డబ్బు చూసే సరికి అక్కడ ఉన్న చాలామందికి ఎంతో సానుభూతి కలిగింది రూపమీద. "ఎవరో పాపం! బాగా చదువుకున్నది. ఇంత ఉన్నదే, ఏం జరిగిందో పిచ్చెత్తింది!"
మొదట పలకరించిన యువకుడు నోట్లు తీసి సూట్ కేస్ లో పెట్టి, సూట్ కేస్ చేతపట్టుకొని, "మా ఇంటికి వస్తారా? మీకు ఏ లోటూ జరగకుండా చూచుకొంటాను" అన్నాడు.
"ఆఁ! వస్తా. పదండి!" అతన్ని అనుసరించింది రూప.
ఆ అపరిచిత యువకుడి వెంటబడి పోతున్నాగుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు కళ్యాణ్. కాని, అతడి అంతరంగంలో రఘు "రూపా....రూపా...." అన్న హృదయవిదారకమైన కేకలు ఎంతోసేపు నిలవనీయలేదు. 'దుర్మార్గుడు! మనుష్యులమతికి దూరమైన ఆ పిచ్చిదాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తాడో?' రూపను రక్షించాలని గబగబా వెళ్ళాడు కాని, ఆమె మీద జాలివల్ల కాదు; రఘు అంటే అతడికి ఉన్న సానుభూతిచేత.
"నన్ను మీ ఇంటికి తీసుకువెళుతున్నారా?"
"ఆఁ! దేవేంద్ర భవనంలాంటి ఇల్లు ఉంది నాకు."
"అబ్బా!" అబ్బురపాటు ప్రకటించి, అమాయకంగా ప్రశ్నించింది: "దేవేంద్రభవనం చూసివచ్చి కట్టారా?"
"కాదులే, నా భవనం చూసే దేవేంద్రుడు కట్టాడు ఒక ఇల్లు." తమాషాగా నవ్వి, ఎంతో చనువుగా రూప భుజంమీద చెయ్యి వేశాడు. "నిన్ను రాణిలా ఉంచుకొంటాను నా దగ్గిర."
"ఉంచుకొంటారా?"
"ఉంచుకొంటాను!"
వాగ్దానం చేస్తున్నట్లు ఎంతో నమ్మకంగా పలుకుతూన్న అతడి మాట పూర్తి కాకముందే అతడి చెంప సత్కరింపబడింది రూప కోమలహస్తంతో, "ఉంచుకొంటావా? ఉంచుకొంటావురా? హుఁ! వెలయాలిననుకొన్నావురా, రంకు వెధవా? స్వచ్చమైన పిల్లనురా, నేను!" వీరనారిలా ముఖంపెట్టి పిచ్చిగా విరగబడి నవ్వసాగింది.
బిక్కచచ్చిముఖంతో పెదవులు వెంట వెంటనే తడుపుకొంటూ నిల్చుండిపోయాడు ఆ యువకుడు.
"రూపాదేవీ!"
"ఇక్కడ దేవి, దేవత లెవరూ లేరు." తన నవ్వుకు అంతరాయం కలిగించారన్న చీకాకుతో తల తిప్పింది రూప. క్షణంలో రంగులు మారిపోయాయి ఆమె వదనంలో. "మీ బాబును మీరు తీసుకోండి. నాకు వద్దు. నాకు వద్దు." వెర్రిగా ఏడుస్తూ మూర్చపోయింది.
ట్రెయిన్ కూతవేసి కదిలింది.
కళ్యాణి పూర్వాపరాలు ఆలోచించకుండా రూపను రెండు చేతులా ఎత్తుకొని పరిగెత్తుకు వెళ్ళి తన కంపార్ట్ మెంట్ లో బెర్త్ మీద పడుకోబెట్టాడు.
ట్రెయిన్ వేగం అందుకొంది.
15
"డియర్ రఘునాధ్!
