! సుందరయ్యా! ఇంత వేళకా రావడం?' అన్నాడు షాహుకారు కటువుగా.
"లేదండీ! బాబుగారూ! ఇంట్లో ఆడదానికి బొత్తిగా బాగులేదండీ! వండుకు తినోచ్చేసరికి ...." చేతులు నలుపుకొన్నాడు అతడు.
"చూడు, ఈయన తను అరువు తీసుకొన్నానంటూ సొమ్ము తెచ్చేడు. మరి చిట్టాలో చూస్తె కాష్ ముద్ర కొట్టుందేం?"
తను తిన్నగా పని చెయ్యడం లేదని సాధించేందుకే యజమాని ఆ మాట అన్నాడనుకొన్నాడు సుందరయ్య.
"అది అంతేనండి, బాబుగారూ! కాష్ ముద్ర ఉంటె సొమ్ము చెల్లించినట్లే. ఆ బాబుగారు మరిచిపోయి ఉంటారు. నా దగ్గర లెక్కల్లో తేడా ఎప్పుడూ ఉండదండీ. చిట్టా చూపించి, మీకు రోజూ సొమ్ము జమ కడుతున్నాను. ఏరోజైనా తేడా వచ్చిందాండీ" అన్నాడు గర్వంగా.
షాహుకారు కు అది సరియైన మాటే అనిపించింది. తను లెక్కల్లో ఏనాడూ తేడా రాలేదు. కూడికలో పది హీను రూపాయలు తిరకాసు వచ్చేందుకు వీలులేదు. సుందరయ్య, తను ఒకసారి కూడిందే మళ్ళా, మళ్ళా కూడి చూస్తుంటారు కూడా.
"మీరేళ్ళండి పంతులు గారూ! నేను పిల్లా, పాపా కలవాణ్ణి. మీ సొమ్ము ఊరకే తీసుకోలేను" అన్నాడు షాహుకారు.
సుందరయ్యకు ప్రకాశం ముఖం చూస్తుంటే, ఏవేవో సంగతులు జ్ఞాపకం రాసాగేయి. అతడు ఆనాటి సంఘటనలని గుర్తు చేసుకొంటున్నాడని ప్రకాశం తెలుసుకొన్నాడు.
"చూడండి, తాతగారూ! ఆరోజు నేను అరువు అనేసరికి మీరేదో గొణుక్కుంటూ విసురుగా నా బిల్లు చింపి ఇచ్చేరు. నాకు ముందు చాలా మంది అరువు తీసుకొన్నారు. ఉగాది నాటి ఉదయం. పన్నెండు గంటల సమయం. "ప్రకాశం అతనికి ఆలోచనల్ని అందించేడు.
ఒక్కసారిగా ముసలాయన ముఖం విప్పారింది.
ముసలాయన భార్య ఆనాటి నుండి జబ్బుగానే ఉంది. మందుల కోసం యజమానిని అప్పడిగి పదిహేను రూపాయలు కోటు జేబులో పెట్టుకొన్నాడు. సాయంకాలం లెక్కలు చూసేసరికి పదిహేను రూపాయలు తిరకాసు వచ్చింది. అటు, ఇటు పడేసేడెమో అని బల్ల కింద, డ్రాయరు అడుగు సొరుగు అన్నీ వెతుక్కోన్నాడు. చివరికి పరాకుగా తన లాల్చీ పక్క జేబులో పడేసుకొన్నట్లు తెలుసుకొని, లెక్క సరిపెట్టి షాహుకారు కు సొమ్ము అప్పగించేడు.
"అమ్మయ్య! పండుగ పూట చేతి చమురు తగులుకోలేదని" సంతోషించేడు.
మందులషాపు లో డబ్బు కోసం, సంచుల్లా వేలాడు తున్న పాతకోటు జేబులన్నీ వెతికెడు. షాహుకారు ఇవ్వగానే పదిహేను రూపాయలు తన కోటు జేబులో పెట్టుకున్న జ్ఞాపకం ఉంది. షాపులో వంకెకు కోటు తగిలించి ఉన్నప్పుడు ఎవరో కొట్టేసి ఉంటారు అనుకొన్నాడు. ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళి , మంచం మీద జ్వర తాపం వల్ల ఆపసోపాలు పడుతున్న భార్యను చూసి తల వంచుకొన్నాడు.
"బాబూ, ఆ సొమ్ము నాదే. ఆ సొమ్ము నాదే. పరాగ్గా కోటు జేబుకి బదులు లాల్చీ జేబులో పెట్టుకొన్నాను. మీ పేరు ముందు కాష్ స్టాంపు కొట్టడం వల్ల సొమ్ము చాలలేదు. అదీ బట్టల సొమ్మే అనుకొన్నాను." ముసలాయన ఆత్రుతగా తడబడుతూ అన్నాడు.
అలాగే జరిగి ఉంటుందనిపించింది ప్రకాశానికి. ఇందండి, తాతగారూ! ఈ సొమ్ము మీదే" అంటూ బల్ల మీద నోట్లు పెట్టేడు ప్రకాశం.
తాతగారి కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
"నాయనా, కాఫీ తాగి వెల్దువు గాని, రా" అన్నాడు.
"ఇప్పుడు వద్దులెండి. ఇంకోసారి కలిసి వెళ్దాం" అన్నాడు ప్రకాశం.
"అప్పుడప్పుడు వస్తుండు , నాయనా. ' గుమ్మం దాటుతుంటే సుందరయ్య మాటలు వినిపించేయి ప్రకాశానికి.
బట్టల కొట్టు గుమ్మం దాటుతున్న ప్రకాశం ఒక ప్రలోభం లోంచి తప్పుకున్నందుకు తన్ను తనే అభినందించుకొన్నాడు.
* * * *
