Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 25


    "బొట్టు ఎలా పెట్టుకోను?"
    సోగకన్నులకు కాటుకరేఖ తీర్చిందేమో, చాలా అందంగా కనబడుతూంది రూప. అలాగే చూస్తున్నాడు కళ్యాణ్, ఆమె నేత్రసౌందర్యాన్ని.
    "ప్లీజ్, కొంచెం బొట్టు పెడతారూ?"
    "ఊఁ."
    "నా ముఖానికి దోసపలుకుబొట్టు చాలా అందంగా ఉంటుంది. దోసపలుకు బొట్టు పెట్టండి." తిలకంలో పుల్ల అద్ది అతడి చేతికి ఇచ్చింది.    
    "దోసపలుకు! అంటే?"
    "ఇలా!" శూన్యంలో వేలుతిప్పి చూపెట్టింది. "తెలిసిందా?"
    "ఉహుఁ."
    "అయితే చూపెడతా, పట్టండి!" కళ్యాణ్ చేతి నుండి పుల్ల అందుకొని, అతడి ముఖానికే బొట్టు దిద్దబోయింది.
    "నా ముఖానికే పెడితే నాకు ఎలా తెలుస్తుంది?" వస్తూన్న నవ్వు ఆపుకొంటూ, అమాయికంగా ప్రశ్నించాడు.
    "అవును కదూ?" తన పొరపాటు తెలిసింది రూపకు. ఓ తెల్లకాగితంపై బొట్టు దిద్ది చూపింది. "ఇలా పెట్టాలి!"
    తన కుంచెనుండి లలితలావణ్యవతులయిన లతాంగులను ఎందరినో చిత్రించి రకరకాల అందాలూ, అలంకారాలూ తీర్చిదిద్దిన కళ్యాణ్, విధాత గులాబీ సోయగమూ, మల్లెల సౌకుమార్యమూ, శరచ్చంద్ర చంద్రికలూ కలబోసి, కరిగించి నిర్మించినట్లున్న ఆ సజీవ సుందరి చుబుకంకింద వేలుంచి ముఖం పైకెత్తి నుదుట తిలకం తీరుస్తూ "ఏనాటి ఋణానుబంధం ఈనాడు ఈ అనుబంధంగా మారింది, రూపా?' అనుకొన్నాడు.
    "చక్కగా కుదిరిందా?"
    "ఊఁ."
    "ఎలా చూచుకోను కుదిరిందో, లేదో?"
    "నిజం! చక్కగా కుదిరింది."
    "అయితే, మీ కంటిపాపలో నా ముఖం చూచుకొంటాను ఉండండి." కళ్యాణ్ ముఖం దగ్గిర ముఖం పెట్టింది. "కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు..." రాగం తీస్తూన్న దల్లా కిలకిలా నవ్వింది, "ఈ పాట పాడవలిసింది మీరు! అప్పుడే అర్ధం కుదురుతుంది, మరి" అంటూ.
    