మొదట ఒక శుభవార్త. రూప క్షేమంగా ఉన్నది నా దగ్గిర. వినగానే నమ్మవు కదూ? విదిలీల, నేను మాత్రం అనుకొన్నానా రూప నా జీవితంలో తీరుగా ప్రవేశిస్తుందని!
మా అక్కగారి ఊరినుండి తిరుపతి వస్తున్నాను. ఓ స్టేషన్ లో రూప తారసపడింది. మతిలేని మనిషి! తనను పిలిచిన ఓ అపరిచిత యువకుడి వెంటపడి పోతూంది.
రూప అంటే నాకు ద్వేషం ఉన్నది. అయితే అది, నా బాబును నానుండి దూరం చేసి నిర్దయగా చంపిందని మాత్రమేగాని, ఆమె చరిత్రను నేను అసహ్యించు కోవడంలేదు. ఒకవిధంగా సానుభూతి చూపగలను ప్రేమించిన వ్యక్తికీ, కన్నబిడ్డకూ దూరమైనందుకు.
ఆ క్షణంలో రూపను క్షమించి నాతో తీసుకువచ్చాను. నువ్వు చెల్లెలికోసం పడుతున్న తపన, ఆమె కోసం నువ్వు సాగిస్తూన్న అన్వేషణ నన్ను రూపను ఆమె కర్మానికి వదిలివెయ్యనీయలేదేమో! మనిషిగా నా కనీసధర్మం ఒకటి ఉన్నదికూడా. ఏమైతేనేం? రూపను నాతో తీసుకువచ్చాను. ఇప్పుడు ఆమె నాకు గోకుల్ కంటే పసిపాప అయిపోయింది. ఆమె పిచ్చిలో నేనూ సగం పిచ్చి పంచుకొంటేనేగాని ఆమె విషయంలో నేను తలపెట్టిన ఒక్కపనీ సక్రమంగా నెరవేరదు. ఆమెకు శారీరకంగా చికిత్స జరపడమే కాదు; మానసికంగా ఆమెకు తగిలిన గాయాన్ని మాన్చి తిరిగి మామూలు మనిషిని చెయ్యలన్నదృఢ సంకల్పంతో నాకు తోచిన ప్రయోగాలు చేస్తున్నాను.
మూడునెలలయింది, తిరుపతి కొండమీద మకాంవేసి.
అనుదినమూ స్వామిదర్శనం చేస్తూ, కొండమీద పచ్చటి ప్రకృతినీ, నేత్రపర్వమైన సెలయేటి దృశ్యాల్నీ తిలకిస్తూ ఉల్లాసంగా ఉండడానికి ఇష్టమైన విధంగా సదుపాయాలు సమకూరుస్తూ ఆమెను ఒక దారిలోకి తెస్తున్నాను.
ఒక్కమాట!
ఈ లేఖ చూచుకొన్న తక్షణం రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలుతావని తెలుసు. కానీ, ఇప్పుడప్పుడే రూప కళ్ళలో పడవద్దు మీరెవరూ. ఆమె జీవితంలో గతస్మృతులను రేపే ఏ సంఘటనా, సన్నివేశమూ జరగడానికి వీల్లేదు. ఆమె మనస్సు గాయం మాని మామూలు మనిషి అయ్యేవరకు మనం చాలా జాగ్రత్తగా మసులుకోవాలి.
దైవానుగ్రహం ఉంటే రూప మన మనిషి అవుతుంది. ఇక ఆమె విషయంలో ఎంతమాత్రం చింత పెట్టుకోవద్దు. రత్నాదేవికి నా నమస్కారాలు చెప్పు. చిరంజీవికి నా ముద్దులూ, ఆశీర్వాదాలూ. సెలవు.
-కల్యాణచక్రవర్తి."
కళ్యాణ్ వ్రాయడం ముగించి కవరు మడుస్తూండగా వచ్చింది రూప, చిక్కులు కట్టిని జుట్టు దువ్వుకుంటూ. "కొంచెం కత్తెర ఇటు ఇవ్వండి" అంది, ఎంతకూ చిక్కులు వీడని జుట్టుపై అలిగి.
"ఎందుకూ?"
"కత్తిరించేస్తాను. నా చెయ్యి పడిపోతున్నది, దువ్వి దువ్వి. తలంతా నొప్పి పెట్టిందిగాని చిక్కులు వీడడంలేదు."
"అలాగని అందమంతా చెడగొట్టమంటావా? అటు చూడు, నాల్గంటికి వాలుజడ ఎంత అందమో!" గోడమీది చిత్రంకేసి చూపెట్టాడు కల్యాణి.
రూప కళ్ళు రెపరెపలాడింది. "అంత అందంగా ఉంటుందా నాకు, జడ చేసుకొంటే?"
"ఊఁ!" నమ్మకంగా అన్నాడు. "అసలే పొగ వెంట్రుకలు నీవి. నూనె పెట్టకుండా, దువ్వకుండా బాగా చిక్కులు కట్టిపోయాయి. ఈవేళ ఎలాగో బుద్ధిపుట్టి ఊరికే దువ్వబోతే చిక్కులెలా వస్తాయి? కాస్త నూనెపెట్టి దువ్వు." పసిపిల్లకు తెలియజెప్పినట్లుగా ఉంది.
తలకు నూనె పెట్టుకు వచ్చింది రూప. దువ్వెన కళ్యాణ్ ముందు పడేసి, "కొంచెం దువ్వండి. నా చెయ్యి తీస్తున్నది" అంది, అతడి ముందు నిల్చుంటూ.
తనలో నవ్వుకొంటూ ఓపికగా చిక్కులు తియ్యసాగాడు కళ్యాణ్.
"చిన్నప్పుడు ఎంత తలకట్టు ఉండేదనుకొన్నాడు. నాకు! ఇప్పుడు అందులో సగం ఉంటుంది. రామిఅనేది మా ఇంట్లో పని చేస్తూండేది. వారంవారం నాకు తలంటి పొయ్యాలంటే బలే విసుగువచ్చేది దానికి, 'చేతులు పడిపోతాయబ్బా' అంటూండేది. దిష్టి తగులుతుందని అంటూ తలంటి పోసినప్పుడల్లా సాంబ్రాణి పొగ వేసేది బలవంతాన."
ఒపిగా ఊకొడుతున్నాడు కళ్యాణ్, తనూ రూప తరవాత ఓ ఆడపిల్ల అయి జట్టు చిక్కు తీయించుకొని, దువ్వెన అందుకొని వెళ్ళిపోతూ అతడికి కృతజ్ఞత తెలియజేసి చిత్రంగా నవ్వింది.
'ఎందుకా నవ్వు?' తర్కించుకొంటూన్న కళ్యాణ్ తనకు తానే సమాధానం చెప్పుకొన్నాడు: 'ఆ! పిచ్చి వారి నవ్వులకు అర్దాలేమి ఉంటాయి?'
రూప సాన్నిహిత్యంలో, సహవాసంలో ఆమె పిచ్చిదన్న విషయంకూడా మరిచిపోతున్నాడు. ఎప్పుడో గాని ఆ విషయం తట్టడంలేదు. 'కొన్నాళ్ళంయితే ఆమె పిచ్చి నాకు పట్టదుకదా?' అనుకొన్నాడు.
ఏదో కిందపడి పగిలిపోయిన శబ్దం వినిపించి లోనికేగాడు కల్యాణ్.
"పగిలిపోయింది." అద్దం ముక్కలు ఏరుతూ అంది రూప.
"నువ్వు కొంచెం పక్కకు తప్పుకో, నే తీస్తా. గాజుముక్కలు చేతికి గుచ్చుకొంటావు." బలవంతాన రూప చేతులు తొలగించి అద్దం ముక్కలు ఓ కాగితంలోకి ఎత్తుకొని అవతల పారబోసి వచ్చాడు.