                                    *    *    *

    కళ్యాణ్ తో కలిసి కొండలమీదికి షైర్ వెళ్ళి వచ్చిన రూప, కాలు పట్టుకొని బాధగా మూలుగుతూ సోఫాలో కూలబడింది.
    "ఏమైంది, రూపా?" కంగారుగా ప్రశ్నించాడు కళ్యాణ్.
    "దెబ్బ తగిలింది."
    "ఎక్కడ?"
    "బొటన వేలికి."
    "ఎప్పుడు తగిలింది?" అంటూ కాలువంక చూశాడు.
    బొటనవేలి గోరు కొద్దిగా లేచి రక్తం వచ్చి ఎండి లేదు. పోయింది. ఇసకా, దుమ్మూ అంటుకొని ఉంది.
    "ఎప్పుడో తగిలితే, ఇప్పుడా చెప్పడం?"
    "ఇంటికి వచ్చాక నొప్పి తెలిసింది."
    "అందుకే నిన్ను తీసుకువెళ్ళాలంటే భయం. పారవశ్యంలో పరుగులు పెడుతూ ఏ రాయి జారి అగాధంలో పడిపోతావో అని హడిలి చస్తూంటాను. ఆ సెలయేటి చిలిపి గంతులకన్నా నీ గంతులే ఎక్కువ కదా, అక్కడ?"
    "అయితే ఓ పంజరం చేయించి నన్ను అందులో వేసెయ్యండి!" మూతి సున్నాచుట్టేసి కూర్చుంది రూప.
    వేడినీటితో గాయం కడిగి అయోడిన్ రాస్తూ, "అప్పుడే అలక, ఈ అందాలబొమ్మకు. ఏమన్నాననీ? ఆ రాళ్ళలో ఒళ్ళు తెలియకుండా పరుగులు పెడితే ఎలా చెప్పు, మరి? ఇలా దెబ్బలు తగిలితే బాధ కదూ?" అన్నాడు లాలనగా.
    "కమనీయమైన ప్రకృతిని చూసి పరవశించి పోవడంకన్నా జీవితానికి అందం, ఆనందం ఏమున్నాయి, డాక్టర్?" ఒక నిట్టూర్పు విడిచింది రూప. "అనునిత్యం స్వామిదర్శనార్ధం వేలాది జనం వస్తారు కదా, ఎందరు ఈ కొండల సౌందర్యము, ప్రకృతిశోభ పరికిస్తారు? ఆ నల్లరాతినీ, పట్టె నామాల్నీ చూసి కళ్ళు పావనమైనవనుకొంటారు. నాకనిపిస్తూ ఉంటుంది, నా జన్మ నా చేతిలోనే ఉంటే, ఈ కొండలలో కోయిలనై పుట్టి సౌందర్య గానం చెయ్యాలని."
    రూపలో సౌందర్యపిపాస ప్రబలడం గమనిస్తున్నాడు కల్యాణి.
    రూప కన్నులు అరమోడ్పులు చేసి సోఫాలో జారగిల బడి, పాదాలు కళ్యాణ్ ఒళ్ళో వేసింది. "కాళ్ళు తీస్తున్నాయబ్బా!మెల్లిమెల్లిగా ఒత్తండి. హాయిగా ఉంటుంది కాస్సేపు."
      వరండాలో నిలబడిన రఘు రత్నలు కిటికీలోంచి లోపల కనిపించిన దృశ్యం చూసి క్షణకాలం కొయ్యబారిపోయారు.
    "ఇదేం విపరీతం?"
    "చిత్రంగా ఉంది!"
    అలికిడి విని ఇవతలికి వచ్చాడు కళ్యాణ్. "మీరా?" రఘు చెయ్యి పట్టుకొని దూరంగా తీసుకుపోయాడు. "రావద్దని వ్రాశానే, కొన్నాళ్ళు ఆగలేకపోయారా? రూప ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకొంటూంది శారీరకంగా, మానసికంగా కూడా."    
    అతని భయాందోళనలను అణిచివేస్తూ, "రూప కళ్ళలో పడకుండానే వెళ్ళిపోతాం. ఆయన నిలవలేక పోయారు. చాటుగానైనా చెల్లాయిని చూసివస్తానని బయలుదేరారు" అంది రత్న.
    రత్న చేతులనుండి బాబును ఎత్తుకొన్నాడు కళ్యాణ్.
    "మీ ఈ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. రూప కాళ్ళు పట్టడందాక మీ సహనం నిలవ గలిగిందంటే ......"
    "ఆమె రోగి; నేను డాక్టరును. ఇలాంటి పనులు భారంగా తీసుకోను. రూపతో సరదాగా గడిచిపోతున్నాయి, రోజులు." చిరుహాసంతో అన్నాడు కళ్యాణ్.
    "డాక్టర్ ఋణం తీర్చుకోవాలంటే ఆయన కాళ్ళు కడిగి చెల్లాయినివ్వండి." తేలిగ్గా నవ్వుతూ అన్న రత్న, కళ్యాణ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నెమ్మదిగా అంది. "అందని చందమామకై నిచ్చెన వేస్తున్నా మేమో!"
    "కాదు, కాదు."
    "శ్రుతి తప్పిన రూప జీవనరాగాన్ని సరిదిద్దారు. ఆమె జీవితం మీకే అంకితం కావాలని నా కోరిక. రూప చరిత్ర అందరికీ తెలుసు. ఆమెను స్వీకరించగల సహృదయత మీకే ఉంది."
    కళ్యాణ్ చేసిన మందహాసాన్ని మహాప్రసాదంగా భావించి, పట్టలేని ఉత్సాహంతో అన్నాడు రఘు: "శ్రీనివాసుని సన్నిధిలోనే రూప వివాహం మహావైభవంగా జరగాలి!"
    "నా అభ్యంతరం లేదు." కళ్యాణ్ అన్నాడు. "ఈ రెండుమూడురోజుల్లో రూపను తీసుకొని మద్రాస్ వెడుతున్నాను. అక్కడ వారంరోజులు ఉండి, ఊటీలో ఈ వేసవి గడపాలనుకొంటున్నాను."
    "సరే, దానికేముంది? ఆ కళ్యాణం తొందరగా జరిగిపోతే మాకు నిశ్చింతా, సంతృప్తీ."
    రఘు తొందర చూచి నవ్వుకొన్నాడు కళ్యాణ్. "అయితే, ప్రయత్నించి చూస్తాను, ఈ విషయంలో."
    సెలవు తీసుకొంటూ, "రోజూ ఉత్తరం వ్రాస్తూ ఉండండి, రూప సంగతులు తెలుపుతూ, అలాగయితే రూపకు దూరంగా ఉన్నా బాధ అనిపించదు" అన్నాడు రఘు.
    "తప్పకుండా వ్రాస్తూంటాను." రత్నకు బాబును అందించి, ఇంట్లోకి వచ్చాడు కళ్యాణ్. నిదురిస్తూంది రూప, సోఫాలో.
    "రూపా, లే!"
    లేచి కూర్చుంది రూప. కళ్యాణ్ ఇచ్చిన మందుగ్లాస్ టేబుల్ మీద కోపంగా పెట్టేస్తూ, "పాడు మందులు. ఒళ్లంతా మందులతో నింపేసి అసలు మనిషిని మాయం చేస్తున్నారు. అసలే ఈ మనుషులు చాలా చిత్రంగా తయారౌతున్నారు. కృత్రిమపు ఎరుపులతో పండించిన ఆహారం తింటూ, వాటితో రోగాలు పుట్టి చావడానికి సిద్ధమై మందులతో బతుకు నిలుపుకొంటూ, అసలు బ్రహ్మ పుట్టించిన ఆత్మ కరిగిపోగా యాంత్రికంగా మారిపోతున్నారు. ఏం చిత్రాలు, ఏం మనుషులు!" అంది, పెదవులు చిత్రంగా తిప్పుతూ.
    బుజ్జగించి, లాలించి మందుగ్లాస్ చేతికి ఇవ్వగలిగాడు కళ్యాణ్.

                                 16

    సముద్రపు కెరటాలు కళ్యాణ్ పాదాలను తాకి వెనకకు మరలుతున్నాయి. నీటిలో తేలిఉన్న ఓ రాతిపై కూర్చుని దిగంతాలవరకూ వ్యాపించి ఉన్న జలరాసి కేసి చూస్తూ మనస్సులో అస్పష్టంగా కదలాడుతూన్న భావాలకు రూప కల్పన చేసుకొంటున్నాడు, కాగితం మీద చిత్రించడానికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS